Wednesday, 10 August 2016

|| మోడీ చెప్పిన గోముఖ వ్యాఘ్రాలెవరు ||

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన 'మై-గవ్‌ పోర్టల్‌' రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలతో నేరుగా మాట్లాడారు. పన్నెండు మంది అడిగిన విభిన్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యం, అభివృద్ధి, పౌరుల పాత్ర, రైతులు, యువత, ఎన్నారైల గురించి ఎంతో గొప్పగా వివరించారు. అన్నింటి కన్నా ముఖ్యంగా గోసంరక్షకులుగా నటిస్తూ సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే వారి భరతం పట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని సమాధానాలు విన్న ఎవరైనా... ఎంత నిజాయితీ, నిబద్ధత, దేశాభివృద్ధి పట్ల వెలకట్టలేని తపన, అసహన శక్తుల పనిపట్టాలన్న సంకల్పం సుదృఢ చిత్తం అంటూ మెచ్చుకోకుండా ఉండరు. ఈ సందర్భంగా కబీర్‌ మాటలు గుర్తుకొస్తున్నాయి. 'ఎన్నెన్నో మాయలు చేసినవాళ్లు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా, మంచి మనిషిగా బతకడం కష్టమైన పనే' అని ఆయన ఎప్పుడో చెప్పారు. మోడీ మాటలకు, చేతలకు మధ్య ఉన్న అంతరం గుర్తించినప్పుడు కబీర్‌ మాటల్లోని నిగూఢార్థం స్పష్టమవుతుంది. ఆయన రెండేళ్ల పాలనలో దేశంలో అసహన శక్తులు పెచ్చుమీరడానికీ, మత సామరస్యం ప్రమాదపుటంచులకు నెట్టబడడానికీ కారణం ఏమిటి.. ఎవరు? నేడు ఆయన సుదీర్ఘకాలం పాలించిన గుజరాత్‌లో దళితులు, మైనార్టీలు పది రోజుల పాటు ఫ్రీడం మార్చ్‌ నిర్వహించాల్సిన అవసరం, అగత్యం ఎందుకు వచ్చింది? ఆయన చెప్పిన గోముఖ వ్యాఘ్రాలు ఎవరు? వారికి పదవులు, హోదాలు కట్టబెట్టి అధికారపు అండతో ఉన్మత్త క్రీడకు పాల్పడేలా చేసిందెవరు? అన్నీ తానే చేసి, తన వారితో చేయించి, తన సైద్ధాంతిక పునాదికి మూలమైన సంస్థలు, వ్యక్తులు గోసంరక్షణ పేరుతో మనుషులను అమానుషంగా హత్యచేస్తుంటే మౌనమునిలా వ్యవహరిస్తూ నీతి వాక్యాలు వల్లించడమే అసలైన గోముఖ వ్యాఘ్ర స్వభావం కాదా? మోడీ మాటలు చెవులకు ఇంపుగానే ఉన్నాయి. హృదయం పెట్టి ఆలోచించగలిగేవారికీ, మెదడుకు పదునుపెట్టి విశ్లేషించగలిగేవారికీ ఎంతో ఆవేదన, ఆగ్రహం కలిగించక మానవు. ఎవరో చేసిన దానికి ఆయనను ఎలా తప్పుపడుతారనేవారూ ఉంటారు. నిజమే అనుకుందాం. ఆ తప్పులు చేసినవారిని సమర్థించడం, వారికి వివిధ రకాల పదవులు, హోదాలు కట్టబెట్టడమంటే ఆ ఘోరాలు, నేరాల్లో భాగస్వామ్యం వహించినట్లు కాదా? స్వయంగా రాజ్యమే ఒక నియంతగా మారి తన భావజాల వ్యతిరేకతను భౌతికంగా అంతమొందించాలని ప్రయత్నిస్తుంటే... ఆయన మౌనంతో దానికి మద్దతుగా నిలుస్తుంటే.. ఆయనకు మించిన గోముఖ వ్యాఘ్రం ఎవరు? హిందూ మతంలోని మూఢత్వానికీ, హిందూత్వ శక్తుల ఆగడాలకూ వ్యతిరేకంగా ఏ ఒక్కరు గొంతువిప్పినా.. సంఫ్‌ు పరివార్‌ శక్తులు, మోడీ మంత్రివర్గంలోని కొందరు మంత్రులు సైతం ఎదురుదాడికి, భౌతిక దాడులకు తెగబడుతుంటే ఏనాడూ ఆయన నోరు విప్పకపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బెంగళూరులో ప్రభ అనే యువతి తన పరిశోధనా పత్రాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అంతే... హిందూ సనాతన ధర్మాన్ని ప్రశ్నించిందన్న పేరుతో ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త 'ఆమెపై అత్యాచారం చేయండ'ని ఫేస్‌బుక్‌లో పిలుపునిచ్చాడు. ఒక మహిళ శాస్త్రీయ భావాల గురించి మాట్లాడితే ఇంత అమానుషంగా దాడిచేయటాన్ని ఏమనాలి? బీఫ్‌ తింటానన్న కర్ణాటక ముఖ్యమంత్రి తల తీసేసి ఫుట్‌బాల్‌ ఆడుకుంటాననేలా ఓ బిజెపి నేత బరితెగించారంటే అర్థం ఏమిటి? లౌకికవాది కానివాడు దేశభక్తి పరుడు కాజాలడన్నందుకు షారుఖ్‌ఖాన్‌ను పాకిస్తాన్‌ వెళ్ళిపోవాలని హెచ్చరించిందెవరు? తమిళనాట గొప్ప రచయిత మురుగన్‌ వందేళ్ల కిందట అమలులో ఉన్న ఒక ఆచారం మీద నవల రాస్తే.. హిందూ దేవుళ్లకు, మనోభావాలకు భంగం కల్గించారనీ, ఒక కులాన్ని అవమానించారనీ.. ఆయన మీద విశ్వహిందూపరిషత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దాడిచేసి వేధించారు. ఇక రచయితగా తాను మరణించానని ఆయన ప్రకటించే దాకా వెంటాడారు. చివరకు హైకోర్టు ఈ దాడులను ఖండించడమేగాక, ఆయనను కలం పట్టాలని కోరాల్సి వచ్చింది. పికె చిత్రంలో కూడా కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను గాయపరిచాయనీ, వాటిని తొలగించాలని ప్రజాప్రయోజనాల వ్యాజ్యం వేస్తే... ఢిల్లీ హైకోర్టు బెంచి తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాజ్యం సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇలాంటి ధోరణులను మొగ్గలోనే తుంచివేయాలని హెచ్చరించింది. కోర్టు తీర్పు తర్వాతనైనా మోడీ పాలనా యంత్రాంగంలో కదలిక రాలేదు. అంతేకాదు, శాస్త్రీయ దృక్పథాన్ని, హేతువాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నందుకు గోవింద్‌ పన్సారేను, బసవేశ్వరుడు విగ్రహారాధనను, కులవివక్షను వ్యతిరేకిస్తే.. ఆయన అనుచరులు వాటినే పాటించడమేమిటని ప్రశ్నించినందుకు కల్బుర్గిని హత్యచేసిన గోముఖ వ్యాఘ్రాలెవరో ప్రధానికి తెలియదా? మోడీ చెప్పినట్లే ఎన్నో నరమేధాలకు పాల్పడిన గోముఖ వ్యాఘ్రాలు ఇప్పుడు 'గోరక్షకులు'గా పోజులు కొడుతున్నారు. గోవును ముందుకు తెచ్చి రాజకీయాధికారాన్ని దీర్ఘకాలం గుప్పిట పెట్టుకుని తమ అసలు అజెండా అయిన 'హిందూ రాజ్య' కలను సాకారం చేసుకోవచ్చనే దుష్టతలంపే ఇందులో ఉంది. కాబట్టే 'ఆవుల