Friday, 12 August 2016

|| గో రక్షణ పేరుతో దళితులపై దాడి ||

 గో సంరక్షక సమితుల దురాగతాలు దేశవ్యాప్తంగా పెచ్చుమీరి పోతున్నాయి. ముస్లింలపైనే కాక దళితులపై కూడా వీరు చేస్తున్న దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతంలో కూడా ఇదే జరుగుతున్నది. ఉనాలో జరిగిన దాడులకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న స్థితిలో కూడా కర్ణాటకలోని చిక్‌మగళూర్‌లో దళితులపై బజరంగ్‌ దళ్‌ దాడి చేసింది. గత రెండు సంవత్సరాలలో అది ఎనిమిదవ దాడి. ఆ తరువాత లక్నోలో ఒక చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచినందుకు ఇద్దరు దళితులపై దాడి జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఎన్డీయే ప్రభుత్వ పాలనలో ఢిల్లీకి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోని హర్యానాలోని బాద్‌షాపూర్‌లో చనిపోయిన ఆవు చర్మాన్ని తీసినందుకు ఐదుగురు దళితులను చంపారు. ముస్లింల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందు వులలో సజాతీయతను సాధించటమే ఆర్‌ఎస్‌ఎస్‌-హిందూత్వల ఎజెండా. భారతీయ అస్తిత్వ రూపకల్పనలో హిందువులను ముస్లిముల నుంచి వేరు చేయాలనేది వారి ఆలోచన. అందుకే ఆవును అలాంటి అస్తిత్వానికి ప్రతీకగా తీసుకోవటం జరిగింది. ఆవు 'మనకు' పవిత్రమైనదనేది ముఖ్యం కాదిక్కడ. అయితే 'మనకు' పవిత్రమైన దాన్ని ముస్లిములు తింటారనే వాస్తవమే ఇక్కడ ముఖ్యం. ఇది ముస్లిములను హిందువుల నుంచి వేరు చేసి వారిని 'మన' శత్రువులుగా మారుస్తుంది. అదే దాద్రీలో అఖ్లాక్‌ను మూకలు తొక్కి చంపేలా చేసింది. అనేక చోట్ల ముస్లిములపై దాడులు జరగటానికి కూడా అదే దారితీసింది.
గో సంరక్షణ గత కొంతకాలంగా క్రియాశీలంగా ఉన్నది. అయితే దానికి ప్రజల నుంచి అంతగా మద్దతు లేదు. దీనిలో ప్రభుత్వం కుమ్మక్కు కానంత వరకు దీన్ని అరికట్ట వచ్చు. బిజెపి పెద్ద పార్టీగా మారి వివిధ రాష్ట్రాలలోనూ, ప్రస్తుతం కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. గ్రామీణ ప్రాంతాలలో హిందులను ఐక్యపరచేందుకు, ముస్లిములను వేరు చేసేందుకు ఒక సమీకరణ సాధనంగా ఇది ఉపయోగపడుతున్నది. గతంలో పట్టణ ప్రాంతాలలో హిందూత్వ శక్తులు ముస్లిములకు వ్యతిరేకంగా మత కలహాలను ఒక సాధనంగా ఉపయోగిం చేవి. గో'మాత'ను సంరక్షించే నెపంతో నేడు గ్రామీణ ప్రాంతాలలో హిందువులను సమీకరించి ముస్లిములపై దాడులు చేస్తున్నారు. అలా గుజరాత్‌లో జరిగినట్టు ముస్లిము లను వేరుచేసి వారిని రాజ్యాధికారంలో భాగస్వాములు కాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నది.
