Saturday, 27 August 2016

# పోలవరం ప్రాజెక్టు - కొన్ని వాస్తవాలు #



దేర్‌ ఈజ్‌ నో ఎక్సర్‌సైజ్‌ బెటర్‌ ఫర్‌ ద హార్ట్‌ ద్యాన్‌ రీచింగ్‌ డౌన్‌ అండ్‌ లిఫ్టింగ్‌ పీపుల్‌ అప్‌’ (ప్రజల అభ్యున్నతి కోసం లొంగి పనిచేయడం కన్నా ఉన్నతమైనది, ఉత్తమమైనది ఏదీ లేదు)-అని ప్రముఖ కవి జాన్‌ హోమ్స్‌ సూక్తి పోలవరం నిర్వాసితుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం పాటించాల్సిన తారక మంత్రం. ఒక సమస్యను అర్థంచేసుకునే కోణాలను బట్టి పరిష్కారాలు కనిపిస్తాయి. 

                   ప్రపంచంలోనే ఉత్తమమైన పునరావాస ప్యాకేజీని అందజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెబుతుంటే... ఇంత చెత్త ప్యాకేజీ మరొకటి లేదనేది నిర్వాసితుల వాదన. ప్యాకేజీ కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు... మానవీయ కోణంలోనూ ఉండాలి. ప్రభుత్వం తనకున్న సర్వాధికారాలను ఉపయోగించి ఏమైనా చేయవచ్చు కానీ, నిర్వాసితుల మనసులను గెలుచుకొని, కుంగిపోయిన వారి జీవితాలకు వెలుగుచూపడం నిజమైన ప్రజా ప్రభుత్వ బాధ్యత.

                  పట్టిసీమ భూసేకరణ, నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం చూపిన ఉదా రత పోలవరం పునరావాస ప్యాకేజీకి ఆదర్శం కావాలి. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించేవారు, సమర్థించేవారు ముందుగా ఆ ప్రాజెక్టును సందర్శించడం మంచిది. అప్పుడే అక్కడ నిజంగా జరుగుతున్నదేమిటి? అక్కడ నిర్వాసితులు కోరుకుంటున్నదేమిటో కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. అన్యాపదేశంగా ఎవరో చెప్పింది విని ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా విమర్శలు చేసుకుంటూ పోవడం వల్ల నిర్వాసితులకు ఒరిగేదేమీ లేదు. వైఎస్‌ హయాం నుంచి ప్రస్తుతం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి వరకూ ఢిల్లీలో ఉంటూ పోలవరంపై ఎన్నో వార్తలు రాసిన నాకు ఇటీవల పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం లభించింది. నిర్వాసితులతో మాట్లాడినప్పుడు వారు కోల్పోయిందేమిటి? కోరుకుంటున్నదేమిటి అన్నది స్పష్టంగా తెలిసింది.

