Wednesday, 17 August 2016

## కాశ్మీర్ కు పరిష్కారమేది? ##


                కాశ్మీర్‌ సమస్యకు దారి తీసిన కారణాలు కనుగొనకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపడం అసాధ్యం. రోగ నిర్ధారణ చేయకుండా నివారణ చేయలేం కదా! మూలాలు అన్వేషించకుండా చేసే వైద్యం ఫలితాలివ్వడం సంగతి అలా ఉంచి ఒక్కోసారి వికటించే ప్రమాదం కూడా ఉంది. కాశ్మీర్‌లో అస్థిరత ఈ నాటిది కాదు. కొన్ని దశాబ్దాల చరిత్ర దానికి ఉంది. అక్కడ ఉగ్రవాదమూ కొత్తకాదు. ఉగ్రవాదులకు బయటి నుండి సహాయం అందడమూ, కొందరు స్థానికులు సహకరించడమూ రహస్యం కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న పరిస్థితులే అవి! ఇంత సంక్షుభిత పరిస్థితుల్లోనూ శాంతి కుసుమాలు విరబూసిన సందర్భాలూ ఉన్నాయి. గత ప్రధాని మన్మోహన్‌ హయాంలోనూ, అంతకు ముందూ దేశ చిత్రపటంపై సుందర కాశ్మీరం ఆవిష్కృతమైన దృశ్యాలనూ ప్రజానీకం చూసింది. తాజా ఘటనల్లో స్థానిక ప్రజల మనోభావాలను, వారి ఆవేదనను అర్థం చేసుకుని సామరస్యంగా పరిష్కరించడానికి బదులుగా ఘర్షణలు పెంచే వైఖరిని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవడమే ఉద్రిక్తతలు కొనసాగడానికి కారణం.
ఆరువారాల క్రితం కాశ్మీర్‌లో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరినే తీసుకుంది. హిజ్ముల్‌ కమాండర్‌ బుర్హన్‌ వని ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన తరువాత ప్రారంభమైన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రజలు ఎక్కడికక్కడ వీధుల్లోకి వస్తున్నారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 63 మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. పెల్లెట్‌ గన్స్‌ బారిన పడి వందల సంఖ్యలో కళ్లు పోగొట్టుకున్నారు. లారీ Äఛార్జీల్లో గాయపడిన వారి సంఖ్య లెక్కకుమిక్కిలిగా ఉంది. కాశ్మీర్‌ అంతా 39 రోజులుగా ఆంక్షలమయంగా మారింది. కీలక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. అయినా, ఆందోళనలు తగ్గకపోవడం ప్రజల్లో నెలకొన్న అపనమ్మకానికి, అశాంతికి చిహ్నం. విజ్ఞత కలిగిన ఏ ప్రభుత్వమైనా ఈ పరిస్థితుల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి ప్రజల్లో పాదుకొల్పడానికి ప్రయత్నిస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఈ దిశలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజల మధ్య ఉద్రిక్తతలు పెంచి, అభద్రతను పెంచి మతాలు, కులాల వారిగా చీల్చి, ఆ నెత్తుటి ధారల్లో అధికారాన్ని శాశ్వతంగా హస్తగతం చేసుకోవడం సంఘపరి'వార్‌' వ్యూహం. ఆ శక్తుల కనుసన్నలలో పాలన సాగించే మోడీ సర్కారు ప్రాధాన్యతలు కూడా ఇదే విధంగా ఉంటాయి. అందుకే, కాశ్మీర్‌లో జరుగుతున్న ఆందోళనలను స్థానిక ప్రజల అశాంతికి చిహ్నంగా, ప్రజా సమూహాలు వ్యక్తం చేస్తున్న నిరసనగా గుర్తించడానికి బదులుగా విదేశీ కుట్రగానో, ఉగ్రవాద దురహంకార చర్యగానో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తోంది. భద్రతా దళాల సంఖ్యను రోజురోజుకి పెంచుతుండటం, పారా మిలిటరీ దళాలనూ తరలిస్తుండటం దీనికే నిదర్శనం.
వాస్తవానికి కాశ్మీర్‌ అంశంలో కేంద్ర ప్రభుత్వం రోజుకో మాటగా, పూటకో విధానంగా వ్యవహరిస్తోంది. మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి అనుసరించిన విధానాన్నే అనుసరిస్తానని అట్టహాసంగా ప్రకటించిన మోడీ ఆ తరువాత కొద్దిరోజులకే ఆ హామీని విస్మరించారు. అవసరమైన పక్షంలో వేర్పాటువాదులతో కూడా చర్చించి సామరస్య పూర్వక పరిష్కారాన్ని కనుగొనే అవకాశాన్ని జార విడుచుకున్నారు. కాశ్మీర్‌ ఘటనలకు పాకిస్తాన్‌ కారణమని ప్రకటించడం ద్వారా స్థానిక కోణాన్ని విస్మరించారు. భద్రతా దళాల సంఖ్యను పెంచడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనే అవకాశాన్ని దూరం చేసుకున్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పదేపదే డిమాండ్‌ చేసిన అనంతరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాశారు. అఖిలపక్ష పార్టీల ప్రతినిధుల బృందాన్ని కాశ్మీర్‌కు తీసుకువెళ్లాలన్న సిపిఎంతో పాటు ఇతర వామపక్ష పార్టీలు చేసిన సూచననను తిరస్కరించడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకుని, సమస్యను పరిష్కరించే మార్గానికి దూరంగా జరిగారు. ఎర్రకోట సాక్షిగా ఆగస్టు 15న చేసిన ప్రసంగంలో కాశ్మీర్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకంగా మార్చివేశారు. అదే సమయంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో మానవ హక్కుల హననం, బెలూచిస్థాన్‌ తదితర అంశాలను ప్రస్తావించడం ద్వారా ఉప ఖండంలో ఉద్రిక్తతలను రాజేసే వినాశకర వ్యూహాన్ని అమలు పరచబోతున్నట్లు సంకేతాలనిచ్చారు.
మోడీ సర్కారు అనుసరిస్తున్న ఈ తరహా వైఖరి కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఏమాత్రం ఉపయోగపడకపోగా దేశ భద్రతకు ప్రమాదకరంగా మారే అవకాశమే ఎక్కువ. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాశ్మీర్‌లో చర్చల ప్రక్రియను తక్షణం ప్రారంభించాలి. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని రాజకీయ పార్టీలనూ ఈ చర్చల్లో భాగస్వాములను చేయాలి. అవసరమైతే పాకిస్తాన్‌తోనూ సంప్రదించాలి. ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పే చర్యల్లో భాగంగా అణచివేత చర్యలకు దిగుతున్న భద్రతా దళాలను తక్షణం ఉపసంహరించాలి. భారత్‌, పాక్‌ మధ్య నెలకొనే ఉద్రిక్తతలకు కాశ్మీర్‌ ప్రజలను బాధితులుగా మార్చే విధానాలకు స్వస్తి పలకాలి. అహంకారపూరిత విధానాలకు భిన్నంగా సానునయంతో కూడిన సానుకూల దృక్పథాన్ని అనుసరించడం ద్వారా కాశ్మీర్‌ ప్రజల హృదయాలను గెలవాలి.


No comments:

Post a Comment