Wednesday, 10 August 2016

|| పాలకులు సృష్టించిన పాము ||

కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడన్నది నానుడి. కానీ నేర సామ్రాట్‌ నయీముద్దీన్‌ అలియాస్‌ నయీం చేత కత్తి పట్టించి ఆ కత్తికే అతన్ని బలి ఇచ్చాయి.. పాలక వర్గాలు. నయీం ఉత్థాన, పతనాల వెనుక పాలకవర్గాలు, అవి సృష్టించిన నేర పూరిత వ్యవస్థ ఉంది. తాత్కాలిక ప్రయోజనాల కోసమో, సొంత లాభం కోసమో నేరాన్ని వ్యవస్థీకృతం చేసి, సర్వాధికారాలు దానికే అప్పగిస్తే కలిగే దుష్ఫలితాలకు నయీం ఉదంతం తాజా ఉదాహరణ. అంతా ముగిసిన తరువాత నయీం నేర చరిత్ర గురించి, అనుసరించిన అక్రమ మార్గాల గురించి, చేసిన భూ కబ్జాలు, బ్లాక్‌ మెయిలింగ్‌లు, కిడ్నాప్‌ల గురించి పోలీస్‌ అధికారులు ఇప్పుడు గంటల తరబడి చెబుతుండటమే విచిత్రం! సామాన్యులు విస్తు పోయే రీతిలో వేల కోట్ల రూపాయలు నయీం ఖజానాలో వచ్చి చేరాయన్నా, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఆస్తుల కూడగ ట్టాడన్నా రోజుల తరబడి లెక్క పెట్టినా తేలనంత సంపద పోగు చేశాడన్నా ప్రభుత్వాలు, అవి అనుసరించిన దివాళాకోరు విధానాలే కారణం. పోలీస్‌శాఖ నయీంకు పాలు పోసి పెంచితే, పాలకవర్గ రాజకీయాలు ఒక శక్తిగా మార్చాయి. అరాచకాలకు తెగబడుతున్నా చట్టం కళ్లు మూసి, ముందు వెనుక మఫ్టీ సెక్యూరిటీనిచ్చి తమకు నచ్చని వారిని, తమ వారు కాని వారిని, తమకు అడ్డు అనుకున్న వారిని బెదిరించి, అవసరమైతే కడతేర్చే వికృత వ్యూహాన్ని అమలు చేశాయి. ఈ అలుసే నయీంను అధికార యంత్రాంగంలో అనధికార భాగంగా మార్చాయి. తానే ఒక అధికార కేంద్రంగా తనను తాను భావించుకునే స్థితికి బరి తెగించేలా మార్చాయి. పోలీసులు చెబుతున్న కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోవడానికి కొద్దిరోజుల ముందు అధికారపార్టీ నేతలను, ఎంపీలను నయీం బెదిరించాడన్నా, బ్లాక్‌ మెయిల్‌ చేశాడన్నా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఉన్నత స్థాయి నుండి లభించిన భరోసానే కారణమన్నది ఎంత సత్యమో, అధికారంలోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నాడు కాబట్టే పోలీసుల తుపాకీ గుళ్లకు ఎరగా మారాడన్నదీ అంతే సత్యం.

ఐపిఎస్‌ అధికారి వ్యాస్‌ హత్య అనంతర పరిణామాలు నయీం ప్రాభవానికి దారి తీశాయి. 1993లో హైదరాబాద్‌లో జరిగిన ఆ సంఘటన అనంతరం పోలీసులకు చిక్కిన నయీం ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ఆ కాలంలో ఏం జరిగిందో కానీ, జైలు నుండి విడుదలైన తరువాత పోలీస్‌శాఖకు అత్యంత ప్రియమైన వ్యక్తిగా మారి పోయాడు. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం పెట్టి తన హిట్‌లిస్ట్‌లో ఉన్న వారి పేర్లు బహిరంగంగా ప్రకటించినా, నాటి పీపుల్స్‌వార్‌ నేత గణపతిని అంతం చేస్తానని చెప్పినా, అప్పట్లో అధికారంలో ఉన్న వారిలోగానీ చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారుల్లో గానీ ఉలుకు పలుకూ లేదు. అదేదో తమకు సంబంధంలేని వ్యవహారంగా అప్పట్లో వ్యవహరించారు. తమ చేతికి మట్టి అంటకుండా నక్సలైట్లను నిర్మూలించవచ్చనీ భావించారు. నయీంకు పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా స్నేహ హస్తం అందించారు. ఇదేమని అప్పట్లోనే పలువురు ప్రశ్నించినా, నిలదీసినా పాలకులు వినీ విననట్లు వ్యవహరించారు. కొందరిని బెదిరించి నోరు మూయించారు. ఇలా ప్రారంభమైన నయీం సంఘ విద్రోహ శక్తిగా, బ్లాక్‌ మెయిలర్‌గా, డాన్‌గా తన ప్రస్థానాన్ని సాగించి చివరకు తుపాకీ గుళ్లకు బలి కావడం అనూహ్య పరిణామమేమీ కాదు! కాకపోతే పెంచి, పోషించి, ఇంత కాలం రక్షణ కల్పించిన వారే మరో మార్గం లేదన్నట్లు వ్యవహరించిన తీరే ఆశ్చర్యం. ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్‌ శాఖ పాత్ర గురించి వచ్చిన కథనాల్లో సమాధానాలు లేని ప్రశ్నలెన్నో ఉన్నాయి.
నిజానికి ఈ తరహా సంఘ విద్రోహ శక్తులకు అధికార ప్రాపకం లభించడం కొత్తేమీ కాదు. ఇన్‌ఫార్మర్లనో, ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకంగా పని చేస్తారనో పోలీసులు కొందరిని ప్రోత్సహిస్తారు. మరి కొందరిని తామే సృష్టిస్తారు. వారికి అన్ని విధాలా అండగా ఉండి ప్రోత్సహిస్తారు. అటువంటి వారికి రాజకీయ నేతల ప్రాపకం కూడా దొరికితే మరింతగా బరి తెగించిపోతారు. రాష్ట్రంలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఏకుగా ప్రారంభమైన వారు మేకుగా మారిన తరువాత ఆ దుష్ఫరిణామాలు సమాజాన్ని వెంటాడతాయి. సులభంగా డబ్బు సంపాదించడం కోసం భావి భారత పౌరులు ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే దేశానికి అథోగతే! ఈ తరహా కుత్సిత విధానాలను ఇప్పటికైనా పాలకులు విడనాడలి. నయీం ఉదంతంపై పూర్తి స్థాయి విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటే నయీం ఈ స్థాయి ఎదుగుదలకు కారకులను గుర్తించేందుకూ విచారణ నిర్వహించాలి. వారి పేర్లను ప్రకటించాలి. భవిష్యత్‌లో రాజ్యం మరెందరో నయీంలను తయారు చేయదన్న హామీని ఇవ్వాలి. ఆ దిశలో చిత్తశుద్ధితో కార్యాచరణ లేకుండా కంటి తుడుపు చర్యల వల్ల ఎటువంటి ఫలితమూ ఉండదు.

No comments:

Post a Comment