Thursday, 11 August 2016

|| రాజ్యము-రాక్షస మర్రీ ||

ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాజకీయ భవితకు ముప్పుగా మారిన సోహ్రాబుద్దిన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనలోనూ నయీమ్‌ పేరుంది. అలాగే గుజరాత్‌ మాజీమంత్రి అమిత్‌షా ప్రత్యర్థి హీరేన్‌ పాండ్యా హత్యలోనూ వినిపించింది. ఆ నేపథ్యంలో చూస్తే నయీంను పట్టుకుని గుట్టు మట్టులు లాగకుండా మట్టుపెట్టడంతో సత్యాలను సాక్ష్యాలను శాశ్వతంగా సమాధి చేసినట్టయింది. 


నయీమ్‌ ఖతం తదనంతర పరిణామాలు నాటకీయకథనాలుగా మీడియా నిండా దర్శన మిస్తున్నాయి. పోలీసు అధికారులు ఇచ్చే లీకులు, ముక్తసరి ప్రకటనలు మినహా అధికారపూర్వక సమాచారం తక్కువ. క్రైమ్‌ విలేకరులకూ, పోలీసులకూ, రాజకీయ వర్గాలకూ చాలా పేర్లు తెలుసు. అయినా ప్రచురిత ప్రసారిత కథనాల్లో పేర్లు వుండక పోవడానికి చాలా కారణాలుంటాయి. ఇప్పటికి వచ్చిన ఒకే ఒక పేరు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాజీ మంత్రి, ఓడిపోయిన ఎమ్మెల్యేది కాగా ఆమె దాన్ని ఖండించారు. తాను రెండు సార్లు నయీమ్‌ను కలిసిన మాట నిజమేనని ఒక పోలీసు అధికారి అంగీకరించారు. నయీమ్‌ తమను బెదిరించాడంటూ కొందరు మాట్లాడు తున్నారు. ఒక పెద్ద వాణిజ్యవేత్త జోలికి వెళ్లడం వల్ల ఈ తీగ కదిలిందని చెబుతున్నారు గాని ఆయనెవరో మాట్లాడటం లేదు. తమకొచ్చిన ఫిర్యాదులేమిటో పోలీసులు చెప్పడమూ లేదు. తెలంగాణ అగ్రకుటుంబానికి చెందిన లేదా సన్ని హితమైన వ్యక్తులను కూడా నయీమ్‌ బెదిరించిన కారణంగానే అతని కథ ముగించాల్సివచ్చిందనే కబుర్లు కూడా మీడియాకు పోలీసులనుంచి అందుతున్నాయి. ఇంత జటిలమైన వ్యవహారంలో పోలీసు అధికారులతో ‘సిట్‌’ వేసినంత మాత్రాన వూడలు తన్నిన ఈ రాక్షసమర్రి మూలాలు తేలకపోవచ్చు. దీన్ని శాఖాపరమైన వ్యవహారంగా పరిమితం చేస్తే ఏళ్లతరబడి ఇలాంటి ప్రమాదకరశక్తులతో పెన వేసుకుపోయిన రాజకీయ వేత్తలు, వ్యాపారవర్గాలు, అధికారులు అన్నింటినీ మించి పోలీసు బాసుల పాత్ర భూస్థాపితం కావచ్చన్న ఆందోళనా వుంది. అలాంటి సందేహాలకు సహేతుకమైన భూమిక కూడా వుంది. 
మాజీ నక్సలైట్‌గా మొదలై పోలీసుల చేతుల్లో పావుగా మారి మావోయిస్టుల ఆనుపానులు అందించేందుకు నయీమ్‌ ఉపయోగపడ్డాడనేది బహిరంగ రహస్యం. అతనేగాక కత్తుల సమ్మయ్య, పటోళ్ల గోవర్థనరెడ్డి, జడల నాగరాజు, బయ్యపు సమ్మిరెడ్డి వంటి పేర్లు కూడా ఈ మాజీల జాబితాలో వుంటాయి. వారిలో సమ్మయ్య శ్రీలంకకు వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించాడు. ఇంకొందరు రకరకాల సంఘటనల్లో చనిపోయారు. కొంతమంది అసలు పత్తా లేకుండా పోయారు. లొంగిపోయిన, మారిపోయిన చాలామంది మాజీ మావోయిస్టులు టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వైసీపీ వంటి పార్టీల్లో ప్రజాప్రతినిధులుగా లేదంటే అధికార ప్రతినిధులుగా మాతోపాటు చర్చల్లోనూ కనిపిస్తుంటారు. వారిలో ఒకరైన సాంబశివుడు తదితరులు హత్యలకు గురైనారు. 1993లో వ్యాస్‌ ఐపీఎస్‌ హత్య కేసులో లొంగిపోయి ఏడేళ్ల తర్వాత బయిటకు వచ్చి తన హిట్‌ లిస్టును ప్రకటించిన నయీమ్‌ పౌరహక్కుల కార్యకర్తలను రాజకీయ ప్రత్యర్థులను హతమార్చడంలో ముఖ్యపాత్రధారిగా వున్నట్టు వార్తలు వస్తూనే వున్నాయి. నయీం బాధితుల గోడు కూడా అరుదుగానైనా మీడియాలో కనిపిస్తూనే వుంది. అయినా పోలీసులు పాలకులు స్పందించింది లేదు. రాజ్యమే ప్రాపకం కల్పిస్తున్నప్పుడు మిగిలిన వారు కుమ్మక్కు కావడంలో పెద్ద ఆశ్చర్యమేమి లేదు. ఇలాటి ఒక సమాంతర సురక్షిత వ్యవస్థ వుందని తెలిసినప్పుడు అక్రమశక్తులు అవినీతిపరులూ ఉపయోగించుకోవడం సర్వసాధారణం.
