Tuesday, 30 August 2016

|| కరుణలేని పాలనలో కన్నీటి ధారలు ||


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు పాలనలో నిర్దయ కనిపిస్తుంది. పైపై ఆడంబరాలకు పోయి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. రాష్ట్రమంతా కరువుతో విలవిల్లాడు తోంది. విషజ్వరాలతో ఊళ్ళకు ఊళ్ళు మంచాన పడ్డాయి. సాగునీరు, తాగునీరు లేక ప్రజలు వలస బాట పట్టారు. దుర్భిక్షంతో మేఘాలు తెల్లబోయి, జీవితాలు డొల్లబోయి రైతులు, వ్యవసాయ కార్మికులు కన్నీరు కనుకొలకుల్లో ఇంకిపోయి నిర్భాగ్యంగా ఆకాశం వైపు చూస్తున్నారు. చంద్రబాబును మనోవిశ్లేషకులు ఆర్ధ్రత, కరుణ లేని మనిషిగా వ్యాఖ్యానిస్తున్నారు. భావోద్వేగాలు లేని మనిషి పాలకుడైతే దుఃఖపడాల్సిన చోట కూడా కఠినంగానే ఉంటాడని మనోవిశ్లేషకులు చెబుతున్నారు. రూ.1.36 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన రాష్ట్రంలో ప్రజలు మంచాన పడితే నాలుగు మాత్రలు ఇవ్వలేని దుస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు పుట్టింది రాయల సీమలో. ఈనాడు రాయలసీమ పరిస్థితి ఏమిటి? అనంతరపురం జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల్లో వేరుశనగ ఎండిపోయింది. అసలు అనంతపురం జిల్లాలోని సాగుభూమి 24 లక్షల ఎకరాలు. అందులో 20 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు. 15 లక్షల ఎకరాల్లో పంట వాడిపోతుంది. 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. వ్యవసాయం కోసం రైతులు వాడుకునే ట్యాంకర్లు, రెయిన్‌గన్లు, డ్రిప్‌, పైపులన్నీ మూలబడిపోయాయి. కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నం అవుతోంది. దారిద్య్రంలోకి ప్రజలు నెట్టబడి, ఉన్న కొంప, గొడ్డు అమ్ముకొని రైతులు కూలీలుగా మారుతుంటే, వ్యవసాయ కార్మికులైన దళితులు ఊళ్ళు విడిచి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతుంటే, తన భజంత్రీల ద్వారా ముఖ్యమంత్రి బాకాలు ఊదించుకొంటూ పుష్కరాల పేరుతో కోట్ల రూపాయలు బుగ్గిపాలు చేసి నిమ్మకు నీరెత్తినట్టుగా తనకు అనుకూలమైన పత్రికల్లో 'అంతా సుభిక్షంగా ఉంది' అని ప్రకటనలిస్తున్నారంటే ఎంత కరుణరహితమైన భావనతో ఆయన వాస్తవాలను చూసే పరిస్థితి నుంచి ఒక అంధత్వంలోకి జారిపో తున్నారో అర్థం చేసుకోవాల్సి ఉంది. అసలు మేము ప్రత్యేకాంధ్రను కోరడంలో ముఖ్యోద్దేశం పరిపాలన హైదరాబాద్‌ చుట్టుపక్కలకు పరిమితం అవుతోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడితే పరిపాలన ప్రజల దగ్గరకు ముఖ్యంగా నిర్లక్ష్యం చేయబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు విస్తరించాలని కోరుకొన్నాం. మరోపక్క ఉత్తరాం ధ్రలో పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతబడుతూ కార్మికులు నిర్భాగ్యులవుతున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పది జూట్‌ మిల్లులు, 14 ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు మూతబడుతూ వస్తున్నాయి. విజయనగరం, కొత్తవలస, బొబ్బిలి, సాలూరుల్లో జూట్‌ మిల్లులు మూతబడటంతో కార్మికులు రోడ్డున పడ్డారు. అతి పెద్ద మ్యాంగనీస్‌ ఫ్యాక్టరీ, గవిడిలో పెట్రో అల్లాయిస్‌ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. ఈ ఫ్యాక్టరీల మూసివేతకు కారణం విద్యుత్తు ఛార్జీలు యూనిట్‌కు రూపాయిన్నర పెరగడం. ఒక టన్ను ఉత్పత్తి చేస్తే రూ.8 వేలు సంస్థకు నష్ట వస్తుండటంతో మూసేస్తున్నామని యజమానులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 20 వేల మంది కార్మికులు ఈ సంవత్సరం ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇతర దేశాల పెట్టుబడిదారులకు 13 జిల్లాల్లో ఏ భూమి అమ్ముకోవాలి, తాకట్టుపెట్టాలి అని ఆలోచించడం తప్ప ఆయన రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఎన్ని రోజులు నివసిస్తున్నారు. అక్కడ ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ఏమి పరిశీలిస్తున్నారు? ఆలోచిస్తే శూన్యం. ముఖ్యమంత్రి రాజకీయ అనిశ్చితిలో ఉండి ఆ పార్టీ నుంచీ, ఈ పార్టీ నుంచీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా రాజకీయంగా బలపడాలని చూస్తున్నారు. అందువల్ల ప్రజల ఆకలి బాధలు తీరుతాయా అని ఆయన ఆలోచించాల్సి ఉంది. ఒక పక్క కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జ్వరాల వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది. ప్రాథమిక వైద్యశాలలు నరక కూపాలు అయిపోయాయి. కార్పొరేట్‌ వైద్యం వ్యాపారమయం అయ్యింది. జ్వరం అని వెళ్తే ప్లేట్‌లెట్లు పడిపోయాయని డబ్బు దండుకుంటున్నారు. ప్రతి ప్రభుత్వ డాక్టర్‌ ఒక ప్రయివేట్‌ వైద్యశాల లేకపోతే కార్పొరేట్‌ వైద్యశాలలో అదనపు వృత్తి. పెద్ద పెద్ద కార్పొరేట్‌ వైద్యశాలల నిర్మాణానికై మైనారిటీల ఆస్తులు లీజులకు తీసుకోవడం, దళితుల అసైన్డ్‌ భూములను ఆక్రమించడం చేస్తున్నారు. చివరికి ఎవరి భూములు ఆక్రమించారో వారికి అక్కడ వైద్య సౌకర్యం మృగ్యం. చంద్రబాబు అగ్రకులాల్లోని ధనవంతులకు మేలు జరిగే పద్ధతిలో ఆలోచిస్తున్నారు. తాను, తన అనుయాయులు ఎంత దోపిడీ చేసినా ప్రజలు తనకే ఓటు వేస్తారని, ఎన్నికలు నాలుగు రోజులు ఉన్నాయనగా డబ్బు, మందు పంచితే వెనకటివన్నీ మర్చిపోయి మళ్ళీ అధికార పార్టీకే వేస్తారని ముఖ్యమంత్రి భరోసా. నిజానికి ఓటు చాలా విలువైంది. కానీ ఆ ఓటును ప్రజలు సులువుగా అమ్ముకుంటున్నారు. వామపక్ష, అంబేద్కర్‌వాద పార్టీలు స్వాతంత్య్ర కాలం నుంచీ ఉన్నాయి. ఎన్నో పోరాటాలు చేసి వీరు ప్రజలకు ఎన్నో హక్కులు సాధించారు. కానీ ఎన్నికల్లో ప్రజలు వీరికి ఓటువేయడం లేదు. కారణం ఏమిటి? వామపక్షవాదులు, అంబేద్కర్‌వాదులు ప్రజలకు చైతన్యవం తంగా ఓటును ఉపయోగించుకోవడాన్ని నేర్పలేకపోయారు. రాజ్యాధికార భావన ప్రజల్లో చైతన్యం తెస్తుంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తంగా రెండు కులాలు పాలిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పరిశ్రమలు, విద్యాలయాలు, భూములు అన్నీ ఈ కులాల చేతుల్లోనే