ఇరినా మాలెంకో ప్రస్తుతం 45 సంవత్సరాల వయసులో ఉన్నారు. సోవియట్ యూనియన్‌లో జన్మించి, సోషలిజంలో బాల్యం, యౌవ్వనాన్ని గడిపిన ఆమె ఆ తర్వాత పెట్టుబడిదారీ దేశాలలో నివసిస్తున్నారు. సోషలిజం, పెట్టుబడిదారీ వ్యవస్థలలోని జీవితాలను పోల్చుతూ ఆమె శ్రీలంక పత్రిక సింహళ యూత్ యూనియన్ ఆఫ్ శ్రీలంకకు ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం.
నా పేరు ఇరినా మాలెంకో. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. నేను సోవియట్ యూనియన్‌లోని తులలో జన్మించాను. నాకు 22 సంవత్సరాలు వచ్చే వరకూ సోవియట్ యూనియన్లోనే నివసించాను. చరిత్ర, పురాతత్వ శాస్త్రాలలో మాస్కోలో డిగ్రీ పాసయ్యాను. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నెదర్లాండ్స్‌కు వెళ్ళి అక్కడ నివసిస్తున్నాను. అక్కడ ఎనిమిది సంవత్సరాలు నివసించి లీడెన్ యూనివర్సిటీ నుంచి స్లోవానిక్ భాషలలో డిగ్రీ తీసుకున్న తర్వాత ఉద్యోగాన్వేషణలో ఐర్లాండ్ వెళ్ళాను. నేను ఇప్పటికీ ఐర్లాండ్‌లోనే నివసిస్తున్నాను. నేను అనువాదకురాలిగా, రచయితగా, రాజకీయ కార్యకర్తగా పనిచేస్తున్నాను. కమ్యూనిస్టుగా, సోవియట్ పౌరురాలిగా చెప్పుకోవటా నికి నేను గర్వపడుతున్నాను. బాల్యంలో నా జీవితం అత్యంత ఆహ్లాదకరంగా గడిచిందని చెప్పటం నా ఒక్కదానికే సంబంధించినది, అసాధారణమైనది కాదు. సోవియట్‌లో పెరిగిన నా తరానికి చెందిన అనేకమంది మీకు ఇదే విధంగా చెబుతారు. నా తల్లిదండ్రులకు నేను ఏకైక కుమార్తెను. నా తండ్రి పోస్ట్ గ్రాడ్యుయేట్. నా తల్లి ఇంజనీర్. ఆమె ఒక ఫ్యాక్టరీ నిర్వాహకురాలిగా పనిచేశారు.
అప్పుడు మాకు వర్తమాన, భవిష్యత్ జీవితాన్ని గురించి ఎటువంటి ఆందోళనా లేదు. ప్రాథమిక, ఉన్నత విద్యకు సంబంధించి ఏడు సంవత్సరాల వయసు నుంచి పది సంవత్సరాల వరకు నిర్బంధవిద్యను అభ్యసించాలి. సోవియట్‌లో పిల్లలు మాత్రమే ప్రత్యేక హక్కులు కలిగిన వారని అంటుంటారు. మా విద్య అంతా ఉచితం, నాణ్యమైనది. పాఠశాల సమయం అనంతరం ఆటలాడుకోవటానికి, సంగీతం నేర్చుకోవటానికి వివిధ రకాల ఉచిత క్లబ్బులున్నాయి. పిల్లల వేసవి శిబిరాలు, బాలల హోటళ్ళు, బాలల రైళ్లు, ప్రకృతిని ప్రేమించే వారికి ప్రత్యేక శిబిరాలు ఉన్నాయి. అక్కడ బాలలు మొక్కల పెంపకాన్ని కూడా నేర్చుకోవచ్చు. పదిహేడు సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను మా తాతయ్య, అమ్మమ్మ, మా చినమామయ్య ఒకే ఇంట్లో ఉన్నాం. మా అమ్మమ్మ, తాతయ్యలు ఫ్యాక్టరీ కార్మికులుగా పనిచేసి రిటైరయ్యారు. మా జీవితం