కోసం ప్రత్యేక డెయిరీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేవారికీ, దాణాను ఉత్పత్తి చేసేవారికీ ఉచితంగా భూమి' ఇస్తామని కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, రాధామోహన్‌ సింగ్‌ ప్రకటించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సందీప్‌ పాండేను హఠాత్తుగా తొలగించారు. దేశద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నాడని ఆరోపించారు. పాండిచ్చేరి యూనివర్సిటీ స్టూడెంట్‌ యూనియన్‌ విడుదల చేసిన 'వైడర్‌స్టాండ్‌' మ్యాగజైన్‌ను పాలకవర్గం నిషేధించింది. ఈ మ్యాగజైన్‌లో మార్క్స్‌, ఏంగెల్స్‌ భావజాలంతో కూడిన వ్యాసాలు, జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయకుమార్‌ గురించి, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి భావనలను పెంపొందించే రచనలు, సామాజిక అణచివేత, వివక్షలను ప్రశ్నించే, విమర్శించే అంశాలు ఉండడమే కారణం. దీనిలో ప్రభాత్‌ పట్నాయక్‌ సహా 40 మంది మేధావులు, విద్యార్థి సాల్కర్స్‌ వ్యాసాలున్నాయి. జస్టిస్‌ చలమేశ్వర్‌ లాంటి న్యాయాధిపతుల వ్యాఖ్యలున్నాయి. ఈ మ్యాగజైన్‌ విడుదల కార్యక్రమంలో ఇన్‌చార్జి ఉపకులపతి కూడా పాల్గొన్నారు. మ్యాగజైన్‌ విడుదలకు కారకులంటూ డీన్‌ను కూడా మార్చేసి చాలా జూనియర్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టారు. దీనంతటికీ కారణం ఈ మ్యాగజైన్‌ రావడంపై ఎబివిపి, బిజెపి తీవ్ర వ్యతిరేక వ్యక్తంచేశాయి. దీంతో విశ్వవిద్యాలయం అధికారులు మరో ఆలోచన లేకుండా దాన్ని నిషేధించారు. మన విశ్వవిద్యాలయాలు తొలి నుంచీ విజ్ఞాన కేంద్రాలుగా, విభిన్న భావజాలాలను పెంపొందించే వేదికలుగా వర్ధిల్లుతున్నాయి. ముఖ్యంగా మార్క్సిజం వైపు విద్యార్థులు ఆకర్షితులు కావడానికి విశ్వవిద్యాలయాలే మూలబిందువులుగా ఉన్నాయి. విద్యాసంస్థల మీద పట్టుకోసం, భిన్నాభిప్రాయాలున్న వాళ్లను ఆ విద్యాసంస్థల నుంచి బయటకు తరిమివేసేందుకు సంఫ్‌ుపరివార్‌ ఆడుతున్న నాటకమే ఇదంతా. అంతేకాదు, దళిత, ముస్లిం, వామపక్ష విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుంచి దూరం చేయాలని కూడా ఈ శక్తులు అనేక రకాల ఎత్తులు వేస్తున్నాయి. మోడీ చెప్పినట్లు ఇప్పుడు బిజెపి, సంఫ్‌ుపరివార్‌ శక్తుల భరతం పట్టేందుకు దేశ ప్రజలు సిద్ధం కావాలి. మతతత్వ అల్లర్లకు చాలానే చరిత్ర ఉన్నప్పటికీ, 2013లో హిందూత్వ శక్తులు ముజఫర్‌నగర్‌లో అల్లర్లను ఎగదోయడంతో దేశంలో 'గుజరాత్‌ నమూనా' లేదా 'మోడీ మార్క్‌' మతతత్వ కల్లోలం మొదలైందని చెప్పుకోవచ్చు. చర్చీలపై దాడులు, బీఫ్‌ నిషేధ చట్టాలు, ఉన్మాద హత్యలు, దాడులు, అసెంబ్లీలోనే ఎమ్మెల్యేను