సుప్రీంకోర్టు 2016 అక్టోబరు 26న ఇచ్చిన తీర్పు వర్క్ చార్జ్డ్, డెయిలీవేజ్, కాజువల్, అడ్హాక్, కాంట్రాక్ట్, అటువంటి తరహా తాత్కాలిక ఉద్యోగులకు ఊరటనిచ్చింది. తాత్కాలిక ఉద్యోగులు చేసే పని, రెగ్యులర్ ఉద్యోగులు చేసే పని ఒకటే అయినంత మాత్రాన రెగ్యులర్ పే స్కేలులోని కనీస వేతనా నికి తాత్కాలిక ఉద్యోగులు అర్హులుకారని పంజా బ్, హర్యానా హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ఈ తీర్పు వచ్చింది. వారు దఫదఫాలుగా ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు అక్టోబరు 26న హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది. కేసులు వేసిన తాత్కాలిక ఉద్యోగులందరూ అతి తక్కువ గ్రేడ్ వద్ద రెగ్యులర్ స్కేలులోని కనీస వేతనానికి అర్హులని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తన తీర్పును ఇవ్వటానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
''ఒకే పనికి పెట్టబడిన ఉద్యోగికి వేరొక వ్యక్తి కంటే తక్కువ వేతనం ఇవ్వరాదు. సంక్షేమ రాజ్యంలో ఆ పని అసలే చేయకూడదు. అలా చేస్తే అవమానపరచటమేగాదు, మానవత్వ పునాదులనే అది పెకలిస్తుంది. పరిస్థితుల వల్ల నెట్టబడితే తప్ప స్వతహాగా ఎవరూ తక్కువ వేతనానికి పని చేయరు. తమ కుటుంబానికి కూడు, నీడ కల్పించేటందుకే తమ ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని, విలువలను, పరిపూర్ణతను పక్కన పెట్టి ఆ పని చేస్తారు. తక్కువ వేతనానికి పని చేయక పోతే తమ మీద ఆధారపడినవారు తీవ్రమైన ఇబ్బందులు పడతారని వారికి తెలుసు.''
''అదే పనిలో ఉన్న వారితో పోల్చినప్పుడు తక్కువ వేతనం ఇవ్వటం బానిస దోపిడీ చర్య కిందికి వస్తుంది. ఇది క్రూరమైన పద్ధతి. బలవంతంగా లొంగదీయటం అనేది ఎటువంటి సందేహానికీ తావులేకుండా అణచివేత, పీడన చర్య కిందికి వస్తుంది.''
''1966 ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందంలోని ఆర్టికల్ 7ను ఈ సందర్భంలో పునశ్చరణ చేయదల్చుకున్నార.'' ''ఆర్టికల్ 7 ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్న దేశాలు న్యాయమైన, అనుకూలమైన పని పరిస్థితులను ప్రతి ఒక్కరూ పొందే హక్కును గుర్తిస్తున్నాయి. ప్రత్యేకించి ఎ) కార్మికులు పొందే కనీస ప్రతిఫలం ఈ క్రింది వాటితో కూడినదై ఉండాలి. 1) సమాన విలువ కలిగిన పనికి ఎటువంటి వివక్షా లేకుండా న్యాయమైన, సమానమైన వేతనాలు. ప్రత్యేకించి మహిళలకు సమాన పనికి సమాన వేతనం. పురుషుల కంటే తీసుపోని పని పరిస్థితులు మహిళలకు గ్యారంటీ ఇవ్వాలి. 2) ఒప్పందంలోని నిబంధనల ప్రకారం తమకు, తమ కుటుంబాలకు యోగ్యమైన జీవనం; బి) భద్రత, ఆరోగ్యకర పని పరిస్థితులు; సి) సీనియార్టీ, సామర్థ్యాల మినహాయింపుతో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలతో పై స్థాయికి ప్రమోషన్లు; డి) విశ్రాంతి, న్యాయమైన పరిమితులతో పని గంటలు, వేతనాలతో కూడిన లీవులు, పబ్లిక్ హాలిడేస్ ఇవ్వాలి.'' ''భారత దేశం ఆ ఒప్పందం మీద సంతకం చేసింది. 1979 ఏప్రిల్ 10న దాన్ని స్థిరపర్చింది (ఆమోదించింది). పైన పేర్కొన్న బాధ్యత నుంచి తప్పుకోవటం కుదరదు. రెగ్యులర్ లేదా తాత్కాలికం ఎవరయినా సరే ప్రతి ఒక్క ఉద్యోగికీ సమాన పనికి సమాన వేతనం పొందటం నిస్సందేహమైన హక్కు. పైన పేర్కొనబడిన రాజ్యాంగంలోని వివిధ నిబంధనలు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 141కి లోబడి ఈ కోర్టు ప్రకటించిన న్యాయం దృష్ట్యా ఇది స్పష్టం.''
