Wednesday, 24 August 2016

|| హిందూ జనాభా సిద్ధాంత రాద్ధాంతం ||




                 ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ ఆగ్రా వెళ్లారు. అక్కడ ఆర్‌.ఎస్‌.ఎస్‌ నిర్వహించిన 'కుటుంబ ప్రబోధన్‌' కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు అకస్మాత్తుగా హిందూ జనాభా మీద బెంగ పుట్టుకొచ్చింది. ముస్లింల కంటే హిందువుల సంతానోత్పత్తి రేటు తగ్గిపోతోందని, ఇలాగైతే 2025 నాటికి ఉనికే ప్రశ్నార్థకమౌతుందని, అందుకే ముస్లింలకు ధీటుగా హిందువులు కూడా అధిక సంతానాన్ని కనాలంటూ కార్యక్రమానికి హాజరైన 2 వేల మంది యువ దంపతులకు ఉచిత సలహా పడేశారు. సంతానోత్పత్తి రేటు హిందువులలో కంటే, ముస్లింలలో ఎక్కువ శాతం వుందన్నది ఆయన ఆక్రోశం.

'హిందూ జనాభా సిద్ధాంతాన్ని' వల్లించడం ఆర్‌.ఎస్‌.ఎస్‌కు, దాని శిష్య పరమాణువైన బి.జె.పికి కొత్తేమీ కాదు. గత ఏడాది బి.జె.పి పార్లమెంటు సభ్యడు సాక్షీ మహరాజ్‌ ఇదే రాగాన్ని ఆలపించారు. హిందూ మతాన్ని కాపాడుకోవడానికి ప్రతి భారతీయ మహిళా తప్పనిసరిగా కనీసం నల్గురు పిల్లలను కనాలని సాక్షి సూచించారు. ఇక బి.జె.పి ఎం.పి యోగి ఆదిత్యనాథ్‌ మరో అడుగు ముందుకేసి ముస్లిం జనాభా పెరుగుదలను తనిఖీ చేసేందుకు ఏకంగా ఒక చట్టాన్నే తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.
గత సంవత్సరం విజయదశమి సందర్భంగానూ భగవత్‌ ఇదే విధమైన వివాదానికి కేంద్ర బిందువయ్యారు. 2011, దానికి ముందరి జనాభా లెక్కలను ఉటంకించి మరీ హిందూ జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతోందని వాపోయారు. అయితే ఆయన మాటల్లో ఆ జనాభా వృద్ధి రేటు తగ్గిందన్నదానికంటే ముస్లిం జనాభా వృద్ధి రేటు పెరుగుతోందన్న దుగ్థే ఎక్కువగా కనిపించింది. వాస్తవానికి 1981 గణాంకాల ప్రకారం జనాభా పెరుగుదల రేటు 21.5 శాతం నుంచి 17.7 శాతానికి తగ్గింది. ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులను గతంలో కంటే ఎక్కువగా వాడిన కాలమది. అయితే హిందువులలో జనాభా వృద్ధి రేటు 2001-2011 వరకు ఏడాదికి 1.55 శాతం వుండగా, ముస్లింల వృద్ధి రేటు 2.2 శాతం వుంది. అయితే 1991-2001లో ఈ గణాంకాలు 1.8, 2.6 శాతంగా వున్నాయి. వృద్ధిరేటు ఇదే పద్ధతుల్లో కొనసాగితే 2061 నాటికి హిందూ ముస్లిం జనాభా బాగా పెరిగిపోతుంది. ముస్లింలు 29.24 కోట్లు, హిందువులు 140.25 కోట్లు అవుతారు. మొత్తంగా భారతదేశ జనాభా 173.03 కోట్లు అవుతుంది. ఇందులో 81.06 శాతం హిందువులు, 16.89 శాతం ముస్లింలు వుంటారు. ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే భారత జనాభా 130 కోట్లు. వారిలో 80 శాతం హిందువులు. మిగతా 20 శాతం ముస్లింలు- కొద్దిగా క్రైస్తవులు వున్నారు. మరలాంటప్పుడు హిందూ మహిళలను ఎక్కువ మంది సంతానాన్ని కనమని భగవత్‌ ఎందుకు సలహా ఇస్తున్నారు? నిరుద్యోగ సైన్యంలోకి మరింత మందిని చేర్చేందుకా? సహజ వనరులను మరింత వేగంగా ఖాళీ చేసేందుకా? ఇవేవీ కాకపోయినా, ఆ సాకుతో సమాజంలో విభజన రేఖలు గీయడం, కొందరిలో భయోత్పాతాన్ని సృష్టించడం, మరికొందరిపై అసూయా ద్వేషాలు రగిలించేందుకా!?
ప్రతిసారీ హిందూ జనాభా ప్రమాదంలో పడిందని, గణనీయంగా తగ్గిపోతోందని ఆర్‌.ఎస్‌.ఎస్‌, బి.జె.పిలు 'ప్రచారం' చేయడంలో ఒక అంశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మానవ సహజ భావోద్వేగమైన 'భయం'తో ఆటలాడుకోవాలని అనుకోవడమే అందుకు కారణం. భయం అనేది మనుషిని అంధుణ్ణి చేస్తుందని, ఆ ఉద్వేగంలో తమ జాతిని పరిరక్షించుకోవాలన్న పట్టుదలకు, మూఢవిశ్వాసాలకు పోతారని, పర మతస్తులపై అసహనాన్ని ప్రదర్శించేందుకు సైతం వెనుకాడరని సంఫ్‌ుకు బాగా తెలుసు. తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు సంఫ్‌ు ప్రయత్నిస్తోందన్నది ఈ ఘటనలన్నింటా పూదండలో దారంలా దాగివున్న కఠోర వాస్తవం. తాజాగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ నేత భగవత్‌ రేకెత్తించిన 'హిందూ జనాభా సిద్ధాంత' రాద్ధాంతంపై పలువురు నేతల స్పందనలు...

