ఒకవైపు పౌర హక్కులను కాలరాస్తూ హిందూత్వ ఎజెండాను దూకుడుగా అమలు చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం మరోవైపు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికుల హక్కులపై బాహాటంగా దాడిచేయడం ఆందోళన కలిగిస్తోంది. కార్మిక సంస్కరణల పేరుతో శ్రమజీవులకు వెన్నుపోటు పొడిచేందుకు ప్రతిపక్షాల అభ్యంతరాలను సైతం తోసిరాజని ఫ్యాక్టరీ కార్మికుల అదనపు పని గంటల (ఓవర్ టైం వర్కింగ్ అవర్స్) పరిమితి రెట్టింపు బిల్లును లోక్‌సభలో పెట్టి ఆమోదింపజేసుకున్న తీరు మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిలువెత్తు నిదర్శనం. ప్రస్తుతం 50 గంటలకు పరిమితమైన త్రైమాసిక అదనపు పని గంటలను 100 నుంచి 125 గంటలకు పెంచడం ఈ బిల్లు ఉద్దేశం. అదనపు పని గంటలను రెట్టింపు చేయడమంటే కార్పొరేట్ యాజమాన్యాల శ్రమ దోపిడీికి లైసెన్స్ ఇవ్వడమే. కార్మికులను బానిస యుగం నాటి పరిస్థితులకు నెట్టడమే. 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం సమగ్ర సవరణకు ఉద్దేశించిన బిల్లు స్టాండింగ్ కమిటీ ముందు పరిశీలనలో ఉన్నందున ఆ చట్టంలోని ఒక సెక్షన్‌ను సవరిస్తూ ఇంత హడావిడిగా అదనపు పనిగంటల బిల్లును తీసుకురావాల్సిన అవసరమే మొచ్చింది. కార్పొరేట్లకు పంద్రాగస్టు కానుకగా కార్మికులను ఈ ప్రభుత్వం బలి ఇవ్వదలచుకున్నదా? ఇదే అంశాన్ని నిండు సభలో ప్రతిపక్షాలు నిలదీస్తే మోడీ సర్కార్ మన్ను తిన్న పాములా మిన్నకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేయగా లోక్‌సభలో మెజార్టీ బలగంతో బిల్లును ఆమోదింపజేసుకోవడం సిగ్గుచేటు. ఈ సవరణ బిల్లు-2016 చట్టరూపం దాలిస్తే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి 100 నుంచి 125 గంటల వరకు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ఇది అంతిమంగా కార్మికుల తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురి చేసే ప్రమాదముంది. త్రైమాసికానికి అదనపు పని గంటలను 50 గంటలకు పరిమితమైన నేపథ్యంలోనే శ్రామికులపై తీవ్రమైన శ్రమదోపిడీ సాగిస్తున్నారు. ఇప్పుడు అదనపు గంటలను ఏకంగా 125కు పెంచడమంటే శ్రామికులను పీల్చిపిప్పి చేయడమే. పార్లమెంటు సభా నియమావళిలోని సెక్షన్ 66, 67 ప్రకారం ఒక బిల్లు లోక్‌సభలో పెండింగ్‌లో ఉండగా అదే బిల్లును మళ్లీ ప్రవేశ పెట్టకూడదు. సభా నిబంధనలకు విరుద్ధంగా మోడీ సర్కార్ బరి తెగించి ఈ బిల్లును ప్రవేశ పెట్టిందంటే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేందుకు అది ఎంతగా తహతహలాడుతున్నదో అర్థమవుతున్నది. వ్యాపారం సులభతరం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అందుకే అదనపు పని గంటలు పెంచామని చెప్పడం ప్రభుత్వ నయవంచనకు పరాకాష్ట. కేవలం వ్యాపారం సులభతరం చేయడం కోసమే కార్మిక సంస్కరణలు తీసుకొస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఉపాధి కల్పించాలనే చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ఉండివుంటే అదనపు పని గంటలను పెంచివుండేది కాదు. ఇందులో కీలకమైన మరో అంశం అదనపు పని గంటలు పెంచాలంటే రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి. ఆ పని కూడా చేయకుండానే సవరణ బిల్లు ఆమోదించడమంటే రాష్ట్రాల హక్కులను కూడా కాల రాయడమే. రాష్ట్రాలను, కార్మిక సంఘాలను సంప్రదించకుండా కార్మిక సంస్కరణలను చాప కింద నీరులా అమలు చేసుకుపోతోంది. కార్మిక హక్కులపైన, కార్మిక సంఘాలపైన దాడి చేయడం మోడీ సర్కార్‌కు ఇదే తొలిసారి కాదు. ఫ్యాక్టరీ చట్టంతో పాటు అప్రెంటీస్ చట్టం, ఇపిఎఫ్, ఇఎస్ఐ చట్టాలకు ఇప్పటికే అది తూట్లు పొడిచింది. బిజెపి పాలిత రాజస్థాన్ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను అందరూ అనుసరించాలని గతేడాది ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయమే వివిధ రాష్ట్రాలకు లేఖలు రాసింది. బిజెపి పాలిత మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో స్వీయ సవరణలతో కార్మికుల హక్కులపై దాడి చేస్తున్నాయి. కనీస వేతనాల చట్టం, సమాన పనికి సమాన వేతన చట్టం, బోనస్ చెల్లింపు చట్టం వంటి దాదాపు 44 చట్టాలను సులువుగా వ్యాపారం పేరుతో ఏకీకరణ చేసి కార్మికులపై కత్తి వేలాడదీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెకు ఇప్పటికే ప్రధాన కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చాయి. దేశీయ, విదేశీ కార్పొరేట్ల కోసం కార్మికుల హక్కులను పణంగా పెడుతున్న ప్రభుత్వ విధానాలపై యావత్ కార్మికవర్గం పిడికిలి బిగించాలి. సెప్టెంబరు 2 సమ్మె ద్వారా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి.
No comments:
Post a Comment