సుప్రీంకోర్టు తీర్పు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించినది. అయినప్పటికీ, కోర్టు పరిగణనలోకి తీసుకున్న అంశాలను చూసినప్పుడు ఈ తీర్పు అందరికీ వర్తిస్తుందని ఎటువంటి సందేహాలకు తావులేకుండా చెప్పవచ్చు. పంజాబ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న టెంపరరీ ఉద్యోగుల కేసుపై సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తన తీర్పు ఇవ్వటానికి ముందుగా అదివరలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనేక కేసులను ఉటంకించింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్టేట్ బ్యాంక్, యుపి కో ఆపరేటివ్ బ్యాంక్‌లకు సంబంధించిన ఉద్యోగుల కేసులు ఉన్నాయి. అంతేకాదు ఈ తీర్పులో ముఖ్యమయిన మరో భాగం ఉంది. సుప్రీంకోర్టు ఈ తీర్పు కోసం అంతకుముందు తాము ఇచ్చిన అనేక తీర్పులను పరిశీలించింది. రాజ్యాంగంలోని అనేక నిబంధనలు ఆ తీర్పులలో ఉపయోగించబడ్డాయి. చివరిలో పంజాబ్ ప్రభుత్వ తాత్కాలిక ఉద్యోగులకు తాను ఇచ్చిన తీర్పుకు కూడా సుప్రీం కోర్టు రాజ్యాంగాన్ని ఉపయోగించుకొంది. తీర్పుల కోసం పరిశీలించిన రాజ్యాంగంలోని ముఖ్యమైన భాగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రాజ్యాంగ పీఠిక : అవకాశాలు, హోదాల్లో సమానత; ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం.
ఆర్టికల్ 14 : చట్టం ముందు అందరూ సమానులే. వివక్షతను రూపుమాపాలి.
ఆర్టికల్ 16 : ఉద్యోగంలో సమాన అవకాశాలు.
ఆర్టికల్ 38(1) : ఆదాయంలో అసమానతలు తగ్గించాలి. హోదా, సౌకర్యాలు, అవకాశాల్లో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు రాజ్యం ప్రయత్నించాలి.
ఆర్టికల్ 39(డి) : సమాన పనికి సమాన వేతనం.
ఆర్టికల్ 141 : సుప్రీం కోర్టు ప్రకటించిన న్యాయం, ధర్మాలకు దేశంలోని అన్ని కోర్టులూ కట్టుబడి ఉండాలి.
ఆర్టికల్ 142 : సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు కావాలి.
రాజ్యాంగంలోని 4వ భాగం : ఇందులో ఉన్న ఉద్దేశాలను ఆచరణలోకి తెస్తే సంక్షేమ రాజ్యాన్ని స్థాపించినట్లే. (ఆదేశిక సూత్రాలు)
సుప్రీం కోర్టు తీర్పు సంకుచితమైనది కాదు. ఏదో కొంత మంది ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికే అది పరిమితం కాదు. విశాల పరిధిలో ఉన్న కార్మికులందరికీ అది వర్తిస్తుంది. రాజ్యాంగం ముందు అందరూ సమానులే. రాజ్యాంగంలోని అనేక నిబంధనలను సుప్రీంకోర్టు తన తీర్పుకు ప్రాతిపదికగా తీసుకుంది. అందువల్ల అన్ని రకాల కార్మికులకు, ఉద్యోగులకు దీన్ని వర్తింపచేయాలి.
ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు కారు చీకట్లో కాంతిరేఖ. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకుంది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోనే కాకుండా, ప్రయివేటు పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే క్యాజువల్, కాంట్రాక్టు, డైలీవేజ్, అడ్హాక్, తదితర కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలి. ఇటీవల జరిగిన భారత కార్మిక మహాసభలు తీర్మానించినట్లుగా సమాన పనికి సమాన వేతనం అంశాన్ని కాంట్రాక్టు కార్మికుల చట్ట ప్రధాన భాగంలోకి చేర్చాలి. సరళీకరణ విధానాలు అమలవుతున్న నేటి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంత తేలికగా తీర్పును అమలు చేస్తాయని చెప్పలేము. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఏవైనా సరే తీర్పుపై అప్పీలుకు పోవని చెప్పలేము. ఒకసారి ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మరో పెద్ద బెంచ్ స్పందించదని కూడా అనుకోలేము. సమాన పనికి సమాన వేతనం అమలు కోసం ఉద్యోగులు, కార్మికులు ఉద్యమాన్ని మహోన్నతంగా నడపాలి. ఆ ఉద్యమానికి సుప్రీంకోర్టు తీర్పు ఆసరాగా నిలుస్తుంది. కార్మికోద్యమం ఒక్కటే సమాన పనికి సమాన వేతనం అమలుకు పూచీగా నిలుస్తుంది.
- పి అజయ కుమార్

No comments:
Post a Comment