నల్లధనంపై ప్రభుత్వ యుద్ధ బాధితులు పేద ప్రజలే. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల నిర్ణయం వారికి జీవన్మరణ సమస్యగా పరిణమించింది.
పేదరికంలో మగ్గుతున్న కోట్లాది భారతీయుల ఆహార భద్రతకు తాజాగా ఒక తీవ్ర ముప్పు ఏర్పడింది. డీమోనెటైజేషన్ వల్లే ఈ విపత్తు ముంచుకొచ్చింది! ఇదొక కఠోర వాస్తవం. పాలకులు నిరక్ష్యం చేస్తున్న, పేదలు తల్లడిల్లుతున్న దుస్థితి ఇది.
భారతదేశపు కొట్టొచ్చినట్టు కన్పించే వాస్తవం పేదరికమే కాదూ? అధికారిక గణాంకాల ప్రకారమే 2012లో దేశ జనాభాలో 22శాతం మంది దార్రిద్య రేఖకు దిగువున నివశిస్తున్నారు. అయితే పోషకాహార లభ్యతకు సంబంధించిన పలుసూచకాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 22 శాతానికి మించి మరెంతో మంది భారతీయులు పోషకాహార లేమితో బాధపడుతున్నారని స్పష్టమవుతోంది. ప్రకటిత లక్ష్యంలో ఎంత ఉదాత్తమైనదైనప్పటికీ పేదలకు ఆహారం అందుబాటులో ఉండడానికి తోడ్పడని ఏ విధానమైనా వారి ఆహారభద్రతపై వినాశనకర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు.
ఆహారభద్రత, పోషకాహార హోదా అవినాభావ సంబంధం కలవి. కనుక పోషకాహార సూచకాలను కొన్నిటిని సమీక్షించడం చాలా ముఖ్యం. భారతీయ బాలల్లో 43శాతం మంది (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3’ (ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించింది. వీరిలో సగం మంది 55 జిల్లాల్లో ఉన్నారు. వీరందరూ ఐదు సంవత్సరాల వయస్సు లోపు వారే కావడం గమనార్హం. కొత్త ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో మెరుగైన ఫలితాలు కన్పించినప్పటికీ మొత్తంమీద పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నదనేది స్పష్టం. పోషకాహార లోపంతో పెరిగిన పిల్లలు వయోజనులుగా పోషకాహార సమస్యలతో బాధపడుతున్న వారేనని కూడా ఈ సర్వేల ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. డిమోనెటైజేషన్ (పెద్ద విలువగల కరెన్సీ నోట్ల రద్దు) ఇప్పుడు తదుపరి దశలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ గణాంకాలను పరిశీలిస్తే బ్యాంకింగ్ సదుపాయాలను ఉపయోగించుకొంటున్న భారతీయుల సంఖ్య చాలా స్వల్పమని స్పష్టమవుతుంది.
జనాభా లెక్కల ప్రకారం ఈశాన్య రాష్ట్రాలలో బ్యాంకింగ్ రంగం విస్తరణ చాలా తక్కువగా ఉన్నది. మణిపూర్‌లో కేవలం 29.6 శాతం కుటుంబాలకు, మేఘాలయలో 37.5 శాతం కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఆ తరువాతి స్థానాలలో బిహార్, అసోం, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో గరిష్ఠంగా 44 నుంచి 46 శాతం కుటుంబాలకు మాత్రమే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ బ్యాంకింగ్ అంకెలు మరింత తక్కువ స్థాయిలో ఉన్నాయని మరి చెప్పనవసరం లేదు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 25 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ కొత్త ఖాతాలు అంతకుముందు ఎటువంటి ఖాతాలు లేనివారే ప్రారంభించారా అనే విషయం తెలియదు. జన్‌ధన్ యోజన ఖాతాలను గుర్తింపుకార్డులు లేదా గెజిటెడ్ అధికారుల ఆమోదం ప్రాతిపదికన ప్రారంభించడం జరిగింది. ఈ రెండు సదుపాయాలు మన దేశంలోని పేద ప్రజలకు సాధారణంగా అందుబాటులో ఉండవు కదా. మరి నిన్నటివరకు తమ అరకొర సంపాదననే సరిగ్గా లెక్కించుకోలేని ఈ పేదలు ఒక్కసారిగా బ్యాంకు చెక్‌లపై సంతకాలు చేయడం లేదా ఏటీఎమ్ కార్డులు స్వైప్ చేయడం ఎలా నేర్చుకున్నారో అర్థం చేసుకోవడం కష్టమే.
