Friday, 19 August 2016

## మతోన్మాదంపై మహనీయుల పోరాటం ##







                 స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి సందేశంలో దళితులపైన, ముస్లింపైన జరుగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తమైంది. ప్రధానమంత్రి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ హిందూ మతోన్మాదానికి మూలకారణమైన ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌ల గురించి రాష్ట్రపతికి స్పష్టమైన సమాచారం ఉంది. అయినప్పటికీ ఆ శక్తులు ఎవరో తెలియనట్లు మాట్లాడటం ఆశ్చర్యకరం. మనం ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే మతం మత్తుగా మారితే అది ఉన్మాదాన్ని తెస్తుంది. వివేచనను పోగొడుతుంది. రక్తపాతాన్ని సృష్టిస్తుంది. అందుకే మతం గురించి మార్క్స్‌, లెనిన్‌, మావో కూడా చాలా ఆందోళన చెందారు. ఈ సందర్భంగా లెనిన్‌ మతోన్మాద చేష్టల గురించి చెబుతూ 'మతం మానసిక అణచివేత రూపాలలో ఒకటి. ఇది అంతటా ప్రజా బాహుళ్యంపై మోయరాని భారాన్ని మోపుతుంది. వారు ఇతరుల కోసం శాశ్వతంగా పనిచేయడం, కొరతలు, ఏకాకితనం చేత ఆ బరువు మితిమీరిపోయింది. తమను దోపిడీ చేసే వర్గాలకు వ్యతిరేకంగా దోపిడీకి గురవుతున్న వర్గాలు చేస్తున్న పోరాటాలు, వారి నిస్సహాయత, నిర్వీర్యతలు మరణానంతరం ఉందని భ్రమించే, మరుజన్మలో సుఖంగా బ్రతకవచ్చనే ఆశలు చిగురించడానికి అనివార్యంగా ఎలా చిగురిస్తున్నాయో, తలెత్తుతున్నాయో అలాగే ఆటవిక మనిషి ప్రకృతికి వ్యతిరేకంగా పోరాటాలలో కల్గిన నిస్సహాయత, నిర్వీర్యతలు, దేవుళ్ళు, దయ్యాలలో అద్భుతాలు, మహిమలు లాంటి వాటిల్లో నమ్మకాలు తలెత్తాయి. జీవితాంతం కష్టపడుతున్నప్పటికీ కడుపునిండా తిండి కరువైన కష్టజీవులకు ఈ జన్మలో, ఈ భూమిపై ఓపిక పట్టండి, వినయ విధేయతలు కలిగి ఉండండి, మరణాంతరం వచ్చే జన్మలో స్వర్గానుభవాలు ప్రాపిస్తాయని మతం నమ్మబలుకుతుంది. కానీ పరుల శ్రమను దోచుకొని విలాసవంతంగా జీవితాన్ని గడిపే ధనికులకు ఈ జన్మలో కేవలం అడపా దడపా దానధర్మాలు చేస్తూ ఉండమని మాత్రమే వారికి మతం ఉద్బోధిస్తుంది. ఆ విధంగా దోపిడీదారులుగా తమ యావజ్జీవితం గడిపే కారుచౌక మార్గాన్ని వారికి చూపుతుంది. స్వర్గంలో సుఖాలు అనుభవించడానికి వారికి కారుచౌకలో టిక్కెట్టు అమ్ముతుంది. మతం ప్రజల పాలిటి మత్తుమందు. మతం ఒక విధమైన ఆధ్యాత్మిక సురాపానం. ఈ మతం మత్తులో పెట్టుబడిదారుల బానిసలు తమ మానవ ప్రతిష్టను, మనిషిలాగ యోగ్యమైన జీవితం కావాలనే తమ డిమాండును గంగలో కలిపి వేస్తారని చెప్పిన లెనిన్‌ మాటలను ప్రతి మార్క్సిస్ట్‌, అంబేద్కరైట్‌ లోతుగా అర్థం చేసుకోవాలి. నిజానికి ఈనాడు మోడీయే కాదు ఆయన మార్గంలో నడుస్తున్న చంద్రబాబు కూడా మత ఛాందసత్వాన్ని అనేక సందర్భాల్లో అవకాశంగా తీసుకొని వ్యాప్తి చేస్తున్నారు. కృష్ణా, గోదావరి నాగరికతలు మాతృస్వామ్యంతో కూడుకున్నాయి. వీటిని నిర్మించింది మూలవాసులు. అయితే చంద్రబాబు నదులను బ్రాహ్మణాధీనం చేస్తున్నారు. పితృస్వామ్య సంస్కృతిని పుష్కరాల పేరుతో ప్రచారం చేస్తున్నారు. రాజ్యం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతోన్మాదాన్ని నెత్తికెత్తుకుంటుంది. ప్రజలు మత ఘర్షణల్లో ఉన్నప్పుడు ఆర్థిక విషయాలు పట్టించుకోరు. అందుకే రాజ్యం మతోన్మాదాలు, మత ఘర్షణలు, మత బోధనలు పనిగట్టుకు ప్రచారం చేస్తుంది. మతం యాచనను నేర్పుతుంది, ఉత్పత్తిని అపహాస్యం చేస్తుంది. మనుస్మృతి ఇలా బోధించింది. యాచకుడు దాతని ప్రసన్నం చేసుకోవడం కోసం దానం అనేది కేవలం దానం కాకుండా అది కర్మకాండ నిహితమై ఉండాలని, దానిలో