డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దార్శనికుడు, మానవ హక్కుల పోరాటయోధుడు. మహోన్నత హేతువాద భావజాల తాత్వికుడు. భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన మరణించి 2016 డిసెంబరు 6కు అరవై ఏళ్ళు అవుతుంది. ఆయన భారత రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించి 67 ఏళ్ళు అవుతుంది. ఆయన నిర్మించిన సిద్ధాంతాలు, ఆలోచనలు, ప్రజ్వలమైన బోధనలు నేటి భారతదేశ పునర్నిర్మాణానికి ఉపకరణాలు.
ఆయనది ఒక యుద్ధజీవితం. ఆయన అధ్యయనం, అవగాహన, మేధోసంపన్నత శాస్త్రబద్ధమైంది. సత్యనిష్టమైంది. అంబేద్కర్ తాత్విక మూలం సామాజిక వ్యథ. చీకటి కుహరాల్లో వేల సంవత్సరాలుగా జీవిస్తున్న అణగారిన సామాజిక జీవుల వేదనాస్వరాన్ని ఆయన మొక్కవోని దీక్షతో ప్రపంచానికి వినిపించారు. సామాజిక న్యాయం కోసం సమరభేరి మ్రోగించారు. ఆయన అధ్యయన శీలి, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తిత్వ నిరూపణకు చెప్తున్న అంశాలు శీలం, అంకితభావం, నిబద్ధత, కరుణ, ధైర్యం ఆయన జీవితంలో పెనవేసుకొని ఉన్నాయి. ఆయన గొప్ప చదవరి. ఆయన 1912కు బిఎ పూర్తి చేసి 1913లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలో చేరాడు. ''ప్రొవిన్షియల్ 'ఫైనాన్స్' ఇన్ బ్రిటీష్ ఇండియా'' అనే అంశం మీద పరిశోధన పత్రాన్ని సమర్పించాడు. అమెరికా విశ్వవిద్యాలయంలోని స్వేచ్ఛా, సౌభ్రాతృత్వాలకు ఆయన ఉత్తేజితమయ్యాడు. కులం పునాదుల మీద అప్పుడే ఆయన పరిశోధన ప్రారంభించాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో తన పరిశోధనను ప్రారంభించాడు. ఎక్కడ ఆయనకు ఆటంకాలు వస్తున్నాయో అక్కడ ఆయన ఎదురు తిరిగి పోరాడి విజయాన్ని సాధించాడు. కృంగిపోవడం, నిద్రాణం అయిపోవడం, అయ్యో అశక్తులమే అని ఆలోచించడం ఆయనకు లేదు. నేడు ప్రజలు ఆయన నుంచి నేర్చుకోవలసింది ఈ సంకల్ప బలమే. అంబేద్కర్ లండన్‌లో చేసిన పరిశోధనా పత్రం పేరు ''ప్రాబ్లమ్ ఆఫ్ ది రుపీ''. ఇది 1923కు పూర్తయ్యింది. అప్పటికి ఆయనకు 32 ఏళ్ళు. ఈ డిఎస్సి డిగ్రీ ద్వారా ప్రపంచంలో ప్రమాణబద్ధమైన ఆర్థికవేత్తగా మారాడు. లండన్ విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పత్రాలను సమర్పించడం అంత తేలికైన విషయం కాదు. భారతదేశంలో ఆ స్థాయికి ఎదిగిన వాళ్లు అప్పటికీ ఇప్పటికీ ఎవరూ లేరు. అంబేద్కర్ ఈ అధ్యయనం పునాదితోనే రాజ్యాంగం రచించారు. అంబేద్కర్ విద్యావంతుడైన తాత్వికుడు. తాత్వికుడు కారణాన్ని అన్వేషించడానికి ఎంతో సమయం పట్టవచ్చు. అయితే దుఃఖితుడు తన తాత్కాలిక అన్వేషణ నుంచి ఒక్కోసారి మరల్చుకోలేడు. చాలా సుదీర్ఘ పరిశీలన నుంచి గాని కారణం అనుభూతం కాదు. కారణాలు కొన్నిసార్లు వైయక్తికాలు, కొన్నిసార్లు సామాజికాలు. వైయక్తిక దుఃఖానికి ఉపశమనం ఉంది. సామాజిక దుఃఖం కొన్నిసార్లు నివారింప శక్యంకాదు. అది ఎక్కడ జనించిందో ఆ జనన కారణం అనేకసార్లు అనుభూతం కాదు. జనన కారణం తెలియక దుఃఖం జీవన విధానమైపోతుంది. సమాజంలో అస్పృశ్యత అలాంటిది. అస్పృశ్యులు తాము ఎందుకు అస్పృశ్యం చేయబడ్డారో తెలియక