నయీం దాష్టీకాల కథలు మీడియాలో వస్తుంటే ఐపీఎస్‌లూ ఐఎఎస్‌లూ అధినేతలూ చూసిచూడనట్టు వుండిపోయారంటే కారణం వ్యవస్థల కుమ్మక్కు మాత్రమే. అదే వూపులో కొందరు ఆస్తులు ఆర్జన పెంచుకోవడానికి ఎలా తెగబడటం మరీ దారుణం. మిగిలిన సంగతులు అలా వుంచి అమాయకురాళ్ళైన అమ్మాయిలను వ్యభిచారిణులుగా మార్చి అక్రమ రవాణా చేస్తున్నా ఉపేక్షించడం ఎంత ఘోరం? ఎన్‌కౌంటర్ల బాస్‌గా మీడియా ముందే తుపాకి చూపించిన డీజీపీ స్వర్ణజిత్‌సేన్‌, చర్చలకు పిలిచిన వారిని కూడా మిగల్చకుండా హతమార్చిన కాలంలో డీజీపీగా ఉన్న దినేష్‌రెడ్డి వంటివారు వేళ్లు తన్నిన ఈ నేర సామ్రాజ్యాన్ని గుర్తించ లేకపోయారా? (వైఎస్‌కు దగ్గరమనిషిగా పేరున్న మాజీ డీజీపీ మొదట వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి తర్వాత బీజేపీలో చేరారు.) విధి నిర్వహణలో భాగంగా నయీమ్‌ను రెండుసార్లు కలుసుకున్నట్టు చెబుతున్న స్పెషల్‌ ఇంటలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబి) అధిపతి శ్రీరాం తివారికి అతనిలోని మరో కోణం చూచాయగానైనా తెలియరాలేదా? మరికొందరు ఉన్నతాధికారులకు కూడా అతనితో సంబంధాలు వుండే అవకాశం వుందని తివారి అంటున్నా వారిలో ఎవరూ ఎప్పుడూ ఎందుకని ఈ విషవలయం ఛేదించడం గురించి ఆలోచించలేకపోయారు. వారికీ సంబంధా లున్నాయా లేక సంబంధాలున్నవారు ఒత్తిడి చేశారా? చాలా ఏళ్ల నుంచి - ఇప్పటికి కూడా - శాంతి భద్రతలకు స్వయంగా బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రులైనా పదేపదే వెల్లడవుతున్న ఈ వికృతబంధాన్ని ఎందుకు ఎలా అనుమతించారు? రోజువారి నివేదికల్లో ఈ సంగతులు లేవేమని నిలదీయలేదా?
నక్సలైట్లు/మావోయిస్టుల ఖతంకార్యక్రమం, తుపాకిగొట్టం సిద్ధాంతంతో ఏకీ భవించకపోయినా ప్రజాస్వామికవాదులెప్పుడూ ఎన్‌కౌంటర్లను సమర్థించలేదు. 1990ల్లో అచ్చంగా ఇందుకోసం సృష్టించిన గ్రేహౌండ్స్‌ దళాధిపతి వ్యాస్‌. ఆయన హత్య కేసులో అరెస్టయిన నయీమ్‌తో పోలీసులు ఎలా చేతులు కలిపారని మాజీ పోలీసు అధికారి రావులపాటి సీతారాంరావు ఈ పత్రిక వ్యాసంలో వేసిన ప్రశ్న. అదే పోలీసు వ్యవస్థ స్వభావానికి దర్పణం. వ్యాస్‌ హత్య కేసు విచారణకు నియమితుడైన బాధ్యుడికి ప్రధానసాక్షి (దినేష్‌ రెడ్డి) సహకరించలేదని ఒక సీనియర్‌ ఐపీఎస్‌ నాతో అన్నారు. పైగా ‘గబ్బర్‌ సింగ్‌’ అనిపించుకున్న ఆ విచారణాధికారిని తర్వాత కాలంలో కేసులతో వేధించితే ఎలాగో బయిటపడ్డారట. అప్పుడు ఏ ప్రభుత్వం వున్నా పోలీసు వ్యవస్థలో ఇవన్నీ పరిపాటి. హైదరాబాదులో లుంబినీ, దిల్‌షుక్‌నగర్‌ ఘటనల వంటివి జరిగి ఐఎస్‌ఐ, ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదం వంటివాటి గురించి అంత హడావుడి చేసిన వారు పెరట్లో తాము పోసిన పాలుతాగి పెరుగుతున్న సర్పానికి మాత్రం స్వేచ్ఛనిచ్చేశారు. కోవర్టుల ముద్రతో నిస్వార్థ రాజకీయ కార్యకర్తలను, బలహీనులను కూడా ఎంతోమందిని హతమార్చిన మావోయిస్టుల హిట్‌లిస్టులో నయీం లేకపోవడం కూడా గమనించదగ్గది.
పోలీసులు ఇప్పుడేదో హఠాత్తుగా అతని స్థావరాలు తెలిసి దాడి చేసినట్టు చెబుతున్నారు గాని చుట్టుపక్కల వారికి ముఖ్యంగా యువతకూ పిల్లలకూ కూడా వాటి గురించి తెలుసు. కాకపోతే అతనిచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని అనేక ఎనకౌంటర్లు చేసి ఇప్పుడు అతనికీ అదే ముగింపునివ్వడం పోలీసున్యాయం. ఒక దశలో జాతీయంగా సంచలనం కలిగించి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాజకీయ భవితకు ముప్పుగా మారిన సోహ్రాబుద్దిన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనలోనూ నయీం పేరుంది. అలాగే గుజరాత్‌ మాజీమంత్రి అమిత్‌షా ప్రత్యర్థి హీరేన్‌ పాండ్యా హత్యలోనూ వినిపించింది. ఆ నేపథ్యంలో చూస్తే నయీంను పట్టుకుని గుట్టు మట్టులు లాగకుండా మట్టుపెట్టడంతో సత్యాలను సాక్ష్యాలను శాశ్వతంగా సమాధి చేసినట్టయింది.

రాజకీయవేత్తలు, పోలీసు ఉన్నతాధికారులు, పౌర విభాగాధిపతులు, ఈ ముగ్గురి కుమ్మక్కు కారణంగానే నేర ప్రపంచం వర్ధిల్లుతున్నదని వోరా కమిటీ పాతికేళ్ల కిందట ఇచ్చిన నివేదిక నిజమని ఈ క్షుద్రచరిత్ర మరోసారి నిరూపించింది. కొమ్మలు నరికినా భూమిలో చెట్టు వేళ్లు వుంటాయన్నట్టుగానే ఒక ఘరానా నేరస్థుడిని హతం చేసినంత మాత్రాన నేర సామ్రాజ్యం అంతరించిపోదు. దావూద్‌ ఇబ్రహీం తరహాలో నయీం వారసుడెవరనే దానిపైనా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రపంచీకరణ మిగిలిన విషయాలలాగే నేరాలను కూడా అంతర్జాతీయం, ఆధునికం చేసింది. నయీం కూడా వందలకోట్లతో దుబాయ్‌ వెళ్లిపోయి తర్వాత రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నట్టు చెబుతున్నారు. ఆ విధంగా వందల కోట్లు కూడ బెట్టుకోవడానికి వెనకనున్న శక్తులెవరు? ఉమామాధవరెడ్డి వచ్చిన కథనాలను ఖండించారే తప్ప నయీం అకృత్యాలను పెద్దగా ఖండించలేదన్నది నిజం. కానీ ఆమె వేసిన ప్రశ్నలకూ జవాబులు కావాల్సిందే. 
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత శక్తిమంతమైన కొత్త పార్టీ పాలనలోనూ రెండేళ్ల పాటు ఈ ముఠా ఎలా చెలామణి కాగలిగింది? ఇలాంటివి శాఖాపరమైన సాంకేతిక దర్యాప్తులతో తెలిసేవి కావు. లెక్కపెట్టిన నోట్ల కట్టల గురించి దొరికిన ఆయుధాల గురించి కథలు చెప్పి అలరించడం వల్ల ప్రయోజనం శూన్యం. వందల సంఖ్యలో వున్న బాధితులు, మామూలు పోలీసులు ముందుకొచ్చి నిజానిజాలు చెప్పాలంటే వారికి బోలెడంత భరోసా ఇవ్వగలగాలి. రాజకీయ అనుబంధాలకు అతీతంగా పారదర్శకంగా సమగ్ర విచారణ జరిగితేగాని నిజంగా డొంక కదలదు. ఇకమీదటైనా ప్రభుత్వాలూ, పోలీసులూ నయా రాకాసులను సృష్టించి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అమానుష వ్యూహాలను కట్టిపెట్టాలి.       -తెలకపల్లి రవి (ఆంధ్ర జ్యోతి)

No comments:

Post a Comment