వ్యవసాయ రంగం లో 'సమగ్రాభివృద్ధి'ని సాధించేందు కు రైతు సంక్షేమంపై దృష్టి సారిస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంలో తనను, తన ప్రభుత్వాన్నీ తానే అభినందించుకున్నారు. మూడు ప్రధాన స్తంభాలపై ఈ అభివృద్ధి నమూనా ఆధారపడి ఉన్నది. 2016వ సంవత్సరపు ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్టు చిల్లర వర్తకంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమ తించటం ద్వారా మౌలిక వసతులను అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను ఐక్యం చేయటం మొదటిది. గతంలోని వ్యవసాయ బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పేరుతో పునః ప్రవేశపెట్టటం రెండవది. మెట్ట ప్రాంతాలలో నీటి పారుదలను విస్తృతపరచటం మూడవది. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటానికి ఈ ద్రవ్య, మార్కెట్ సాధనాలను సమిష్టిగా ఉపయోగించటమే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ పరిష్కారం అని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నది. అయితే మధ్య, దీర్ఘకాల ప్రభుత్వ ప్రణాళికలలో ప్రభుత్వం ఈ దృక్పథాన్ని అవలంబించడం ద్వారా ప్రస్తుతం సంభవించనున్న సంక్షోభాన్ని విస్మరిస్తున్నది. స్వరాజ్ అభియాన్స్ పిటిషన్ పేర్కొన్నట్టుగా గతించిన అనేక దశాబ్దాలలో దేశంలో ఎన్నడూ లేనంతగా 54 కోట్ల మంది ప్రజలు తీవ్ర స్థాయి కరువుతో గిలగిలా కొట్టుకుంటున్నారు. దీనివల్లనే 2014-2016 మధ్య కాలంలో రైతు ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయి. 'కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి' అని ఈ ప్రభుత్వంలోని మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తూ ఈ ఆత్మహత్యలను పట్టించుకోవటం లేదు. రైతు ఆత్మహత్యలను పట్టించుకోకపోవడమనేది ప్రధాని వార్షిక అంచనాలోనూ, దేశ ఆర్థిక సర్వేలోనూ స్పష్టంగా కనబడుతున్నది.
|| రైతు ఆత్మహత్యల గణన ||
రైతు ఆత్మహత్యలకు సంబంధించిన లెక్కలు సమగ్రంగా లేవనేది అందరికీ తెలిసిందే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కేవలం పురుష రైతుల ఆత్మహత్యలనే లెక్కిస్తున్నది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా 2014 వరకు అలాంటి విషయం ఒక అంశంగా కూడా లేదు. అంతేకాకుండా రైతుల ఆత్మహత్యల వర్గీకరణలో భూమి యాజమాన్యం గల రైతులనే పరిగణనలోకి తీసుకోవాలనే ఉప వర్గీకరణను సృష్టించి ఈ సమస్యను మరింతగా నీరుగార్చారు. ఆత్మహత్యలకు గల కారణాలను 'రుణ భారం', 'కుటుంబ సమస్యలు', 'వ్యవసాయానికి సంబంధించిన కారణాలు'గా వర్గీకరించి మరింత గందరగోళాన్ని సృష్టించారు. ఇలా కారణాలను వర్గీకరించటం వల్ల ఈ మూడు కారకాల మధ్యగల అంతస్సంబంధం మరుగున పడిపోయి రైతులు ఆత్మహత్య చేసుకోవటానికి కారణం వ్యవసాయ రంగాన్ని నిస్పృహ ఆవహించటం కాదనే భావన కలగటానికి దారితీస్తున్నది. ఈ నిర్ధారణ మౌలికంగా తప్పుల తడక. ఎందుకంటే వ్యవసాయ రంగంలో నిస్పృహ వల్ల సామాజిక ఉద్రిక్తతలు తీవ్రతరమై అది రైతులు ఆత్మహత్య చేసుకోవటానికి దారితీస్తుంది. ప్రత్యేకంగా 1995 తరువాత రైతుల ఆత్మహత్యలు పెరగటాన్ని మరోలా ఎలా వివరించగలుగుతాము? వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో వ్యవసాయ మార్కెట్లలో పరిమాణాత్మక పరిమితులను తొలగించి రైతులను ప్రపంచ మార్కెట్, బడా కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాలకు వదలివేయటం, రైతుల ఆత్మహత్యలు పెరగటం ఒకే కాలంలో జరగటం యాదృచ్ఛికం కాదు. అప్పటి నుంచి ఈ ధోరణి పెరుగుతూ వస్తున్నది. రైతుల ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయని రాజ్యసభలో ప్రభుత్వమే అంగీకరించింది. రైతులు అత్యధికంగా ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లు ముందు వరుసలో ఉన్నాయి. అయితే 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటానికి కారణం వ్యవసాయ రంగంలో నిరాశానిస్పృహలనే విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అంగీకరించటం లేదు. 2013-2014 మధ్య కాలంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అందుబాటులోకి వచ్చిన సమాచారం తెలుపుతున్నది.
