Thursday, 11 August 2016

|| మోడీ కపట నాటకం -దళితులపై ఆగని దాడులు ||

తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మం వలుస్తున్న దళితులపై 'గోరక్ష'కుల దాడి అత్యంత అమానుషం. విద్యుద్ఘాతానికి మృతి చెందిన ఆవు కళేబరాన్ని తరలించమని యజమాని కోరిన మీదట దళితులు తమ వృత్తిలో భాగంగా శ్మశానికి తరలించారన్నది వాస్తవం. కాగా మత మౌఢ్యం ఆవహించిన ఉన్మాదులు ముగ్గురిపై ఇష్టారీతిన దౌర్జన్యానికి ఒడిగట్టడం హేయం. చెట్టుకు కట్టేసి రాడ్లు, కర్రలు, రాళ్లతో గొడ్లను బాదినట్లు బాదారు. చనిపోయిన ఆవు చర్మమే వలుస్తున్నామని దళితులు కాళ్లావేళ్లా పడ్డా వదల్లేదు. దుండగుల రాక్షసత్వంపై బాధితులే కాదు కళ్లారా చూసిన స్థానికులూ సాక్ష్యం చెబుతున్నారు. చివరికి పోలీసులొచ్చి గాయపడ్డ బాధితులను ఉన్మాదుల చెర నుంచి విడిపించి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందంటే 'గోరక్ష'కులకు నయం భయం లేదని అర్థమవుతూనే ఉంది. ఉన్నత స్థాయిలోని వ్యక్తుల మద్దతు లేకుండా ఇంతటి ఆగడానికి పాల్పడటం సాధ్యం కాని పని. కాగా దళితులపై దాడి జరిగిన వెంటనే పోలీసులు పెద్దగా స్పందించలేదు. ఎప్పటికోగాని రక్తమోడుతున్న వారిని ఆసుపత్రికి తలించారు. అగ్రవర్ణ పెత్తందార్ల పనిగా తీసిపారేశారు. దాడికి గురైన వారిపై కాకుండా ఆవును దొంగిలించారంటూ దుండగులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి దళితులపై కేసుల నమోదుకు ఉపక్రమించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నిరసనలు మిన్నంటాక చేసేది లేక దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి, కొందరిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడింది గోరక్షణ సమితి అని ప్రభుత్వం రహస్యంగా నిర్వహించిన దర్యాప్తులో నిర్దారణ అయినట్లు వార్తలొస్తున్నాయి. బిజెపి నాయకుల అండ దండలు పుష్కలంగా ఉన్నాయనీ, ప్రధాన నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు ఢిల్లీ స్థాయి నుంచి ఒత్తిళ్లొస్తున్నాయని లోకం కోడై కూస్తోంది. 
దేశ వ్యాప్తంగా దళితులపై ఒక పథకం ప్రకారం బిజెపి, పరివారం సాగిస్తున్న దాడుల పరంపరకు కొనసాగింపే సూదాపాలెం ఘటన. బిజెపి పాలిత, ఆ పార్టీ ప్రభావం అధికంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన గోసంక్షణ వంటి మత విద్వేష అఘాయిత్యాలు టిడిపి, బిజెపి పొత్తు వలన మన నట్టింట్లో కరాళ నృత్యం చేయడానికి ఆస్కారం ఏర్పడిందన్నది దాచినా దాగని సత్యం. ఇప్పటి వరకు 'ఉనా' వంటి ఘాతుకాలు గుజరాత్‌కే పరిమితం కాగా మన తూర్పుగోదావరిలో సూదాపాలెం ఘటన అక్కడి 'ఉనా'ను తలపింపజేస్తోంది. అక్కడ ఆవును చంపారనే ఆరోపణపై దళితుల బట్టలు ఊడదీసి నడి వీధిలో పట్టపగలు అవమాన పర్చగా సూదాపాలెంలో ఆవును దొంగిలించారనే నెపంతో దళితులను చెట్టుకు కట్టేసి రక్తం వచ్చేదాకా కొట్టి కులం పేరుతో దుర్భాషలాడారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో, అదీ ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై మతపరంగా దాడులు చేసిన దాఖల్లేవు. కేంద్రంలో ఎన్‌డిఎ అధికారంలోకొచ్చాక సంఫ్‌ు పరివార్‌ అన్ని రాష్ట్రాలకూ మత ఉద్రిక్తతలు విస్తరింపజేయాలన్న కుట్రలో భాగంగానే పచ్చని కోనసీమలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బరితెగించారని అర్థమవుతూ ఉంది. దళితులను కాల్చే ముందు తనను షూట్‌ చేయాలని ప్రధాని మోడీ హైదరాబాద్‌లో ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే బిజెపి ప్రోద్భలంతో సూదాపాలెంలో 'గోరక్షకులు' దళితులపై రెచ్చిపోవడం గమనార్హం. ఆవుల రక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన రోజునే సూదాపాలెం ఘటన జరిగింది.
ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనే సామెతను టిడిపి నిజం చేస్తున్నట్లుంది. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపితో దోస్తీ కట్టాక టిడిపి ధోరణిలో మార్పొచ్చింది. వరుస సంఘటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. దేవాలయ మాన్యాల్లో హిందూయేతరులను తొలగించేలా జీవో వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆవాసాల్లో హిందూ దేవాలయాలను నిర్మించాలనే ఉత్తర్వులూ వెలువడ్డాయి. ఈ రెండు నిర్ణయాలూ బిజెపికి చెందిన మంత్రి శాఖ నుంచి వచ్చాయని తప్పించుకోడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్ణయాలైనందున చంద్రబాబు కేబినెట్‌ మొత్తానికీ బాధ్యత ఉంటుంది. గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణలోనూ ప్రభుత్వపరంగా గతం కంటే అధిక ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. బిజెపి సైతం రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. విజయవాడలో రోడ్డు విస్తరణలో ప్రార్ధనా మందిరాల తొలగింపుపై వ్యూహాత్మకంగా ఆందోళనలు చేసింది. రాజమండ్రి, తిరుపతిలో అన్యమత ప్రచారం పేర క్రైస్తవులపై దాడులు చేసింది. ఈ ఉన్నాద చర్యలను బాబు సర్కారు ఉపేక్షిస్తూ వచ్చింది. సూదాపాలెం ఘటననూ బిజెపి ఒత్తిళ్లతో నీరుగార్చే అవకాశం లేకపోలేదు. పాముకు పాలు పోస్తే విషం చిమ్మినట్లే మతోన్మాదుల దుశ్చర్యలను చూస్తూ ఊరుకుంటే చివరికి రాష్ట్రానికే ప్రమాదం తెచ్చి పెడుతుంది. టిడిపి సర్కారు సూదాపాలెం బాధితులకు అరకొర పరిహారం, వైద్యం వంటి చిట్కాలతో పొద్దుపుచ్చకుండా, నిందితులను, వారిని తెర వెనుక నుంచి నడిపించిన కుట్రదారులను కఠినంగా శిక్షించాలి. 

No comments:

Post a Comment