Monday, 14 November 2016

# నేరస్తులెవరు...శిక్షెవరికి? #



            పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టడం సంచలనం రేపింది. రాత్రికి రాత్రి ప్రకటించిన ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి నల్లడబ్బును పూర్తిగా నిర్మూలిస్తుందని పాలక పక్ష నేతలు చెప్పుకుంటున్నారు. తద్వారా ధరలు తగ్గుతాయని కూడా వాదిస్తున్నారు. ఇలా పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశపెట్టడం చరిత్రలో కొత్తేమీ కాదు.
1946లో ఒకసారి, 1978లో మరోసారి చేశారు. ఒకప్పుడు ఐదు వేలు, పది వేల నోట్లు కూడా ఉండేవి. అవి ఇప్పుడు కనుమరుగయ్యాయి. 2005లో కూడా ఈ ఆలోచన జరిగింది. కానీ పర్యవసానాలు ఊహించి విరమించుకున్నారు. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్న మోడీ దీనివల్ల కలిగే పర్యవసానాలు, ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించలేదు. దాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి ముందస్తు ఏర్పాట్లూ చేయలేదు. ప్రభుత్వ అసమర్థత ఇక్కడే కనబడుతోంది. ఇలాంటి జిమ్మిక్కులతో ఆర్థిక వ్యవస్థ బాగుపడదని, నోట్లు మార్చినా నల్లధనం ఏదో ఒక రూపంలో కొనసాగుతోందని చరిత్ర రుజువు చేసింది. రెండున్నరేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన మోడీ విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పిస్తానని, ఆ డబ్బు అందరికీ పంచితే తలకు రూ.15 లక్షలు వస్తాయని, అవి అందరికీ బ్యాంకుల్లో జమ చేస్తామని భ్రమలు పెట్టారు. దీన్ని అమలు చేయడంలో విఫలమైన మోడీపై అసంతృప్తి రగులుతోంది. ముఖ్యంగా యువతరంలో మోడీపై ఆకర్షణ తగ్గుముఖం పట్టింది. తక్షణం ఉత్తరప్రదేశ్‌, తదితర రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను ఎదుర్కొనడానికి ఈ సరికొత్త డ్రామాకు తెరలేపారు.
దేశంలో రూ.17,54,000 కోట్ల కరెన్సీ చలామణిలో ఉంది. ఇందులో 39 శాతం వెయ్యి నోట్లు, 45 శాతం ఐదొందల నోట్లు ఉన్నాయి. జీతాలు, చిన్న చిన్న వ్యాపారాల ద్వారా జనం చేతుల్లోకి పెద్ద నోట్లు వచ్చినా తిరిగి అవి ఖర్చు రూపంలో పెద్ద వారి చేతికే చేరతాయి. సామాన్యులు తమ రోజువారీ ఖర్చుల కోసం వంద, అంతకు లోపు నోట్లను ఎక్కువ వాడతారు. 16 శాతంగా ఉన్న ఈ చిన్ననోట్లే 56 శాతం విలువతో చెలామణిలో ఉన్నాయి. గత వారం రోజులుగా సామాన్యులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆరు నెలల క్రితమే ఈ నిర్ణయం జరిగినట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఏప్రిల్‌లోనే గుజరాత్‌కు చెందిన ఒక పత్రిక మొదటి పేజీ పతాక శీర్షికలో దీన్ని ప్రచురించింది. ఈ సమాచారం తెలుసుకున్న చంద్రబాబునాయుడు నెల రోజుల క్రితం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి ఉత్తరం రాశారు. తమ సిఫార్సు వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవటం ఆత్మవంచనే తప్ప మరొకటి కాదు. ఈ నిర్ణయం ప్రకటించింది నవంబర్‌ 8వ తేదీన అయినా, నిర్ణయం తీసుకున్నది మాత్రం ఆరు నెలలకు ముందే. లేకుంటే కొత్త నోట్ల ముద్రణ, రవాణా, పంపిణీ ఒక్క రోజులో అయ్యే పనికాదు. ఈ సమాచారం తెలుసుకున్న పెద్ద పెద్ద చేపలన్నీ ముందుగానే వలలో పడకుండా తప్పించుకున్నాయి. గత రెండు మూడు మాసాలుగా బ్యాంకుల్లో అధిక మొత్తాలు జమచేసినవారి లిస్టు బయటపెడితే వారి బండారం బయటపడుతుంది. మొత్తం నల్లధనంలో కరెన్సీ విలువ 5 శాతమే ఉంటుందని ఆర్థికవేత్తల అంచనా. నల్లధనం కలిగినోళ్ళు ఎవరూ కరెన్సీ రూపంలో దాచుకునేవాళ్ళు కాదు. పెద్ద పెద్ద వాళ్లంతా ఈ డబ్బును విదేశీ బ్యాంకులకు తరలిస్తుంటారు. ఉదాహరణకు ఏదైనా ఒక సరుకును లక్ష రూపాయలకు దిగుమతి చేసుకుని, దాని విలువ నాలుగు లక్షలు అయినట్లుగా ఇన్వాయిస్‌ సృష్టిస్తారు. మిగిలిన మూడు లక్షలను అక్కడే మధ్యవర్తుల ద్వారా బ్యాంకులకు మళ్లిస్తారు. అదే డబ్బు తిరిగి విదేశీ పెట్టుబడి పేరుతో ఏదో ఒక సూట్‌కేసు కంపెనీ ద్వారా దేశంలోకి వస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి పెట్టుబడులకు రాచమర్యాదలు చేస్తోంది. పరిశ్రమ పెట్టే పేరుతో వారికి పెద్ద విస్తీర్ణంలో భూమి కేటాయిస్తారు. అదే భూమిని రియల్‌ ఎస్టేట్‌ కింద మార్చుకొని అంతకు పది రెట్లు సంపాదిస్తారు. మరల ఇదే భూమిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటారు. పరిశ్రమలేదు, లాభాలు లేవు కనుక ఆ లోను తిరిగి చెల్లించరు. ఇలాంటి పెద్ద మనుషులంతా మన ప్రభుత్వ బ్యాంకులకు రూ.11 లక్షల కోట్లు బకాయిలున్నారు. ఈ డబ్బు మాత్రం సంపద రూపంలోకి మారిపోతోంది. ఇలా విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు తరలించిన పెద్ద మనుషుల పేర్లు బయటపెట్టేందుకు కూడా మోడీ ప్రభుత్వం సిద్ధపడలేదు. ఇక ఆ డబ్బును వెనక్కి తీసుకొచ్చే ఆలోచనే వారు చేయడం లేదు. ఇప్పుడు ఈ నోట్ల మార్పిడి ఇలాంటి దొంగ డబ్బు, సంపద మీద ఎలాంటి ప్రభావం చూపదు. ఇక దేశం లోపల నల్లడబ్బు కలిగినోళ్ళు నోట్ల కట్టలను ఇనప పెట్టెల్లో పెట్టుకోరు. సినిమాల్లో చూసినట్లు నేల మాళిగల్లో, ఇంటి కప్పుల్లో, స్టోర్‌ రూమ్‌లో పాత బస్తాల్లో కుక్కి కనిపించదు. నిజానికి ఈ డబ్బు రూపం మార్చుకుంటుంది. రియల్‌ ఎస్టేట్‌, బంగారం, డైమండ్స్‌లోకి మార్చుకుంటున్నారు. అందువల్లే బంగారం ధర కూడా అసాధారణంగా పెరిగిపోతోంది. సామాన్యులెవరైనా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుక్కోవాలన్నా, పెళ్లీడుకొచ్చిన పిల్లలకు పుస్తె కొనాలన్నా చుక్కలు చూడాల్సిందే. ఈ నోట్ల మార్పిడితో నల్ల దుష్ట శక్తులకు కళ్ళెం పడుతుందా? అందుకే ఇలాంటి పెద్ద మనుషులంతా నేరం చేసినా హాయిగానే ఉన్నారు. పైగా ఇలాంటి వారే దొరల్లా నటిస్తూ ఈ నోట్ల మార్పిడిని హర్షిస్తూ ప్రకటనలు కూడా చేస్తున్నారు. లేకుంటే తమ దొంగతనం ఎక్కడ బయటపడుతుందోనన్న భయం.