ఉన్నాయి. బహుజనుల జనాభా 85 శాతం ఉంది. రాను రాను దళిత, బహుజన, మైనార్టీలు అణగారిపోతున్నారు. స్వాతంత్య్రానంతరం ప్రధానంగా తమ పిల్లలను చదివించు కోవాలనే కాంక్ష బలంగా ఉంది. అయితే ఇంకా ఈ వర్గాల్లో 40 శాతం పైగా ప్రజలు నిరక్ష్యరాసులుగానే ఉన్నారు. అక్షరం నుంచి చైతన్యం వీరికి అందడం లేదు. ప్రాథమిక విద్యపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడి చేస్తున్నది. నిరంతరం స్కూళ్ళు, హాస్టళ్ళు మూసివేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఎన్నో స్కూళ్ళలో పిల్లలు బడికి రాలేక జ్వరాలతో మూల్గుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం నానాటికీ కుంచించుకుపోవడం వల్ల పిల్లలు జ్వరాలతో నీరసంగా అనాకారులవు తున్నారు.కన్న బిడ్డలు కళ్ళ ముందు శుష్కించిపోతూ, కొబ్బరినీళ్ళు, బార్లీ, ఎలక్ట్రాల్‌ పౌడర్‌ ఇచ్చుకోలేక కనీసం మంచినీళ్ళు కూడా పూర్తిగా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో తల్లులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎందరో పసికందులు, వృద్ధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో మరణిస్తున్నారు. శ్మశానాల్లో చోటులేక పూడ్చిన వారి మీదే పూడ్చుతున్నారు. ఇంటిలో యజమానికి జ్వరం వస్తే నాలుగైదు రోజులు పనికి వెళ్ళలేకపోతే ఇంటిలో పస్తులు. ఒక పక్క ప్రభుత్వం పుష్కరాలని, పండుగలని కోట్ల ధనం వ్యర్థంగా ఖర్చుపెడుతోంది. నవ్యాంధ్ర ప్రజలు తమ కన్నీటికి కారణాలు తెలియక ఏ దేవుడో కారణం అనుకొని మొరపెట్టుకొంటున్నారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడే భక్తి పెరుగుతుంది. మరో పక్క ధనవంతులు తమ సంపదను పేద ప్రజలకు వడ్డీలకిచ్చి, మందుల షాపులు నడుపుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నాయకులు గూండాలను మేపుతూ దందాలు చేస్తూ, పైరవీలు చేస్తూ, కత్తి, తుపాకీ చూపించి నిరాధారమైన ప్రజలను బెదిరించి డబ్బు గుంజి స్థలాలు, పొలాలు, ఇళ్ళు అక్రమంగా రాయించుకొంటూ బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో కులాధిపత్య దోపిడీ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ రాజ్యాధికార భావన ప్రజల్లో పెరగాలి. అంబేద్కర్‌ రాజకీయ ఆలోచనల ద్వారానే మనం ఈ రాజ్యాధికార భావనను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి ఉంది. అంబేద్కర్‌ బౌద్ధ తాత్విక స్వీకరణకు, రాజకీయ పార్టీల నిర్మాణానికి, పోరాటానికి అవినాభావ సంబం ధం ఉంది. బౌద్ధ సూత్రాలలోని అహింస విధానాన్ని అంబేద్కర్‌ అభిలషించాడు. అందుకే ఆయన పార్లమెంటరీ ఎన్నికల నుండి రాజ్యాధికారాన్ని సాధించే మార్గాన్ని నిర్దేశించాడు. ఒక మనిషికి రాజకీయ విలువ ఓటు ద్వారా లభిస్తుంది. సామాజిక, ఆర్థిక సమానత్వానికి దారితీసే వరకూ ఆ పోరాటం జరగవలసిందే. ఇది ఒక పెద్ద పరిణామ క్రమం. ఈ పరిణామ క్రమం ఒక తాత్వికునికే అర్థమవుతుంది. రాజకీయ అధికారమంటే ఆధిపత్యానికో, అవినీతికో, అధర్మవర్తనకో, సంపదను పోగేసుకోవడానికో కాదు. అది మానవ పునర్నిర్మాణానికి అని అంబేద్కర్‌ ఉద్దేశం. అందుకే సంపత్తికి కేంద్రంగా కాక ఆలోచనా కేంద్రంగా ఆయన రాజకీయ పార్టీని నడిపించాడు. 