''గెలుపు గొప్ప కాదు. విలువల నిచ్చెనలో ఎక్కడ నిలిచామన్నది మహనీయ మూర్తిమత్వానికి నిదర్శనం''-సాపేక్ష సిద్ధాంతకర్త అల్బర్ట్ ఐన్‌స్టీన్. ప్రజాప్రతినిధులలో నేరగాళ్ళు, నీతిబాహ్యులూ ఉన్నారు. ప్రజలను దోచుకుంటున్నారు. అధికారం కోసం నీచకార్యాలకు ఒడిగడుతున్నారు. ఇవి మన రాజ్యాంగ నిర్మాతలు ఊహించని పరిణామాలు.
|| చట్టసభల్లో నేర చరితులు ||
నేర చరితులకు ఉద్యోగమివ్వరు. అసాంఘిక శక్తులతో సహజీవనం చేసే పోలీసులిచ్చిన నివేదికలతో ఇచ్చిన ఉద్యోగాలను కూడా పీకేస్తారు. అయితే నేరగాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు కావచ్చు! నిఘాలు, నివేదికలు, ఊడబీకుళ్ళకు వీరు అతీతులు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, నేరాల చిట్టాలతో లిఖిత వాంఙ్మూలాలను ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. దాయడానికి వీలులేని వివరాలే ఈ చిట్టాలలో ఉంటాయి. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఎడిఆర్) ఈ వాంఙ్మూలాలను విశ్లేషించి అనేక నివేదికలిచ్చింది. 2013, అక్టోబర్‌లో ఇచ్చిన నివేదిక ప్రకారం 162 మంది ఎంసీలు, 1,200 మంది ఎమ్మెల్యేలు నేరచరితులు. అతి గంభీర నేరారోపణలున్న పది మంది రాజకీయ నాయకులలో అద్వానీ, రాజ్‌నాథ్ సింఫ్‌ు, అమిత్ షా, వరుణ్ గాంధీ, గోపీనాథ్ ముండే, ఒవైసి సోదరులు, పి కరుణాకరన్, రషీద్ మసీద్, అధిర్ రంజన్ చౌధరి, నవజోత్ సింగ్ సిద్ధు ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఓంప్రకాశ్ చౌతాలా, బంగారు లక్ష్మణ్, జయలలిత, కరుణానిధి, కనిమోళి, ఎ రాజా, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, నితిన్ గడ్కరి, శరద్ యాదవ్ తీవ్ర ఆర్థిక కుంభకోణాలలో మునిగిన రాజకీయ ప్రముఖులు.
16వ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో నేరచరితులున్నారు. 78 మంది దేశ మంత్రులలో 24 (31 శాతం) మంది మీద క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 8 (18 శాతం) మంది కేసులు చాలా తీవ్రమైనవి. కొత్తగా ఎంపీలైనవారిలో నేరస్తులు 34 శాతం. 2004, 2009 లోక్‌సభలలో ఈ సంఖ్య వరుసగా 24 శాతం, 30 శాతం. మొత్తం నలుగురు ఆర్జెడి సభ్యులు, 18లో 15 మంది శివసేన సభ్యులు, ఐదుగురిలో నలుగురు ఎన్‌సిపి సభ్యులు, కొత్తగా ఎన్నికైన వారిలో 33 శాతం బిజెపి, 18 శాతం కాంగ్రెస్ సభ్యులు నేరచరితులే. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ సభ్యులు అధిక నేరచరిత గలవారు. నిరూపించబడితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సభ్యత్వానికే అనర్హత కాగల గంభీర నేరాలను ఎదుర్కొంటున్న సభ్యులు 16వ లోక్‌సభలో 53 మంది ఉన్నారు. వీరిలో 24 మంది అధికార బిజెపి సభ్యులు. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, ఉమా భారతి, నవజోత్ సింగ్ సిద్ధూలపై కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. వివిధ రాష్ట్రాల అధికార పక్షీయులు 34 శాతం నేరగాళ్ళే. వీరిలో 210 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 113 మందిపై హత్య, మనుషుల అపహరణ, అత్యాచారాల వంటి ఘోరమైన కేసులున్నాయి. మహిళలపై 13 క్రిమినల్ కేసులతో దేవినేని ఉమామహేశ్వరరావు దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. నేరస్తులు కాని వారి కంటే నేరస్తులైన వారికే రెట్టింపు విజయావకాశాలున్నాయని ఎడిఆర్ విశ్లేషించింది. అందుకే అధికార పార్టీలలో నేరస్తులు అధికం. ''న్యాయవ్యవస్థ ద్వారా కళంకిత సభ్యులను పార్లమెంటు నుంచి ఊడ్చిపారేస్తాను'' అని ప్రధాని కాగానే మోడీ రాజ్యసభలో హూంకరించారు. ఈ ఊడ్చిపారేసే ప్రక్రియ ప్రారంభమే కాలేదు.