ఈ నోట్ల మార్పిడి నిర్ణయం సామాన్యులపై సర్జికల్‌ స్ట్రయిక్‌ లాంటిదని అనేక మంది మేధావులు విమర్శిస్తున్నారు. నోట్ల మార్పిడి కోసం క్యూలో నిలబడి ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. ఒక వ్యవసాయ కూలి లేదా ఒక అసంఘటిత కార్మికుడు ఒక ఐదు వందల రూపాయాలు మార్చుకోవడానికి బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి, ఆరోజు కూలీ కోల్పోతున్నారు. ఎవరి వద్దనైనా నాలుగు ఐదు వందల నోట్లుంటే వాటిని బ్యాంకులో ఇస్తే రూ.2000 నోటు ఇస్తారు. తిరిగి ఈ రెండు వేల నోటును మార్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలో? ఒక రైతు పొలం అమ్ముకుంటే కొనుక్కున్న వారివద్దనున్న నల్లడబ్బు రైతు చేతికి చేరుతుంది. ఇప్పుడు అలాంటి వారి బాధలు వర్ణనాతీతం. గత వారం రోజులుగా బ్యాంకులు, ఎటిఎంలు, పోస్టాఫీస్‌ల వద్ద మైళ్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా సామాన్యులంతా క్యూలో కనిపిస్తున్నారు. ఈ క్యూలలో ఎక్కడా సంపన్నులు కనిపించరు. ఇక అంబానీ, అదానీల వంటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. వంద నోట్లకు కరువు వచ్చింది. బ్యాంకు అకౌంట్లు ఉండి ఎటియం కార్డున్నవారికే అదీ రోజంతా క్యూలో నిల్చుంటే వంద నోట్లు దొరుకుతున్నాయి. ఎటియంలు కూడా ఈ మార్పుకు సిద్ధం కాలేదు. రెండు వేల నోట్లు అందులో సరిపడవు. కొత్త 500 నోటును అది గుర్తించలేదు. బ్యాంకులో రోజుకు ఒకరికి రెండు వేలు మాత్రమే ఇస్తారు. అధికార పార్టీ నాయకులకు మాత్రం ఎన్ని నోట్లయినా దొరుకుతాయని వార్తలొస్తున్నాయి. రోడ్డు పక్కన దుకాణాలు, ఫుట్‌పాత్‌ వ్యాపారాలు, తోపుడుబండ్లు, మార్కెట్‌లో దుకాణాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. కూరగాయలు, చేపలు అమ్ముకునే మహిళల పరిస్థితి ఇంకా దారుణం. ఆర్థిక వ్యవస్థకు దీని వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పూడ్చగలుగుతుందా? అలాంటి వారికి నష్ట పరిహారం చెల్లిస్తుందా? కార్మికులు ఒక రోజు సమ్మె చేస్తే ఎంత నష్టం జరిగిందో లెక్కలు చెప్పే బడా మీడియా ఇప్పుడు నోరెందుకు తెరవటం లేదు? ఇదంతా తాత్కాలికమని, దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారి, పరివర్తన చెందుతుందని బిజెపి నాయకులు ప్రవచిస్తున్నారు. వారు చెప్పినట్లు పెద్ద నోట్ల వల్ల నల్లధనం పెరిగితే, రూ.2000 నోట్లను ఎందుకు విడుదల చేసినట్లు? అంటే నల్లధనం దాచుకునే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుందనా? నల్లధనానికి చట్టబద్ధత కల్పించేందుకు సరికొత్త మార్గాలు కనిపెట్టలేరని అమాయకత్వమా? ఇప్పటికే నకిలీ రెండు వేల నోట్లు వచ్చేశాయని సాగుతున్న ప్రచారం సామాన్యులకు వణుకు పుట్టిస్తోంది. ఇలాంటి పుకార్లతో బ్లాక్‌మార్కెట్‌ మరింత పుంజుకుంటుంది. పనిలో పనిగా ఉప్పు ధరను కూడా కిలో రూ.250కి పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పు కూడా దొరకదేమోనన్న భయంతో కొందరు పాత ఐదొందల నోటిచ్చి రెండు కేజీల ఉప్పు కొన్నారు. ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు బ్రోకర్లు బయలుదేరారు. కమిషన్‌ తీసుకొని పాత నోట్లు మార్పిడి చేస్తున్నారు. దీనితో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందే తప్ప తగ్గలేదు. అవినీతి నోట్లకట్టల్లో లేదు. వ్యవస్థలో ఉంది. అవినీతికర వ్యవస్థను కాపాడుతూ నోట్లు మారిస్తే సమాజానికి ఏం వరగదు. కొత్త కరెన్సీతో కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామని పాలకులు చెబుతున్నారు. కరెన్సీ స్థానంలో ఆన్‌లైన్‌ వ్యాపారాలు ప్రోత్సహించడం ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చునని చెబుతున్నారు. మన దేశంలో చదువుకున్న వాళ్ల శాతమే తక్కువ, అందులో కంప్యూటర్‌ చదువుకున్న వాళ్ళ శాతం మరీ తక్కువ. బాగా అభివృద్ధి చెందిన అమెరికా, యూరోపియన్‌ దేశాలే ఆ స్థాయికి చేరుకోలేదు. మన దేశంలో ప్రస్తుతం చెక్కులు, ఆన్‌లైన్‌, ఎటిఎం కార్డుల ద్వారా జరుగుతున్న మారకం 22 శాతం కాగా, రోజువారీ నిత్యావసరాల కోసం వినియోగదారులు ఈ రూపంలో చేసే ఖర్చు (ఈ-కామర్స్‌) కేవలం 2 శాతం మాత్రమే. ఈ లెక్కన ఆ స్థాయికి చేరడానికి ఎన్నేళ్లు పడుతుందో ఊహించొచ్చు. ఇలా గాలిలో మేడలు కట్టి జనాన్ని భ్రమింపజేయాలని చూస్తున్నారు. 