అదే దుఃఖంలో కొట్టు మిట్టాడు తుంటారు. బుద్ధుని మార్గంలో ఈ దుఃఖ కారణాన్ని అంబేద్కర్ కనుగొన్నారు. దీనికి మూలాన్ని అంబేద్కర్ వెదికారు. మనిషిని గూర్చి తెలుసుకొన్నారు. జంతు ప్రవర్తన నుంచి మానవుని వేరుచేస్తున్న ప్రధాన అంశం సామాజిక జీవితాచరణ. దీన్ని మానవుడు సంఘ జీవనము నుంచి నేర్చుకున్నాడు. అంతేకాక అతని జీవిత ఔన్న త్యానికి మూలభూతమైన మరొక ప్రధానాంశం ప్రకృతి అవగాహనలో అతనికున్న నేర్పు. ఈ నేర్పును, అవగాహనను సామాజిక జీవితానికి అన్వయించడం ద్వారా అతడు ఉత్పత్తి శక్తిగా ఆవిర్భవించాడు. ఈ సామాజిక జీవి తనను గురించి విశ్లే షించుకోవడం మానవ శాస్త్రం అయితే, ప్రకృతిపై అతని వ్యాఖ్యానం, నిర్థారణలు ప్రకృతి జీవశాస్త్రాలైతే, అతని ఉత్పత్తి సంబంధాలను విశ్లేషించేది ఆర్థికంగా రూపొం దింది. ఈ పరిశోధన నుంచే అంబేద్కర్ అస్పృశ్యత, కులం రెండూ మానవులపై రుద్ద బడినవని తెలుసుకొన్నారు. ఈ అవగాహన నుంచి మానవ హక్కుల పోరాట యోధునిగా అంబేద్కర్ అవతరించాడు. మనుస్మృతి దహనానికి పూనుకొన్నాడు. 1927 డిసెంబరు 25న 36 సంవత్సరాల దళిత మేధావి ఏ గ్రంథాన్ని తగలపెట్టాలో, ఏ గ్రంథాన్ని చేతబూనాలో తేల్చివేశాడు. మనుస్మృతి 12 అధ్యాయాలు. వర్ణధర్మాన్ని మరింత పటిష్టం చేసేందుకు మనుధర్మాన్ని మనువు కూర్చాడు. భారతదేశంలో అసమ సమాజానికి రూపకల్పన ఈ మనువే చేశాడని, మనుస్మృతిని బహిరంగ దహనం చేయడం కర్తవ్యమని అంబేద్కర్ ఆచరించారు. అంబేద్కర్ అందుకే ఇలా అన్నారు. ''చాతుర్వర్ణ సిద్ధాంతం నశించాలి. హిందూ సమాజంలో నిమ్నజాతులు సమానత్వంతో పరిగణించ బడాలి. సవర్ణులు సకల భోగాలను అనుభవించడం, నిమ్నజాతివారు పరమ దరిద్రులుగా నశించి పోవడం నేను సహించను. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ పురాతనమైన సిద్ధాంతాలతో సమాజాన్ని వెనుకకు మళ్ళిస్తున్నందున దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కంటే హీనమైన సాంఘిక వ్యవస్థ మరొకటి ఈ భూమండలంపై లేదు, ఉండదు. ఈ విధానం మానవులను నిష్ప్రయోజకులుగా, దుర్బలులుగా, అవిటివారుగా మార్చివేస్తోంది.' ఈ స్ఫూర్తితోనే అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారు. ''పాశ్చాత్యులు కులాన్ని కేవలం భారతదేశ సమస్యగానే తీసుకోకూడదు. కుల సంకుచితత్వం వల్ల ప్రపంచ మానవవాదానికి అడ్డుగోడలు ఏర్పడతాయి'' అని ఆయన ఆనాడే హెచ్చరించారు. ప్రపంచంలో రెండవ అతి పెద్ద జనాభా కలిగిన భారతదేశాన్ని, దాని కులస్వభావాన్ని అలానే వదిలివేసినట్లైతే అది ప్రపంచ మానవ సమైక్యతకే గొడ్డలిపెట్టు అవుతుందని ఆయన ఆనాడే పసికట్టారు. ''ఈ కులం సమస్య సిద్ధాంతపరంగానూ, ఆచరణ రూపంలోనూ ఎంతో విస్తృతమైనట్టిది. ఆచరణరీత్యా అతి భయంకరమైన పరిణామాలను సూచించే వ్యవస్థ ఇది. ఇది ఒక స్థానిక సమస్యగానే కనిపించినా, పరిధికి మించి నష్టం చేయగల సత్తా దీనికుంది. ఎందుకంటే భారతదేశంలో కులం ఉన్నంతకాలం హిందువులు కులాంతర వివాహాలు చేసుకోరు, బయటివారితో ఎలాంటి సామాజిక సంబంధాలు పెట్టుకోరు. ప్రపంచంలో వేరే ప్రాంతాలలోకి హిందువులు వలసపోతే భారతీయ కులం ప్రపంచ సమస్య అవుతుంది.'' ఈ కులతత్వ భావాజాలాన్ని రాజ్యాధికారంలో భాగంగా నిర్మూలించడానికి తన రిపబ్లికన్ పార్టీ మేనిఫెస్టోలో ప్రజాస్వామిక సూత్రాలని ఇలా ముందుకు తెచ్చారు. 