                  1980లో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టాలనుకున్నా అనివార్య కారణాలవల్ల ముందుకు సాగలేదు. 1991 జనాభా లెక్కల ఆధారంగా నిర్వాసితుల లెక్కలను ప్రభుత్వం తేల్చింది. అంటే 25 ఏళ్ల క్రితం జనాభా లెక్కల్లో ఎక్కిన వారికి మాత్రమే నష్టపరిహారం అందుతోంది. మరి ఆ తరువాత పెరిగిన జనాభా సంగతేంటి? వారికి ప్రభుత్వం ఎందుకు నష్టపరిహారం ఇవ్వదన్నదే నిర్వాసితులు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న. నిజానికి ప్రతి 16 ఏళ్లకు ఒక తరం(జనరేషన్‌)గా లెక్కగడతారు. అంటే ఇప్పుడు రెండు తరాలు పూర్తయ్యాయి. కానీ కొత్త తరానికి పోలవరం నష్టపరిహారం అందడం లేదన్నది స్థానికుల మనోవేదన. అప్పట్లో మైనర్లుగా ఉన్నవారంతా ఇప్పుడు మేజర్లు అయ్యారు. వారికి కూడా ఒక దారి చూపాలన్నదే వారి డిమాండ్‌. ‘పోలవరం ప్రాజెక్టును ఆపేంత శక్తి మాకు లేదు... ఏదో మా తరపున పోరాడతామంటూ మా దగ్గరకు చాలామంది వచ్చి చందాలు అడుగుతున్నారు... మొదట ప్రభు త్వం ఇచ్చిన దాంట్లో కాస్తో, కూస్తో ఉంటే ఇచ్చాం... ఇక మేం ఏమీ ఇచ్చుకోలేము...’ అని గిరిజనులు వాపోతున్నారు. ‘నోటి మాటలే శాసనాలుగా భావించి బ్రతికేవాళ్లం.... ఎన్నికలప్పుడు చంద్రబాబు, జగన్‌లు మా దగ్గరకు వచ్చి అధికారంలోకి వస్తే రూ.10 లక్షలు నష్టపరిహారం ఇస్తాం.. కొత్త చట్టం ప్రకారం కొత్త ప్యాకేజీ ఇస్తామన్నారు.. చంద్రబాబు గెలిచారు... కానీ మాకు ఇచ్చిన మాట గుర్తుచేస్తే ఆయనకు కోపం వస్తంది... మేమేమి చేయాల’ అంటూ నిస్సహాయంగా చెబుతున్నారు.
                  ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో ఈ ప్రాజెక్టు కారణంగా 299 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఏపీలో మాత్రమే 270 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు దిగువున ఉన్న దేవరకొండ, రామాయంపేటతో పాటు ఆరు గ్రామాలను మాత్రమే ఖాళీ చేయించారు. మిగతావన్నీ ప్రాజెక్టుకు ఎగువభాగాన ఉన్నవి కాబట్టి వాటిని ఇప్పుడే ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నప్పుడు ఖాళీ చేస్తే సరిపోతుంది. 2006లో వైఎస్‌ జమానాలో ప్రవేశపెట్టిన పునరావాస ప్యాకేజీ ప్రకారం ఏపీలోని 270 గ్రామాల్లోని వారందరికీ నష్టపరిహారం నామమాత్రంగా చెల్లించారు. ఇప్పుడు వారు అడుగుతున్నది 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారం కావాలని. కానీ ప్రభుత్వం మాత్రం వారి గోడు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు కూడా బాధితులు కోర్టును ఆశ్రయిస్తే పరిశీలిస్తామంటూ వారి తరపున దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఇటీవలే కొట్టివేసింది. నిర్వాసితుల్లో 60శాతం మంది ఎస్సీ, ఎస్టీలు కాగా ఓబీసీలు 40 శాతం మంది ఉన్నారు. 60 నివాస ప్రాంతాలు(హ్యాబిటేషన్స్‌)లో 100శాతం గిరిజనులుంటే కొన్ని చోట్ల మాత్రం 90 శాతం గిరిజనులున్నారు. కొండలు, అడవుల్లో నివసించే వీరందరినీ పట్టణాలకు తరలించి వారికి అక్కడ ఇళ్లను నిర్మించి ఇస్తామంటే వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయా? తరుగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య.
                  స్వచ్ఛమైన గాలి, నీటితో పాటు అడవుల్లో దొరికింది తిని, పోడు వ్యవసాయం చేసుకుంటూ, పశువులను మేపుకుంటూ బ్రతికే వారిని ఒక్కసారిగా జనజీవన స్రవంతిలోకి తీసుకొస్తే వారికి ఊపిరి ఆడుతుందా? గిరిజనజాతులు పూర్తిగా అంతరించిపోతాయి. కొండల్లో, అడవుల్లో ఉంటేనే వారిని గిరిజనులుగా గుర్తిస్తారు. మరి పోలవరం నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం లాంటి మండల కేంద్రాల్లో ఇళ్లు కట్టిస్తే అక్కడ వారికి ఎస్టీ సర్టిఫికెట్లు ఎవరిస్తారు? వారికి ఎన్ని డబ్బులిచ్చినా వారు ఏమి చేసుకుంటారు? డబ్బులు తిని బ్రతకలేరు. వారి జీవన విధానాన్ని తిరిగి తీసుకురాగలరా? 2.5 ఎకరాల కన్నా ఎంత తక్కువ ఉంటే అంత సాగుభూమిని, అంతకన్నా ఎంత ఎక్కువ ఉన్నా 2.5 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఏజెన్సీ ఏరియాలో రిజిసే్ట్రషన్‌లు ఉండవు. వారికి చేతనైంత మేరకు వ్యవసాయం చేసుకుంటారు? కొంతమంది 20 నుంచి 30 ఎకరాలు కూడా సాగు చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ రిజిస్ర్టేషన్‌లు, పట్టాలు లేవన్న కారణంగా వారికి కేవలం అరకొరగా సాగు భూములను అధికారులు కట్టబెట్టారు. కొన్ని లక్షల మందిని ఖాళీ చేయిస్తున్నప్పుడు వారికి ప్రత్యామ్నాయం చూపకుండా మీ దారిన మీరు వెళ్లండి అంటూ హుకుం జారీచేయడం క్రూరత్వమే అవుతుంది. మానవతా దృక్ఫధంతో వ్యవహరించి నిర్వాసితులందరిలో విశ్వాసాన్ని నింపినప్పుడు శాంతి నెలకొంటుంది. లేదంటే రావణకాష్టంలా అశాంతితో రగిలిపోయి పెద్ద ఎత్తున నిర్వాసితుల ఆగ్రహం పెల్లుబుకుతుంది. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలబడటమే కాక వారి జీవితాలకు భరోసా కల్పించాలి.

