Wednesday, 31 August 2016

|| వైద్యో... నారాయణో... హరి ||


               పది రోజుల్లో ఆరు ఘటనలు. మనసు మెలి పెట్టేస్తాయి. సున్నిత హృదయుల కంట కన్నీరు పెట్టిస్తాయి. ఉడుకు రక్తం గలవారికి ఏలికలపై ఆగ్రహం తెప్పిస్తాయి. వైద్యుడికి రోగికి మధ్య దూరం ఎంతుందో మరో మారు తాజాగా ప్రపంచానికి చాటుతాయి. మానవజాతిని అప్రతిహతంగా ముందుకు నడిపిస్తున్న మహిళలు ప్రసవానికి ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో? నాగరికతను నిలువెల్లా నింపుకున్న ఆధునిక సమాజంలో, కట్టుకున్న భార్య అంతిమ యాత్రను ఓ బీద గిరిజనుడు ఎంత దీనాతి దీన పరిస్థితుల్లో చేశాడో? తల్లిదండ్రులిద్దరికీ బరువైన చిన్నారులు చీకటి గదిలాంటి మురికి కూపంలో తిండీతిప్పలు లేకుండా ఎలా పడున్నారో? విష జ్వరంతో బాధపడుతున్న కుమారుడిని భుజాన వేసుకుని ఆస్పత్రుల చుట్టూ పరుగెట్టినా అసమర్థ తండ్రిగానే ఎలా మిగిలిపోవాల్సి వచ్చిందో? తెలిపే ఘటనలివి. భార్య శవాన్ని భుజాన మోసుకెళ్లిన ఒడిషా గిరిజనుడి వార్తా కథనం పత్రికల్లో చూసి అక్కడెక్కడో వున్న బహ్రెయిన్‌ ప్రధాని స్పందించి డబ్బు పంపి ఆదుకోగలిగాడే కానీ, మన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం పెదవి విప్పలేకపోయారు. ఆయన గిరిజనుడి కుటుంబానికి సంతాపం తెలపాలంటే 'మన్‌ కీ బాత్‌ కార్యక్రమమం' రావాలి కామోసు? వైద్యం ప్రయివేటు పరమై బడుగు జీవికి అంతంత మాత్రపు సేవలు అందుతున్న వేళ, ఒక చిన్ని అంబులెన్స్‌ వాహనం కూడా లేక బీదల ప్రాణాలెలా అల్లాడిపోతున్నాయో ?

|| సైకిల్‌పై ప్రసవ యాత్ర ||

ప్రసవ యాతనను మాటల్లో వర్ణించలేం. అలాంటిది నొప్పులు మొదలయ్యాక సైకిల్‌ మీద 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్పత్రికి చేరుకోవడమంటే మాటలు కాదు. ఆ మహిళ పార్వతి అయితే, సైకిల్‌ మీద ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లిన వ్యక్తి నన్హేభారు. పార్వతి తండ్రి. మధ్యప్రదేశ్‌లోని షాపూర్‌ గ్రామానికి చెందిన గిరిజనులు వీళ్లు. పార్వతికి నొప్పులు ప్రారంభమవడంతో అంబులెన్స్‌ పంపించమని, 'జనని ఎక్స్‌ప్రెస్‌' వారికి పదే పదే ఫోన్లు చేశారు. పురుటి నొప్పులతో బాధ పడుతున్న కుమార్తెను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి ఎంత త్వరగా తీసుకెళ్దామా అన్న ఆతృతలో వున్న నన్హేభారుకు నిరాశే ఎదురైంది. అంబులెన్స్‌ రాకపోవడంతో సైకిల్‌ మీదే ఆమెను ఆస్పత్రికి చేర్చాడు. సుఖప్రసవమై పండంటి బాబు పుట్టాడు. అప్పటి వరకు పడ్డ మానసిక ఒత్తిడిని మర్చిపోయి తాత అయినందుకు ఎంతగానో సంతోషించాడు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తిరిగి తల్లీబిడ్డలను ఇల్లు చేర్చడమెలాగనేది పెద్ద సమస్యగా ఆయన ముందు నిల్చింది. ఆస్పత్రి అధికారులు వారి తిరుగు ప్రయాణానికి అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో తన సైకిల్‌ మీదే పచ్చి బాలింతరాలిని, పసిగుడ్డుగా వున్న మనవణ్ణి తీసుకుని ఇల్లు చేరాడు.