అన్ని రాష్ట్రాలలోకెల్లా బిజెపి పాలిత రాష్ట్రమైన గుజరాత్ అందిస్తున్న సమాచారం చాలా అస్పష్టంగా ఉన్నది. 2013లో ఒకే ఒక్క రైతు గుజరాత్లో ఆత్మహత్య చేసుకున్నాడని లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే 2015 జులై 24న రాజ్యసభలో 23వ నంబరు ప్రశ్నకు సమాధానంగా గుజరాత్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య 582 అని చెప్పారు. కౌలుదారులను గుజరాత్ ప్రభుత్వం లెక్కలోకి తీసుకోలేదనేది సుస్పష్టం. ఆత్మహత్య చేసుకునే రైతులలో చాలామంది కౌలుదారులే. చిన్న స్థాయి ఉత్పత్తిని కూడా కాంట్రాక్టులతో నియంత్రించే కార్పొరేట్ దగా గుజరాత్ నమూనాగా కొనసాగుతున్న రాష్ట్రంలో ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉండటం సహజం. ఆత్మహత్యలపై ప్రస్తుతం తాజా సమాచారం అందుబాటులో లేనప్పటికీ 2015 మార్చి తరువాత రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారని భావించటానికి కావలసినన్ని ఆధారాలున్నాయి. బిజెపి పాలిత మహారాష్ట్రలో ఆత్మహత్యలు 40 శాతం వరకూ పెరిగాయి. ఇది కాంగ్రెసు పాలిత కర్ణాటకలో కంటే ఎక్కువ. రైతుల ఆత్మహత్యలలో మూడింట రెండు వంతులు బిజెపి పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలోనే జరిగాయి. దీనికి కారణం ఈ రాష్ట్రాలు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రవేశపెట్టటంలో చాలా దూకుడును ప్రదర్శించటమే. అయితే 'వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల' ఈ ఆత్మహత్యలు జరుగు తున్నాయని వీటిలో ఏ ఒక్క రాష్ట్రమూ అంగీకరించటం లేదు. ఉదాహరణకు బ్రూక్లిన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో చేసిన అధ్యయనం ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్న రైతులలో చాలామంది కుంగుబాటు, మానసిక అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుంటు న్నారు. కాబట్టి సమస్య పరిష్కారానికి డబ్బు సహాయం కంటే కౌన్సిలింగ్ అవసరమే ఎక్కువగా ఉన్నదని ఆ అధ్యయనం పేర్కొన్నది. ఈ తప్పుత్రోవపట్టించే తోలుమందం విశ్లేషణకు అదనంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో మెజారిటీ 'విఫల ప్రేమ, మాదక ద్రవ్యాల వాడకం, నపుంసకత్వం వంటి కారణాల చేతనే ఆత్మహత్య చేసుకుంటున్నారు' అని ప్రస్తుత వ్యవసాయ మంత్రి చెబుతున్నారు. దీనివల్ల సమస్య తీవ్రతను తక్కువ చేసి చూపటమే కాకుండా ప్రభుత్వం ఈ సమస్య పట్ల ఏమాత్రం ఆందోళన చెందటం లేదని స్పష్టమవుతున్నది. - అర్చనా ప్రసాద్

No comments:
Post a Comment