1) భారతీయులందరికీ హక్కుల సమానత్వం. 2) ప్రతి పౌరుడు తనను తాను అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం సోపానం కావాలి. 3) మత, ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రాలు ప్రతి భారతీయుడి హక్కు. 4) సమాన అవకాశాలు ప్రతి భారతీయుడి హక్కు. మనిషిని మరో మనిషి, ఒక వర్గాన్ని మరో వర్గం, ఒక దేశాన్ని మరో దేశం దోచుకోవడం, అణచివేయడాన్ని ప్రణాళిక వ్యతిరేకిస్తోంది. మొత్తం ప్రజానీకం శ్రేయస్సుకు, వ్యక్తి శ్రేయస్సుకు పార్లమెంటరీ ప్రభుత్వమే ఉత్తమమైనదని ప్రణాళిక ప్రతిపాదించింది. అంబేద్కర్ తన సిద్ధాంతాలను ప్రజాస్వామ్య లౌకికవాద దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన రాజ్యాధికారం అంటే సమతావాదాన్ని ముందుకు తీసుకెళ్ళేదే అని చెప్పాడు. ఆ సమయంలో అంబేద్కర్ ఇలా చెప్పారు. ''ఎటువంటి రక్తపాతం లేకుండా ప్రజల ఆర్థిక, సామాజిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే స్వరూపం, పాలనా వ్యవస్థే ప్రజాస్వామ్యం. అది విజయవంతంగా పనిచేసేందుకు ముందుగా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 1. సమాజంలో పైకి వ్యక్తమయ్యే విధంగా అసమానతలు ఉండరాదు. ఒక వర్గం వారికి అదనపు సదుపాయాలు కల్పించరాదు. 2. ప్రతిపక్షం ఉండాలి. 3. చట్టం, పాలనా యంత్రాంగంలో సమానత్వం ఉండాలి. 4. రాజ్యాంగపరమైన నైతిక నియమాలు పాటించాలి. 5. మెజారిటీ వర్గం నియంతృత్వం వహించరాదు. 6. సమాజంలో నైతిక నియమాలు పాటించే వ్యవస్థ ఉండాలి. 7. ప్రజాచైతన్యం ఉండాలి. ఈ రాజకీయ ప్రజాస్వామ్యం నాలుగు ప్రధాన అంశాల మీద ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ చెప్పారు. 1. మనిషి తనకు తాను పరిమితమవుతాడు. 2. ప్రతి వ్యక్తీ రాజ్యాంగం హామీ ఇచ్చిన కొన్ని బదిలీ చేసుకోవడానికి వీలులేని హక్కులు కలిగి ఉంటాడు. 3. ప్రత్యేక సదుపాయం లేదా రక్షణ పొందేందుకు రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించిన హక్కులను వదులుకోవాల్సిన అవసరం ఏ వ్యక్తికీ ఉండదు. 4. ఇతరులను పరిపాలించేందుకు ప్రయివేటు వ్యక్తులకు ప్రభుత్వం అధికారాన్ని దత్తం చెయ్యలేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకీ విమర్శించే హక్కు, అధికారాన్ని చేజిక్కించుకునే హక్కు ఉంటాయి. ప్రభుత్వాధికారం అధికార పార్టీ నుంచి ఇతర రాజకీయ పార్టీ లేదా పార్టీలకు బదలాయింపు అయినప్పుడు పార్టీ వ్యవస్థ నిజమైన పరీక్షను ఎదుర్కొంటుంది. రాజ్యాధికారం ఉన్నవారి చేతుల్లోనే రాజ్యాంగాన్ని అమలు జరిపే కార్యక్రమానికి వీలుంటుంది. అందుకే ఆయన జీవితంలో రాజ్యాధి కారాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం కూడా ఒక విప్లవంగా జరిగింది. అందుకే ఆయన ఓటు పట్ల చైతన్యవంతంగా ఉండమని తన ప్రజలను హెచ్చరించాడు. ఓటను బడాపెట్టుబడిదారులకు, అగ్రకుల పెత్తందార్లకు అమ్ముకున్న తరువాత మీరు శూన్యహస్తులు అవుతారని ఆయన ముందే చెప్పాడు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పోరాటాలన్నీ భారతదేశంలో అంతస్సంబంధితంగా ఉంటాయని, రాజకీయ పోరాటాన్ని విస్మరిస్తే ప్రజలు నిరంతరం బానిసలుగా జీవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించాడు. అంబేద్కర్ రాజకీయ పార్టీలను నిర్మించాడు. 