1946లో రాజ్యాంగ నిర్మాణంలోకి అడుగు పెట్టినప్పుడు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసమే ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. ఆయన సిద్ధాంతపటిమ, నిరంతర అధ్యయనశీలత, పునర్నిర్మాణ దక్షత బౌద్ధతాత్వికత నుంచే వచ్చింది. తాత్వికుడు కానివాడు రాజకీయవేత్త అయితే అధికారం కోసం, ఆధిపత్యం కోసం వెంపర్లాడటం మాత్రమే జరుగుతుంది. అంబేద్కర్‌ విలువల కోసం పోరాడిన నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాణం తరువాత మొత్తం భారతదేశ ప్రజలకు మేలు చేసేవాడిగా ఆయనకు గుర్తింపు లభించింది. అగ్రవర్ణాలు చేసిన అనేక దుష్ప్రచారాలకు ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన బౌద్ధ సూత్రాలు సమాధానం చెప్పాయి. భారతదేశంలో వ్యక్తిగత కక్షలు లేని రాజకీయ నాయకునిగా అంబేద్కర్‌ నిలబడ్డాడు. గాంధీ, నెహ్రూ, పటేల్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటి రాజకీయ నాయకుల్లో అనేక సందర్భాల్లో వర్ణ, వర్గ, కుల ఆధిపత్య ద్వేష స్వభావాలు బయటపడ్డాయి. ఆ స్వభావాల వల్ల అనేక సందర్భాలలో దేశం కకావికలం కూడా అయింది. అంబేద్కర్‌ లౌకికవాద వ్యక్తిత్వం ఇందుకు భిన్నమైంది. భారతదేశ పౌరులు తమ రాజ్యాంగాన్ని తాము అర్థం చేసుకోగలిగితే ప్రజలలో సమతాభావం పెరుగుతుంది. అంబేద్కర్‌ రచనల్లో జ్ఞానం ఉంటుంది. ఆయనొక జ్ఞాన స్రవంతి. ఆయనొక విజ్ఞాన సర్వస్వం. ఆయనొక సందర్భంలో మామూలు మనిషి చిన్న కాలువ వంటివాడు. మహాపురుషుడు నది లాంటివాడు అని చెప్పాడు. ఇప్పటి రాజకీయ నాయకులు ఎండిపోతున్న చెరువుల్లా ఉన్నారు. మార్క్సిస్టులు-అంబేద్కరైట్లు పార్లమెంటరీ రాజకీయాల్లో కీలకమైన ఓటు విలువ గురించి ప్రచారం చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో మనం కట్టే పన్ను మనకే ఉపయోగపడాలంటే నీతి, నిజాయితీ, సిద్ధాంత బలమున్న మన పార్టీలకు ఓటు వేసుకోగలగాల్సి ఉంది. ఆపద వచ్చినప్పుడు, హక్కుల కోసం పోరాడేటప్పుడు మనం ఎరుపు, నీలం పార్టీలను, ఉద్యమాలను ఆశ్రయించి ఆ తరువాత ఎన్నికలు వచ్చేటప్పటికి డబ్బుకు, మందుకు, ప్రచారానికి లోబడి చంద్రబాబు వంటి కరుణరహితమైన, ప్రజల కష్టాలను, కన్నీళ్ళను, పేదరికాన్ని పట్టించుకోని నాయకులను ఎన్నుకుంటే, ఆ పార్టీలకు కొమ్ముకాస్తే, మన పేదరిక నిర్మూలన మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతుంది తప్ప ప్రయోజనం లేదు. బృహత్తరమైన బడ్జెట్‌, వనరులున్న అధిక జనాభా గలిగిన దళిత, బహుజన, మైనార్టీలు, మన దేశం, మన రాష్ట్రంలోని అగ్రకులాల్లోని పేదలు, స్త్రీలు కలసి నిర్మించుకొనే రాజకీయ అధికార చైతన్యం కోసం పోరాడదాం. రాబోయే చరిత్రను మనమే నిర్మిద్దాం. మన వనరులు మనకే ఉపకరించే సమతా రాజ్యాన్ని నిర్మిద్దాం..     - డాక్టర్‌ కత్తి పద్మారావు

No comments:

Post a Comment