|| భుజాలపైనే భార్య అంతిమ యాత్ర ||

క్షయ వ్యాధిగ్రస్తురాలైన భార్యను తీసుకుని ఆస్పత్రికి వెళ్లేప్పుడా గిరిజనుడు ఊహించనే లేదు! ఆమె కట్టెను భుజాన మోసుకెళ్లాల్సి వస్తుందని!! ఈ హృదయ విదారక ఘటన ఒడిషాలో జరిగింది. దానా మఝి భార్య అమన్‌గడై టీబీ వ్యాధి ముదిరి భవానీపట్నాలోని ఆస్పత్రిలో మృతి చెందింది. కాయాన్ని తీసుకెళ్లేందుకు అతని దగ్గర పైసా లేదు. ఎంతగా వేడుకున్నా, శవాన్ని తిరిగి స్వగ్రామం తీసుకెళ్లేందుకు పాడెగానీ, అంబులెన్స్‌గానీ ఆస్పత్రివారు ఏర్పాటు చేయలేదు. గత్యంతరం లేక దుప్పటి చుట్టిన శవాన్ని భుజాన వేసుకుని భార్య అంతిమ యాత్ర ప్రారంభించాడా భర్త. తల్లి మరణంతో పెల్లుబికి వస్తున్న దు:ఖాన్ని, కన్నీళ్లను ఆపుకోలేక అలాగని వీధుల్లో మనసారా ఏడవడానికి కూడా నోచుకోని కూతురితో కలిసి 60 కిలోమీటర్ల దూరంలో వున్న స్వగ్రామం బయల్దేరాడు. తండ్రీ కూతుళ్ల కన్నీటి యాత్రను జనం అలా నిలబడి చూశారేగానీ స్పందించే మనసే కరవైంది. ఇక మనసులేని ప్రభుత్వం సంగతి చెప్పేదేముంది?!

|| కడ ప్రయాణం ఇంత కష్టమా ||

ఎనభయ్యేళ్ల వితంతువు సలమాని బెహ్రా. ఇటీవల బాలాసూర్‌ దగ్గర సోరో రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక గూడ్సు రైలు గుద్దడంతో చనిపోయింది. అన్నేళ్ల జీవితానుభవంలో ఎన్నో చావులను, చివరి ప్రయాణాలనూ చూసి వుంటుంది కానీ తన కడ యాత్ర ఇంత అమానుషంగా వుంటుందని ఆమె కలలో కూడా అనుకొని వుండదు. రైలు పట్టాల మీద పడున్న ఆమె శవాన్ని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు చేర్చారు.
అక్కడి నుంచి పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి చేర్చాలి. అయితే అధికారులు అంబులెన్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో శవాన్ని గుడ్డలో చుట్టి వెదురు బొంగుకు కట్టేసి తీసుకెళ్లారు. ఇదంతా ఒక ఎత్తయితే, సుళువుగా మోసుకెళ్లేందుకు వీలుగా ఓ వ్యక్తి తన కాళ్లతో శవం కాళ్లు విరగ్గొట్టి మూట కట్టడమే మనసును తొలిచేస్తుంది. ఇలా కూడా జీవితం వెళ్లమారిపోతుందా అనిపించకమానదు. యాదృచ్ఛికమే అయినా ఈ ఘటన సైతం ఒడిషాలోనే జరిగింది.

|| వరదలో ప్రసవయాసం ||

వానొచ్చినా, వరదొచ్చినా పురుటి నొప్పులు ఆగవు. మధ్యప్రదేశ్‌ను వరద నీరు చుట్టిముట్టిన తరుణంలో టిమారిహ గ్రామానికి చెందిన సంధ్యా యాదవ్‌కు ప్రసవ వేదన మొదలైంది. ఆస్పత్రికెళ్లడానికి ఆటోలూ లేవు. ఎన్నిసార్లు పిల్చినా అంబులెన్సూ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఇటీవలే జనని అంబులెన్సుల సేవలను ప్రారంభించింది. నెలలు నిండిన మహిళలను ఉచితంగా ఆస్పత్రికి తీసుకెళ్లడం, ప్రసవానంతరం తిరిగి ఇంటికి చేర్చడం కోసమే వాటిని కేటాయించింది. అయితే అదేమీ సంధ్యకు అక్కరకు రాలేదు. ముగ్గురు మహిళలను తోడు చేసుకుని మోకాళ్ల లోతు వరద నీటిని 6 కిలోమీటర్ల దూరం పంటి బిగువున ఈదుకుంటూ వెళ్లాకే ఆటో దొరికింది. అక్కడి నుంచి చత్తర్‌పూర్‌ ఆస్పత్రికి చేరుకుని ఆడపిల్లకు జన్మనిచ్చింది. అలా తల్లీ బిడ్డా సురక్షితంగా బైటపడ్డారు కాబట్టి సరిపోయింది. వరదనీళ్లలో నడిచేటప్పుడు నొప్పులెక్కువై బిడ్డ బైటపడితే దిక్కెవరు?!
  ఇలాంటి దుర్ఘటనలు మన రాష్ట్రంలోనూ తక్కువేం కాదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని బొడ్డగండికి చెందిన గర్భిణి సాదల మణిమ్మకు పురిటి నొప్పులు రావడంతో ఏడు కిలోమీటర్ల మేర జట్టీపై ఆమెను బంధువులు తీసుకొచ్చారు. చివరికి 108 సిబ్బందికి సమాచారం అందించి ఆస్పత్రికి తరలించారు.

