Wednesday, 10 August 2016
|| చావుకొచ్చిన సంప్రదాయ పని..||
చావుకొచ్చిన సంప్రదాయ పని.
ఆవు చర్మం వొలిచి, అవమానాలు
గోరక్షకుల చేతుల్లో పడితే చిత్రవధే
ఆత్మహత్యాయత్నాలు, ఆగ్రహ ప్రదర్శనలతో
నెలరోజులుగా గుజరాత గరం గరం
ఉనా..! నిన్నటిదాకా గుజరాత్లో ఎక్కడ ఉందో తెలియని ప్రాంతం! దళితులపై దాడులు, ప్రతిఘటనల వార్తలతో ఇప్పుడు పతాకశీర్షికకు చేరింది. పశువుల చర్మాలు వొలవడం చావుబతుకుల సమస్యగా మారిన స్థితిలో, దళితుల ఆత్మగౌరవ పిలుపు అయింది. గోసంరక్షణ ప్రయత్నాల్లోని విపరీత ధోరణులను చర్చలోకి తీసుకొచ్చింది. ఇంతకీ దాదాపు నెల రోజులుగా గుజరాతని అట్టుడికిస్తూ,మీడియా, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్న ‘ఉనా’లో అసలు ఏమి జరిగింది?
పిలిచారని వెళ్లినందుకు..
అహ్మదాబాద్‌కు 360 కిలోమీటర్ల దూరంలోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ఓ తాలూకా పేరు ఉనా. ఆ తాలూకాలోని మోతా సమధియాలా గ్రామాన్ని వెతుక్కొంటూ కొంతమంది గత నెల 11వ తేదీన వచ్చారు. సరాసరి చమర్లు ఉండే వాడకు వెళ్లారు. తాము బేడియా గ్రామం నుంచి వచ్చామని, తమ ఇంట ఓ ఆవు చనిపోయిందని, దాన్ని ఎత్తేసేవారు కావాలని అడిగారు. ఆ పనిచేసే వాళ్లు ఉదయాన్నే పనులకు వెళ్లారని వాడలోని వారు చెబితే.. పొలం వైపు వెళ్లారు. వ్యవసాయ పనులు చేస్తున్న ఐదుగురు కుర్రాళ్లను కలుసుకొని, ఆ పనికి ఒప్పించారు. బేడియా గ్రామస్థుల వెంట ఈ కుర్రాళ్లు వెళ్లారు. చచ్చిన ఆవుని బండిలో వేసుకొని తమ గ్రామానికి తెచ్చారు. కత్తులు బాగా నూరుకొని ఆవు చర్మం వొలవడం ప్రారంభించారు. ఇంతలో వారి ముందు ఓ తెల్లకారు ఆగింది. క్షణాల్లో ఐదారుగురు కిందకు దిగారు. ‘ఆవుల్ని ఎందుకు చంపుతున్నా’’రంటూ ఆ కుర్రాళ్లపై ఆగ్రహించారు. వారు సమాధానం చెప్పేలోపే వెంట తెచ్చుకొన్న ఐరన్ రాడ్లతో చితగ్గొట్టారు. వారిలో నలుగురిని తీసుకొని ఉనా పట్టణానికి చేరుకొన్నారు. బట్టలు విప్పదీసి వీధుల్లో నగ్నంగా తిప్పారు. గొలుసులతో బండికి కట్టి ఈడ్చారు. తమను శివసేన కార్యకర్తలుగా చెప్పుకున్నవారు, ఆవుని అగౌరవపరిచినవారికి ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. అక్కడితో ఆగకుండా, ఆ దృశ్యాలను ఎప్పటికప్పుడు వీడియో తీస్తూ, ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. దీంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొన్నారు. కానీ, తన్నులు తింటున్నవారిని కాపాడటానికి ప్రయత్నించలేదు. తీవ్ర గాయాలయిన ఆ నలుగురిని తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించడంతో సరిపెట్టారు.
