Friday, 26 August 2016

|| దళితుల నిరసనలు ఒక శుభసూచిక ||


                గోరక్షణ దళాల పేరుతో దళితులపై రోజు రోజుకూ దౌర్జన్యాల సంఖ్య పెరుగుతూ ఉంది. 2013లో 39,000 కేసులు, 2014లో 47,000 కేసులు నమోదైతే 2016లో ఇప్పటికే 54,000 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా మైనారిటీలకు వ్యతిరేకంగా కూడా కేసులు పెరిగిపోతున్నాయి. దళితులు, మైనారిటీలలో ఒక విధమైన భయం ఏర్పడింది. ఇంతకు ముందు ఇలాంటి భయాలు లేవు. మన రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. కులం, మతం పేరుతో దౌర్జన్యాలకు అవకాశమే లేదు. వీటన్నింటిలో భాగంగా 'ఉనా' సంఘటన జరిగింది. ఒక చనిపోయిన ఆవుకున్న ప్రాముఖ్యత ఒక దళితునికి లేదు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదొక శుభసూచిక. 'విద్యా బుద్ధులు నేర్పు, కూడగట్టు, ఆందోళన చెయ్యి' అన్న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పిన విధంగానే ఇప్పుడు జరుగుతున్నది. ఇలాంటి ఐక్యత గతంలో ఉండి ఉంటే ఈ విధంగా దళితులపై దౌర్జన్యాలు జరిగి ఉండేవి కాదు. దళితులంతా ఐక్యమై దేశంలో అలాంటి దౌర్జన్యాలు ఎక్కడ జరిగినా వాటికి వ్యతిరేకంగా తమ గొంతుకను వినిపించాలి. అలా చేస్తే వారంతా అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పగలం. దళితులపై గతంలో కూడా దౌర్జన్యాలు జరిగాయి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఆ దాడుల బాధితులకన్నా వారిపై దాడులు చేసిన వారికే అధికార ప్రభుత్వం అండగా ఉంటోంది. 'ఉనా' సంఘటనే తీసుకుంటే క్షతగాత్రులు 30 మంది పేర్లు చెప్పారు. షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్‌ ఒత్తిడి చేయడంతో వారిలో కొద్ది మందిని మాత్రమే అరెస్ట్‌ చేశారు. లాఠీలతో దాడులు చేస్తుంటే పోలీసులు ప్రశాంతంగా వీక్షిస్తున్నట్లు వీడియోలు చూపించాయి. మూగ శ్రోతలుగా ఉండిపోయారు. దౌర్జన్యకారులు దళితులపై దాడికి ఉపయోగించిన బెత్తాలు పోలీసు వారికి సంబంధించినవిగా గుర్తించవచ్చు. దీన్ని బట్టి దౌర్జన్యకారులకు, పోలీసులకు మధ్య మంచి సంబంధాలున్నట్లు అర్థమవుతోంది. దౌర్జన్యాలను అరికట్టవలసిన పోలీసులు ఏమీ చేయకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్‌ 4 ప్రకారం వారు శిక్షార్హులు. మా కమిషన్‌ నియమించిన నిజ నిర్థారణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది. గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే దాడులలో గాయపడిన వారికంటే నేరస్తులతోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు రహస్యంగా అవగాహన ఉన్నట్లు అర్థమవుతుంది.
గొప్ప జాతీయవాది లేక గొప్ప హిందువు ఎవరు అని చూపించే జాతి ఒకటి ఉన్నది. ఈ క్రమంలో వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. గోరక్షకులెవరు? ఎవరు వారిని గుర్తిస్తారు? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే విధంగా ఎవరూ వారికి అధికారం ఇవ్వలేదు. ఒకవేళ వారు ఆవును చంపినట్లు గుర్తిస్తే, ఆ విషయాన్ని పోలీసు శాఖ దృష్టికి తీసుకుపోవచ్చు. వారికి ఒకవేళ బాధ కలిగితే ఆందోళన చేయవచ్చు. కానీ వారు వాస్తవాలను అణచిపెట్టి ఉంచుతున్నారు. ఉనా సంఘటనలో సిఐడి బృందం ఆవులు సింహం చేత చంపబడినట్లు తెలిపారు. గోరక్షకులు గొంతులు కోసే అసాంఘిక శక్తులు. పశువుల వ్యాపారం ఈ ప్రాంతంలో జరుగుతుంది. అనునిత్యం జంతువుల రవాణా జరుగుతుంది. వారు ఆ వాహనాలను నిలిపేసి అక్రమంగా డబ్బు వసూలు చేస్తూ అన్ని రకాల బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి ఎన్నికలలో గెలవడమే బిజెపి ఉద్దేశం. ఆవు కూడా అలాంటి ఉద్దేశం నుంచి ఉద్భవించిందే. అది హిందూ మతానికి సంబంధించినది, పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నది. అందుకే 1950లలో అన్ని రాష్ట్రాలూ (గోవా, కేరళ, బెంగాల్‌ మినహా) గోరక్షణ చట్టాలు చేశాయి. గోవధ నిషేధించబడింది. కానీ గోమాంసాన్ని రవాణా చేయడం, తినడం, కలిగి ఉండడం నేరం కాదు. వధించడం నేరం. కానీ వారు మతాల మధ్య చీలిక తెచ్చే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారికి బిజెపి చాలా చేస్తున్నదని చెప్పడానికి గుర్తుగా పార్లమెంటులో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ దేని కొరకు కృషి చేశాడు? దాడులలో క్షతగాత్రులైన వారికి అండగా లేకుండా, వారిపై దాడులు చేసిన నేరగాళ్ళకు బిజెపి మద్ధతుగా ఉన్న అనేక సంఘటనలున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రమోషన్లలో రిజర్వేషన్ల గురించి బాధపడుతున్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ల కొరకు రాజ్యాంగ సవరణ చేయాలన్న డిమాండ్‌ ఉన్నది. ఎవరూ దానిపై మాట్లాడడానికి సిద్ధంగా లేరు. దళితులకు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. కానీ ఉద్యోగాలు ఎక్కడున్నాయి. ఖాళీలు లేవు. ప్రభుత్వరంగంలో కొత్త పథకాలేవీ లేవు. ప్రభుత్వరంగంలో ఉద్యోగ కల్పన లేదు. ప్రయివేట్‌ రంగంలో వారిని తీసుకోవడం లేదు. ప్రవేట్‌ రంగంలో అత్యవసరంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్క న్యాయమూర్తి కూడా లేరు. అన్ని హైకోర్టులలో కలిపి 20 లోపు సంఖ్యలోనే కొద్ది మంది న్యాయమూర్తులున్నారు. ఎస్సీ, ఎస్టీ వారికి ప్రయివేట్‌ రంగంలో కొన్ని కచ్చితమైన అవకాశాలున్నాయని చెప్పే 'గిరిజన సబ్‌ప్లాన్‌', 'స్పెషల్‌ కాంపోనెంట్‌ ప్లాన్‌'లు ఏర్పాటు చేయబడినాయి. ఇవి ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అవసరాలలను గుర్తించే పథకాలు. కానీ నిధులు మళ్ళింపబడుతున్నాయి. సాధారణ పథకాలపై ఆ నిధులు ఖర్చు చేయబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ప్రభుత్వాలు అలాంటి పథకాల నిధుల మళ్ళింపు శిక్షార్హమైనదన్న చట్టం చేశాయి. అలాంటి నిధులు మళ్ళింపబడకుండా ఉండాలని ఒక చట్టం చేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలు ముఖ్యంగా పేద వర్గాల నుంచి వచ్చినవారే. ఇళ్ళ నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత మొదలగు అవసరాల కొరకు వారు ప్రభుత్వ పథకాలపై ఆధారపడి జీవించాల్సినవారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిన అన్ని రకాల ఆర్థిక పథకాలలో 2014-15 కేంద్ర బడ్జెట్‌లో రూ.66,268 కోట్లు తగ్గించారు. ఈ కేంద్ర బడ్జెట్‌ నిధులలో కోత ఎస్సీ, ఎస్టీలపై ప్రభావం చూపింది.
- పిఎల్‌ పునియా

No comments:

Post a Comment