1942 జులైలో ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎఐఎస్సిఎఫ్) స్థాపించాడు. ఈ సందర్భంగా ఆయన దళితుల సాంఘిక, ఆర్థిక హక్కులను సాధించడానికి వారికి రాజకీయ అధికారం ముఖ్యమైన సాధనమని చెప్పారు. ఆయన ఎఐఎస్సిఎఫ్లో షెడ్యూల్డ్ జాతుల ఆర్థిక, సాంఘిక హక్కుల సాధనకై రాజకీయ అధికారం ఎలా ఉపయుక్తం అవుతుందో, దళితులు మిగిలిన బడుగు వర్గాలతో కలిసి ఈ రాజకీయ అధికారాన్ని ఎలా సాధించాలో ఆయన ప్రణాళికలో పేర్కొన్నారు. ఆయన 1952 ఎన్నికలకు సన్నద్ధమయ్యే సందర్భంలో 1951 డిసెంబరులోనే వామపక్ష పార్టీలను పొత్తుకోసం ఆహ్వానించారు. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా సోషలిష్టు పార్టీతో ఎన్నికల పొత్తుపెట్టుకున్నారు. 1952లో విడుదల చేసిన ప్రణాళికలోనే ఆయన తన వామపక్ష భావాలను ప్రకటించారు. భారతీయులందరూ ఆర్థిక, సాంఘిక స్వాతంత్య్రాలను పొందాలని నొక్కి వక్కాణించారు. ప్రతి మనిషికీ నిర్భయంతో కూడిన స్వేచ్ఛను సాధించడం ప్రభుత్వ బాధ్యత అని ప్రతిపాదించారు. స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రణాళిక అణగద్రొక్కబడ్డవారి సాంఘిక సమానత్వాన్ని నొక్కి చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన కోరారు. ఆయన వామపక్షాలతో పొత్తు పెట్టుకునే విషయంలో కొన్ని సూత్రాలను ముందుకు తెచ్చారు. ముఖ్యంగా హిందూ మహాసభ, ఆర్యస్యస్లతో పొత్తు పెట్టుకోకూడదని, వెనుకబడిన సంఘాలతో సంబంధం ముఖ్యమని ప్రతిపాదించారు. ఆయన ఆలిండియా లేబర్ పార్టీని స్థాపించిన నాటి నుంచి భారతదేశంలో దళిత జాతులకు రాజకీయ అధికారాన్ని సాధించే కృష్టిలో అద్వితీయమైన పాత్రను పోషించారు. సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని రూపొందించే క్రమంలో ఆయన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అవసరాన్ని నొక్కి వక్కాణించారు. దళిత జాతులకు రాజకీయ అధికారం రానిదే వారి సమస్యలు ఎన్నటికీ పరిష్కారం కావు. దళితులు బడుగు వర్గాలతోనూ, లౌకిక వాదులతోనూ కలిసి రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత, సౌభ్రాతృత్వాలను అంబేద్కర్ సిద్ధాంతాల స్ఫూర్తితో సాధించుకోవడానికి మొక్కవోని దీక్షతో ముందుకు నడవడమే ఆయన నుంచి మనం పొందే నిజమైన స్ఫూర్తి. కుల నిర్మూలన, సంపద పంపిణీ ఆయన రాజ్యాంగ సారం. భారతదేశ పునర్నిర్మాణం ఆయన మనకిచ్చిన ప్రణాళిక. ఇది రాజ్యాధికారంతోనే సాధ్యం. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని, ఆలోచనలను పునచ్ఛరణ చేసుకొని ఆయన బాటలో నడవడం సమసమాజ నిర్మాణ కర్తలందరి కర్తవ్యం. - డాక్టర్ కత్తి పద్మారావు

No comments:
Post a Comment