నల్ల ధనంపై ప్రభుత్వ యుద్ధం (అంటే ప్రధాని మోదీ గారి యుద్ధమని అర్థం చేసుకోవాలి సుమా!) వల్ల తొలుత నష్టపోయింది పేదప్రజలే. ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఈఈపీసీ) అంచనా ప్రకారం నాలుగు లక్షల మంది దినసరి వేతనోద్యోగులు వీధిన పడ్డారు. వీరికి ప్రస్తుతం ఎటువంటి పని దొరకడం లేదు. జౌళి, వస్ర్తోత్పత్తుల రంగంలోని పరిస్థితి ఇది. ఈ రంగంలో 3.20 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక నిర్మాణరంగం తీవ్ర విషమ పరిస్థితినెదుర్కొంటున్నది. 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగంలో ఇప్పటికే తీవ్ర మాంద్యం నెలకొన్నది. భారతీయ కార్మికుల్లో 90శాతం మందికి పైగా అసంఘటిత రంగంలో ఉన్నవారేననేది మనం విస్మరించకూడని వాస్తవం. అత్యంత స్వల్ప ఆదాయాలతో వీరు దేశ ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తున్నారు.
డిమోనెటైజేషన్ విన్యాసం పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తుందన్నది స్పష్టం. అంతేకాదు అదివారికొక జీవన్మరణ సమస్యగా పరిణమించింది. వాతావరణంలో విపరీత మార్పులు, పెరుగుతున్న నిరుద్యోగం, ఆహార అభద్రత కారణంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చారు. భారతీయులందరికీ మరీ ముఖ్యంగా పేదలు, నిరుపేదలకు ఆహార భద్రత సమకూర్చడానికీ చట్టాన్ని ఉద్దేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎ్‌స) ద్వారా ప్రతి ఒక్కరికీ తిండిగింజలు, ఇతర నిత్యావసరాలను సరఫరాచేయాలని ఈ చట్టం నిర్దేశించింది. అయితే పీడీఎస్లోని లొసుగుల వల్ల అత్యధిక పేద కుటుంబాలు ఆహార భద్రతా చట్టం వల్ల లబ్ధిపొందలేకపోతున్నాయి. ఆహార భద్రత ఉన్న కుటుంబాలు కూడా పెద్ద సంఖ్యలో పీడీఎస్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయి. పీడీఎ్‌సకు సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాలలో లబ్ధిదారులకు కాకుండా నల్లబజారుకు చేరుతున్నాయనేది కూడా ఒక వాస్తవం. అయినప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక సంక్షేమ పథకమిది. మరి పాత కరెన్సీ నోట్ల మార్పిడి విషయంలో మినహాయింపులను పీడీఎ్‌సకు సైతం ఎందుకు వర్తింపచేయలేదు? పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకొంటున్న ప్రభుత్వం గ్రామీణ భారతీయుల వెతలను నిర్లక్ష్యం చేయడం గర్హనీయం.
డిమోనెటైజేషన్ వల్ల ఎదురవుతున్న సమస్యలను ప్రజలు తమ సొంత పద్ధతుల్లో అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటువంటి చాతుర్యం, సామర్థ్యం కలవారిలో నిరుపేదలు లేరనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఆకలి , పోషకాహార లోపంతో సంభవిస్తున్న మరణాలను గుర్తించడం సాధ్యం కాని విషయం. ఎందుకంటే సాధారణ రోగాల వల్లే సంభవించినట్టు ఆ మరణాల వివరాలు రికార్డు అవుతాయి. దేశ పాలకులు గుండెలు విరుచుకొని ఘనంగా చాటుకొంటున్న గొప్పల సందడిలో ఆ నిర్భాగ్యుల ఆక్రందనలు విన్పించకపోవడంలో ఆశ్చర్యమేముంది? -అనుపమ్ శ్రీవాస్తవ (ఆంధ్ర జ్యోతి)

No comments:
Post a Comment