ముస్లిములకు వ్యతిరేకంగా ఈ గో సంరక్షణ ఒక ఆయుధంగా 'ఉపయోగపడుతున్నప్పటికీ' దానికి అంతర్గ తంగా హిందూ సమాజాన్ని చీల్చగల ప్రమాదకర లక్షణం ఉన్నది. బ్రాహ్మణవాదం పాలిస్తున్న హిందూ సమాజంలోని వైరుధ్యాలు హిందదూత్వ గో సంరక్షణతో బయట పడుతున్నాయి. ఆవు నిజంగా గౌరవనీయమైనదే అయితే వాటితో పనిచేసే పశువుల ఆర్థిక వ్యవస్థలోనివారు ఎందుకు కళంకిత జీవితం గడుపుతున్నారు? ఆవు నిజంగా వారి 'మాత' అయితే దాన్ని గో సంరక్షకులు కాకుండా దళితులే ఎందుకు ఖననం చేస్తున్నారు? బ్రాహ్మణవాద వ్యవస్థలో మానవుల మధ్య సంబంధాలను వారు చేసే శ్రమ నిర్ధారిస్తుంది. అగ్ర కులాలకు గ్రాసం అందించటానికి, వారికి చెప్పులు తయారు చేయటానికీ ఇతర కులాల అవసరం ఉంటుంది. పశుపాలన, అవి చనిపోయినప్పుడు వాటి చర్మాన్ని తీయటానికి ఈ కులాలు కావాలి. అలా తీసిన చర్మాన్ని ఇతరులు శుద్ధిచేసి వాటితో రకరకాల వస్తువులు తయారు చేస్తారు. ఎలాంటి వస్తువులను ఉత్పత్తి చేసేవారైనప్పటికీ పాలను లేక జంతు చర్మంతో చేసే వస్తువులను ఉత్పత్తిచేసే వారిని 'కళంకితులు'గా భావిస్తారు. ఇతరుల శ్రమతో తయారైన అలాంటి వస్తువులను వినియోగించేవారిని-పాలు తాగేవారిని, చర్మ ఉత్పత్తులను వాడేవారిని-'పరిశుద్ధులు'గా భావిస్తారు. ఉత్పత్తిదారులు కళంకితులుగాను, ఇతరుల శ్రమను దోచుకుని బతికే పరాన్నభుక్కులు పరిశుద్ధులుగానూ ఉంటారు. ఇదంతా బ్రాహ్మణవాద సమాజపు కపటనీతి.
కుల విభజిత బ్రాహ్మణవాద సమాజాన్ని సమర్థించే వారు సమాజం 'మెరిట్‌' ఆధారంగా నిర్మితమైనదని మనల్ని నమ్మింపజూస్తారు. వాస్తవంలో ఈ సమాజం శ్రమ విభజన ఆధారంగా నిర్మించబడింది. దీనిలో శ్రమ చేయనివారు అత్యున్నత స్థానంలోనూ, మిగిలినవారందరినీ వారివారి శ్రమ స్వభావాన్ని బట్టి వివిధ శ్రేణులలో ఉంచారు. ఆ విధంగా ఇతర కులాలకు అవసరమైన చనిపోయిన పశువులను ఖననం చేయటం, పాకీ పని వంటివి అత్యంత కళంకితమైనవిగా మారి కుల వ్యవస్థ అనే పిరమిడ్‌లో అత్యధమ స్థాయికి నెట్టబడ్డాయి. సమాజంలోని వేరువేరు విభాగాల నుంచి మిగులును దోచుకునే ప్రక్రియలో ఈ ఏర్పాటు ఒక సాధనంగా ఉన్నది. శ్రమ దోపిడీ ఒక్కటే మిగులును దోచుకునే రూపం అని దీని అర్థం కాదు. అనేక రూపాలలో మిగులును దోచుకోవటం జరుగుతుంది. భారతదేశంలోని భూస్వామ్య-కుల వ్యవస్థకు, ఐరోపా ఖండంలోని భూస్వామ్యానికి మధ్య గల ముఖ్యమైన తేడా ఏమంటే భారతదేశంలో కష్టజీవులు వారసత్వంగా వృత్తికి బందీలైతే ఐరోపాలో రైతులు భూమికి లేక భూస్వామికి బందీలయ్యారు. వారు ఎక్కడికెళ్ళాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. అయితే వారికి తమ వృత్తిని త్యజించటానికి స్వేచ్ఛలేదు.
వేద కాలంలో ఉన్నదీ, యజ్ఞయాగాదులలో ఉపయోగించిందీ అయిన ఆవు మాంస భక్షణను ఆ తరువాత నిషేధించటానికి గల కారణాలను అనేక విధాలుగా వివరించటం జరిగింది. అన్నింటికంటే ఎక్కువగా ఆమోదయోగ్యమైన వివరణను ప్రముఖ మానవ శాస్త్రవేత్త మార్విన్‌ హార్రిస్‌ ఇచ్చాడు. భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ఎద్దులకు, ఆబోతులకు గల ప్రాధాన్యత వల్ల ఆవు మాంసాన్ని నిషేధించవలసిన పరిస్థితి ఏర్పడింది. పాలదే సమస్య అయినట్టయితే పాల ఉత్పత్తిలో ప్రముఖ పాత్రను పోషించే గేదెల మాంసాన్ని నిషేధించి ఉండేవారు. గంగా మైదానంలో అడవులను నరికి శాశ్వత వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయటంతో ఆవులను రక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఆవులు పాలనే కాకుండా మగ దూడలను ఇస్తాయి. అవే ఆ రోజుల్లో భారత దేశ ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు.