|| కన్నవాళ్లే కాదన్నారు ...||

ఇద్దరు చిన్నారులు. ఒకరికి 3, మరొకరికి 8 సంవత్సరాలు. వీరికి ఓ తమ్ముడు. వాడిని తీసుకుని అమ్మ ఎప్పుడో ఇంట్లోంచి వెళ్లిపోయింది. నాన్న వాయవ్య ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో కార్మికుడు. తాగుబోతు. ఒకరోజు ఆ చిన్నారులిద్దరినీ గదిలో పెట్టేసి తాళం వేసి వెళ్లిపోయాడెక్కడికో! తినడానికి తిండిలేదు. తాగడానికి నీళ్లు లేవు. నాన్న వస్తాడని ఆకలి తీరుస్తాడని ఎదురు చూసీ చూసీ అలసిపాయాయా నాలుగు పసి నేత్రాలు. నేలమీదే దుప్పటి చుట్టుకుని వుండిపోయారు. గదిలోంచి దుర్వాసన రావడంతో కిటికీ లోంచి చూసిన ఇంటి యజమానికి దయనీయ పరిస్థితుల్లో పడున్న చిన్నారులు కనిపించారు. క్రిమికీటకాల కారణంగా వారి శరీరాలపై లోతైన గాయాలయ్యాయి. ప్రస్తుతానికి న్యూఢిల్లీలోని హిందూరావ్‌ అస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో వున్న వారికి కొద్ది రోజుల్లో ఒంటిపైనున్న గాయాలు మానవచ్చు కానీ మనసుకైన గాయాల మాటేవిటి?!

|| నాన్న భుజాల మీదే చివరి శ్వాస ||

ఒళ్లు తెలీని జ్వరంతో బాధపడుతున్న పన్నెండేళ్ల కొడుకుని భుజాన వేసుకుని ఆస్పత్రికెళ్లిన తండ్రికి జీవితాంతం మరవలేనంత దు:ఖాన్ని మాత్రమే ఇచ్చింది మన వైద్య వ్యవస్థ. కాన్పూర్‌కి చెందిన సునీల్‌ కుమార్‌ కుమారుడు అన్షు. ఎప్పుడూ క్లాసులో ఫస్టుండే ఆ చిన్నారికి జ్వరం రావడంతో మొదట ఫజల్‌గంజ్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూయించాడు తండ్రి. రెండు రోజులైనా జ్వరం తగ్గకపోగా పెరగడంతో లాలా లజపతిరారు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. జ్వరంతో సోయ లేకుండా పడున్న పసివాడికి అత్యవసర సేవలందించి ప్రాణాలు నిలపాల్సిన వైద్యులు ఆ చిన్నారిని పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పి మిన్నకుండిపోయారు. అక్కడికి 250 మీటర్ల దూరంలో వున్న ఆస్పత్రికి వెళ్లడానికి కనీసం స్ట్రెచర్‌ ఇమ్మని అధికారుల కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. అంబులెన్సూ లేదు. భుజన మోసుకెళ్లినా కొడుకును కాపాడుకోలేకపోయాడు. ఆస్పత్రికెళ్లేసరికే పసివాడు కన్నుమూశాడు. కొడుకు శవాన్ని భుజాన వేసుకునే తిరుగు ప్రయాణమయ్యాడా బీద తండ్రి. ఎవ్వరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. పది నిమిషాల ముందుగా తీసుకొచ్చినట్టయితే చిన్నారి ప్రాణాలు కాపాడేవారమన్న వైద్యుల మాట అతన్ని జీవితాంతం వెంటాడుతూనే వుంటుందేమో!     ఇంతకీ... ఈ ఘటనలకు బాధ్యులెవరో!?

No comments:

Post a Comment