Saturday, 26 November 2016

|| విప్లవోద్యమ సూరీడు ||



క్యూబాలో బాటిస్టా నియంతృత్వాన్ని ఎదిరించడానికి కేవలం 80 మందితో ప్రయత్నించిన ఫిదెల్‌ క్యాస్ట్రోను మట్టుబెట్టాలని నియంత ఆదేశాలు జారీచేశాడు. క్యాస్ట్రోను అంతమొందించినట్లు బాటిస్టా సేనలు అనేకసార్లు చెప్పుకొన్నాయి. ఆయన 1956 డిసెంబరులో మరణించినట్టు పత్రికలు ప్రచురించాయి. క్యాస్ట్రోకు సమాధి కట్టాలన్న నియంతల ఆటలు సాగలేదు. ఆ తరవాత అంతమైంది బాటిస్టా నియంతృత్వమే! ప్రభుత్వానికి ఉన్నంత ఆయుధ సంపత్తిలో లేశమాత్రమైనా లేని ఆయన అంటే, నియంతకు వెన్నులో వణుకు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ- క్యాస్ట్రోను హతమార్చాలని 638 సార్లు ప్రయత్నించి విఫలమైంది. దాదాపు 55 సంవత్సరాల పాటు అమెరికాను ఎదిరించి, 11 మంది అమెరికా అధ్యక్షులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆయన శనివారం శాశ్వతంగా నిద్రపోయారు. 1959లో అధికారం సంపాదించిన అనంతరం 2008 దాకా క్యూబా నాయకుడిగా వెలుగొందిన క్యాస్ట్రోలా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన నాయకుడు ఆధునిక చరిత్రలోనే లేడు. సమకాలీన చరిత్రలో ఆయన ఓ అద్భుతం. ఆయనను ‘కనికరం లేని నియంత’ అని ఈసడించినవారు ఉన్నట్లే, ‘యుగయుగాల్లో అరుదుగా కనిపించే విప్లవకారుడు’ అనే వారూ ఉన్నారు. క్యూబా ప్రజలకు అయిదున్నర దశాబ్దాలుగా ఆయనే నాయకుడు. 2006లో పాక్షికంగా అధికార బాధ్యతలు వదులుకుని; 2008లో అధికారాన్ని తన సోదరుడు, విప్లవోద్యమ సహచరుడు అయిన సోదరుడు రావుల్‌ క్యాస్ట్రోకు అప్పగించారు. అయినా అవసరమైనప్పుడు తన జాతి జనులకు దిశానిర్దేశం చేస్తూనే వచ్చారు.

|| అసాధ్యుడు ||

క్యాస్ట్రోది మహా సాహసం. ఒకసారి ఆయన తన శక్తి ఏమిటో నిరూపించుకోవడానికి, సైకిల్‌ నడుపుతూ గోడను ఢీకొట్టాడు. రాజీ అన్నదే ఎరుగని తత్వం. వైరుధ్యాలను దరిజేరనివ్వలేదు. ఆ మనోస్థైర్యమే ఆయనలో లేకపోతే, అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉండే క్యూబాను ఆ దేశం గుండెల మీద కుంపటిగా మార్చగలిగేవాడు కాదు. ఒక చిన్న దీవి జెండాకు అగ్రరాజ్య జెండాకు ఉన్నంత గొప్పతనం ఆపాదించగలిగేవాడే కాదు. లాటిన్‌ అమెరికా అంతటా విప్లవ జ్వాలలు రగిలించగలిగేవాడు కాదు. అమెరికాతో కయ్యం కారణంగా దశాబ్దాలపాటు కొనసాగిన ఆర్థిక ఆంక్షలను తట్టుకుని క్యూబాను నిలబెట్టడం అసాధ్యమయ్యేది. విద్య, వైద్య రంగాల్లో క్యూబాను మరో అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయడం దుర్లభమయ్యేది. 2001లో ఉత్తర దక్షిణ అమెరికాల మూడో శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు, ‘ఆహ్వానం అందకపోతే అమెరికాతో వాణిజ్య సంబంధాలు లేకుండా మనగలిగే ఏకైక దేశం క్యూబానే’ అని ధైర్యంగా ప్రకటించి నివ్వెరపరచిన విశిష్ట వ్యక్తిత్వం క్యాస్ట్రోది. అధికారం చేపట్టిన తరవాత శత్రు నిర్మూలన కోసం క్యాస్ట్రో కరకుగా వ్యవహరించడం వాస్తవమే అయినా, ‘చరిత్ర నన్ను క్షమిస్తుంది’ అని ప్రకటించగలిగినవాడు క్యాస్ట్రో. 1960 నుంచి 2015 వరకు అమెరికాతో ఎలాంటి దౌత్య సంబంధాలూ లేకపోయినా క్యూబా నిలదొక్కుకున్నదంటే- అందుకు కారణం అమెరికా దాష్టీకాన్ని ఎండగట్టడానికి ఆయన చూపిన ప్రతిభే! ఆయన ప్రభుత్వాన్ని పడదోయడానికి అంతర్గత వ్యతిరేక శక్తులు, అమెరికా పాలకులు సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించినా, తట్టుకుని నిలబడిన ఏకైక నాయకుడాయన. మొదటి నుంచీ తీవ్రవాద భావాలు ఉన్నవాడే కాని, తొలిదశలో కమ్యూనిస్టు కాడు. తాను అధికారం చేపట్టిన దరిమిలా క్యూబాను అస్థిరపరచడానికి కొన్ని ప్రయత్నాలు జరగడం వల్లనే, సోవియట్‌ పంచన చేరాల్సి వచ్చింది. ఆయన నాయకత్వంలో కొనసాగిన విప్లవానికి కమ్యూనిస్టు సిద్ధాంత ప్రాతిపదిక లేదు. ఆచరణ, ఎదురైన సవాళ్లు, పరిస్థితుల కారణంగా ఆయన కమ్యూనిస్టు కాక తప్పలేదు. క్యాస్ట్రో అనుసరించింది కమ్యూనిస్టు సిద్ధాంతాలే.

