అహ్మదాబాద్ నుంచి ప్రారంభమై ఉనాలో గొప్ప సభతో ముగిసిన దళిత అస్మితా యాత్రలో 'జై భీమ్, స్వాతంత్య్రం, స్వాతంత్య్రంÛ' అనే రెండు నినాదాలే ప్రముఖంగా వినిపించాయి. ఈ యాత్రలో అసాధారణమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇది ఐచ్ఛికంగా ప్రారంభమై, అహింసాపూరితమైనదని బహిరంగంగా ప్రకటించబడిన యాత్ర. దీనికి ఏ విధమైన రాజకీయ అనుబంధాలు లేవు. సామాన్య ప్రజలు పెద్దసంఖ్యలో దీనికి మద్దతు తెలిపారు. యాత్ర సాగిన దారిలోని గ్రామాలలో బహిరంగసభలు జరిపారు. ఈ సభలలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గుర్తింపు పొందిన నాయకులుగానీ, వక్తలుగానీ లేరు. అతికొద్ది బడ్జెట్తో నిర్వహించిన ఈ యాత్రలో అనేక గ్రూపులు ఒకచోటికి చేరి-ట్రేడ్ యూనియన్లు, యువజన సంఘాలు, దళిత పోరాట సమితులు, కార్మికసంఘాలు, వ్యక్తిగతంగానూ-పాల్గొన్నాయి. ఇందులో పాల్గొన్నవారిలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చినవారున్నారు. పంజాబ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో దళితులపై అదేపనిగా జరుగుతున్న దాడులకు తక్షణ ప్రతిస్పందనే ఈ యాత్ర. రాజుల గ్రామంలో ఒక దళితుడు, దళితేతరురాలైన ఆయన భార్య హత్య చేయబడ్డారు. మరో గ్రామంలో ఒక దళిత బాలుని సజీవ దహనం చేశారు. చనిపోయిన ఆవు చర్మం ఒలుస్తున్నందుకుగానూ జులై 11న ఉనా పోలీస్స్టేషన్ ఎదుట ప్రజల సమక్షంలో నలుగురు దళితులను బట్టలూడదీసి కారుకు కట్టివేసి గంటల తరబడి కొట్టారు. ప్రజలలో వ్యక్తమైన నిరసన చివరకు ప్రధాని ఈ అంశంపై మాట్లాడే అరుదైన పరిస్థితిని కల్పించింది. 30 మందికి పైగా దళితులు ఆత్మహత్యకు ప్రయత్నించటమో, చనిపోవటమో జరిగింది. బస్సులపై రాళ్ళురువ్వటంతో గుజరాత్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈ ప్రాంతానికి బస్ సర్వీస్లను రద్దుచేసింది.
|| విప్లవకర మార్గంలో ||
ప్రభుత్వం ఏ విషయాన్నీ యథాతథంగా జరగటానికి వదలలేదు. రెండు బస్సులలో రాష్ట్ర సాయుధ రిజర్వు పోలీసులు అహ్మదాబాద్ నుంచి యాత్రను అనుసరించి వచ్చారు. ప్రతి గ్రామంలోనూ స్థానిక ప్రజలు యాత్రలో పాల్గొంటున్నవారిని సాదరంగా ఆహ్వానించారు. హింసను రెచ్చగొట్టేలా కాకుండా ఉపన్యాసాలు ప్రశాంతంగా సాగాయి. ఇక నుంచి చనిపోయిన ఆవులు, ఇతర జంతువుల చర్మం ఏ ఒక్కరూ ఒలవకూడదని ప్రతి సభలోనూ బహిరంగంగా ప్రమాణం చేశారు. ప్రభుత్వం భూములివ్వాలనే డిమాండ్ సభలలో వచ్చింది. ప్రతి గ్రామంలోనూ ప్రజలు ప్రదర్శనలు చేశారు. ఇతర కులాల ప్రజలు ఈ యాత్రను ఆసక్తిగా తిలకించారు. యాత్రలో వ్యక్తమైన గ్రూపు సమైక్యత స్థానిక దళితులలో విశ్వాసాన్ని పెంచటానికి ఉపయోగపడింది. అమానవీయమైన, అవమానకరమైన ఘటనలు జరుగుతున్న క్రమంలో అహింసాపూరితంగా, శాంతి యుతంగా యాత్ర జరగటం చెప్పుకోదగిన అంశం. మరికొన్ని అంశాలపై మైక్లేకుండా, అనధికారికంగా చర్చలు జరిగాయి. ప్రతిరోజూ అవమానాలకు గురవుతున్నామని మహిళలు ఫిర్యాదులు చేశారు. ఏ ధాబా హోటల్లోనూ తమకు గ్లాసులలో టీ ఇవ్వకపోవటంతో తమ గ్లాసులను తీసుకెళుతున్నట్లు వారు చెప్పారు. నీళ్ళు తోడుకునేందుకు బావులలో తమ పాత్రలను ఉపయోగించే వీలులేదని చెప్పారు. పొరపాటున ఇతర మహిళ వారిని ముట్టుకుంటే ఆ మహిళ తన చేతులను నీటితో శుభ్రంగా కడగాలి. చనిపోయిన జంతువుల చర్మాలను ఒలవటానికి వారి కుటుంబాలు తిరస్కరిస్తే వారు స్థానిక పెత్తందారుల ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది. వారు చర్మం ఒలిచినట్లయితే గోరక్షకుల దాడులను ఎదుర్కోవలసి వస్తున్నది. భయానకమైన పరిస్థితులలో జీవిస్తున్నామని వారు చెప్పారు. వివక్షను అంతం చేయాలని వారు కోరారు. అందరిలాగే తాము మనుషులం కామా, తమ నరాల్లో రక్తం ప్రవహించటం లేదా అని వారు ప్రశ్నించారు. ఏ విధమైన భయంగాని, సందేహంగాని లేకుండా తమ అభిప్రాయాలను దృఢమైన స్వరంతో చెప్పారు. ప్రతీకారం కాదు న్యాయం కావాలని వారు కోరారు.
