కేంద్రంలో మరోసారి జాతీయ విద్యావిధానం ఆవిష్కరణకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి దాకా అమల్లో ఉన్నది 1986లో ప్రకటించిన విధానం అనే విషయం తెలిసిందే. 30 సంవత్సరాల తర్వాత రివైజ్ చేస్తున్న నూతన విద్యా విధానానికి సహజంగానే చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్యారంగం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశించటం కద్దు. కానీ, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో జూన్ 30న ప్రకటించిన 'సమ్ ఇన్‌పట్స్ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2016' పత్రాన్ని పరిశీలిస్తే ఊరించి ఉసూరు మనిపించినట్లుగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలపర్చటం కంటే ప్రయివేట్ శక్తులకు పట్టం కట్టి కాషాయీకరణకు కళ్లెం అప్పగించే పోకడలే పొంచి ఉన్నాయి.
|| పూర్వ ప్రాథమిక విద్యపై లేని స్పష్టత ||
నాలుగైదు సంవత్సరాల వయస్సు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ ప్రైమరీ)ను అందించాలని, మహిళాశిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమన్వయంతో అమలు చేయాలని, అందుకోసం అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లో నిర్వహించాలని, అదనపు వసతులు కల్పించటం, ప్రీ ప్రైమరీ టీచర్స్ కేడర్‌ను సృష్టించటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని ప్రతిపాదనలో పేర్కొనబడింది. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ బాధ్యత అంగన్‌వాడీలదా? పాఠశాలలదా? అనే విషయంలో స్పష్టతలేదు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 11 ప్రకారం నాలుగైదు సంవత్సరాల పిల్లలను పాఠశాలల్లో చేర్చుకుని ప్రీ స్కూల్ క్లాస్‌లు నిర్వహించాలనే నిబంధనను ముసాయిదా విస్మరించింది. ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఇసిసిఇ) గురించి 2013లో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని గాని, 2015లో వచ్చిన లా కమిషన్ ఆఫ్ ఇండియా నివేదికను గానీ పట్టించుకోకపోవటం పెద్ద లోపమే. పాఠశాల విద్యలో అంతర్భాగంగా ఉంటేనే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌కు న్యాయం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి.
|| ఆరో తరగతి నుంచి డిటెన్షన్ ||
ముసాయిదా పత్రం 4.3.3 పేరాలో నాన్ డిటెన్షన్ విధానాన్ని 5వ తరగతి వరకే పరిమితం చేయాలని, అందుకనువుగా విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించబడింది. డిటెన్షన్ విధానాన్ని విధిస్తే ఆరో తరగతి నుంచి ఫెయిలయ్యే విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ పాఠశాలలు ఏర్పాటు చేయాలనే సూచన చేయబడింది. నాన్‌డిటెన్షన్ విధానానికి న్యాయం చేయటం కోసమే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) విధానం వచ్చింది. సిసిఇ కొనసాగినా నాన్ డిటెన్షన్ ఎత్తేయాలని చెప్పటం విచిత్రంగా ఉంది. డిటెన్షన్‌తో ఫెయిలయ్యే విద్యార్థుల్లో ఎక్కువమంది ప్రభుత్వ పాఠశాలల్లోని బడుగు, బలహీనవర్గాల వారే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో 1972 నుంచే అమల్లో ఉన్న నాన్‌డిటెన్షన్ విధానం ఎగిరిపోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మరింత తగ్గిపోవటానికి దారితీస్తుంది.
|| పాఠశాలల విలీనం చేయాల్సిందేనట ||
విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయవద్దని ఉపాధ్యాయ సంఘాలు, మూసేస్తూనే ఉంటామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాదించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో విద్యా విధాన ముసాయిదా ప్రభుత్వాలకే కొమ్ముగాస్తోంది. తక్కువ మంది విద్యార్థులు ఉండే స్కూళ్లను విలీనం చేయాలనే చెప్పింది. ఆ విధంగా చేయటం ద్వారా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే ఏర్పాటు చేసుకోవచ్చనే సలహా కూడా చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవటానికి తరగతికో టీచర్ లేకపోవటమే కారణమా? పాఠశాలల పని విధానం, పర్యవేక్షణ, మీడియం, వసతులు వంటి మౌలిక సమస్యలు పరిష్కరించకపోతే విలీన ప్రహసనంతో మూసివేతలు కొనసాగుతూనే ఉంటాయి. పాఠశాల విద్య పూర్తికాకుండానే మధ్యలోనే బడి మానేస్తున్న విద్యార్థుల కోసం ఓపెన్ స్కూల్, నాన్‌ఫార్మల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనా ఉంది. 1998లో వచ్చిన ఇండియా ఎడ్యుకేషన్ రిపోర్ట్‌లో వివరించిన డ్రాపవుట్స్ కారణాలను, పరిష్కార చర్యలను ముసాయిదా నివేదిక చూడక పోవటం అన్యాయం. ఈ ప్రతిపాదనతో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్ పెరిగిపోతాయి.