|| విలువలు కోల్పోయిన రాజకీయాలు ||
స్వాతంత్య్రం తర్వాత 10, 15 ఏళ్ళ దాకా దేశభక్తి, దేశ సమైక్యత, సమగ్రతలు నాయకుల ఆశయాలు. న్యాయవాదులు, సామాజిక న్యాయ నిపుణులు రాజకీయాలలో పాల్గొనేవారు. శ్రామికులు, రైతులు, పేదలు, వెనుకబడిన తరగతుల కోసం పాటుపడేవారు. పరిస్థితి క్రమేపీ మారింది. దేశభక్తి మాయ మైంది. స్వార్థం పెరిగింది. రాజకీయాలలో వ్యాపారవర్గం పాత్ర గణనీయంగా పెరిగింది. తొలుత, ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి గుత్తపెట్టుబడిదారులు పబ్బం గడుపుకునేవారు. తర్వాత తమ తాబేదారులను గెలిపించుకునే వారు. ఇప్పుడు వారే ప్రజా ప్రతినిధులు. ఫలితంగా కార్పొరేట్ సంస్థల అధిపతులు, అక్రమ సంపాదనాపరులు, సారా వ్యాపారులు, సమాజ వ్యతిరేకులు ప్రజాప్రతినిధుల య్యారు. ఏడు దశాబ్దాల ''స్వతంత్ర'' భారతంలో జనాభా ప్రాతిపదికన మహిళా ప్రాతినిధ్యం సాధించబడలేదు. పుచ్చులు, కుళ్ళులు మాత్రమే ప్రజలకు ప్రత్యామ్నాయమయ్యాయి. ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది. కులం, డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే వారేగాక వారి సంతానం, మనుమలు కూడా భోగభాగ్యాలతో జీవించడానికి, ఎన్నికలలో నెగ్గడానికి సరిపడేంత డబ్బు సంపాదించుకుంటున్నారు. అర్హతలు అవసరం లేని కుటుంబ, వారసత్వ రాజకీయాలు పెరిగాయి. మేధావులు, వృత్తి నిపుణులు, కళాకారులు, సామాజిక శాస్త్రవేత్తలు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేరు. పాల్గొనే ఆసక్తి ఉండదు. అయినా ప్రజాప్రయోజనాలను కాపాడే శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు, ప్రణాళికలు వీరి సొంతం. అందుకే వీరిని ఎగువసభలకు ఎన్నుకునే, నియమించే అవకాశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ అధికారపక్ష మద్దతుదారులు, ఎన్నికల్లో ఓడిన నాయకులు, అధికార పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టగల ''ప్రముఖులు'', నోట్లు ఇవ్వగల వాణిజ్యవేతలు ఈ సభలకు పంపబడుతున్నారు. ప్రజలు తిరస్కరించినవారు, ప్రజా సంబంధాలు లేనివారు ప్రజాప్రతినిధులు, మంత్రులు!? ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో వీరి సంఖ్య గణనీయంగా ఉంది. అందుకే ప్రజా శ్రేయస్సు ఎండమావిలో నీరయింది. కొందరు నాయకులు అధికారం అందగానే తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. గుత్తేదారుల నుంచి వాటాల శాతాలు సరేసరి. వారి సంతానం తమ వృత్తులు మాని మామూళ్ళు, కమిషన్లు వసూలు చేస్తున్నారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరంటారు. ఇది అవకాశవాద ముసుగు. ప్రతిపక్షంలోనే గాక స్వపక్షంలో కూడా శత్రువులుంటారు. అయినా పెట్టుబడిదారీ పార్టీలు పరస్పరం సహకరించు కుంటాయి. తప్పెవరిది? ఓటుకు డబ్బిచ్చిన వారిదా, పుచ్చుకున్న వారిదా? ప్రజలు ఓట్లు అమ్ముకుంటున్నారు. వారికి ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు లేదు అని తరచూ వినిపించే వ్యాఖ్యానం. ఎన్నికల్లో పోటీ చేసేవారు విజ్ఞులు, యోగ్యులు, ధనవంతులు, చదువరులు, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించవలసిన వారు. ఎక్కువమంది ఓటర్లు పేదలు, విద్యాహీనులు, అమాయకులు, ఓటు విలువ, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు తెలియని వారు. 