Wednesday, 24 August 2016

|| సమస్య భౌతికం-పరిష్కారం మతంలోనా.. ||



             కాకతాళీయమే అయినా రియో ఒలింపిక్స్‌, కృష్ణా పుష్కరాల సమయంలో ఆగష్టు 19న రెండు సంఘటనలు జరిగాయి. మొదటిది, పివి సింధు ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ ఫైనల్‌ పోటీలో పాల్గొనడం కాగా, రెండవది, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజం చినజియ్యర్‌ స్వామి లక్ష మంది భక్తులతో కలసి వచ్చి కృష్ణానదిలో సమతా స్నానం చేయడం. సింధు అంతర్జాతీయ క్రీడలో పాల్గొని గెలవడం, ఓడడం అన్నది భౌతికం, సామాజికం. కానీ ఆమె ఆ క్రీడలలో గెలవాలని కోరుకుంటూ, బంగారు పతకం సాధించాలని ఆకాంక్షిస్తూ దేశమంతా మతపరమైన యాగాలు, పూజలు జరిగాయి. అసమ సమాజంలో సమతను తీసుకురావడం భౌతికం, సామాజికం. సమతను సాధించాలన్న సంకల్పంతో మత సంబంధమైన పుష్కరాలలో స్నానం చేయించారు చిన జియ్యర్‌ స్వామి. సింధు విజయం, సమతా సాధనం ఈ రెండూ భౌతికమైన సామాజికాంశాలు. అయితే ఈ రెండింటినీ సాధించడానికి మతాన్ని ఆశ్రయించడం అశాస్త్రీయం, వైరుధ్యం. భౌతిక సమస్యలకు భౌతికేతర పద్ధతిలో పరిష్కారాలు దొరకవు. సామాజిక సమస్యలకు సామాజికేతర పరిష్కారాలు దొరకవు.

   సింధు మన తెలుగమ్మాయి. భారతీయ క్రీడాకారిణి. అతి చిన్న వయసులో అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదగడం భారతీయులందరికీ ఆనందం కలిగించే అంశం. ఆమె బ్యాడ్మింటన్‌ ఫైనల్లో విజయం సాధించి మన దేశ కీర్తి పతాకను ఎగురవేయాలని కోరుకోవడంలో భారతీయులంతా ఏకమయ్యాం. ఇందుకు మనలో ప్రతి ఒక్కరూ తక్కిన వాళ్ళను అభినందించాలి. అలాగే అనేక అసమానతలతో కునారిల్లుతున్న భారతీయ సమాజాన్ని సమతా సమాజంగా మార్చాలన్న చిన జియ్యరు సంకల్పం మహోన్నతమైనది. సమసమాజ స్థాపన ఒక సామాజిక అవసరమని ఆయన గుర్తించినందుకు ఆయనను అభినందించాలి. ఆయనతో కలిసి వచ్చినవారిని కూడా అభినందించాలి. అయితే సింధు ఒలింపిక్స్‌ ఫైనల్లో గెలవాలని దేశవ్యాపంగా దేవుళ్ళకు మొక్కడం, యాగాలు చెయ్యడం, సమత్వ సాధన కోసం నదిలో స్నానాలు చెయ్యడం ఈ రెండూ సమతూకమైన చర్యలు కావు. ఆటల పోటీలలో ఆటగాళ్ళు గెలవడం, ఓడడం అన్నవి వాళ్ళ శారీరక, మానసిక స్థితి మీద, వారి క్రీడా నైపుణ్యానైపుణ్యాల మీద ఆధారపడి ఉంటాయి. క్రీడా సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించగలిగే మెలకువ మీద ఆధారపడి ఉంటాయి. క్రీడలలో గెలుపు, ఓటమి క్రీడాకారుల చేతులలోనే ఉంటాయి. ఇందులో దేవుళ్ళ దయకు గాని, నిర్దయకు గాని ప్రమేయం ఉండదు. ఒలింపిక్స్‌లో చివరి పోరులో సింధు గెలవాలని ఇంత మందిమి పూజలు, యాగాలు చేశాం. ఆమె విజయం సాధించలేక పోయింది. మరి మనం పూజించిన దేవుళ్ళు ఏం చేశారు? వాళ్ళు మన మొరెందుకు ఆలకించి మన సింధుకు విజయం చూకూర్చలేదు? ఫైనల్లో పోటీకి దిగిన ఇద్దరిలో కరోలినా విజయం సాధించడంలో గాని, సింధు విజయం సాధించలేక పోవడంలో గాని దేవుళ్ళ ప్రమేయం లేదు. వాళ్ళ క్రీడా సామర్థ్య, నైపుణ్యాలలోని తేడాలే వాటికి కారణం. బంగారు పతకం సాధించడంలో సింధు ఓడిపోయందా? ఆమె గెలవాలని కోరుకుంటూ దేవుళ్ళందరినీ మొక్కుకున్న భారతీయులు ఓడారా? ఇంతమంది భక్తుల మొర ఆలకించి సింధును గెలిపించలేక పోయిన దేవుళ్ళు ఓడిపోయారా? తుది పోరులో కూడా గెలవగలిగిన క్రీడాకారులను తయారుచేసే సంకల్పం లేని ప్రభుత్వాలు ఓడి పోయాయా? ఇదీ మనం ఇప్పుడు ఆలోచించవలసింది. సమతా సాధనమన్నది మహోన్నత లక్ష్యం. అయితే అది ముక్కుమూసుకుని కృష్ణానదిలో మూడు మునకలు వేస్తే సాధించగలిగినంత సులభమైంది కాదు. సమతా స్నానం కోసం చినజియ్యర్‌ స్వామి లక్షమందిని సమీకరించడం గొప్ప విషయం. అయితే ఆయన ఎన్నుకున్న అభివ్యక్తి రూపం సామాజికమైంది కాదు. మత సంబంధమైనది. మతమంటేనే అసమానత్వం. అది సమతా సాధనకు ఎలా సాధనమౌతుంది? సమతా సమాజం ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యం. రామానుజాచార్యులు అప్పట్లో గిడసబారి పోయిన హిందూ సమాజంలో సంస్కరణలు తీసుకొనిరావడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. కానీ ఇవాళ ఆ పద్ధతి సాధించేదేమీ ఉండదు. సాంఘిక, ఆర్థిక వివక్ష, అసమానత, అణచివేత, అవినీతి, దోపిడీల నుంచి భారతీయ సమాజాన్ని విముక్తం చేయాలంటే మొదట భారతీయులను మతం నుంచి విముక్తం చేయాలి. కులం నుంచి విముక్తం చేయాలి. కుల, మత చట్రంలోనే సమతను సాధించాలనుకోవడం అశాస్త్రీయం. కుల, మత నిర్మూలన ద్వారా, ఆర్థిక పోరాటాలు చేయడం ద్వారానే సమతను సాధించగలం. కులమతాల విశ్వాసాల నుంచి ప్రజలను విముక్తం చేయడం ప్రథమ కర్తవ్యం. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాల ద్వారా కులాలను నిర్మూలించుకొని, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాలు అందించిన శాస్త్రీయ జ్ఞానాన్ని జీర్ణించుకొని మతాలను నిర్మూలించుకొని ప్రజా శ్రేణుల సమీకరణ ద్వారా ఆర్థిక పోరాటాలు చేస్తే సమత సాధ్యమౌతుంది గాని, మత స్వభావాన్ని అది ధర్మం అనో, మరొకటనో చెప్పి ప్రయోజనం లేదు. కులాలను వదులుకోకుండా, మత రూపాన్ని వదులుకోకుండా సమతను గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం శూన్యం. సమతను గురించి మాట్లాడినంత సులభం కాదు దానిని సాధించడం. అలాంటిది రూపంలోనే మతం, మతంలో ఒక శాఖ, ఒక విభాగం చిహ్నంగా ఉంటూ సమతను గురించి మాట్లాడడం దండగ. మత చిహ్నాల నుంచి బయటపడి లౌకిక రూపంతో, లౌకిక సారంతో మాటల ఆచరణలు ఉంటే ఏదైనా సాధించగలం. ధర్మం సనాతనం వంటి మాటలకు అర్థనిర్దిష్టతలున్నాయి. వాటిని యథాలాపంగా వాడేస్తుంటే ఫలితం గందరగోళమే. భయంకరమైన సాంఘిక, ఆర్థిక, తాత్విక వైరుధ్యాలున్న భారతీయ సమాజంలో సమతను సాధించాలని ఎవరు కోరుకున్నా అభినందనీయమేగాని, అది లౌకిక విధానం ద్వారానే సాధ్యమని గుర్తించడం అవసరం. సమత మతాల ద్వారా సాధించడం అసాధ్యం. ప్రపంచంలో ఏ మతమూ సమానత్వాన్ని తీసుకురాలేదు. లౌకిక ప్రజా ఉద్యమాలే దానిని సాధించగలవు. వీటి మీద నమ్మకం లేనివాళ్ళు సమతను గురించి మాట్లాడక పోవడం శ్రేయస్కరం.
సింధు ఒలింపిక్స్‌ ఫైనల్లో బంగారు పతకం సాధించాలని జరిగిన పూజలను, సమతను సాధించాలని చినజియ్యరు స్వామి చేసిన సమతా స్నానాన్ని వాళ్ళ అభివ్యక్తి రూపాలుగా మాత్రమే గుర్తించాలి. అదే సమయంలో ఆ అభివ్యక్తి రూపాలు అంతిమ పరిష్కారాలు కాదని కూడా గుర్తించాలి.   - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

No comments:

Post a Comment