నోట్ల మార్పిడితో దొంగనోట్లను అరికడతామని, ముఖ్యంగా పాకిస్తాన్‌ నుంచి వచ్చే నకిలీ కరెన్సీని అరికట్టి ఉగ్రవాదానికి సమాధానం చెబుతామంటున్నారు. ఈ కొత్తనోట్ల మార్పిడిని వ్యతిరేకించే వారిని ఉగ్రవాదులను కాపాడేవారిగా చూపించేందుకు అధికార పార్టీ నానా తంటాలు పడుతోంది. ఇంత కంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. ఒకవేళ బిజెపి నాయకులు అన్నట్లు పాకిస్తాన్‌ నుంచి నకిలీ కరెన్సీ వస్తే దాన్ని కనుక్కొలేనంత అసమర్థంగా ఈ ప్రభుత్వం ఉందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఒకవేళ పాత కరెన్సీ ఆగిపోయినా, కొత్త కరెన్సీని తయారు చేసి పంపిణీ చేయలేరా? నిజానికి ఉగ్రవాదుల లావాదేవీలన్నీ కరెన్సీ రూపంలో కాకుండా, ఆన్‌లైన్లోనే జరుగుతున్నట్లు గూఢచారి నివేదికలు కూడా చెబుతున్నాయి. ఈరోజు మన ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించిన మనీమార్కెట్‌ కంపెనీలన్నీ ప్రయివేటువే. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు వారే నిర్వహిస్తుంటారు. ఎటిఎంల నిర్వహణ వారిదే. ప్రతి కంపెనీ ఆన్‌లైన్‌లో సొంత వ్యాలెట్‌(నగదు దాచుకునే ఆన్‌లైన్‌ పర్స్‌లు), పేటీఎం, రూపే, ఫోన్‌ పే లాంటి విదేశీ పెట్టుబడు లతో నడిచే కంపెనీలు ఆన్‌లైన్‌లో నగదు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. వీటిపై ప్రభుత్వానికుండే నియంత్రణ చాలా తక్కువ. ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత రవి సుబ్రమణ్యం ఆన్‌లైన్‌లో జరిగే కుంభకోణాల గురించి అనేక పుస్తకాలు రాశారు. ఉగ్రవాదులెలా వీటిని ఉపయోగించుకుంటున్నారో ఆయన వర్ణించారు. ఈ నోట్ల మార్పిడితో ఉగ్రవాద కార్యకలాపాలను, డ్రగ్‌, మనీలాండరింగ్‌లను ఆపుతామని చెప్పటం ప్రజలను వంచించటమే. పాలకవర్గ నేతలకే ఇలాంటి వాటితో సంబంధాలున్నా యన్న విషయం జనానికి తెలియందేమీ కాదు. ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్యల నుంచి ప్రక్కదారి పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేటతెల్లమవుతోంది. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు మన దేశంలో కొత్త కాదు. తుగ్లక్‌ కాలం నుంచే జరుగుతూనే ఉన్నాయి. అయినా సామాన్యులు బాధ పడుతూనే ఉన్నారు. సంపన్నులు బాగుపడుతూనే ఉన్నారు. కాకుంటే మనుషులు మారతారు. నల్లడబ్బు దాచుకునే వారు కొందరు నష్టపోవచ్చు, ఇంకొందరు లాభపడొచ్చు. కానీ నల్లధనం వ్యవస్థ కొనసాగుతూనే ఉంటుంది. కాకుండే నగదు బదులు, సంపద రూపంలోకి మారు తుంది. నోట్ల మార్పిడి సాధించిందిదే. ఇదే బిజెపి నాయకులు చెప్పే పరివర్తన. నల్లధనం కలిగిన నేరస్తులను శిక్షించకపోగా, రూ.500,రూ.1000 కలిగిన సామాన్యులను ఇబ్బంది పాలుచేసేందుకు ఈ చర్య తోడ్పడుతోంది. బహుశా బిజెపి దృష్టిలో రూ.500, రూ.1000 కలిగిన సామాన్యులే నల్ల కుబేరులు కావచ్చు.  - వి శ్రీనివాసరావు

No comments:

Post a Comment