|| విద్యార్థులను విభజించే పరీక్షలు ||
సైన్స్, మేథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు దేశమంతటా ఏకరూపంగా ఉండాలి. సోషల్ స్టడీస్‌లో కొంతభాగం జాతీయ స్వభావంగా, మిగిలింది రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు అని చెప్పబడింది. అందుకు అనుగుణంగా పదో తరగతి పరీక్ష రెండు రకాలుగా ఉండాలని ప్రతిపాదించారు. ఉన్నత చదువుల్లో సైన్స్, మేథ్స్, ఇంగ్లీష్ కోర్స్‌ల్లోకి పోదల్చుకున్న వారు ''ఎ లెవల్'' పరీక్ష రాయాలని, మిగిలిన సబ్జెక్ట్‌లు లేదా ఒకేషనల్ కోర్స్‌ల్లో పోదల్చుకున్న వారు ''బి లెవల్'' పరీక్ష రాసుకోవాలని ఆప్షన్స్ పెట్టారు. దీని ద్వారా విద్యార్థులను రెండు కేటగిరీలుగా విభజించటం జరుగుతుంది. పాఠశాల విద్య నుంచే మార్కెట్ కోర్సులకు ప్రాధాన్యతనిస్తూ, పరిపాలన, పౌరనీతి, సంస్కృతి, నాగరికత, సామాజిక న్యాయం, మానవ సంబంధాలు, నైతిక విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను నేర్చుకునే సబ్జెక్టులు నీరుగార్చబడతాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి)ని ఒక సబ్జెక్ట్‌గా పెట్టాలన్నారు. కానీ అందుకు అవసరమైన టీచర్ల ప్రస్తావన లేదు.
|| త్రిభాషా సూత్రానికి తిలోదకాలు ||
బోధనా మాధ్యమాన్ని 5వ తరగతి వరకు మాతృభాషలో లేదా ప్రాంతీయ భాష లేదా స్థానిక భాషలో రాష్ట్రాలు నిర్వహించుకోవచ్చు. అలాంటి చోట ఇంగిష్ రెండో భాషగా ఉండాలి. అప్పర్ ప్రైమరీ, సెకండరీ లెవల్‌లో రాష్ట్రాలు తమకు ఇష్టమైన భాషను బోధించుకోవచ్చు. దేశ సాంస్కృతిక ఐక్యతకు దోహదపడిన సంస్కృత భాషా బోధనకు తగు ప్రాధాన్యత యివ్వాలి. ఇవీ ముసాయిదాలోని భాషలకు సంబంధించిన ప్రతిపాదనలు. వీటిలో హిందీ భాష ఊసేలేదు. 5వ తరగతి వరకు తెలుగు మీడియం అనేది రాష్ట్రాలకు ఆప్షన్ తప్ప కంపల్సన్ కాదు. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు పెట్టుకోవచ్చు. ఆ స్కూళ్లలో సెకండ్ లాంగ్వేజ్‌గా అయినా మాతృభాష ఉండాలనే సూచన కూడా లేదు. ప్రయివేట్ స్కూళ్లలో తెలుగు మీడియం ఏది? తెలుగు భాష ఎక్కడీ అని ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా పోతుంది.
|| పౌష్టికాహారం బదులు యోగాసనాలు ||
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ మూర్తిమత్వానికి ఎకడమిక్ విషయాలతో పాటు సహపాఠ్యాంశాలను నేర్చుకోవాలి. జ్ఞానంతో పాటు శారీరక భావావేశాల్లోనూ వికసించాలి. మంచి ఆరోగ్యంగా ఉంటేనే బాగా నేర్చుకోగలరు. అందుకని ఆటలు, వ్యాయామంతో పాటు యోగా నేర్పాలంటున్నారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్రీకృత వంటశాలలు నిర్వహించగలిగే ప్రముఖ సామాజిక సంస్థలకు అప్పగించాలని చెప్పారు. బడి పిల్లలకు యోగా అవసరమా? అది నేర్పేది ఎవరు? బిజెపి పాలిత రాష్ట్రాల్లోని పాఠశాలల్లో హిందూత్వ శక్తులే యోగా నేర్పుతున్న విషయం తెలిసిందే. బిజెపితో చెలిమిచేస్తున్న టిడిపి ప్రభుత్వమూ ఆంధ్రప్రదేశ్‌లోని హైస్కూళ్లలో యోగా శిక్షణకు ఇషా ఫౌండేషన్‌కు అవకాశం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇష్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఉండదు. వారు పంపించే ప్రత్యేక శాఖాహారాన్ని తినలేక సగంమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని మానేస్తున్నారు.
