Wednesday, 31 August 2016

|| సరళీకరణ విధానాలను ఓడించడమే సెప్టెంబర్‌ 2 సమ్మె ప్రధాన లక్ష్యం ||




                 భారతదేశంలో సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టి పాతికేళ్ళయ్యింది. సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి అమలుచేస్తున్నాయి. కేంద్రంలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న గత కాంగ్రెస్‌ ప్రభుత్వం, నేటి బిజెపి ప్రభుత్వాలు పోటీలో అగ్రగాములుగా ఉన్నాయి. బిజెపి గత రెండు సంవత్సరాల పాలన మరింత దూకుడుగా ఉంది. బిజెపి విధానాల ప్రభావం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్రంగా ఉంది. వీరి పాలన బహుళజాతి సంస్థలకు మరింత అనుకూలంగా మారింది. పోరాటాల ద్వారానే బిజెపి దూకుడును అడ్డుకోగలమనేది గత అనుభవం కూడా. 2004 సంవత్సరానికి ముందు ప్రజా పోరాటాలు ద్వారానే ఎన్డీయే విధానాలను ప్రజలు నిలువరించారు. 2004 ఎన్నికల్లో బిజెపి అన్ని పారిశ్రామిక కేంద్రాల్లో ఘోరంగా ఓడిపోయింది. సరళీకరణ విధానాలను ఆ నుంచి క్ష వరకు నికరంగా సిఐటియు వ్యతిరేకించి పోరాడుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యక్తిగత సగటు ఆదాయం సాలీనా రూ.1,40,000కు పెరిగిందని ప్రకటించింది. రాష్ట్రంలో మొదటి స్థానంలో గాజువాక మండలం (విశాఖ జిల్లా) ఉంది. గాజువాక స్టీల్‌ప్లాంట్‌, బెల్‌ లాంటి భారీ ప్రభుత్వరంగ పరిశ్రమల కేంద్రం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ.30 వేల కోట్లకు పైగా చెల్లించింది. ప్రభుత్వరంగ పరిశ్రమలు ఆధునిక దేవాలయాలు. ప్రగతికి పట్టుగొమ్మలు. ప్రభుత్వరంగ సంస్థల కాలనీల్లో కార్మికులు అత్యాధునిక సౌకర్యాలున్నాయి. పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులు, పార్కులు, విద్యుత్‌, మంచినీరు లాంటి సౌకర్యాలకు కొదవ లేదు. ప్రభుత్వరంగం వల్లే ఈ ప్రాంతంల్లో ఎస్సీ, ఎస్టీలు బతకగలుగుతున్నారు. సామాజిక న్యాయం సాధ్యమౌతున్నది.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కూల్చేయాలని నిరంతరం కుట్రలు చేస్తున్నది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2015-16లో మొదటిసారి రూ.1,640 కోట్లు నష్టాలు చవిచూసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లోని స్టీల్‌ప్లాంట్‌లకు స్వంత ఇనుప గనులు ఉన్నాయి. కానీ విశాఖ స్టీల్‌కు సొంత గనుల్లేవు. గతంలో కేంద్ర గనుల శాఖా మంత్రులుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి టి సుబ్బిరామిరెడ్డి, దాసరి నారాయణ ఉన్నా విశాఖ స్టీల్‌కు ఇనుప గనులు తేలేదు. సొంత గనులు ఉన్న వారికి టన్ను ఇనుప ఖనిజం రూ.500లకు లభిస్తే, విశాఖ స్టీల్‌ టన్ను రూ.5 వేలు పెట్టి కొనవలసి వస్తున్నది. విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ 80 శాతానికి పైగా ప్రయివేట్‌ పరమైంది. హిందూస్థాన్‌ పెట్రోలియం ఇప్పటికే 49 శాతం ప్రయివేట్‌పరమైంది. ప్రయివేట్‌ కత్తి పరిశ్రమ మెడపై వ్రేలాడుతున్నది. బెల్‌ పరిశ్రమకు వర్క్‌ ఆర్డర్లు లేవు. కార్మికులు 20 సంవత్సరాల నాటి జీతాలతో కాలం గడుపుతున్నారు. షిప్‌యార్డ్‌ రక్షణరంగంలో విలీనమైనా ఆర్డర్లు శూన్యం. ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన భారీ పరిశ్రమల గురించి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ళలో ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రభుత్వరంగాన్ని బలహీనపరిచి ప్రయివేట్‌వారికి పెద్ద పీట వేస్తున్నాయి. అయినా ఒక్క భారీ ప్రయివేట్‌రంగ పరిశ్రమా నేటికి రాష్ట్రంలో ఎక్కడా రాలేదు.