|| బి.జె.పి తిండి పెడుతుందా ||
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనమని ఆర్‌. ఎస్‌.ఎస్‌ అధి నేత హిందు వులకు చెప్తు న్నారు. అయితే ఆయనకు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. హిందువులు మరింత మంది పిల్లలను కనడం మొదలెడితే వారికి తిండి పెట్టే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందా? వారికి ఉద్యోగాలు భారతీయ జనతా పార్టీ ఇస్తుందా?
మాయావతి,
- బి.ఎస్‌.పి అధినేత్రి

|| సలహా అవసరమా ||
ఇది వ్యక్తిగత వ్యవహారం. అంతేకానీ భగవత్‌ లాంటివారు నాగపూర్‌ నుంచి వచ్చి మరీ ఎంతమంది పిల్లల్ని కనాలో జనానికి చెప్పాల్సిన అవసరముందా!
- మనోజ్‌ ఝా, ఆర్‌.జె.డి నాయకులు.

|| మాటలతో విడదీస్తారు ||
భగవత్‌ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు. అంతకంటే ఆయన నుంచి ఏం ఆశిస్తాం! సమాజాన్ని చీల్చే విధంగానే ఆయన సంభాషణ వుంటుంది. ఉపాధి, ధరల పెరుగుదల గురించి మాత్రం నోరు మెదపరు.
- గులాం నబీ ఆజాద్‌, కాంగ్రెస్‌ నేత.

|| 10 మందిని కని పెంచితే తెలుస్తుంది ||
భారతీయ దంపతులు మరింత మంది పిల్లలను కనమని భగవత్‌ సలహా ఇస్తున్నారు. దానికి ముందు ఆయన పది మంది పిల్లలను కని బాగా పెంచమనండి.
- అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ నేత, ఢిల్లీ సీఎం.

|| 'ఉమ్మడి పౌర స్మృతి' అమలు చేస్తే సరి ||
కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం చాలా డబ్బు వెచ్చిస్తోంది. ముస్లిం జనాభా పెరుగుదల ప్రభావం దేశ సామాజిక సాంస్కృతిక సమ తౌల్యంపై తప్పకుండా వుంటుంది. అలాగని ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా హిందువులకు చెప్పడం సమస్యకు పరిష్కారం కాదు. కేంద్ర ప్రభుత్వం ముందుగా 'ఉమ్మడి పౌర స్మృతి'ని అమలు పరిస్తే 'సమతౌల్యత' దానంతటదే వస్తుంది.
- 'సామ్నా' సంపాదకీయ వ్యాఖ్య,
శివసేన అధికార పత్రిక.


|| షెహన్షా అనుమతి ||
ఆయన ముందుగా షెహన్షా (నరేంద్ర మోడీ) అనుమతి తీసుకోవాలి.
- అజాం ఖాన్‌, బి.ఎస్‌.పి నేత.

No comments:

Post a Comment