Monday, 1 August 2016

||బంద్‌తో బుద్ధి చెప్పాలి||
                 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఇన్ని రోజులూ కనీసం దింపుడుకళ్లం ఆశలన్నా ఉండగా, శనివారం రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆ ఆశలు సైతం లేకుండా చేశారు. రెండు రోజుల సుదీర్ఘ చర్చలో బిజెపి మినహా దాదాపు అన్ని పార్టీలూ ఎపికి హోదా ఇచ్చి న్యాయం చేయమని ముక్త కంఠంతో డిమాండ్‌ చేశాక కూడా విత్త మంత్రి ససేమిరా కుదరదన్నారు. జైట్లీ ఎంతగా తిరగేసి మరగేసినా ఎపికి కేంద్రం అన్యాయం చేసిందని స్పష్టమైపోయింది. కేంద్రం హోదా ఇచ్చేది లేదని తేల్చేశాక సహజంగానే అందరి వేళ్లూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైపు గురి పెట్టబడ్డాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని ఇంతకాలం ఆ పార్టీ చెబుతూ వచ్చింది. ఎన్నికల ఒడంబడికకే పరిమితం కాకుండా పైన కేంద్రంలో, కింద రాష్ట్రంలో టిడిపి, బిజెపి అధికారం పంచుకొని రెండేళ్లుగా ఎంచక్కా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలపై పూర్తిగా యుటర్న్‌ తీసుకొని, విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టి, రాష్ట్రాన్ని నట్టేట ముంచిన బిజెపితో చెలిమిపై టిడిపి అనివార్యంగా తన వైఖరి వెల్లడించాల్సిన సమయం వచ్చింది. అయినా ఇప్పటికీ అధికార టిడిపి, ముఖ్యమంత్రి చంద్రబాబులో కనీసం ప్రాయశ్చిత్తం కలగకపోవడాన్ని చూస్తుంటే అవకాశవాద రాజకీయాలు పరాకాష్ట దశను కూడా దాటిపోయాయని అర్థమవుతుంది. సమీక్షలు, సమావేశాలతో రెండు రోజులపాటు చంద్రబాబు ఎడతెరపి లేకుండా హడావుడి చేసి గతంలో ఎలాంటి విన్యాసాలు చేశారో వాటినే నేటికీ కొనసాగిస్తున్నారు. హోదాపై జైట్లీ ప్రకటన తనకు బాధ కలిగించిందంటున్న పెద్దమనిషి ఇంకా కేంద్రంతో ఓపికగ్గా మసులుకుంటామంటున్నారు. సంయమనంతో నిధులు అడుక్కుంటామని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని బిజెపి పెద్దల పాదాక్రాంతం చేస్తున్నారు. బయట ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కేంద్రంపై పోరు సల్పుతున్నట్లు ఫోజు పెట్టి, అంతర్గత భేటీల్లో నోరు జారవద్దని, సంయమనం పాటించాలని హితబోధలు చేయడం ఏ ప్రయోజనాల కోసం?
సుదీర్ఘ రాజకీయ, పాలనానుభవం తనకే స్వంతమని తరచూ భుజకీర్తులు తగిలించుకునే చంద్రబాబు కనీస ప్రజాతంత్ర విలువలను సైతం తుంగలో తొక్కుతున్నారు. వరుసగా పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండగా నిరాహారదీక్షలు, బంద్‌లు, హార్తాళ్లు తదితర ఆందోళనలు నిర్వహించిన బాబు, ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే దాన్నీ తప్పుబడుతున్నారు. బంద్‌ల వలన ప్రభుత్వ ఆస్తులు ధ్వసం అవుతాయని నియంతలా మాట్లాడుతున్నారు. బంద్‌ అంటే విధ్వంసమనే అర్థం వచ్చేలా ముఖ్యమంత్రే మాట్లాడితే పోలీసులు ఊరుకుంటారా? సిఎం వ్యాఖ్యలు ముందస్తు అరెస్టులు, నిర్బంధాల వంటి నిరంకుశ చర్యలు చేపట్టమని ఖాకీలకు పరోక్షంగా సంకేతాలివ్వడంగానే భావించాలి. ప్రభుత్వం ఏదేని ముఖ్య కార్యక్రమం చేపట్టే పక్షంలో దానిలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వివిధ గ్రూపులకు భాగస్వామ్యం కల్పించడం ప్రజాస్వామ్య ముఖ్య లక్షణం. రాజధాని నిర్మాణం మొదలుకొని దేనిపైనా బాబు సర్కారు అఖిపక్ష సమావేశాలు నిర్వహించకుండా ఒంటెద్దు పోకడ పోవడం అభ్యంతరకరం. తాజాగా కేంద్రం హోదా విషయంలో విశ్వాస ఘాతుకానికి పాల్పడినప్పుడు ప్రజల విస్తృత ప్రయోజనాల పరిరక్షణకు అందరినీ కలుపుకొని పోరాటం చేయడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. కాగా హోదాపై అఖిపక్షం నిర్వహించి ఢిల్లీకి తీసుకుపోవాలని విపక్షాలు అడిగితే అది దండగమారి పని అని సిఎం అవహేళన చేయడం ఆందోళనకరం. కేవలం తమ ఎంపీలు మాత్రమే ప్రధానిని కలుస్తారనడంతో బిజెపి, టిడిపి మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
రాజ్యసభలో హోదా అంశం ప్రహసనంగా తయారైందని బిజెపి, టిడిపి, కాంగ్రెస్‌ వ్యవహారశైలి కళ్లకు కట్టింది. మార్చిలో కాంగ్రెస్‌ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టగా చర్చ, ఓటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. జూలై 22న ఎజెండాలో ఉండగా వ్యూహం ప్రకారం వేరే అంశంపై బిజెపి సభ్యులు సభలో ఆందోళన చేసి రాకుండా చేశారు. ప్రతిపక్షాలు పట్టుబట్టేసరికి ద్రవ్య బిల్లు కనుక ఓటింగ్‌కు అవకాశం లేదన్నారు జైట్లీ. విపక్షాల ఆందోళనలతో స్వల్ప వ్యవధి చర్చకు అనుమతించి శక్ర, శని వారాల్లో చర్చించారు. చర్చ సందర్భంగా ప్రభుత్వం హోదా ఇచ్చేది లేదని తేల్చేయగా, భాగస్వామ్య పార్టీ టిడిపి సభ్యుడు హోదా అనేది వ్యాధిగా మారిందని ప్రజల ఆంకాక్షలను కించర్చారు. చర్చకు పట్టుబట్టిన కాంగ్రెస్‌ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయకుండా వాకౌట్‌ చేశారు. పైగా ప్రైవేటు బిల్లు ఇంకా ఉనికిలో ఉందంటున్నారు. బిజెపి, కాంగ్రెస్‌ తలుచుకుంటే పార్లమెంట్‌లో ఏ చట్టమైనా చేయొచ్చు. అలాంటప్పుడు ఇద్దరూ కలిసి ఇచ్చిన హోదా హామీ అమలుకు అడ్డెవరు? పైగా దాదాపు అన్ని పార్టీలూ ఇవ్వమనే చెప్పాయి. బిజెపి, టిడిపి, కాంగ్రెస్‌ ఈ మూడు పార్టీల దోబూచులాటపై ప్రజలే తిరగబడాలి. హోదా సాధనకై ఉద్యమించాలి. ఆగస్టు 2న జరిగే బంద్‌లో ఆబాలగోపాలం పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి.          (ప్రజాశక్తి )

No comments:

Post a Comment