చైనాలో ప్రభుత్వరంగం బలంగా ఉండటం వల్లనే చైనా ప్రపంచంలో అమెరికా తరువాత రెండవ ఆర్థిక శక్తిగా మారిందని చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో కార్మికుల జీతాలు పెంచడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడింది. చైనాలో జీతాలు పెరగడం వల్ల కార్మికవర్గం మార్కెట్‌లో వస్తువుల కొనుగోలుచేయడం బాగా పెరిగింది. దీనికి విరుద్ధంగా కార్మికుల జీతాలు తగ్గిస్తే భారతదేశం అభివృద్ధి చెందుతుందనే పాలకుల సిద్ధాంతం సుద్ద తప్పు. విద్యాధికులు అవుతున్న యువతీయువకులకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. విశాఖఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ఉపాధి కోసం ప్రాణాలు బలిదానం చేశారు. కానీ నేడు ఉన్న ఉపాధికి కోత విధిస్తున్నారు. 1991లో ప్రభుత్వరంగంలో ఉన్న 54 వేల ఉద్యోగాలు నేడు 34 వేలకు పడిపోయాయి. అతి తక్కువ జీతాలతో చేయించుకొనే కాంట్రాక్టు లేబరు పెరిగింది. ఇదే కాలంలో అన్ని పరిశ్రమల్లో రెట్టింపుకు పైగా ఉత్పత్తి పెరిగింది. దీనినే 'ఉపాధి రహిత అభివృద్ధి' అంటాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న జబ్బు ఇది. అమెరికా, యూరప్‌ ఖండాలతో సహా నిరుద్యోగ భూతం ఆవరించింది. మనదేశంలో పర్మినెంట్‌ ఉద్యోగాలకు అవకాశం ఉన్నా పెట్టుబడిదారుల లాభాలు పెంచడం కోసం కాంట్రాక్టు పద్ధతి తీవ్రంగా అమలు చేస్తున్నారు. జీతాలు పెంచమంటే 'మారుతి ఉద్యోగ్‌ లిమిటెడ్‌' లో హైర్‌ అండ్‌ ఫైర్‌ పేరుతో 800 మంది కార్మికులను తొలగించారు. చౌక శ్రమ (చీప్‌ లేబర్‌)తో కార్మికులను శ్రమదోపిడీని తీవ్రం చేయడానికి స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్లు (సెజ్‌) ఏర్పాటు చేస్తున్నారు. సెజ్‌లు అంటే ఆధునిక జైళ్లు. సర్కస్‌ కంపెనీల్లాగా రాయితీలు అయిపోగానే ఒకచోట నుంచి మరోచోటకు మారుతుంటారు. కార్మికులను అతి తక్కువ జీతాలతో పనిచేయిస్తాయి. అచ్యుతాపురం స్పెషల్‌ ఎకానామిక్‌ జోన్‌లో బ్రాండిక్స్‌ కంపెనీకి ప్రభుత్వం వెయ్యి ఎకరాలు వెయ్యి రూపాయలకు సంవత్సరానికి లీజుకు ఇచ్చింది. వీరికి విద్యుత్‌, నీటి ఛార్జీలు తక్కువ.
ప్రయివేట్‌ అంటే లాభాలు. లాభాల కోసమే ప్రయివేట్‌ యాజమాన్యాలు కంపెనీలు నడుపుతాయి. ప్రభుత్వరంగ కంపెనీలు ప్రయివేట్‌ అయితే లాభాలు ప్రయివేట్‌కు వెళతాయి. ప్రభుత్వరంగంలో నష్టాలు సమాజం భరించాలి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వరంగం నేడు నష్టాలపాలవుతున్నది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత గత రెండేళ్ళలో ప్రభుత్వరంగంలో అత్యంత లాభాలొస్తున్న ఆయిల్‌, బెల్‌, ఎన్‌టిపిసి వంటి సంస్థల వాటాలను రూ.20 వేల కోట్లకు పైగా వ్యూహాత్మాక అమ్మకాల పేరుతో ప్రయివేట్‌ వారికి అప్పగిస్తున్నది. బ్యాంకింగ్‌, ఇన్సూరెన్సు రంగాల్లో విదేశీ పెట్టుబడులను అత్యధికంగా ఆహ్వానించడం, వీటి లాభాలను పన్నుల్లేకుండా విదేశాలకు సాగనంపడమే. 'మేక్‌ ఇన్‌ ఇండియా' పేరుతో విదేశీ కంపెనీలు మన దేశంలో 'లూట్‌ ఇన్‌ ఇండియా'గా మారాయి. జాతీయవాదం గురించి తెల్లవారి లేస్తే జపంచేసే బిజెపి పాలకులు అమెరికాకు మన దేశాన్ని తాకట్టుపెడుతున్నారు. ఇది జాతీయవాదం కాదు. విదేశీవాదం. దీన్ని ప్రశ్నించే వారందరూ వీరి సిద్ధాంతం ప్రకారం దేశద్రోహులు. ప్రభుత్వరంగం బలహీనమైతే భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది. ఉపాధి సమస్య తీవ్రమౌతుంది. ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. సామాజిక న్యాయం తీవ్రంగా దెబ్బతిని ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలు మరింతగా నష్టపోతారు. మనదేశ ఆహార అవసరాలకు విదేశాలపై ఆధారపడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. విదేశాల నుంచి కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలతో సహా చిన్న దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్నాం. 80 లక్షల టన్నుల రసాయనిక ఎరువులు, ఒక కోటి టన్నుల స్టీలు వగైరా గత సంవత్సరం దిగుమతి చేసుకున్నాం. దీనివల్ల ప్రభుత్వరంగ అభివృద్ధితో స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశం నేడు పరాధీనత పాలుగావడం విచారకరం.
కార్మికవర్గం చైతన్యయుతమైన వర్గం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గతంలో 16 సమ్మెలు చేశారు. 16 సమ్మెల్లోనూ సిఐటియు చురుకైన పాత్ర వహించింది. వచ్చే సెప్టెంబర్‌ 2వ తేదీన 17వ సమ్మెకు యావత్‌ కార్మికవర్గం సమరశంఖారావం పూరించింది. పూర్తి సన్నాహాలు చేస్తున్నది. కార్మికవర్గ పోరాటాలను అణచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను మారుస్తున్నాయి. సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును కాలరాయడానికి సిద్ధపడుతున్నాయి. పోరాడి సాధించుకున్న హక్కులను ఉక్కుపాదంతో అణచడం ఎవ్వరితరం కాదని చరిత్ర రుజువుచేసిన సత్యం. ఉద్యమాలను ఎంత అణిచేస్తే అంత తీవ్రరూపం దాలుస్తాయి. ఇది పోరాటాల కాలం. యూనియన్‌ లేకుండానే బెంగళూరులో గార్మెంట్‌ కార్మికులు లక్షమంది సెజ్‌ బంధాలు తెంచుకొని వచ్చి జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. విశాఖలో 16 వేల మంది బ్రాండిక్స్‌ కార్మికులు 15 రోజులు నిరవధిక సమ్మె నడిపారు. 22 ఏళ్ళ తరువాత రైల్వే కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 2న యావత్‌ కార్మికవర్గం సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసన తెలియజేయాలని సిఐటియు కోరుతున్నది.  --సి హెచ్ నర్సింగరావు 

No comments:

Post a Comment