అమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ జాన్ ట్రంప్ ఎన్నిక కావడం ఆశ్చర్యం కలిగించే పరిణామం.. ఒక సెక్షన్ మీడియాలో ఈ మేరకు కొన్ని సంకేతాలు వచ్చాయి. మెజార్టీ కార్పొరేట్ మీడియా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా ఉండటం, ఈ అనుకూల మీడియా గొంతు, అది సృష్టించే ప్రభావం ఎక్కువ కావడంతో హిల్లరీ గెలవడం ఖాయమన్న వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికాలో ట్రంప్ వెదజల్లిన విద్వేష, విభజన భావాలకు లభించిన ఆదరణే ఆశ్చర్యం, ఆందోళనకరం కూడా! అమెరికన్ సమాజాన్ని చీల్చడంలో ట్రంప్ విజయం సాధించారు. ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంలో నల్లవారికి, తెల్లవారికి మధ్య అంతరాన్ని పెంచారు. మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలూ చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా ఉత్పన్నమైన ఆర్థిక సంక్షోభాన్నీ తనకు అనుకూలంగా పెంచుకున్నారు. అమెరికాలో నిరుద్యోగం పెరగడానికి, వృద్ధి తగ్గడానికి భారత్, చైనా వంటి దేశాల నుండి వస్తున్న యువతను కారణంగా చూపారు. ప్రపంచంలో క్షీణిస్తున్న ప్రాభల్యాన్ని గుర్తు చేస్తూ గ్రేట్ అమెరికాను సృష్టిస్తానంటూ రెచ్చగొట్టారు. ఇవన్నీ అమెరికన్ ఓటర్లలో ముఖ్యంగా తెల్లవారిలోనూ, ధనవంతుల్లోనూ ఆయనకు అనుకూల ప్రభంజనాన్ని సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన అహంభావ వ్యాఖ్యలనూ, అసహ్యకరమైన మాటలనూ ఓటర్లు పట్టించుకోలేదు. అమెరికాకు మహత్తర యోగం పట్టించే శక్తిగానే ఆయన్ను పరిగణించారు. అదే సమయంలో హిల్లరీ ప్రచారంలో విధానపరమైన అంశాలు లేవనెత్తక పోవడం, వ్యక్తిగత అంశాలకే పరిమితం కావడం కూడా ట్రంప్‌కు కలిసి వచ్చింది. పైగా గత ప్రభుత్వాల్లో కూడా భాగస్వామి అయిన హిల్లరీని, ప్రస్తుత అమెరికా సమస్యలకు కారకురాలిగా కూడా ఓటర్లు పరిగణించారు. దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ వివాదాస్పదంగా మారిన మెయిల్స్ వ్యవహారం కూడా ఆమెకు ప్రతికూలంగా పరిణమించింది.
ఇదంతా ఇప్పుడు గతం! అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎటువంటి విధానాలను అవలంబిస్తారు? మిగిలిన ప్రపంచంపై వాటి ప్రభావం ఏమిటి? భారత్ పట్ల ఆయన వైఖరి ఎలా ఉంటుందన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన అంశం. ట్రంప్ ప్రచారంతో పాటు, ఆయన వ్యక్తిగత వ్యవహార శైలిని దగ్గర నుండి పరిశీలించిన వారు చెబుతున్న దాని ప్రకారం అధ్యక్షుడిగానూ ట్రంప్ దూకుడుగా వ్యవహరించే అవకాశాలే ఎక్కువ! ఇది అమెరికాతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా మితవాదం ప్రబలడానికి, విద్వేషాలు నెలకొనడానికి దోహదం చేయనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు పూర్వ వైభవం తెచ్చే పేరిట సామ్రాజ్యవాద యుద్ధాలు, ఆంక్షలు ప్రపంచ దేశాలపై మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. దీనర్థం హిల్లరి గెలిస్తే ఇంతకన్నా భిన్నంగా ఉంటుందని కాదు. హిల్లరీ, ట్రంప్‌లలో గెలుపెవరిదైనా అంతిమంగా ఓడి పోయేది మాత్రం అమెరికన్ ప్రజలే అన్న వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన విషయాన్నీ విస్మరించలేం. భారత్‌తో సంబంధాల విషయంలో ఎటువంటి మార్పూ ఉండదని అమెరికన్ రాయబార కార్యాలయం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మన దేశం నుండి ఉద్యోగాల కోసం అక్కడికి వెడుతున్న యువకుల పట్ల ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తం మీద ప్రపంచ దేశాలకు రానున్నవి గడ్డు రోజులే అన్న అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. విజయం అనంతరం చేసిన మొదటి ప్రసంగంలో తాను అమెరికన్లకందరికీ అధ్యక్షుడిగా ఉంటానని ట్రంప్ చెప్పారు. ఈ మాటను ఎలా నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిందే!

No comments:
Post a Comment