చాలా భద్రంగా, ప్రశాంతంగా, ఏ మాత్రం ఒత్తిడి లేని వాతావరణంలో ఉండేది. శారీరకంగా అశక్తులు, ఇంటిపనులు చూసుకోవాలనుకున్నవారు, రిటైరైనవారు మినహా మిగతా వయోజనులందరూ ఉద్యోగాలు చేస్తుంటారు. రిటైర్మెంటు వయసు స్త్రీలకు 55 సంవత్సరాలు, పురుషులకు 60 సంవత్సరాలు. సోవియట్‌లో కళలు సేర్చుకోవటం చాలా సులభం. గ్రంథాలయాలలో ఏ మాత్రం రుసుం చెల్లించాల్సిన పనిలేదు. పుస్తకాలు, థియేటర్లలో ప్రదర్శనలు, మ్యూజియంలు, ఎగ్జిబిషన్లలో అతి తక్కువ ఛార్జీలు మాత్రమే ఉంటాయి. స్వంతయిల్లు, ఉద్యోగం, జీతంతో సెలవులు గడపటానికి గ్యారంటీ హక్కు ఉన్నది. ఇంటి ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. మంచినీళ్ళు, విద్యుత్‌కు ప్రజలు తమ జీతాలలో మూడు నాలుగు శాతం మాత్రమే చెల్లిస్తారు. ప్రజలు తమ జీవితకాలం నివసించటానికి ప్రభుత్వం ఉచితంగా అపార్ట్మెంట్లు ఇస్తుంది. వారి పిల్లలు కూడా వాటిలో నివసించవచ్చు. కానీ అమ్ముకోవటానికి హక్కుండదు. ఆహారం వలెనే ప్రజారవాణా వ్యవస్థ కూడా అత్యంత చౌకగా ఉంటుంది. బాలల బట్టలు, బూట్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. పుస్తకాలు ఉచితంగా సరఫరా చేస్తుంది. ఈనాటి యువతరానికి ఈ విషయాలు ఎక్కువ భాగం తెలియవు కాబట్టి నేను అనుభవించిన ఈ జీవితాన్ని నా పుస్తకం సోవియటికాలో సాధ్యమైనంత ఎక్కువగా వివరించటానికి ప్రయత్నించాను. ఈ అంశాలను నమ్మటం వారికి కష్టంగా ఉంటుంది. నాకు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు మా అమ్మ మొదటిసారిగా పనికి వెళ్ళటం ప్రారంభించింది. పాఠశాలేతర విద్యాకేంద్రం ఆమె ఫ్యాక్టరీకి సంబంధించినది. నేను రోజంతా అక్కడ ఉండటానికిగానూ ఆమె తన జీతంలో కొంతభాగాన్ని చెల్లించేది. అది వెచ్చని, ఆహ్లాదకరమైన ప్రదేశం. సమూహంలో భాగంగా ఎలా ఉండాలి, దేశంలోని రాజకీయ పరిణామాలను, తదితరాలను గురించి ఉపాధ్యాయులు మాకు బోధించేవారు. మాకు సంగీతం పాఠాలను చెప్పేవారు. బొమ్మలు చాలా ఉండేవి. పార్కులకు, ఇతర బయటి ప్రదేశాలకు చాలా ఎక్కువగా తీసుకెళ్ళేవారు. సోవియట్‌లో బాలలకు అన్నీ లభ్యమయ్యేవి. బాలల కోసమే ప్రత్యేకంగా పుస్తకాలను ప్రచురించే సంస్థలుండేవి. పిల్లల కోసమే ప్రత్యేకంగా నిర్మించిన కథా చిత్రాలు, కార్టూన్ సినిమాలుండేవి. రేడియో, టీవీలలో ప్రతిరోజూ పిల్లల కోసం కార్యక్రమాలు ప్రసారం చేసేవారు. వాటితో పాటు ప్రతివారం పిల్లల కోసం ప్రసారం చేసే 'విజిటింగ్ ఫెయిరీటేల్స్'ను కొత్త విషయాలతో అందించేవారు. వాటికోసం మేమందరం ఎదురు చూస్తుండేవారం.
స్పోర్ట్స్ క్లబ్బులన్నింటిలో ప్రవేశం పూర్తి ఉచితంగా ఉండేది. వాటికి హాజరుకమ్మని పిల్లలను ప్రోత్సహిస్తుండేవారు. వారిలో ఉత్తమమైనవారిని స్పోర్ట్స్ స్కూల్స్‌కు హాజరయ్యేందుకు ఎంపికచేసేవారు. ఆ విధంగా ప్రతివారూ ఆటలలో పాల్గొంటూ విస్తృతమైన భాగస్వామ్యం ఉండటమే సోవియట్ యూనియన్ ఒలెంపిక్స్‌లో బలమైన శక్తిగా ఉండటానికి కారణం. అమెరికా ఫిగర్ స్కేటర్ థారు బాబిలోనియా స్కేటింగ్ పాఠాలు నేర్చుకునేందుకు ఆమె తండ్రి తప్పనిసరి పరిస్థితుల్లో మూడు ఉద్యోగాలు చేశాడని ఒక సినిమాలో చూసి నేను షాక్‌కు గురయ్యాను. పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం ఆటలను ప్రదర్శించేవారు. పిల్లల సినిమాలకు టిక్కెట్ రేట్లలో రాయితీలు ఇచ్చేవారు. తరచుగా మొత్తం క్లాసులోని పిల్లలందరూ వాటికి హాజరయ్యేవారు. స్కూలు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత వారివారి ఆసక్తికి అనుగుణంగా పిల్లలు వివిధ రకాల కార్యక్రమాలలో పాల్గొనటానికి ప్రత్యేకమైన కేంద్రాలుండేవి. స్కూలు కార్యక్రమాలలో భాగంగా పిల్లలకు ఈత పాఠాలు చెప్పేవారు. పిల్లలకు సంబంధించిన అన్నింటికీ, పుస్తకాలు, బట్టలు, ఆట వస్తువులు, పిల్లల జాగ్రత్తకు సంబంధించిన అన్ని విషయాలలోనూ ప్రభుత్వం పెద్దమొత్తంలో సబ్సిడీలు ఇచ్చేది. అందువల్ల ఎక్కువ మంది పిల్లలున్నవారు భారంగా కాకుండా, ఆనందకారకంగా భావించేవారు. అపార్ట్మెంట్ సైజు మాత్రమే కుటుంబ పరిమాణాన్ని నియంత్రించేది. పిల్లలను హింసించటం, వేధించడం లాంటి వాటికి తావులేదు. ఎటువంటి పర్యవేక్షణ లేకుండానే నేను నాస్నేహితులతో రోజంతా బయట ఆడుకుంటూ ఉండేదాన్ని. ఐదు లక్షల మంది ప్రజలు నివసిస్తున్న మా నగరంలో 20 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్క పిల్లవాడి హత్య జరిగింది. అది కూడా మతిస్థిమితంలేని అతని తల్లి చేసింది. ఇల్లులేని పిల్లలు ఉండరు. బాలలలో ప్రతి ఒక్కరూ స్కూలుకు వెళతారు.
మా అమ్మమ్మ ఫ్యాక్టరీ పని తర్వాత మిగతా సమయంలో ఎక్కువగా నాతోనే గడిపేది. ఆమె బలమైన నైతిక విలువలు, సహనం, మంచి తెలివితేటలు కల వ్యక్తి. ఆమె మాపై ముద్రవేసిన విలువలకు తగినట్లుగా బతకటానికి మేమందరం ప్రయత్నిస్తున్నాం. నా చిన్నతనంలో ఆమె నాకు కథలు చెప్పేది. పాటలు పాడి వినిపించేది. మా తాతయ్య కూడా నాకోసం కథలు చెప్పేవాడు. ఇరుగుపొరుగు వారు కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటారు. మా వీధిలో