సామాజిక.. కలకలం
గోసంరక్షకులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన దాడి దృశ్యాలతో దేశం అట్టుడికిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సత్వరం స్పందించింది. దాడికి పాల్పడినట్టు చెబుతున్న ఆరుగురిని వీడియో ఆధారంగా అరెస్టు చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ, అప్పటికప్పుడు ఆరుగురు పోలీసు అధికారులను, ఆ తరువాత మరో పదిమందిని సస్పెండ్ చేసింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత ఉనా పట్టణంలో దళిత సంఘాలు ధర్నా నిర్వహించాయి. దెబ్బలు తిన్న కుర్రాళ్లలో ఒకని మేనమామ రోడ్డుపైనే యాసిడ్ తాగి.. ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనే అనంతరకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున సాగిన ఆత్మహత్యాయత్నాలకు నాంది పలికింది. ఉనా బాధితులకు న్యాయం చేయాలని దళితులు ఆందోళనలు సాగిస్తుండగానే, సౌరాష్ట్రలోని రాజూల గ్రామం సమీపంలో గోసంరక్షణ కార్యకర్తలు.. ఓ టెంపోను ఆపారు. చూస్తే, అందులో చచ్చిన ఆవు కనిపించింది. టెంపోలోని యువకులను బయటకు లాగారు. ఓ స్తంభానికి కట్టేసి కొట్టారు.
న్యాయానికి ఆమడ దూరం..
సంప్రదాయ వృత్తిని చేసుకొంటున్న తమను అన్యాయంగా లక్ష్యంగా చేసుకోవడాన్ని దళితులు తట్టుకోలేకపోయారు. వరుస ఘటనలతో తీవ్రమైన అభద్రతా భావానికి గురయ్యారు. తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యలకు యత్నించారు. ఈ మూడు వారాల్లో పదుల సంఖ్యలో దళిత యువకులు బలవన్మరణాలకు ప్రయత్నించారు. సహజంగా రైతులు, చేనేత కార్మికుల్లోనే కనిపించే ఈ ధోరణి.. దళితుల్లోకీ ప్రవేశించడంతో దేశవ్యాప్తంగా కలకలం బయలుదేరింది. ఒకవైపు ఆత్మహత్యాయత్నాలు, మరోవైపు రోడ్డెక్కిన దళిత ఉద్యమాలతో గుజరాత రగిలిపోతోంది. గత నెల 21వ తేదీన రాష్ట్రమంతటా బంద్ జరిగింది. చనిపోయిన ఆవులను రోడ్లపై పడేసి దళితులు ధర్నా చేశారు. ఇకపై.. పశువుల చర్మం వొలిచేది లేదని తెగేసి చెప్పారు. వారి ఉద్యమం సౌరాష్ట్ర ప్రాంతాన్ని దాటి, అహ్మదాబాద్నీ తాకుతోంది. ‘‘మాకెందుకీ రోత పని! ఈ పని చేసి మేమేందుకు తన్నులు తినాలి. మాకు చారెడు భూమి ఇవ్వండి. ఈ పనిని పూర్తిగా వదిలేస్తాం’’ అని దళితులు నినదిస్తున్నారు. ఇదొక్కటే కాదు, సామాజికంగానూ దళితులు అణచివేతకు గురి అవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కోర్టుల్లో వారికి దక్కుతున్న న్యాయం అంతంతమాత్రమేనని పోలీసు రికార్డులు ఘోషిస్తున్నాయి. 2014 సంవత్సరంలో.. దేశవ్యాప్తంగా దళితులకు సగటున 28.8 శాతం మేర న్యాయం అందితే, గుజరాతలో అది 3.4 శాతం మాత్రమేనని సామాజిక వేత్తలు చెబుతున్నారు. - (సెంట్రల్ డెస్క్ఆంధ్ర జ్యోతి)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment