Wednesday, 10 August 2016

|| జీవనదుల చుట్టూనే మన జీవితం ||

రేపు జరగబోయే కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 12 ఏళ్ళకోసారి పుష్కరాలు జరిగిన ప్పుడే మనకు నదులు గుర్తుకొస్తు న్నాయి. మన మనుగడ, సంస్కృ తికి ప్రాణాధారమైన నదులను అంతవరకే మనం గౌరవిస్తున్నామా అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం. నదిలేని సమా జానికి అభివృద్ధి, నాగరికత రెండూ లేవు. మానవ నాగరికతా వికాసంలో నదులు పోషించిన పాత్రను గుర్తు చేసుకుని, కర్తవ్యాన్ని చేపట్టడం ఒక తక్షణ అవసరం. భారతదేశ సంస్కృతిలో నదులకు ఎంతో గౌరవం ఉంది. ఇక్కడ నదులను జీవనదులు అని పిలుస్తారు. దానికి కారణం అవి నిరంతరంగా సజీవంగా ప్రవహిస్తూ ప్రజల జీవితంతో పెనవేసుకుపోవడమే. మానవజాతి మనుగడకు, అభివృద్ధికి నీరే ప్రాణాధారం. ప్రపంచంలోని మానవుల ప్రధాన నీటి అవసరాలను తీరుస్తున్న జీవన వాహకాలు నదులే. నదిలేని నాగరిక సమాజాన్ని ఊహిం చలేం. భారతదేశంతో సహా ప్రపంచ ప్రాచీన నాగరికత వికసించిన ప్రాంతాలన్నీ నదీ తీరాలే. టైగ్రిస్‌, యూప్రటిస్‌, సింధు, హొయాంగ్‌హో, నైలు నదులు తమ పరీవాహక ప్రాంతాల్లో సారవంతమైన నదీ మైదానాలను ఏర్పరిచాయి. సస్యశ్యామలమైన ఈ ప్రాంతాలు ప్రజలను ఆకర్షించాయి. మానవుడు ఆహార అన్వేషణలో పడిన శ్రమను నది తగ్గించింది. మానవుడు స్థిర నివాసం, వ్యవసాయం, పశుపోషణ వల్ల ఆహార ఉత్పత్తిలో మిగులు నిల్వ సాధించాడు. తద్వారా మనిషికి కొంత విశ్రాంతి సమయం దొరికింది. తనకు లభించిన ఈ ఖాళీ సమయాన్ని మానవుడు సృజనాత్మకమైన ఆలోచన వైపు మళ్ళించాడు. దాని ఫలితమే సాంస్కృతిక వికాసం. వ్యవసాయం, స్థిరనివాసం, గృహనిర్మాణం, పశుపోషణ, పాత్రల తయారీ, లిపి, కళలు, శిల్పం, సాహిత్యం, వస్త్రాల తయారీ, వృత్తి నైపుణ్యం, తత్త్వశాస్త్రం, మతం, ఈ నూతన సంస్కృతుల నిర్మాణంలో అంతర్భాగంగా జరిగాయి. బహుముఖంగా నడిచిన ఈ సాంస్కృతికాభివృద్ధి వల్ల ఆ ప్రాంతాలు నాగరికతా వికాస కేంద్రాలుగా, నగరాలుగా అభివృద్ధి చెందాయి. ఈ నదుల ఒడ్డునే మానవుడు ఆహార అన్వేషణ దశను దాటి సాంస్కృతిక జీవిగా పరిణామం చెందాడు. ఈ చారిత్రక క్రమానికి నదే ప్రేరణగా నిలచింది. ఈ విషయాలను మన ప్రాచీన నాగరికతలైన మెసపుటోమియా, నైలు నాగరికత, చైనా నాగరికత, సింధూ నాగరికతలను పరిశీలిస్తే తెలుస్తుంది. వివిధ నాగరికతలు-నదుల పాత్ర మెసపుటోమియా నాగరికత ప్రపంచంలోని సింధు, ఈజిప్టు నాగరికతలను కలుపుతూ వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేసింది. నైలు నాగరికత అత్యంత ఎత్తైన పిరమిడ్‌ల నిర్మాణం, వ్యవసాయం, స్థిర నివాసం, నీటిపారుదల వ్యవస్థ, రాచరిక వ్యవస్థల స్థాపనకు పునాది వేసింది. చైనా నాగరికత ఎల్లో రివర్‌, హొయాంగ్‌హో నదుల మిశ్రిత నాగరికత. పింగాణీ వస్తువులు, వివిధ పాత్రలు, సిల్కు వస్త్రాల తయారీలోనూ, నదీ వాణిజ్యాన్ని విస్తరించడంలోనూ, కన్‌ఫ్యూషియస్‌ తాత్త్విక