|| గోమాత పేరిట బిజెపి మోసకారితనం ||
ఓట్లు దండుకోవటానికి బిజెపి నాయకత్వాన ఉన్న కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ 125వ జయంతిని అట్టహాసంగా నిర్వహిం చింది. రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా పాటించింది. ఇవన్నీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల గౌరవం చూపటానికి కాదు, ఓట్ల కోసమే. అది ఈమధ్యే రుజువైంది. ముంబాయిలోని దాదర్ ప్రాంతంలో అంబేద్కర్ చారిత్రాత్మక కార్యాలయ భవనాన్ని కూల్చేసింది మహారాష్ట్ర బిజెపి ప్రభుత్వం. అది ఒకప్పుడు స్వతంత్ర సంగ్రామానికి ఒక కేంద్రంగా ఉండేది. దీంతో వారి దళిత ప్రేమ ముసుగు తొలగిపోయింది. దేశమంతటా ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలు తమ కార్యక్రమం అమల్లో భాగంగా ముస్లింలు, దళితులపై దాడుల తీవ్రతను పెంచాయి. ఉగ్ర హిందూత్వవాదులు దేశాన్ని దళిత, ముస్లింల నుంచి విముక్తి చేయటానికి లోతైన కుట్రలో మునిగి ఉన్నారు. రాజకీయ హిందూత్వ వాదులు దళితులు, ముస్లింలు, మహిళలను శత్రువులుగా చిత్రీకరిస్తు న్నారు. హిందూ మహిళకు పుత్ర సంతానం కనటం తప్ప వేరే పనిలేనట్టు ప్రవర్తిస్తు న్నారు. గోమాంసం తినడాన్ని నిషేధించారు. వారికి అన్నిటా గోమాంసమే కనపడుతున్నది. ఈ గోమాంసం సాకుతో ఒకటి తర్వాత ఒకటిగా ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నారు. దేశ ప్రజలు వీరి ఈ మోసకారితనానికి వ్యతిరేకంగా గళం విప్పాలి.
ఉత్తరప్రదేశ్ దాద్రిలో మహమ్మద్ అఖ్లకుద్దీన్‌ను ఆయన ఇంట్లోని ఫ్రిజ్‌లో గోమాంసం ఉందనే సాకుతో చంపేశారు. తరువాత అది మటన్ అని తేలింది. హర్యానాలో ముగ్గురు దళిత శిశువులను నిప్పంటించి చంపారు హిందూత్వవాదులు. జార్ఖండ్‌లో ఇద్దరు ఆవులు అమ్మేవారిని చెట్టుకు ఉరితీసి చంపారు. ఈమధ్యే గుజరాత్‌లోని ఉనాలో చచ్చిన ఆవు చర్మం తీస్తుంటే ఏడుగురు దళితులను చిత్రహింసల పాల్జేశారు. కర్ణాటకలో చిక్‌మగళూర్‌లో ఆవు మాంసం వండుకుని తిన్నారన్న అభియోగం మోపి ఒక దళిత కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారు. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు ముస్లిం మహిళలు గేదె మాంసం విక్రయిస్తుండగా గోమాంసం అమ్ముతున్నారని అభాండం వేసి చితకబాదారు. ఈ సంఘటనలన్నీ వార్తల్లో వచ్చాయి. ఇంకా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కానీ తెలియటం లేదు. ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి కూటమి గోమాత పరిరక్షణ కార్యక్రమం అమలు జరిపి వేద కాలాన్ని తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నది. విడ్డూరమేమంటే వేదకాలంలో రుషులు, మునులు గోమాంసం తినేవారు. అది వారి ఇష్టమైన మాంసాహార జాబితాలో ఉండేది. ఇప్పుడు మాంసం తినటానికే ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు రాజకీయ హిందూత్వవాదులు. లేకుంటే మధ్యప్రదేశ్‌లో మండసార్‌లో మహిళలపై దాడి, ఉత్తరప్రదేశ్ దాద్రిలో అఖ్లాక్‌ను వారు హత్య చేసేవారు కాదు. ఈ విషయంలో ఉగ్ర హిందూత్వవాదులు ద్వంద్వ వైఖరి కనబరుస్తున్నారు. ఒకవైపు వేద కాలాన్ని తిరిగి తేవాలంటారు, మరోవైపు గోమాంసం తినొద్దంటారు. ఈ రెండు నాల్కల ధోరణి, ఈ మోసం ముసుగును తొలగించాలి.
సాధారణ దళిత, ముస్లిం తరగతుల ప్రజలు చనిపోయిన పశువుల చర్మం తీసి, దాన్ని శుభ్ర పర్చటం వంటి పనులు చేస్తూ ఉంటారు. గుజరాత్ సంఘటన తరువాత వారు ఈ పనులు చేయటానికి ఇష్టపడటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశమంతా ఒక రోజు బొందలఘాట్‌గా మారుతుంది. అప్పుడు గోరక్షకు లైన హిదూత్వవాదులే చనిపోయిన పశువుల చర్మం వలిచి శుభ్ర పర్చే పని చూసుకో వాల్సి వస్తుంది. ప్రజల తాలూకు ఈ తరగతులే ప్రస్తుతం చర్మం పనులు చేస్తున్నాయి. ఇలాగే దాడులు కొనసాగితే జోళ్ళ తయారీకి చర్మం సరఫరా మూత పడుతుంది. దాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. బిజేపి బహుళజాతి కార్పొరేట్ల కొమ్ము కాయటం చూస్తే వారు ఏ కార్పొరేట్ సంస్థలతో తోలు దిగుమతి ఒప్పందాలు చేసుకుందో చెప్పటం కష్టం. గోమాంసం నిషేధం, దాన్ని అనుసరించి దాడుల వెనక ఎవరికి ఏ లాలూచీ ఉందో? ఎన్నికల ముందు అదానీ గ్రూపు డబ్బుతో నరేంద్ర మోడీ ప్రచార పర్వం అంతా జరిగింది. తరువాత మోడీగారు వెళ్ళిన ప్రతి దేశానికీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని కూడా తీసుకెళ్ళకుండా అదానీని మాత్రం కచ్చితంగా తీసుకుపోయి అన్ని వ్యాపార ఒప్పందాలూ ఆయనకే కట్టబెడుతున్నారు. ఇది అందరికీ కళ్ళకు కనబడుతున్న సత్యమే. అదానీ గ్రూపు కేవలం పప్పులు నిల్వ చేసే రెండు లక్షల కోట్ల రూపాయలు దండుకున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవైపు మతతత్వ, మతపరమైన రగడ, మరోవైపు కార్పొరేట్లకు వెసులుబాట్లు కల్పించటంలో అహోరాత్రులు నరేంద్ర మోడీ కష్ట పడుతున్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల కొమ్ము కాస్తున్న మోడీ ప్రభుత్వ ఈ మోసపూరిత వైఖరిని అడ్డుకోవాలంటే దళితులు, ముస్లింలు, మహిళలతో సహా కష్టజీవులందరూ ఐక్యం కావాలి. దళితులపై అత్యాచారాలు, ముస్లింలపై దాడులు, మహిళలపై అవమా నాలు ఆపాలని నినదించాలి. ఈ మోసకారితనాన్ని తీవ్రంగా ఖండించాలి.
- వివిఆర్ శాస్త్రి




No comments:
Post a Comment