కనీసం పదో తరగతి వరకైనా చదువుకుని ఉండటంతో ఎక్కువ మంది యువకులలో ఉద్యోగాలు కావాలనే ఆసక్తి పెరిగింది. భూమి కావాలని, అది వ్యవసాయ ఆదాయంతో పాటు సామాజిక హోదానిస్తుందని వయసు పైబడినవారు చెప్పారు. వారనుభవిస్తున్న అత్యాచారాలను గురించి ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు. ఎవరితోనూ పోరాడాలని తాము భావించటం లేదని వారు చెప్పారు. యాత్ర తర్వాత ఏం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. ఉద్యమం వెనుకపట్టు పడుతుందా? ఉన్నత విద్యావంతులైన యాత్ర నాయకులు ఆ విధమైన అభిప్రాయంతో లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఉదహరిస్తూ కులవ్యవస్థ పునాదులు, దాని రూపాలను గురించి చర్చించారు. పూర్తిగా మార్పు రావాలన్న కోరికను వారు బహిరంగంగా వ్యక్తం చేశారు. గాంధీ మహాత్ముడు, కమ్యూనిస్టులు, పట్టణాలలో ఉండే మేధావులైన ఉదారవాదులతో వారు ఏకీభవించలేదు. ఇవి మేధో చర్చకు సంబంధించిన ఆటంకాలు మినహా కలిసి పనిచేయటానికి ఏ మాత్రం ఆటంకం కాలేదు. హిందూ మతం దళితులకు వ్యతిరేకంగా తీవ్రమైన వివక్షను అమలు చేయటంతో ఆ మతంలో ఏ మాత్రం మంచిలేదని వారు అవగాహన చేసుకున్నారు. వీరి భావాల పట్ల సానుభూతితో ఉన్న సాధారణ హిందువు కూడా కొద్దిపాటి సంస్కరణలు సరిపోతాయని భావిస్తున్నాడు. హిందూవాదం నుంచి ఏ మంచీ జరగదని దళితులు భావిస్తున్నారు. భారతదేశంలో లోతుగా ఉన్న ఈ గండిని ఏ మాత్రం పక్షపాతం లేకుండా పూడ్చటానికి మన సమాజం మార్గాలను అన్వేషించాలని వారు కోరుతున్నారు. హిందూ మతానికి నాయకత్వం వహిస్తున్నవారు, గురువులు వివక్షపై బహిరంగంగా క్షమాపణలు చెప్పటం, అది హిందూ వ్యతిరేకమైనదని బహిరంగంగా అంగీకరించటం మంచి ప్రారంభంగా ఉండగలదు.
|| అర్థవంతమైన మార్పు దిశగా ||
గ్రామాలలోని సాధారణ దళితులు పోరాటానికి సిద్ధంగా లేరని యాత్రకు నాయకత్వం వహిస్తున్నవారు అర్థంచేసుకున్నారు. కానీ రోజువారీగా తామనుభవిస్తున్న వివక్ష, అణచివేతకు సంబంధించి లెక్కలేనన్ని అనుభవాలను గురించి వారు వివరిస్తున్నారు. దళిత కులాన్ని సూచించే పేరు పెట్టుకొని గ్రామంలో లేదా కార్మికవర్గం నివసించే ప్రాంతంలో ఆరు నెలల పాటు నివసించాలని అగ్రవర్ణానికి చెందిన వ్యక్తిని ఒక దళితుడు సవాల్ చేశాడు. నువ్వు నీపేరు చెప్పటంతోనే ఎదుటి వ్యక్తి ముఖంలోని భావాలు మారతాయి. ఆ విధమైన పేరుతో నువ్వు బతికితే దళితులంటే ఏమిటో నీకు అర్థమవుతుందని చెప్పాడు. భౌతిక, సామాజిక, మానసికమైన అనేక రంగాలలో అభివృద్ధి కోసం పోరాడటం ద్వారానే మార్పును సాధించగలమని నాయకుల భావనగా ఉంది. మొదటి రెండింటిని గురించి వింటున్నప్పటికీ ఉన్నత కులాలలో తామే గొప్ప అనే భావన, దళితులలో తాము తక్కువవారమనే భావన కనిపిస్తున్నది. మానవశక్తి సామర్థ్యాలను నువ్వు పూర్తిగా అభివృద్ధి చేసుకోలేనంత కాలం సమాజం నిన్ను తక్కువవాడిగానే చూస్తుందని వారు చెప్పారు. బయటి నుంచి వచ్చి హితోపదేశాలు చేసేవారిని వారొక సాధారణ ప్రశ్న అడిగారు. ''మీరు ఇక్కడికి వచ్చి దళితులు సుచిగా ఉండాలని, సత్ప్రవర్తనతో ఉండాలని, కష్టపడి చదవాలని, ఇతర విషయాలను చెబుతున్నారు. సంస్కరించబడాల్సింది దళితులేనా? ఉన్నత కులాలలో మానసికంగా ఉన్న దురభిప్రాయాలను ఎవరు తొలగిస్తారు?'' అని ప్రశ్నించారు.