ఆరుగురు పిల్లలున్న కుటుంబం ఉండేది. వారు నాకు స్నేహితులు. వారికి తాతయ్య లేడు. తండ్రి ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరించేవాడు. వారి తల్లి పూర్తికాలం పనిచేస్తుండేది. పిల్లలు ఎక్కువ సమయం రోడ్డుపై ఉండేవారు. కానీ ఆ వీధిలోని వారంతా ఆ కుటుంబం మంచిచెడ్డలు చూస్తుండేవారు. ప్రస్తుతం నేను జీవిస్తున్న పెట్టుబడిదారీ దేశాలలో అయితే ఇరుగుపొరుగు వారు ఆ పిల్లలను గురించి సామాజిక కార్యకర్తలకు తెలియజేసేవారు. వారు వచ్చి ఆ పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరంగా తీసుకువెళ్ళటానికి ప్రయత్నించి, వారి జీవితాన్ని మరింత దుర్భరం చేసేవారు. కానీ వారు ఆరుగురూ ఇప్పుడు తమ కుటుంబాలతో హాయిగా ఉంటున్నారు. వారు పెట్టుబడిదారీ సమాజంలో లేకపోవటం అదృష్టం. మేమందరం అదృష్టవంతులం. సోవియట్ యూనియన్‌లో ఒకే విధమైన పాఠశాలలుంటాయి. అందరూ ఆ స్కూళ్ళలోనే చదవాల్సిందే. కాబట్టి పాఠశాలల్లో ప్రవేశానికి పోటీ ఉండదు. మొదట్లో ఎనిమిది సంవత్సరాల విద్యను తప్పనిసరి చేశారు. తర్వాత పది సంవత్సరాలకు పెంచారు. ఎనిమిది సంవత్సరాల విద్యనభ్యసించిన తర్వాత పిల్లలు తాము చదువు మానివేయాలనుకుంటే మానేయవచ్చు. కానీ అప్పుడు వారు కాలేజీకి వెళ్ళి, ఏదో ఒక వృత్తిని నేర్చుకోవాలి. ఆ విధంగా వారు కూడా పది సంవత్సరాలు విద్య నేర్చుకోవటాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. వారి కుటుంబ నేపథ్యం, శక్తిసామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరూ సమాన అవకాశాలు పొందే నిజమైన వ్యవస్థ అది. శారీరకంగా లోపాలున్న పిల్లలకు, ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసేవి మాత్రమే మినహాయింపు. ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే ప్రత్యేకంగా అధ్యయనం చేయాలన్న ఆసక్తి ఉన్న పిల్లలకు లెక్కలు, విదేశీ భాషలు నేర్పే పాఠశాలలున్నాయి. పిల్లలుగా ఎదుర్కొనే ఒకే ఒక పోటీ పాఠశాలలోని తరగతుల వారీగా ఏర్పాటు చేసిన గ్రూపుల మధ్య మంచి మార్కుల కోసం జరిగే పోటీ మాత్రమే. ప్రతి తరగతిలోనూ నలుగురు లేక ఐదుగురు పిల్లలతో గ్రూపులను ఏర్పాటు చేస్తారు. ప్రతి గ్రూపుకు ఎన్నికైన నాయకుడుంటాడు. స్కూలు వదిలిన తర్వాత నేర్చుకోవటంలో ముందున్న విద్యార్థులు వెనుకబడిన పిల్లలకు హోమ్‌వర్క్‌లో సహాయం చేస్తారు. బాగా నేర్చుకుంటున్న పిల్లలు వెనుకబడిన పిల్లలకు సహాయం చేయటం తమ బాధ్యతగా భావిస్తారు.