ముస్లిము వ్యతిరేక సమీకరణ కోసమే కాకుండా బ్రాహ్మణాధిపత్యాన్ని కొనసాగించే అగ్రకులాలను సమీ కరించే సాధనంగా 19వ శతాబ్దంలో గో సంరక్షక సమితులు ఏర్పడ్డాయి. ఈ సంస్థలన్నీ హిందూ సభలుగా ఏర్పడ్డాయి. ఇవన్నీ తరువాత కాలంలో హిందూ మహాసభగా మారాయి. గొల్లలు, అహీర్లు, గుజ్జర్ల వంటి వెనుకబడిన కులాలను గో సంరక్షకులలో హిందూత్వ శక్తులు కలుపుకున్నాయి. అత్యంత 'కళంకితులైన' చర్మకారులను వీరిలో చేర్చుకోలేదు. దీనికి గల కారణం వారు చనిపోయిన పశువులతో పనిచేయటం, వాటి చర్మాన్ని ఒలవటం వంటి పనులు చేయటమే. ఈ వృత్తిలో ఉండటం, వారిలో చాలా మంది ఆవు మాంసం తినటం వల్ల వారికి ఆ అర్హత లేదని హిందూత్వ శక్తులు భావిస్తాయి. కాబట్టి వీరిని ముస్లిములతో 'సమానం'గా చూడటం జరుగుతున్నది.
సఫాయి కార్మికుల నాయకుడు, ఈ మధ్య కాలంలో మెగసెసే అవార్డు గ్రహీత అయిన బెజవాడ విల్సన్‌ ఈ సంవత్సరం మే నెలలో జరిగిన ఇండియా కాన్‌క్లేవ్‌లో అవు మాంసం నిషేధానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది పేదల మీద జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ఎందుకంటే ఆవు మాంసాన్ని నిషేధించటం వల్ల పేదలు మాంసకృత్తుల వనరుకు దూరమౌతున్నారు. దళితులలో, ఆదివాసీలలో, కొన్ని వెనుకబడిన కులాలలో ఆవు మాంసం తినే అలవాటు ఉన్నదని అనేక ప్రభుత్వ సంస్థలు అంగీకరిస్తున్నాయి. గో సంరక్షణ పేరుతో ముస్లిములపై దాడిచేయటమంటే వారిపై ఆర్థిక యుద్ధం చేయటమే. అందుకే గో మాంస భక్షణపై గల వ్యతిరేకత చనిపోయిన ఆవుల చర్మం తీయటానికి వ్యతిరేకంగానూ, చర్మాలను, మాంసాన్ని, పశువుల రవాణా చేయడానికి వ్యతిరేకంగానూ మారి ఆ కార్యకలాపాలలో పాల్గొనేవారిపై కూడా దాడులు జరగటానికి దారితీస్తున్నది.
పశువుల వ్యాపారులపై జరుగుతున్న దాడుల పర్యవసానంగా కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న రాష్ట్రాల లోని పశువులు ఎవరికీ కాకుండా వేలాదిగా చనిపోయాయి. పశువుల ధరలు ఘోరంగా పడిపోయాయి. పశువుల రవాణా మరింత సంక్లిష్టంగా మారింది. అది చాలా ప్రమాదకరమైన పని అయింది. అలాగే పశువుల చర్మంతో చేసే వస్తువులు, ఆవు మాంసం ఎగుమతులు(ఇది చాలా వరకు గేదెలదే) చాలా తగ్గిపోయాయి. వ్యవసాయోత్పత్తులను, తయారైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ అపెడా ప్రకారం గేదె మాంసం ఎగుమతులు 2015- 2016లో కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో 11 శాతం పడిపోయాయి. అలాగే భారతదేశం ఎగుమతిచేసే తోలు వస్తువుల ఎగుమతులు 10 శాతం పడిపోయాయి. పశువుల వ్యాపారులపైనా, పశుమాంస భక్షణపైనా జరుగుతున్న దాడులు భారత ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న దాడిగా మారింది. భారతదేశ తోలు పరిశ్రమలో దాదాపు 25 లక్షల మంది ముస్లిములు, దళితులు ఉన్నట్టు అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. కాబట్టి పశువుల, వాటి చర్మాల వ్యాపారం మీద జరుగుతున్న దాడి ఆ వ్యాపారంపై గణనీయంగా ఆధారపడిన ముస్లిముల, దళితుల జీవనోపాధిపై జరుగు తున్న దాడి కూడా.
ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి ఆవు మాంసం ఎజెండా సమాజాన్ని మత ప్రాదిపదికన చీల్చటానికి ఒక మంచి సాధనంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఉపయోగపడు తున్నది. రాబోయే ఎన్నికల్లో ముస్లిముల ప్రభావాన్ని పరిమితం చేసేందుకు పన్నుతున్న కుయుక్తే ఇది. నేటి దళిత నిరసనలు అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని సూచిస్తు న్నాయి. 'ఒకవేళ ఆవు మీ అమ్మ అయితే మీరే ఖననం చేసుకోవాలి' అనే నినాదానికి సమాధానం బిజెపి దగ్గర లేదు.
- ప్రబీర్‌ పుర్కాయస్థ

No comments:

Post a Comment