ఒక నెల క్రితం వరకూ నన్ను ఒక ప్రశ్నవేస్తే సమాధానం చెప్పలేకపోయేవాడిని. ఆ ప్రశ్న ఏమిటంటే ''అవునయ్యా! పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడతాడు. పరిశ్రమ స్థాపిస్తాడు. కార్మికులు అందులో పనిచేస్తారు. ఆ పరిశ్రమలలో లాభాలు వస్తే కార్మికులు జీతాలు పెంచమంటారు. బోనస్లు అడుగుతారు. నష్టాలు వస్తే ఎవరు భరిస్తారు? ఆ కార్మికులు గానీ, కార్మిక పక్షపాతులమని చెప్పుకునే మీలాంటివాళ్లు గానీ భరిస్తారా? పాపం, ఎన్నో రిస్కులు భరించి, నష్టాలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడి పరిశ్రమలు స్థాపించిన పెట్టుబడిదార్లను మీరు దోపిడీదార్లంటారు. ఇది న్యాయమేనా?'' అలాగే మరో ప్రశ్న. ''ప్రభుత్వం వద్ద డబ్బులేదయ్యా. పెట్టుబడిదారుల వద్ద డబ్బుంది. అందుకని వాళ్లు పెట్టుబడి పెడతారు. పదిమందికి ఉపాధి కల్పిస్తారు. ప్రభుత్వం చేయలేని పని వాళ్లు చేస్తే సంతోషించాల్సింది పోయి, కార్మికుల రక్తమాంసాలు పీలుస్తున్నారంటూ పెట్టుబడిదారులను ఆడిపోసుకుంటారెందుకు?'' ఈ రెండు ప్రశ్నలకూ నాకు ఇటీవలనే సమాధానం దొరికింది. అదేమిటంటే పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టడు. ఒక పరిశ్రమ స్థాపించాలనుకుంటే ప్రభుత్వ బ్యాంకుల వద్ద ప్రభుత్వంలో ఉన్న నాయకుల తోడ్పాటుతో అప్పు చేస్తాడు. పరిశ్రమ స్థాపిస్తాడు. లాభాలు వస్తే అన్నీ తనవే అంటాడు. నష్టాలు వస్తే పరిశ్రమ మూసేస్తాడు. చేతులు దులుపుకుంటాడు. నష్టపోయేది ఎవరు? ప్రభుత్వ బ్యాంకులు. అందులో డబ్బు ఎవరిది. నీ, నాబోటి ప్రజలది. అంటే ఒక పరిశ్రమ మూతబడితే అంతిమంగా నష్టపోయేది ప్రజలే. దీనికి మంచి ఉదాహరణ విజయ మాల్యా. ఆయనకు భారత్లో రూ.9,000 కోట్ల ఆస్తులు లేవని తెలిసినా ప్రభుత్వ బ్యాంకులు రూ.9,000 కోట్లు అప్పులిచ్చాయి. ఇది అందరికీ తెలిసిన ఉదాహరణే. పెట్టుబడిదారులకు ప్రభుత్వరంగ బ్యాంకులిచ్చిన అప్పుల చిట్టా ఒకటి 'ది హిందూ' పత్రిక 2016 మే 9న ప్రచురించింది. దాని ప్రకారం అంబానీలు, అదానీ, టాటా, జిందాల్ వంటి 12 మందికి 24 బ్యాంకులిచ్చిన అప్పు 2014-15 నాటికి 14,94,304 కోట్ల రూపాయలు. వారి ఆస్తులన్నీ కలిపినా అందులో పాతిక వంతు ఉంటాయా? వారందరూ ''ఒక్కొక్కరు ఒక్కో విజయమాల్యా!'' కాబట్టి పెట్టుబడిదారుల పెట్టుబడులలో ఎక్కువ శాతం బ్యాంకు రుణాల పేరుతో ఉన్న ప్రజల డబ్బు. మిగిలింది వాటాల రూపంలో ఉన్న ప్రజల డబ్బు. ఆ డబ్బు లాభనష్టాలతో నిమిత్తం లేకుండా పెట్టుబడిదారులు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు. సొంత విమానాల్లో తిరుగుతున్నారు. అవన్నీ లాభాలను స్పెక్యులేట్ చేసిన పెట్టుబడులే గదా? ''స్పెక్యులేట్ చేస్తేనే డబ్బు ఎక్యుములేట్ అవుతుంది'' అనే గదా వారి సూత్రం? మరి స్పెక్యులేషన్ (ఊహ) వికటిస్తే? నష్టాలు వస్తే? వారిని ఆదుకోవడానికి ప్రభుత్వ బ్యాంకులు మళ్లీ సిద్ధం! వారు అప్పులు తీర్చకపోతే, కొన్నేళ్ల పాటు ఎగ్గొడితే వాటిని కొన్నేళ్లపాటు నిరర్థక ఆస్తులు అనే అందమైన, సామాన్యుడికి అర్థం కాని పేరుతో పిలిచి, చివరికి వాటిని మాఫీ చేస్తారు. అలా మాఫీ చేయబడిన కోటీశ్వరుల రుణాలు ఏ మేరకు ఉంటాయో తెలుసా? 