సిద్ధాంత రూపకల్పనలోనూ ప్రధాన భూమిక వహించింది. సింధు నాగరికత ప్రకృతి శక్తుల ఆరాధన, మట్టిపాత్రలు, అలంకరణ వస్తువుల తయారీ, బొమ్మల ద్వారా లిపికి రూపకల్పన, సామూహిక ప్రజా పరిపాలనా వ్యవస్థ, కంచు వస్తువుల తయారీ, క్రమబద్ధమైన పట్టణాల రూపకల్పన, భూగర్భ నీటిపారుదల వ్యవస్థ, స్నాన ఘట్టాల నిర్మాణం లాంటి ఆధునిక ఇంజనీరింగ్‌ పద్ధతులు ఈ కాలంలోనే మొదలయ్యాయి. గంగానది ఒడ్డున ఆర్య సంస్కృతి వ్యాప్తి చెందింది. ఇందులో ప్రకృతి శక్తుల ఆరాధన, వేదాల ఆవిర్భావం, గణాలు, గణ రాజ్యాల స్థాపన, పెద్ద రాజ్యాల స్థాపన జరిగింది. యుద్ధం, యుద్ధ విద్యలు ఈ కాలంలోనే వ్యాప్తి చెందాయి. అప్పటికే ఉన్న చిన్న చిన్న ఆదిమ జాతుల ద్రవిడ సంస్కృతిని కబళించి ఆర్యులు తమ సామ్రాజ్య విస్తరణ చేసుకున్నారు. ఈ మొత్తం పరిమాణానికి నదులు సజీవ సాక్ష్యాలు. నదులకు దూరంగా ఉన్న ప్రాంతాల ఆహార సంపద పరిమితమై పోవడంతో అనాగరిక, ఆటవిక ప్రాంతాలుగా మిగిలిపోయాయి. మరోవైపు నదీ తీరప్రాంతాలు కళలు, సంస్కృతి, వర్తక వ్యాపారాలు ఆవిర్భవించి నగరాలుగా, నాగరికతా కేంద్రాలుగా వికాసం పొందాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నదులను సర్వ సంస్కృతుల వికాసానికి జీవ కేంద్రాలుగా పేర్కొనవచ్చు. నాగరికతా వికాసంలో ఇంత ప్రముఖ పాత్ర పోషిస్తున్న నదులు నేడు మురికినీటి కుంటలుగా మారిపోతున్నాయి. సంవత్సరమంతా ప్రవహించవలసిన జీవనదులు వర్షాకాలంలో మాత్రమే కనిపించి, మిగిలిన కాలం ఒయాసిస్‌లుగా మిగిలిపోతున్నాయి. దీనికి కారణాలు అన్వేషించి దిద్దుబాటు చేపట్టకపోతే మన నదులు జీవం కోల్పోయి చరిత్ర పుటలకే పరిమితమై పోయే ప్రమాదం లేకపోలేదు. నదుల విధ్వంసానికి కారణాలు అనేకం. నదీ తీరప్రాంతాల్లో విపరీతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నది స్వరూపస్వభావాలను దెబ్బతీస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, పట్టణ వ్యర్ధాలు, నదుల స్వచ్ఛతను నాశనం చేస్తున్నాయి. పర్యావరణ అవసరాలను పట్టించుకోని భారీ ప్రాజెక్టులు, నదీగర్భంలో ఒక క్రమపద్ధతి పాటించని ఆయిల్‌ నిక్షేపాల వెలికితీత, నదీ ప్రాంతాలలో ఆక్రమణలు నదుల భౌగోళిక స్వరూపాన్ని పాడుచేస్తున్నాయి. విచక్షణా రహితమైన అడవుల నరికివేత, కొండల తవ్వకాల (మైనింగ్‌) వల్ల పర్యావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. దాని ఫలితమే తగ్గుతున్న వర్షపాతం, క్షీణిస్తున్న నదీప్రవాహాలు. ఈ పరిస్థితులు అంతరిస్తున్న నదుల ఉనికికే ప్రమాద సంకేతాలు. ఇవి మానవ నాగరికత ఉనికికే సవాళ్ళు విసురుతున్నాయి. పర్యావరణ సమతుల్యతలో నదుల పాత్ర ఎంతో ఉంది. నదులు కూడా పర్యావరణ వ్యవస్థలో ఒక అంతర్భాగమే. నదులు, నదీపరీవాహక ప్రాంతంలోని జీవరాశులు ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి. వీటి మధ్య జరిగే చర్య, ప్రతిచర్యలు సుదీర్ఘమైన లోతైన సంబంధం కల్గిఉంటాయి. ఇవి నది, దాని