యాత్ర జరుగుతున్నంత కాలం వాతావరణం మారింది. కానీ మార్పు చాలా నిదానంగా వచ్చింది. యాత్రలో పాల్గొనాలంటున్నవారు ఇతర కులాల వారిని అవమాన పరుస్తున్నారని రాత్రివేళల్లో పుకార్లు వ్యాపింపజేశారు. ఉనాకు వెళ్ళే కొన్ని రోడ్లను దిగ్బంధించారు. కొన్ని చోట్ల పోలీసుల జోక్యం కూడా అవసరమైంది. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. దళిత అస్మిత యాత్ర నూతన సామాజిక మార్పులకు ప్రారంభంగా నిలుస్తుందా, అది ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుందా, నూతన కూటములు ఉంటాయా, నూతన సంఘటనల ఏర్పాటు, చివరి వరకు నిలిచే రాజకీయ పరిష్కారం జరుగుతుందా అనే ప్రశ్నలున్నాయి. గుజరాత్లో రాజుల గ్రామం నుంచి ఉనా వరకూ ఉన్న ప్రాంతం వేరుచేయబడి ఉంది. మిగతా ప్రాంతం ఫ్యాక్టరీలు, రహదారి రెస్టారెంట్లు, ఉన్నతవర్గాలు చదివే స్కూళ్ళు, రహదారులపై తిరిగే ఆవులు, పారిశ్రామిక సరుకులను రవాణాచేసే 30 అడుగుల పొడవున్న ట్రక్కులను చూస్తాము. ఈ ప్రాంతంలో భయంకరమైన రోడ్లు, అధ్వాన్నస్థితిలో ఉన్న కమ్యూనికేషన్ల వ్యవస్థ, విలాసవంతమైన జీవితం లేక అభివృద్ధి గురించిన అతికొద్ది సూచనలే కనిపిస్తాయి. ఇక్కడ భూస్వామ్య విధానం బలంగా ఉందని స్థానికులు చెబుతారు. రానున్న కొద్దినెలల్లో జరగనున్న పరిణామాలను గురించి దేశంలోని అభ్యుదయ ఉద్యమాలు, ప్రభుత్వం శ్రద్ధగా పరిశీలిస్తాయి. యాత్ర ద్వారా రూపుదిద్దుకున్న ఉద్యమం ఈ ప్రాంతంలోని దళితులను విముక్తిచేస్తే, వారికి అర్థవంతమైన ఉద్యోగాలు కల్పిస్తే రక్తపాతరహిత నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. ఉద్యమం ఎక్కువ కాలం నిలబడగల శక్తిపై విజయం ఆధారపడి ఉంటుంది. భౌతికంగా, సామాజికంగా, మానసికంగా, అన్ని విధాలైన బహిరంగ, అగోచర వివక్ష నుంచి సమాజాన్ని విముక్తిచేసే నిజమైన లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి.
ఎన్నికల రాజకీయాల వల్ల భూస్వామ్య, యథాతథవాద దృక్పథం పైచేయి సాధిస్తున్నది. దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అధికారంలో ఉన్న పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దాన్ని నివారించటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ముందుకుపోయి దళితుల డిమాండ్లను పరిష్కరించటానికి పూనుకుంటే దళిత ఉద్యమం విజయం సాధించటమేకాక, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. భారతీయులందరినీ వాస్తవంగా విముక్తి చేయాలంటే నిజమైన స్వాతంత్య్రం కావాలి. భారతీయులు స్వతంత్రంగా లేకుండా దేశం ఎలా స్వతంత్రంగా ఉంటుంది?
(వ్యాసకర్త: త్రిలోచన్ శాస్త్రి,
బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్)

బ్యూటిఫుల్ ఆర్టికల్ సర్ థాంక్యూ
ReplyDeleteబ్యూటిఫుల్ ఆర్టికల్ సర్ థాంక్యూ
ReplyDelete