'ఓటుకు నోటు' నేపథ్యంలో కొందరు విద్యావంతులు, ఉద్యోగులు కూడా ప్రలోభాలకు గురయ్యారు. అధికారాన్ని ఆశించి, లాభాపేక్షతో, దురాశతో ఓటర్ల బలహీనతలను వాడుకొని ఓట్లు కొనడం నేరం. శాసనమండలికి పోటీ చేసే ఉపాధ్యాయులు, పట్టభద్రులు కూడా కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అధికారాలను, ఆదాయాలను, సామాజిక ప్రాముఖ్యత లను ఆశిస్తున్న కొత్త కోటీశ్వరులు అనేక అవకతవకలతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తనిఖీలను తప్పించుకోవడానికి పోలీసులకు లంచాలిస్తున్నారు. తమ సహాయకులైన ఉపాధ్యాయుల, ఉద్యోగస్తుల ఇళ్ళను కేంద్రాలుగా చేసుకొని డబ్బు, వస్తువులు పంచుతున్నారు. నోట్లు ఇవ్వలేదని ఓట్లు వేయని ఉపాధ్యాయులున్నారు. 'గురువులే లఘువులయితే!? తప్పు నేర్పినవారిదా, నేర్చుకున్నవారిదా?' సామాజిక స్పృహ, దృక్పథం, బాధ్యతలను మాయం చేసి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించిన పాలకులదే తప్పు.
|| తగ్గిన జాతీయ భావం ||
భారతీయులు మతం, కులం, జాతి, ప్రాంతం, భాషల ఆధారంగా విభజించబడ్డారు. ఈ విభజన జాతీయ భావానికి తూట్లు పొడిచింది. జాతీయ పాలక పార్టీలు ఈ అంశాలను అశ్రద్ధ చేశాయి. ఫలితంగా రాష్ట్రాల, ప్రాంతాల ఆసక్తులు, అభిరుచులు, ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. ప్రతిఫలనంగా ప్రాంతీయ, కుల పార్టీలు పుట్టాయి. వీటికి జాతీయ దృక్పథం, అంతర్జాతీయ అవగాహన తక్కువ. ఈ పార్టీలు పలు సందర్భాల్లో పార్లమెంటులో నిర్ణాయక శక్తిని సంతరించుకున్నాయి, పాత్రను పోషించాయి. దీనితో పాలనలో దేశ భద్రత, సమాఖ్య స్వభావం, ఐక్యత, సమగ్రతా భావాలు వెనుకంజ వేశాయి. భాషా ద్వేషాలు, ప్రాంతీయ దురభిమానాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రహసనం పాలనా వాసిని పలుచన చేసింది. అవినీతిని, ధనాసక్తి రాజకీయాలను, కుంభకోణాల పుట్టలను పెంచింది. ఆధునికతతో పాటు ఆధ్యాత్మికతా పెరిగింది. దేవతలు సర్వపాపహ రులన్న ప్రచారాలు ఎక్కువయ్యాయి. నేరాలు పెరిగాయి. నీతినియమాలు, నిబంధనలు, విలువలు గాలిలో కలిశాయి. ప్రభుత్వాలు, మతాలయాలు-దేవదూతలు, బహుళజాతి సంస్థలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయి. కనుచూపు మేరలో కనుపించని సామాజిక విప్లవమే పరిష్కారం. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే మన కర్తవ్యం.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి


No comments:
Post a Comment