రాజకీయ నాయకులకు తప్పులు, పొరపాట్లు కొత్తేమీ కాదు. అయితే చేసిన తప్పులు తిరిగి చేయకపోవడంలోనే వివేకం ఉంటుంది. కానీ చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేయడంలో కాషాయ ప్రముఖులు నిష్ణాతులమని నిరూపిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మరో మారు ఆ విషయాన్ని రుజువుచేశారు. పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల జనం పడుతున్న పాట్లు పదే పదే చెప్పుకుని ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం సర్కారు చేయడం లేదు సరికదా కనీసం చేసే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. సామాన్యులకు అర్థం కాని, వారిని అయోమయంలో పడేసే నేతల ఘనకార్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నేతల ముందుంది.
2015 చరమాంకంలో రిజర్వ్ బ్యాంక్ నగదు ముద్రణా సంస్థ భారీ స్థాయిలో వెయ్యి రూపాయల నోట్లను తప్పుగా ముద్రించింది. రూ.30 వేల కోట్ల విలువైన వెయ్యి కరెన్సీ నోట్లను రజితరేఖ(సిల్వర్ ట్రెడ్) లేకుండా అచ్చువేసింది. ఈ పొరపాటు గ్రహించేసరికి అందులో సగంమేర మార్కెట్లోకి వెళ్లిపోయాయి. ఈ వార్తను జాతీయ ప్రధాన పత్రికలూ, మీడియా అప్పట్లో బాహాటంగానే ప్రచురించాయి. ఈ ఏడాది జనవరి 18 నుంచి 22 వరకు పతాక శీర్షికల్లో ఆ వార్తలు వచ్చాయి. రిజర్వ్‌బ్యాంక్ ప్రతినిధులు సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. ఈ విషయం ఆర్థికశాఖ దృష్టికి వెళ్లడంతో అరుణ్ జైట్లీ విచారణకు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తప్పుచేసిన వారిపై చర్యలేమయ్యాయో తెలియదుగాని, జరిగిన పొరపాటును సరిచేసుకోవడం మాత్రం సర్కారుకు తలకుమించిన భారంగా మారింది. నకిలీకి, అసలు నోట్లకు కీలక భేదం సిల్వర్ ట్రెడ్. ఈ లక్ష్మణరేఖను ముద్రించకపోవడంతో మార్కెట్లోకొచ్చిన అసలు నోట్లకూ, అప్పటికే చలామణిలో ఉన్నట్లు ప్రభుత్వం భావించిన నకిలీ నోట్లకు భేదం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సిల్వర్ ట్రెడ్ లేకుండా అచ్చయిన నోట్లలో రూ.10 వేల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లోకెళ్ళాయని ప్రభుత్వం ఒప్పుకుంది. అంతేకాక ఇలాంటి నోట్లను ప్రజలెవరైనా బ్యాంకులకు తీసుకొస్తే వాటిని మార్చి ఇవ్వాలని, అలాంటి నోట్లను తిరిగి అప్పగించాలని బ్యాంకులకు ఓ సర్క్యులర్ జారీ చేసింది. అయితే అప్పటికే నకిలీ వెయ్యి రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పాక్ ఉగ్రవాదులు ఈ పనిలో నిమగమయ్యారని నిఘావర్గాలు తేల్చాయి. దీంతో తమ వద్దకు వచ్చిన నోట్లు అసలువా? నకిలీవా? అన్న గందరగోళంలో పడ్డ ప్రజలు వాటిని గోప్యంగా చింపివేశారు. కొన్ని చోట్ల బ్యాంకులకు వెళ్ళినా ఇవి మీకెలా వచ్చాయని బ్యాంకు సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు వేసేవారని, వాటిని మార్చి ఇవ్వకపోగా, చింపివేసేవారని వాపోయారు. ఇదిలా ఉండగా జరిగిన పొరబాటును ఎలా సరిదిద్దుకోవాలో తెలియక సర్కారు ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఒకవైపు నకిలీ నోట్లు విరివిగా వస్తున్నాయనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో పెరిగింది. ఇలా పరిపరి విధాల మదన పడుతున్న కమలనాథులు విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను ఇప్పటికీ నెరవేర్చలేదు. అంతేగాక, దేశంలో లెక్కల రహితంగా ఉన్న నల్లధనాన్ని బయటకు తేలేకపోయారు. ఇందుకోసం పిలుపునిచ్చిన 'స్వచ్ఛంద ప్రకటన' మంత్రం విఫలమైంది. ఈ పిలుపునకు కేవలం రూ.65 వేల కోట్లు మాత్రమే బయటికొచ్చిందని సర్కారే స్వయంగా ప్రకటించింది. మరో వైపు రాజకీయ ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గద్దెనెక్కిన కమలానికి ఒక్కొక్క రాష్ట్రం చేజారిపోవడం మొదలైంది. వేల కోట్లు కుమ్మరించినా ఢిల్లీ పీఠం ఆప్ హస్తగతమైంది. ఒకపక్క ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే క్రమంలోనే పెద్దనోట్లను రద్దుచేసేందుకు బిజెపి పూనుకుందని మేధావుల విశ్లేషణ. అయితే ముద్రణలో పొరపాటు జరిగిన వెయ్యి నోట్లను ఒక్కటే రద్దు చేస్తే, చేసిన తప్పు తెలిసిపోతుందనే అపరాధ భావంతో ఐదు వందల నోట్లను కూడా రద్దుచేసిందని విశ్లేషకుల అంచనా. ఇదంతా ఒక ఎత్తయితే, ఒక్కసారిగా పెద్దనోట్లను రద్దుచేస్తే నేతలకు వెన్నుదన్నుగా ఉన్న నల్లకుబేరుల సంగతేమిటి? వారికి కోపమొస్తే వచ్చే ఎన్నికల్లో కమలం గెలుపు మాటేమిటి? అందుకే ఆరు నెలల నుంచే లీకులు ప్రారంభమయ్యాయని విపక్షాలు చెబుతున్నాయి. వాటికి దృష్టాంతాలు కనబడు తూనే ఉన్నాయి. అంతేకాక, జులై నుంచి సెప్టెంబరు వరకు మున్నెన్నడూ లేనివిధంగా బ్యాంకు డిపాజిట్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయని బ్యాంకు ప్రతినిధులే చెబుతున్నారు. ఆ కాలంలో సుమారు ఐదు లక్షల కోట్ల మేర డిపాజిట్లు వచ్చినట్లు ఆర్థిక రంగ నిపుణుల అంచనా. ఇది కాక, వెయ్యి, ఐదొందల నోట్ల స్థానంలో రెండు వేల నోట్లు అచ్చు వేసింది. నిజంగా లెక్కలకందని నగదు రూప ద్రవ్యాన్ని తేవాలనుకున్న వారెవరూ రద్దుచేసిన నోట్ల కంటే పెద్ద నోట్లు చెలామణిలోకి తీసుకురారు. ఈ నోట్లు నల్లధనాన్ని మరింత మదుపు చేస్తాయి. ఇప్పుడు అదే జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నోట్ల మార్పిడి లీకులు అందాల్సిన వారికి ఆరు నెలల క్రితమే అందాయని, వారంతా గుట్టు చప్పుడుకాకుండా వివిధ రూపాల్లో ఆ ధనాన్ని బదలాయించుకున్నారని చెబుతున్నారు. ఈ విషయమై పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు బిజెపి నేతల వద్ద జవాబు లేదు. సీతారాం ఏచూరి లాంటి వామపక్ష సీనియర్ నాయకులు నిలదీస్తే సమాధానం చెప్పలేక నీళ్ళునమిలారు.