చుట్టూ ఉండే జీవ పర్యావరణ వ్యవస్థలను నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటాయి. నది దీర్ఘకాలిక ఉనికికి, మనుగడకు ఇదే ఆధారం. వాటి మనుగడ, సజీవత్వాన్ని వాటి చుట్టూ ఉండే జీవావరణ వ్యవస్థలే నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ జీవావరణ వ్యవస్థను కాపాడు కుంటే నదికి చలనం, లేకుంటే మరణం సంభవిస్తాయి. అందువల్ల నదుల చుట్టూ ఉండే పర్యావరణాన్ని మనం ప్రాణప్రదంగా చూసుకోవాలి. నదుల సజీవ ప్రవాహానికి తప్పనిసరిగా కొన్ని చర్యలు చేపట్టాలి. నదుల ఒడ్డున గడ్డి, పొదలు, మొక్కలను పెంచి నదుల గట్లను పరిరక్షించు కోవాలి. నదులలో పూడిక తీయాలి. నదీ ప్రవాహ ఆటం కాలను తొలగించాలి. వరద కట్టలను, పంపింగ్‌ స్టేషన్లను సక్రమంగా నిర్వహించాలి. వరదల నుంచి కాపాడుకునే రక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలి. నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే సరస్సులను పరిరక్షించు కోవాలి. అడవులు, కొండల కోతలు, క్షయం నివారణా చర్యలు చేపట్టాలి. నది జీవావరణ, పర్యావరణ రక్షణ చర్యలు చేపట్టాలి. మురుగునీరు, సాగునీటి పారుదల సౌకర్యాలను సక్రమమైన శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. నదీ తీర ప్రాంత ఆదిమ సంస్కృతులను పరిరక్షించాలి. పుష్కరాలు దేశంలో మెజార్టీ ప్రజల మత ఆచారం. ఈ ఆచార వ్యవహారాలు వారి సాంస్కృతిక జీవితంలో అంతర్భాగంగా ఉన్నాయి. దీనిలో నదీ స్నానం ప్రధాన ఆచారం. ఎక్కువ మంది ప్రజలు ఒక చోట చేరేటప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు, భద్రత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ పుష్కర సమయంలో ప్రభుత్వం వాటిని నివారించే తగు ముందస్తు చర్యలు చేపట్టాలి. ఈ సమ్మేళనం సజావుగా జరగడానికి మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం సహకరించాలి. అంతేగాని ప్రభుత్వమే పుష్కర ప్రచార కర్తగా మారవలసిన అవసరం లేదు. దీనివల్ల భిన్న మతాలున్న మన దేశంలో సంక్లిష్టమైన వాదనలు తలెత్తే ఇబ్బంది ఉంది. మనది లౌకిక దేశం. రాజ్యాంగం అందించిన లౌకిక స్ఫూర్తిని ప్రభుత్వం విధిగా పాటించాలి. పుష్కరాలలో నదుల కోసం హడావిడిగా చేసే పనులు, ఖర్చులు ప్రామాణిక లోపంగా ఉన్నాయనే విమర్శ లు వస్తున్నాయి. మన జీవ సంస్కృతిలో అంతర్భాగమైన నదుల కోసం ఖర్చుపెట్టే ప్రతి పైసా సద్వినియోగం కావాలి. నదుల కోసం పెట్టే ఖర్చులు, నిధుల కేటాయింపు వాటి శాశ్వత సంరక్షణకు, నదీ జీవావరణం కాపాడటానికి ఉపయోగపడాలి. నదుల ఉనికికి, వాటి దీర్ఘకాలిక ప్రయోజ నాలకు నిధులు కేటాయించడం ద్వారా అవి మన భవిష్యత్త రాలకు వారసత్వ సంపదగా అందించవచ్చు. మన సంస్కృ తిలో అంతర్భాగమైన నదులకు అందించగలిగే నిజమైన గౌరవం ఇదే. - డాక్టర్‌ చల్లా రవికుమార్‌ (వ్యాసకర్త జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు)

No comments:

Post a Comment