2013 నుంచి 2015 వరకు మాఫీ చేయబడిన రుణాల మొత్తం రూ.1.14 లక్షల కోట్లు. అంటే సంవత్సరానికి దాదాపు రూ.50 వేల కోట్లు. విశేషమేమంటే, పదేళ్ల క్రిందట కొన్ని లక్షల మంది రైతులకు రూ.55 వేల కోట్లు రుణమాఫీ చేస్తే దాన్ని గూర్చి ఇప్పటికీ ''ఖజానాకు పెనుభారమైనా రైతులకు రుణమాఫీ చేశాం'' అని పదే పదే ప్రకటించే ప్రభుత్వాలు, ప్రతి సంవత్సరం కోటీశ్వరులకు చేస్తున్న రూ.50 వేల కోట్ల రుణ మాఫీని గూర్చి ''ఖజానాకు పెనుభారం'' అంటూ ఏనాడూ బాధపడవు. అసలు దుర్మార్గమేమంటే ఏ సంవత్సరంలోనైనా ఒక కోటి రూపాయల పైన ఏ కోటీశ్వరుడికైనా రుణ మాఫీ జరిగితే, ఆ కోటీశ్వరుడి పేరును ఆ బ్యాంకు వెల్లడించకూడదు. అలా పేరు ఎవరైనా వెల్లడిస్తే వారిని జైలు పాలు చేస్తామని బ్యాంకు రహస్యాల చట్టం బెదిరిస్తోంది! దానివల్ల కొంత ప్రయత్నం మీద కోటీశ్వరులకు ఏ సంవత్సరం ఎంత మొత్తం రుణమాఫీ అయిందని తెలుస్తుంది గానీ, ఎవరికెంత మాఫీ అనేది తెలిసే పరిస్థితి లేకపోవడం అత్యంత బాధాకరం. విచిత్రమైన విషయమేమంటే మన పొరుగు దేశం పాకిస్తాన్లో 'బ్యాంకు రహస్యాల చట్టం' లేదు. అక్కడ పెద్ద మొత్తాలలో బ్యాంకులకు డబ్బు ఎగవేసిన వారి పేర్లను బ్యాంకుల నోటీస్ బోర్డులలో పెట్టడమే గాక, వారి పేర్లను ఎన్నికల సంఘానికి కూడా పంపిస్తారు. వారిని ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. మనదేశంలో ఇదేమి న్యాయం? ఒక పేద రైతు రుణం చెల్లించలేకపోతే ఊరంతా టముకు వేసి ప్రకటించే బ్యాంకు అధికారులు కోటీశ్వరులు రుణాలు ఎంత ఎగవేసిందీ, వాటిని ''రహస్యంగా'' ఎంత మాఫీ చేసిందీ ప్రకటించరు. గత రెండేళ్లలో మాఫీ అయిన రూ.1.14 లక్షల్లో ఎవరికెంత మాఫీ అనేది ప్రకటిస్తే అనేక మంది పెద్దల 'జాతకాలు' బయట పడతాయి! ఆసక్తికరమైన మరో అంశమేమంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015-16 చివరి త్రైమాసిక లెక్కలలో చెడ్డ అప్పుల (మాఫీ) కోసం రూ.12,319 కోట్లు అట్టిపెట్టుకున్నానని ప్రకటించింది. ఈ కార్పొరేట్ అప్పుల మాఫీల వల్ల జరిగిందేమిటో తెలుసా? దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒక త్రైమాసికంలో (2015-16 చివరి క్వార్టర్) వందల, వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూశాయి. ఇలా ప్రభుత్వ బ్యాంకులకు వందలు, వేల కోట్ల రూపాయలు నష్టం రావడానికి కారణాలేమిటి? కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల అప్పులివ్వడం, వారు ఎగవేయడం, కొన్నేళ్లపాటు వాటిని బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటించడం, తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మాఫీ చేయడం. ఇది కారణం. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ నష్టాలను ప్రజలపై అనేక పన్నులు, సెస్సుల రూపంలో విధించడం, దేశాభివృద్ధి కోసం భారాలను భరించండి, త్యాగాలు చేయండి అనడం. ఇదీ జరుగుతున్న తంతు. కాబట్టి పెట్టుబడిదార్లంటే ఎవరు? అప్పుజేసి పప్పుకూడు తినేవాళ్లు! వాళ్లకు అండ కొందరు రాజకీయ నాయకులు!!