స్కూల్ జీవితం పూర్తి సంఘటనా భరితంగా ఉంటుంది. స్కూల్లో మాత్రమే కాక క్లాస్రూమ్ బయట జరిగే పొలాలలో పని, కూరగాయలు పెంచటం, స్వచ్ఛందసేవ, స్కూల్ గార్డెన్‌ను శుభ్రం చేయటం, తదితర అనేక కార్యక్రమాలలో కలిసి పాల్గొంటాం. మమ్ముల్ని పెంచటం కూడా రాజకీయపరంగానే ఉంటుంది. మొదటి గ్రేడ్‌లో మేము ప్రత్యేక బ్యాడ్జి, ప్రవర్తనా నియమావళితో అక్టోబర్ బాలలం అవుతాం. మూడవ గ్రేడ్‌లో రెడ్టై, బ్యాడ్జ్‌తో మార్గదర్శకులమౌతాం. యువ మార్గదర్శకులుగా మేము మాస్కోలోని రెడ్‌స్క్వేర్‌లో ప్రతిజ్ఞ చేసేటప్పుడు మా స్కూలు నుంచి మమ్ముల్నందరినీ ఇందుకోసమే ప్రత్యేకంగా అక్కడికి తీసుకెళతారు. మేము ప్రతిజ్ఞచేసిన తర్వాత లెనిన్ మాసోలియంను దర్శించటాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. పద్నాలుగు సంవత్సరాల వయసులో మేము యంగ్ కమ్యూనిస్టు లీగ్‌లో సభ్యులమౌతాం. చివరిలో దేశాన్ని ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పుతారు. చివరి రెండు సంవత్సరాలు మాకు సైనిక శిక్షణ ఇస్తారు. మహిళల పట్ల దృక్పథం కూడా భిన్నంగా ఉంటుంది. మా సమాజం మహిళల పట్ల లైంగిక దృక్పథంతో వ్యవహరించటాన్ని సహించదు. మహిళలను సమానులుగా చూడటంతో పాటు, వారితో గౌరవనీయంగా వ్యవహరించటాన్ని కూడా నేర్పుతారు. లైంగిక దాడులు, అత్యాచారం లాంటివి అరుదుగా జరుగుతాయి. అటువంటి నేరాలు చేసినవారిని విచారణ తర్వాత ఉరితీస్తారు. నాకు ఆరు సంవత్సరాల వయసప్పుడు మా అమ్మ నన్ను మాస్కో తీసుకెళ్ళింది. మేము అమెరికన్ సినిమా 'హాలిడే ఇన్ ఐస్'కు వెళ్ళాం. తర్వాత రాత్రి రైలుకు మేం తిరిగివచ్చాం. రైలుపెట్టెలు ఖాళీగా ఉన్నాయి. నేను మా అమ్మ ఒడిలో తలపెట్టుకొని పడుకొని గడిపాను. స్టేషన్ నుంచి నడుచుకుంటూ తెల్లవారు ఝామున నాలుగు గంటలకు మేము ఇంటికి చేరాం. ఆ వేసవి రాత్రి వెచ్చగా, ప్రశాంతంగా, అద్భుతంగా ఉంది. ఏ విషయానికీ, ఎవరికీ ఎవరూ భయపడకపోవటం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
విద్య పూర్తికాగానే మాకు ఉద్యోగం గ్యారంటీగా ఉంటుంది. మాకు మేము ఉంటున్నచోటగానీ లేదా ఇతర చోట్లగానీ ఉద్యోగం వస్తుంది. ఇతర చోట్ల ఉద్యోగం వస్తే ఉద్యోగం ఇచ్చిన సంస్థ వసతి కల్పించాల్సి ఉంటుంది. మాకెవరికీ విద్యానంతరం ఉద్యోగాన్ని గురించిన చింత ఉండదు. ఎవరూ నిరుద్యోగులుగా ఉండరు. కొత్తగా ఉద్యోగాలలో చేరినవారికి ఏ ఉద్యోగం చేస్తున్నా వేతనాలు దాదాపు ఒకేవిధంగా ఉంటాయి. ఇప్పటి యువకులకు సోవియట్ విలువలు, లక్ష్యాలను గురించి తెలియకపోవటం విచారకరం. నాణ్యతలేని విద్య, పెట్టుబడిదారీ మీడియా బ్రెయిన్‌వాష్ చేయటంతో సోవియట్ యూనియన్‌లో జీవితం, సోషలిస్టు విలువలను గురించి యువకులకు తెలియకపోవటం విచారకరం. రష్యన్ యువకులు ప్రస్తుత విచారకరమైన వాస్తవాల గురించి తెలుసుకోవటానికి ఆసక్తి చూపటం మంచి విషయం. కొంచెం ముందూవెనుకగా వారు సోవియట్‌ను గురించి తెలుసుకొని, సమాధానాలను అన్వేషిస్తారు. గత ఐదు, పది సంవత్సరాల కన్నా ఈనాడు సోవియట్ యూనియన్ పట్ల, సోషలిజం పట్ల ఆసక్తి పెరిగింది. నేను కలిసిన అనేకమంది రష్యన్లు మనదేశం తిరిగి ఉన్నతమైన స్థితికి చేరే సమయం వస్తుందని చెప్పారు. -(ప్రజాశక్తి)

No comments:
Post a Comment