అంగోలా, మొజాంబిక్‌, ఇథియోపియాల్లోని ప్రజోద్యమాలకు సహకరించడానికి వేలాది సైనికులను ఆయన పంపించాడు. ఐసెన్‌ హోవర్‌ హయాములో క్యూబా మీద ప్రారంభమైన ఆర్థిక ఆంక్షలు, కెన్నెడీ పాలనలో మరింత విస్తరించాయి. విచిత్రం ఏమిటంటే- అమెరికాకు వంత పాడే కెనడా ఆంక్షలను ధిక్కరించి క్యూబా వాణిజ్య సంబంధాలు కొనసాగించింది. రష్యా దన్నుగా నిలిచింది. చమురు సరఫరా చేసి వెనెజులా ఆదుకుంది. క్యాస్ట్రో అభివృద్ధి ప్రణాళికలు ఎంత అబేధ్యమైనవంటే, అపారంగా ఆర్థిక సహాయం చేసి క్యూబాను నిలబెట్టిన సోవియట్‌ పతనం తరవాత కూడా ఆయన నాయకత్వంలోని (కేవలం కోటికి పైబడిన జనాభా ఉన్న) ఆ చిరు దేశం కుదేలైపోలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఆయన అపరిమితమైన సృజనాత్మక విధానాలు అనుసరించారు. అలీనోద్యమానికి క్యాస్ట్రో వెన్నుదన్నుగా ఉండేవారు.1991లో సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు తీవ్రమైన సవాలు ఎదుర్కొంటున్నామన్న క్యాస్ట్రో తేరుకుని ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగారు. ఆయనను గద్దె దించడానికి సీఐఏ కుట్రల్లో భాగమైన బే ఆఫ్‌ పిగ్స్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో క్యాస్ట్రో చూపిన తెగువ- క్యూబా ప్రజలకు ఆయనను తిరుగులేని నాయకుణ్ని చేసింది. ఆయన స్వయంగా మర తుపాకి చేతపట్టి సైనికులను ఉత్సాహపరిచి తన పోరాట పటిమ చాటుకున్నారు. అందుకే క్యాస్ట్రో సాధారణంగా సైనిక దుస్తుల్లోనే కనిపించేవారు. రెండో పోప్‌ జాన్‌ పాల్‌ హవానా సందర్శించిన సమయంలో ఆయనతో సంభాషించినప్పుడు మాత్రం మామూలు దుస్తుల్లో కనిపించారు.

|| విశిష్ట వ్యక్తిత్వం ||

క్యాస్ట్రోకు క్యూబా ప్రజలు బ్రహ్మరథం పట్టినా, వ్యక్తి ఆరాధనను ఆయన అనుమతించేవారు కాదు. వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చేవారు. తొమ్మిదిమంది పిల్లలతో హాయిగా గడిపేవారు. ఆయన ఉపన్యాసాలు సుదీర్ఘమైనవి. ఐక్యరాజ్య సమితిలో ఏకబిగిన ఏడు గంటలపాటు ప్రసంగించి రికార్డు నెలకొల్పారు. 1983లో దిల్లీలో అలీనోద్యమ సమావేశం నిర్వహించినప్పుడు నిర్వర్తించిన పాత్ర అపూర్వమైంది. ఆ సమావేశంలో ఇందిరాగాంధీని వేదికమీద హత్తుకున్న దృశ్యం అపురూపమైంది. సమావేశంలో పాలస్తీనా నాయకుడు అరాఫత్‌ కంటే ముందు మాట్లాడే అవకాశం జోర్డాన్‌ ప్రతినిధివర్గ నాయకుడికి ఇవ్వడంతో, అరాఫత్‌ అలిగారు. కోపగించి తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేసుకున్నారు. ఆ సంక్షోభాన్ని నిలువరించడంలో క్యాస్ట్రో చూపిన చాకచక్యం అద్వితీయం. అరాఫత్‌ను పిలిచి ‘ఇందిరాగాంధీపై మీ అభిప్రాయం ఏమిటి’ అని అడిగితే ‘ఆమె నాకు అక్కయ్య వంటివారు ’ అని బదులిచ్చారు. ‘అయితే తమ్ముడిలా మసలుకో’ అని ఆ సంక్షోభాన్ని క్యాస్ట్రో చిటికెలో నివారించారు.

ఇదే  క్యాస్ట్రో వైవిధ్యభరిత, విశిష్ట, విశేష వ్యక్తిత్వం. ఆయన మృతితో ప్రపంచం ఒక గొప్ప యోధుణ్ని కోల్పోయింది!  - ఆర్వీ రామారావు (ఈనాడు) 

No comments:

Post a Comment