కొట్టడం, విద్వేష వ్యాఖ్యలు.. ఇలా ఎన్నెన్నో దుస్సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదంతా చూసే ఓ తల్లి 'నా పిల్లల భద్రత కోసం ఈ దేశం వదిలి పోవాలనిపిస్తుంది' అని వేదన చెందింది. ఆమె హిందువే. అమీర్‌ఖాన్‌ భార్య కిరణ్‌రావు. సాటి మనుషులు ఏ తిండి తినాలి? ఏ బట్టకట్టాలి? ఏ పలుకు పలకాలి? ఏ దేవుణ్ణి కొలవాలి? అనేది తామే నిర్ణయిస్తామని చెప్పే వరకూ హిందూత్వ శక్తులు వెళ్లాయి. నిరుడు పార్లమెంటుకు హోంమంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం ఆ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకే దేశంలో 330 మతఘర్షణలు జరిగినట్లు నమోదైంది. ఈ ఘర్షణల్లో 51 మంది బలయ్యారు. మరో 1,092 మంది క్షతగాత్రులుగా మిగిలారు. ఈ రెండేళ్ల పాలన అలానే సాగిందనడంలో సందేహం లేదు. అయితే మతోన్మాద చిచ్చురేపి హిందూ ఓట్లను సంపాదించాలన్న వ్యూహంలో ఆయన బృందం కొన్ని మార్పులు చేసుకుంది. భారీస్థాయి ఘర్షణలకు బదులుగా చిన్న, చిన్న గొడవలకు తెరలేపి వాటి ఆధారంగా ప్రజల్లో మతపరమైన చీలికలు తేవాలన్నది వారి ఉద్దేశం. ఒక ఆంగ్ల దినపత్రిక పరిశోధన ప్రకారం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన 10 వారాల్లో ఒక్క ఉత్తరప్రదేశ్‌లో 600 మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. మరో భయంకర విషయమేంటంటే దళితులు, ముస్లింలు కలిసి నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఈ రెచ్చగొట్టే ఘటనలు జరిగాయి. దళితుల్లో ముస్లిం వ్యతిరేకత నూరిపోసి, వారిపై దాడులకు వాడుకునే పంథా ఎంచుకున్నారు. ఇది అణగారిన వర్గాల్లో చీలికలు సష్టించి తమ పబ్బం గడుపుకోవాలనే హేయమైన ప్రయత్నమే. ఢిల్లీ శ్రీరాం కాలనీలో ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు రంజాన్‌ సందర్భంగా మతచిచ్చు రేపేందుకు ఓ పథకం ప్రకారం వీరంగం సృష్టించారు. అప్పట్లో వామపక్ష కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి విషమించకుండా ఆగింది. దళితులు, ముస్లిం యువతపై విచ్చలవిడిగా దాడులు జరిపి భయానక వాతావరణం సృష్టిస్తుంటే వీరి ఆగడాలకు పోలీసు ఉదాసీనత తోడైంది. తమ మతతత్వ అజెండాకు రాజకీయ ముసుగు తగిలించుకున్న వ్యక్తి మోడీ. మనిషికీ పశువుకూ పోటీ పెట్టి, మనిషికన్నా పశువే మిన్న అని నిరూపించే, ఆ పశువు కోసం మనిషిని బలిచేసే సంస్కృతి ఆయనది. అసలు సిసలైన గోముఖ వ్యాఘ్రం ఆయనే. ఈ గోముఖ వ్యాఘ్రం భరతం పట్టాలంటే.. లౌకిక, ప్రజాతంత్ర, హేతువాద, సామాజిక, వామపక్ష శక్తుల ఐక్యకార్యాచరణ అత్యంత అవసరం. - డాక్టర్‌ కె నారాయణ (వ్యాసకర్త సిపిఐ జాతీయ కార్యదర్శి)

No comments:

Post a Comment