ప్రధాని మోడీ నిర్ణయం విప్లవాత్మకమైందని గర్జిస్తున్న తెలుగు సీనియర్ కమలనాథులు వెంకయ్యనాయుడు రెండు వేల నోట్ల చెలామణి నిర్ణయం రిజర్వ్బ్యాంకుదనీ, ప్రధానిది కాదనీ నమ్మబలుకుతున్నారు. అంటే జనం నుంచి వచ్చిన నిరసన నినాదాల నుంచి తప్పించుకునే ప్రయత్నమన్న మాట. అత్యవసరమైతే, నోట్లు మార్చాలనుకుంటే, రద్దయిన నోట్ల స్థానంలో కావాల్సిన నోట్లను ముందే సిద్ధం చేసుకుని ఈ పని చేయాల్సి ఉంది. కానీ ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకుండా నోట్లు రద్దుచేసి ప్రజలను రోడ్డున పడేయడంలో ఔచిత్యం ఏమిటి? దీని ప్రభావం సమాజంపై ఏ మేరకు ఉంటుందో పాలనలో మేధావులకు తెలియదా? ఈ చర్యల వల్ల 15 లక్షల కోట్ల రూపాయల లెక్కలకందని గుప్త ధనం రద్దవుతుందని అధికార పార్టీ పెద్దలే చెబుతున్నారు. అంటే దీనర్థం ఏమిటి? ఎవరైనా దేశీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తారా? లెక్కలేని ధనం ఉంటే, దాన్ని ఎలా బయటకు తేవాలో యోచించాలి గానీ, నిర్వీర్యం చేయడమేమిటి?
ఇవ్వాళ కాకున్నా రేపైనా ఆర్థిక స్రవంతిలో కలిసే ద్రవ్యాన్ని నిర్వీర్యం చేస్తే ప్రయోజనం ఏమిటి? యథేచ్ఛగా విదేశాలకు తరలించిన ధనాన్ని తీసుకురాగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు, జన జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రయోజనం ఉంటుంది. ఎలుక వెక్కిరించిందని ఇల్లు తగలబెట్టిన సామెతగా స్వంత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి విప్లవాత్మక నిర్ణయంగా చెప్పుకోవడం, ముందే సర్దుబాటు చేసుకున్న అనుచరగణం వంతబాడటంలో ఆంతర్యం ఏమిటి? ఈ చర్యల వల్ల దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందని, కనీసం రెండేళ్లపాటు దీని ప్రభావం ఉంటుందని ఆర్థికవేత్తలు ఆందోళనచెందుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ఇలాంటి చర్యకు దిగడం తీవ్రమైన చర్యగా దేశ అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలీచాలని పెద్దనోట్లతో చిల్లర నోట్లు కూడా లేకుండా ప్రజలను ఇంకెంత కాలం అవస్థల పాల్జేస్తారో అంచనాలకే అందడం లేదు.
కమలనాథులకు, వారి చుట్టూ నమో జపం చేస్తున్న అనుచరగణానికి నల్లధనాన్ని నడిరోడ్డుకు తేవాలన్న చిత్తశుద్ధి ఉందా? ఉంటే ఈ తప్పులన్నీ ఎందుకు జరుగుతున్నాయి. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నోట్లరద్దును సమర్థిస్తున్న సదరు నేతలందరూ ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. తప్పులు చేయడం సహజమే కానీ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయడం, దాన్ని గొప్పగా చెప్పుకోవడం అసహజం. పర్యావరణ విధ్వంసాన్ని ప్రకృతి క్షమించనట్లే, ఆర్థిక, సామాజిక విధ్వంసాన్ని ప్రజలెన్నటికీ క్షమించరని గుర్తుంచుకోవాలి. చరిత్ర పునరావృతమనేది చారిత్రక సత్యం. అధికార కాంక్షతో దింపుడు కల్లం ఆశగా తెలు గు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. చరిత్ర మరోసారి పునరావృతమైనా అదేమీ ఆశ్చర్యం కాదు. ఇది గమనిస్తే నేతలకు మంచిది. కానీ, ఇప్పటికే విషయం చేయి దాటిందేమోననిపిస్తోంది. - కొల్లూరు వెంకట్

No comments:
Post a Comment