Thursday, 11 August 2016

|| నయా ఉదారవాదం, మతోన్మాదంపై పోరు ||

- ఆగస్టు15న అందరూ ప్రతిన బూనాలి
- పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకీయంలో కరత్‌ 
              నయా ఉదారవాద విధానాలు, మతోన్మాదంపై పోరు సల్పేందుకు ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని సిపిఐ(ఎం) సీనియర్‌ నేత ప్రకాశ్‌ కరత్‌ పిలుపునిచ్చారు. పీపుల్స్‌ డెమొక్రసీ తాజా సంచికకు రాసిన సంపాదకీయంలో ఆయన ఈ విషయం ప్రస్తావిస్తూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15 ప్రాధాన్యతను వివరించారు. బ్రిటిష్‌ పాలకుల పీడన నుంచి దేశాన్ని విముక్తం గావించేందుకు సాగిన స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షలాదిమంది ప్రజలు తృణ ప్రాయంగా తమ జీవితాలను అర్పించారు. ఆ వీరుల త్యాగాలను స్మరించుకుని వారికి ఘన నివాళులర్పించ డానికి ఇదొక చక్కని సందర్భం. ఈ ఏడాది 70వ స్వాతం త్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడు దశాబ్దాల్లో స్వతంత్ర భారతం సాగించిన ఈ ప్రయాణంలో భారత ప్రజలు హుందా అయిన జీవితం గడిపేందుకు, దారిద్య్రం నుండి బయటపడేందుకు, ఆర్ధిక, సామాజిక దోపిడీ నుండి విముక్తులయ్యేందుకు అలుపెరగని పోరాటం చేశారు. కానీ ఇంకా ఆ తపన, తృష్ణ నెరవేరాల్సి వుందని పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం పేర్కొంది.ఈ స్వాతం త్య్ర దినోత్సవం కన్నా ముందు మరో వార్షికోత్సవం వుంది. 1991లో నయా సరళీకరణ విధానాల అమలు ప్రారంభమై 25ఏళ్ళు పూర్తి చేసుకుంది. బడా వ్యాపార సంస్థలకు, కార్పొరేట్‌ కంపెనీలకు, పాలక వర్గాలకు ఇదొక స్వేచ్ఛా శకం ఆరంభమేనని చెప్పక తప్పదని పీపుల్స్‌ డెమో క్రసీ సంపాదకీయం పేర్కొంది. దేశ వనరులు కొల ్లగొట్టేం దుకు, ప్రజలకు ఉపయోగపడే మౌలిక సేవలను ప్రైవేటు పరం చేసేందుకు, ప్రజలను పణంగా పెట్టి గరిష్ట స్థాయి లో లాభాలు ఆర్జించేందుకు సరళీకరణ, నయా ఉదార వాద సంస్కరణల క్రమాన్ని 'స్వేచ్ఛా' యుగంలో చేపట్టారు. గత 25ఏళ్ళుగా సాగుతున్న మితవాద నయా ఉదారవాద సంస్కరణల ఫలితంగా సామాజిక, ఆర్ధిక అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ అసమానతలు దేశ ప్రజల ఆకాంక్షలను, ఆశలను దెబ్బ తీశాయని కరత్‌ తన సంపాదకీయంలో పేర్కొన్నారు. నయా ఉదారవాద విధానాలు సామాజిక కూర్పును ధ్వంసం చేశాయి. కుల, మతోన్మాదాలను ప్రేరేపించాయి. హిందూత్వ శక్తుల పెరుగుదలకు ఆజ్యం పోశాయి. పెరుగుతున్న ధరల భారం, నిరుద్యోగం, కార్మికుల, రైతుల, ఇతర వర్గాల జీవనోపాధికి ముప్పు వాటిల్లడం వంటివన్నీ నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసిన ఫలితమేనని కరత్‌ పేర్కొన్నారు. మతపరమైన మైనారిటీలు, దళితులు, ఆదివాసీలపై పెరుగుతున్న దాడులు, సమాజంలో విభజనలు ఇవన్నీ హిందూత్వ శక్తుల పనేనని కరత్‌ విమర్శించారు. 
సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల జాతీయతా భావనలు 20వ శతాబ్దంలో ఉచ్ఛ స్థాయికి చేరాయని దాని ఫలితమే భారతదేశ స్వాతంత్య్రమని అన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక భావజాలంలో హిందూత్వ తరహా జాతీయవాదానికి చోటే లేదు. పైగా సామ్రాజ్యవాద వ్యతిరేక భావజాలానికి హిందూత్వ జాతీయవాదం పూర్తి విరుద్ధమైనదని అన్నారు. జాతీయోద్యమ ప్రధాన స్రవంతిలో ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మతోన్మాద సంస్థలు లేవని, అవి వెలుపలే వుండిపోయాయని కరత్‌ పేర్కొన్నారు. ఆ వారసత్వమే ఈనాడు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదన్నారు. మోడీ ప్రభుత్వం రెండేళ్ళ పాలన దేశ సార్వభౌమాధికారాన్ని, విదేశాంగ విధానంలో స్వతంత్ర ప్రాతిపదికను తుడిచిపెట్టేసిందని విమర్శించారు. మోడీ సర్కార్‌ అమెరికాతో లాజిస్టిక్స్‌ ఎక్స్ఛేంజ్‌ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ (ఎల్‌ఇఎంఓఎ) పై సంతకాలు చేయడానికి సిద్ధపడుతోంది. ఈ ఒప్పందంపై సంతకాలు జరిగితే భారత సైనిక స్థావరాలను శాశ్వత ప్రాతిపదికన అమెరికా సాయుధ బలగాలు ఉపయోగించుకోవడానికి అనుమతించినట్టే కాగలదు. అలా చేయడమంటే సామ్రాజ్యవాద శక్తులకు దేశ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం తప్ప మరొకటి కాదని కరత్‌ విమర్శించారు. 
మనం ఒకపక్క దేశ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంటే దేశంలో అసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు దారుణ అణచివేతను ఎదుర్కొంటున్నారు. లేదా వారి హక్కుల కోసం పోరాడుతున్నారని కరత్‌ పేర్కొన్నారు.. కాశ్మీర్‌ ప్రజలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా తిరుగుబాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దళితులు గో సంరక్షణ పేరుతో తమపై జరుగుతున్న అత్యాచారాలను తీవ్రంగా నిరసిస్తున్నారు. నెల రోజుల క్రితం ఒడిషాలోని కాందమాల్‌ జిల్లాలో మావోయిస్టులని ముద్ర వేసి ముగ్గురు మహిళలు, రెండేళ్ళ పసిపాపతో సహా ఐదుగురు ఆదివాసీలను కాల్చి చంపడం ఆదివాసీలపై ప్రభుత్వం ప్రకటించిన మతిమాలిన యుద్ధానికి ఒక నిదర్శనమన్నారు. ఆదివాసీల భూములను, అడవులను లాక్కోవడానికి ప్రభుత్వం పన్నిన పన్నాగంలోని భాగమే ఈ చర్యలు.
ఈ రకంగా నయా ఉదారవాద, మతోన్మాద శక్తుల నుండి దేశ స్వాతంత్య్రం ముప్పును ఎదుర్కొంటోందని కరత్‌ పేర్కొన్నారు. ఈ మితవాద శక్తులను ఓడించాలని ప్రతిన చేయడమే ఈ స్వాతంత్య్ర దినోత్సవ లక్ష్యం కావాలి. అంతేకాదు, స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలైన స్వేచ్ఛా, ప్రజాతంత్ర, లౌకిక, దోపిడీ రహిత సమాజ స్థాపనకు ఇది బాటలు వేయాలి అని కరత్‌ పేర్కొన్నారు.

No comments:

Post a Comment