Friday, 12 August 2016

# దళిత ద్రోహులెవరు? #


               దళితులను కాల్చకండి, గోసంరక్షణ సమితుల నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటూ హైద రాబాద్‌ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘా టించారు. రాజకీయాల్లో అన్నీ సాధ్యమే. నిన్నటి వరకు ఆవు పూజనీయం అంటూ ప్రచారం చేసి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించారు. దళితులు, ముస్లింలపై గోసంరక్షణ పేరుతో దాడులకు తెగబడ్డారు, తెగబడుతున్నారు. ఇప్పుడు గోసంరక్షణ సమితుల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ, దళితులను కాదు తనను శిక్షించండంటూ వేదికలపై ఉద్వేగభరిత ఉపన్యాసాలు ఇవ్వటం ఇందులో భాగమే. ఈ విధమైన పిలుపునిచ్చి 48 గంటలు గడవక ముందే ఇదే తరహా దాడి అమలాపురంలో చోటుచేసుకోవటం బిజెపి మతోన్మాద పోకడలకు పరాకాష్టగా అర్థం చేసుకోవచ్చు. గుజరాత్‌ సంఘటన సృష్టించిన ప్రకంపనలతో అక్కడి దళితజాతి ఏకమైంది. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నిస్తూ గుజరాత్‌లో ఉద్యమం రూపొందింది. గుజరాత్‌లో పాలిత బిజెపి తన ముఖ్యమంత్రినే మార్చి మరో అభ్యర్థిని ప్రకటించు కోవలసిన దుస్థితి దాపురించింది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, తదితర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల దృష్ట్యా ప్రజలు ముఖ్యంగా దళితులను మభ్యపెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. దాని కోసం మోడీ ఇప్పుడు దళితులను మాయచేసే ప్రయత్నం ప్రారంభించారు. రోహిత్‌ వేముల ఆత్మబలిదానం విజృంభిస్తు న్న మనువాద భావజాలాన్ని ఎలుగెత్తిచాటింది. ఇప్పుడు ప్రజాచైతన్యాన్ని పసిగట్టి చల్లార్చే ఎత్తుగడలతో మౌనాన్ని వీడినట్లు మొసలికన్నీరు కారుస్తున్నారు.
హింస పేట్రేగిపోవటానికి, శాంతి అదృశ్యమవటానికి, అసమానతలు రాజ్యమేలటానికి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని భుజాన వేసుకుని నడుస్తున్న బిజెపి ప్రభుత్వమే కారణం. అధికారాన్ని చేపట్టిన తర్వాత దళితులపైనా, ముస్లిములపైనా దాడులు పెరిగిపోయాయి. హిందూత్వ ముసుగులో మారణహోమం సృష్టిస్తూనే ఉన్నారు. ఏమి తినాలి? ఏమి తాగాలి? ఏమి మాట్లాడాలి? లాంటి సమస్యలను సృష్టిస్తూ హిందూత్వ భావజాలానికి అనుకూలంగా వారు నిర్ణయించినట్లే నడుచుకునేలా పరిస్థితులను మార్చేస్తున్నారు. ఈ దేశ సంస్కృతిలో భాగమైన మూలవాసులకే దేశభక్తి పాఠాలు నేర్పుతున్నారు.
హర్యానాలో దళితుడు సాక్ష్యం చెప్పాడనే నెపంతో అర్ధరాత్రి బయట గడియపెట్టి ఇంటికి నిప్పంటించి అభంశుభం ఎరుగని ఇద్దరు చిన్నారుల సజీవ దహనానికి అగ్రవర్ణ అహంకారం కారణమయ్యింది. మరోచోట రక్షణగా నిలుస్తారని పోలీస్‌ ఠాణాలోకి అడుగుపెడితే దళిత కుటుంబాన్నే వివస్త్రను చేసి వివక్షను చాటుకున్నాయి. షిర్డీలో అంబేద్కర్‌ పాటను రింగ్‌టోన్‌గా పెట్టుకున్నాడని యువకుణ్ణి కొట్టి చంపేశారు. ఇలా ఎన్నో సంఘటనలు దేశం నలుమూలలా జరుగుతూనే ఉన్నాయి. తరుగుతున్న మానవత్వపు విలువలను చాటుతూనే ఉన్నాయి. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలే దళితులను వివిధ సందర్భాలలో కుక్కలతో, పందులతో పోల్చడం చూశాం. నిన్నటికి నిన్న దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మాయావతిని అధికారపార్టీ ముఖ్యనేత నోటికొచ్చిన పదజాలంతో దూషించటం విన్నాం. ఆ వ్యాఖ్యలు జనాల చెవుల్లో ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఈ ఉదంతాలతో అధికార పార్టీ నాయకులకు దళితులపై ఉన్న చులకన భావం ప్రస్ఫుటమౌతుంది. మన సంస్కృతిలో, మనవారి జీవన విధానంలో భాగమైన గోవును దేవతను చేశారు. ముక్కోటి దేవతలకు నిలయాలుగా మార్చారు. ప్రకృతితో మమేకమై జీవనాన్ని సాగించేవారు దళితులు. వీరి బతుకుతెరువును చిదిమేసే ఎత్తుగడలకు నిలయాలుగా పాలనలు తయారయ్యాయి. దళితుల జీవన విధానాన్ని చిదిమే ప్రయత్నాలను ప్రారంభించాయి. అణచిపెట్టటానికి, వీరి బలాన్ని బంధించి ఉంచటానికి మాత్రమే పాలకుల గమనాలు సాగుతున్నాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అధికార పగ్గాలను చేపట్టి సాగించిన పాలనంతటిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన దాఖలాలు ఎక్కడా లేవు సరికదా మనువాదాన్ని భుజాన వేసుకొని మతఛాందసాన్ని పెంపొదిస్తున్నది. సామాజిక జీవనాన్ని, సామాన్యుల జీవితాన్ని పరిహాసం చేస్తోంది. అణగదొక్కే ఆదర్శాలనే అంటిపెట్టుకుని నడుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నిరంకుశ ధోరణులను అవలంబిస్తున్నారు నేటి బిజెపి పాలకులు.
యూనివర్సిటీల స్థాయిలోనూ మత విద్వేషాలకు పెద్దపీట వేస్తున్నారు. ఎందరో దళిత మేధావుల పరిశోధనలకు సహకరించకుండా వారిని నిరంతరం అవమానాలకు, అపసవ్య ఆలోచనలకు మళ్లేలా మార్గాలను రూపొందిస్తున్నారు. వీరి భవిష్యత్తుపై మాయని మచ్చగా మిగిల్చే ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఈ విధమైన విద్వేషాలకు కారకులను అదే స్థానాల్లో కొనసాగించి స్వేచ్ఛ, సమానత్వపు ఆలోచనలను సమాధిచేసే ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఇవన్నీ వికాసాన్ని కాంక్షించేనా, విశ్వాసాన్ని కోరుకునేనా? సమాజంలో సగభాగమైన మహిళ స్వేచ్ఛను స్వాగతించే స్థితిలోనూ లేదు.
ఎక్కడ అణచివేత వెర్రితలలు వేస్తుందో అక్కడే ఉద్యమం పురుడుపోసుకుంటుంది. దేశ నలుమూలలా విశృంఖలంగా అమలుపరుస్తున్న మనువాద పోకడలను, మతోన్మాద దూకుడులను ప్రజలు పసికడుతున్నాయి. విరుచుకు పడే తరుణానికై సమాయత్తమౌతున్నాయి. గుజరాత్‌లో ఏకమైన దళితుల శక్తి ఇందుకు నిదర్శనం. కులవృత్తిని సైతం తృణప్రాయంగా విడిచి ఆత్మగౌరవ పోరాటమార్గం వైపు పరుగులు పెట్టటం చూశాం. ఇదే స్ఫూర్తి పీడితులందరిలోనూ రావలసిన అవసరం ఉంది. ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపిన నాడే మన గౌరవం దక్కేది, మన హక్కులు నిలిచేది. ఇలాంటి ఉప్పెనలైన సంఘటనల నుంచి పొందే చైతన్యం మారుమూల జనాల్లోకి, సామాజికంగా అణచివేయబడుతున్న వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఉద్యమరూపం దాల్చే క్షణాలన్నీ విలువగానే ఉంటాయి. విజయాలను చేకూరుస్తాయి. అలాంటి సందర్భాల అంచనాలను వివక్షలు ఎదుర్కొంటున్న వారి చేరువకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సామాజిక ఉద్యమకారులదే. అప్పుడే ఇబ్బంది నుంచే వారు పొందుతున్న వ్యత్యాసపు ఆనవాళ్ల నుంచి ముందుకు రాగల్గుతారు. పరివర్తనలో, మన హక్కుల పరిరక్షణలో ముందడుగు వేయగల్గుతాము. కుంచించుకు పోయిన భావజాలాన్ని విడనాడాలి. దళిత చైతన్యాన్ని పురికొల్పాలి. సమూల మార్పులను చేసేలా ఒత్తిడి పెంచాలి. అలాకాని పక్షంలో మభ్యపెట్టే ఎత్తుగడల రాజకీయం, రాబందుల రాజ్యం ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్ని మాత్రమే పెంచిపోషిస్తుంది. అనుక్షణం మభ్యపెట్టే ఎత్తుగడల మొసలికన్నీరును ఒలకబోస్తుంది. దళిత జాగృతిని కోరేలా, వివక్షను రూపుమాపేలా మరో చరిత్రను సృష్టిద్దాం.

- మాతంగి దిలీప్‌కుమార్‌ 

No comments:

Post a Comment