ఇప్పుడు ''ప్రభుత్వం వద్ద డబ్బులేదయ్యా! పెట్టుబడిదార్ల దగ్గర డబ్బుంది'' అనే వ్యాఖ్యకు సమాధానం దొరికింది. ఇక్కడ పెట్టుబడిదారీ అనుకూల రాజకీయ నాయకులు మరో తప్పుడు అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. అదేమిటంటే ప్రభుత్వరంగం అసమర్థమైనదనీ, ఆ రంగంలో ఎప్పుడూ నష్టాలు వస్తున్నందున సమర్థవంతమైన ప్రయివేటు రంగానికి అప్పజెబుతున్నామనీ. ఈ అంశంలో నేను సేకరించగల్గిన కొన్ని వివరాలు మీ ముందుంచుతున్నాను.
నెం ఆర్థిక సంవత్సరం అన్ని ప్రభుత్వ సంస్థల నికరలాభం
(రూ.కోట్లలో)
1 1991-92 2,350
2 1992-93 3,400
3 2004-05 65,429
4 2006-07 81,121
5 2008-09 83,867
6 2009-10 92,593
కాబట్టి నూతన ఆర్థిక విధానాలు ప్రారంభించిన 1991-92 నుంచి ప్రయివేటీకరణ జపం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నికరలాభం వేల కోట్లలోనే ఉంటున్నదనీ, అది క్రమంగా పెరుగుతోందనీ అర్థం కావడం లేదా? ప్రభుత్వరంగ సంస్థలు మోయలేని భారమనే ప్రచారం అబద్ధాలతో కూడిందనీ వాస్తవాలు వివరించడం లేదా?
ప్రజల ధనాన్ని కొద్దిమంది కార్పొరేట్ అధిపతులకు కట్టబెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? సమర్థవంతమైనదిగా వాస్తవాలు నిరూపిస్తున్న ప్రభుత్వరంగాన్ని ప్రోత్సహించాలి. పెట్టుబడి పేరు మీద కోటీశ్వరులు తీసుకున్న అప్పుల మాఫీలను తప్పనిసరిగా ప్రకటించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. కోటి రూపాయలు పైగా రుణమాఫీ చేయబడిన వారిని ఎన్నికలలో అనర్హులుగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. 1991-92 నుంచి ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టి, రుణమాఫీ ప్రకటింపజేసుకుని, ''బ్యాంకు రహస్యాల చట్టం'' కింద ప్రజల దృష్టికి రాకుండా తప్పించుకు తిరుగుతున్న వారందరి పేర్లు వెల్లడించే వరకూ ఉద్యమించాలి. బ్యాంకింగ్ రంగంలో మొండి బాకీల సంక్షోభాన్ని భూతద్దంలో చూడొద్దనీ, అభివృద్ధి బాగా జరగాలంటే బ్యాంకుల్లోని మొండి బాకీలను రద్దుజేయటమే మార్గమని చెబుతున్న కేంద్ర ఆర్థికమంత్రి మాటలు కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలకు ఎంత హానికరమో, ఈ ప్రభుత్వం ఎవరి పక్షమో గ్రహించడం అన్నిటి కంటే ముఖ్యం.
(వ్యాసకర్త - కెఎల్ కాంతారావు

No comments:
Post a Comment