                  2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామంటూ ఏపీ సీఎం పదే పదే చెబుతున్నా అది అసాధ్యమన్నది ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన వారెవరికైనా అర్థమవుతుంది. రాక్‌ఫిల్‌ డ్యామ్‌, స్పిల్‌వే పనులకు కావాల్సిన పూర్వరంగాన్ని సిద్ధం చేయడానికే మూడేళ్ల సమయం పడుతుందని ప్రాజెక్టు వద్దనున్న ఇంజనీర్లే చెబుతున్నారు. 160 మీటర్ల లోతులో రాక్‌ఫిల్‌ డామ్‌ పునాది వెడల్పు 1 కిలోమీటరు, పొడవు 1.4 కిలోమీటర్లు. స్పిల్‌వే పొడవు, వెడల్పు కూడా దాదాపు ఇంతే ఉంటుంది. సుమారు ఐదారు కొండల్ని పిండి చేయాలి.. పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ నిధుల కొరత వెంటాడుతూనే ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత కేంద్రం ఇప్పటికి కేవలం రూ.850 కోట్లు మాత్రమే కేటాయించింది. 2011 అంచనాల మేరకు పోలవరం నిర్మాణ వ్యయం రూ.16వేల కోట్లు కాగా తాజాగా సవరించిన అంచనాల మేరకు దీని వ్యయం రూ.36వేల కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును తమ పరిధిలోకి తీసుకోవడానికి మీనమేషాలు లెక్కపెడుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, ఏపీ ప్రభుత్వం మధ్య ఇంకా ఎంవోయూ కుదరలేదు. నాబార్డ్‌ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటున్న కేంద్రం రీపేమెంట్‌ ఎవరు చేయాలన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.  పోలవరం నిర్మాణం పేరిట జరుగుతున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. కానీ ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడికన్నా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడని రాష్ట్ర పాలకులు గుర్తుంచుకుంటే బావుంటుంది. --మందడపు కృష్ణ (ఆంధ్ర జ్యోతి)  

No comments:

Post a Comment