|| టీచర్స్ రిక్రూట్‌మెంట్ కమిషన్ ||
జాతీయ స్థాయిలో టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీని నెలకొల్పాలి. ప్రాంతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థలను కూడా విశ్వవిద్యాలయాల స్థాయికి అభివృద్ధిచేయాలి. ఉపాధ్యాయుల నియామకాల కోసం రాష్ట్రాల్లో స్వతంత్ర కమిషన్‌లు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాన్ని, విషయ పరిజ్ఞానాన్ని ఐదేళ్లకోసారి సమీక్షించి అంచనా వేయాలి. అందులో కృతార్థులు అయితేనే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్‌లకు అర్హులవుతారు. కనీసం ఐదు సంవత్సరాల సర్వీస్ గల ఉపాధ్యాయులలో ప్రతిభ, అభిరుచి ప్రాతిపదికన హెడ్మాస్టర్ల కేడర్‌ని సృష్టించాలి. వారిని పాఠశాలల పనివిధానానికి అభివృద్ధికి బాధ్యులను చేయాలి. మొబైల్‌ఫోన్‌లు, బయోమెట్రిక్ యంత్రాలు, తదితర సాంకేతిక పరికరాలతో గైర్హాజర్‌ను అదుపు చేయాలి. బాధ్యతారహితంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారాలు స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసి)లకు అప్పగించాలి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వివిధ స్థాయిల్లో ఇచ్చే అవార్డలకు అర్హులైనవారిని ఎంపిక చేయటానికి కొన్ని లక్ష్యాల ప్రాతిపదిక రూపొందించాలి. ఈ విషయంలోనూ ఎస్‌ఎంసిలు కీలకపాత్ర పోషించాలి. ఇవీ టీచర్ల విషయంలో ముఖ్యమైన ప్రతిపాదనలు. వీటి పర్యవసానాలు ఎలా వుంటాయనేది అందరికీ తెలిసిందే. ప్రతిభ ప్రాతిపదికన ప్రమోషన్‌లు ప్రయివేట్ రంగంలో పాటించే విధానం. స్కూల్స్ పెర్‌ఫామెన్స్, ప్రగతికి హెడ్మాస్టర్ కృషి, చొరవ తోడ్పడినా ప్రభుత్వ విధానాలు, చర్యలే ప్రధానం.
|| అంతర్లీనంగా ప్రైవేటీకరణ, కాషాయీకరణ ||
ఈ వ్యాసంలో పాఠశాల విద్యకు సంబంధించిన విషయాలనే పేర్కొనటం జరిగింది. నూతన విద్యా విధానం 2016 ముసాయిదా పత్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలపరిచేవిగాని, ప్రయివేట్ విద్యా వ్యాపారాన్ని అరికట్టే ప్రతిపాదనలు గానీ ఏమీలేవు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలైన ప్రయివేటీకరణ, కాషాయీకరణ ధోరణులు అంతర్లీనంగా అల్లుకుపోయాయి. ప్రీ ప్రైమరీ టీచర్స్, ప్రత్యామ్నాయ పాఠశాలలు, ఐసిటి ఇన్‌స్ట్రక్టర్లు, కౌమార విద్య బోధకులు, తదితర యంత్రాంగం కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ద్వారా కమ్ముకుంటుంది. యోగా, మధ్యాహ్న భోజనంతో పాటు సంస్కృత భాష వంటి కరిక్యులమ్, సిలబస్, పాఠశాలల్లో చేసే మార్పులు చేర్పులతో కాషాయీకరణ కైవారానికి మార్గం సుగమం అవుతుంది. అసలు ఆ ముసాయిదా పత్రం ప్రారంభంలోనే వేదాల ప్రాధాన్యతను పేర్కొనడం వల్ల ఈ విధానం దిశా నిర్దేశం ఏమిటో అర్థంచేసుకోవచ్చు.
- నాగటి నారాయణ
No comments:
Post a Comment