పురోహితుడు ఉండాలని మనుస్మృతి ఇలా నిర్దేశించింది. సర్వషామేవ దానానాం బ్రహ్మదానం విశిష్యతే వార్యన్నగోమహీవాసస్తిల కాంచనసర్పిషామ్‌. (మనుస్మృతి 4వ అధ్యాయం, శ్లోకం 233). ఉదకం, అన్నం, గోవులు, భూమి, వస్త్రాలు, తిలలు, బంగారం, నెయ్యి వీని దానమున కంటె వేదాధ్యాపనం, తదర్థ బోధనం కడు శ్రేష్ఠము కనుక సాంగవేదాధ్యాపనము చేయింప వలయును. యో ర్చితం ప్రతిగృహ్ణాతి దదాత్యర్చితమేవ చ, తావుభౌ గచ్ఛతస్స్వర్గం నరకం తు విపర్యయే. (మనుస్మృతి 4వ అధ్యాయం, శ్లోకం 235) ఎవడు పూజాపూర్వకంగా దానం నొసగుచున్నాడో, ఎవడు పూజాపూర్వకంగా దానము గైకొనుచున్నాడో, వారిరువురూ స్వర్గము నొందుచున్నారు. అట్లు దాత పూజా పూర్వకంగా దానమియ్యకున్నను, ప్రతిగ్రహీత గ్రహింపకున్నను ఇరువురూ నరకం నొందుదురు. బ్రాహ్మణులు అడుక్కోవడం ఒక శాస్త్రంగా శాస్త్రబద్ధంగా తయారుచేశారు. అది పరిపాలనలోకి వచ్చేటప్పటికి అవినీతిగా మారింది. ఒకరి శ్రమను మరొకరు దోచుకోవడం అనే దోపిడీ విధానం కూడా ఇక్కడే ఏర్పడింది. ఒక వ్యక్తిని భావజాలం వల్ల మోసం చేసి, మూఢనమ్మకాల్లోకి దించి, శాస్త్రీయ దృక్పథం నుంచి ప్రక్కకు నెట్టి, మానవత్వ స్పృహ నుంచి దూరం చేసి, మనిషికి సహాయపడే చిత్తవృత్తిని మసకబార్చి, స్వార్థపూరితమైన వాడిగా రూపొందించడం బ్రాహ్మణవాదంలో ప్రధాన అంశం. ఇదే విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మనుస్మృతిలో చెప్పారు. బ్రాహ్మణుల్లో, శూద్రుల్లో ఒక అస్పృశ్య భావాన్ని మనుస్మృతి మెదడుల్లో ఎక్కించింది. ఎక్కడ కర్మకాండలు జరిగినా, శ్రాద్ధ కర్మలు జరిగినా మనుస్మృతి దళితులను, స్త్రీలను అవమానపరిచే క్రమంలోనే వ్యాఖ్యానం చేసింది. మనుస్మృతి మెదడుల్లో, మానవ జీవితాల్లో కుమ్మరించిన ద్వేషానికి అంతులేదు. చండాలుని అసలు చూడొద్దని నిషేధించింది. అతని మాట వినవద్దని చెప్పింది. అతన్ని చదువుకోవద్దని చెప్పింది. చాండాలశ్చ వరాహశ్చ కుక్కుటశ్శ్వా తథైవ చ, రజస్వలా చ షండశ్చ నేక్షేరన్నశ్నతో ద్విజా ్‌. శ్రాద్ధ కర్మలు నిర్వహించి భోజనాలు చేసిన బ్రాహ్మణులు చండాలుని, పందిని, కుక్కను, ఋతుమతి అయిన భార్యను, నపుంసకుణ్ణి చూడకూడదు. (అంటే వీరు అస్పృశ్యులని అర్థం. కుక్కతో పాటు చండాలుని పోల్చడమే గాక తన భార్యను కూడా కుక్కతో సమానం చేశాడు.) హోమే ప్రదానే భోజ్యే చ యదేభిరభివీక్ష్యతే, ధైవే కర్మణి పిత్య్రే వా తద్గచ్ఛత్యయథాతథమ్‌. హోమం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, బ్రాహ్మణులు భోజనం చేసేటప్పుడు పైవారిని అనగా చండాలుని, ఋతుమతియైన భార్యను చూడకూడదు అన్నారు. (అంటే సొంత భార్యను కూడా ఇంట్లో అస్పృశ్యంగానే చూశారు.) ఘ్రాణేవ సూకరో హన్తి పక్షవాతేన కుక్కుటః శ్వాతు దృష్టినిపాతేన స్పర్శేనావర్ణజః పంది వాసన చూడటం వలన, కోడిరెక్కల గాలి తగలటం వలన, కుక్క చూడటం వలన, శూద్రుడు తాకటం వలన పదార్థాలు మైల పడతాయి. అందువల్ల ఆ పదార్థాలతో శ్రాద్ధాది కర్మలు చేయకూడదు. ఒక మనిషిని చూస్తే అనర్థం జరుగుతుందనే శంకను సృష్టించడమే బ్రాహ్మణత్వంలోని విషపూరితమైన అంశం. మనిషిని చూస్తే వికాసం కలగాలి. ఉత్తేజం రావాలి. పరస్పర ప్రేరణ రావాలి. అటువంటిది పోయి నాకేదో అనర్థం జరుగుతుందనే భావాలను మెదడుల్లో కూర్చారు. శూద్రుల్లో కూడా వీటిని బలంగా ఎదురించగల్గినటువంటి వాళ్ళు రాలేదు. బిసిలు ఇప్పుడు బ్రాహ్మణత్వ పోషకులు మారారు. వీరి మనసుల్లో అస్పృశ్యులంటే తక్కువ భావం చాలామందికి ఉంది. మనం బ్రాహ్మణత్వానికి బానిసలం. స్వతంత్ర ఆలోచనలు లేనివారం. మనం బుర్రలు ఎవరికో తాకట్టు పెట్టి బతుకుతున్న బడుగు జీవులమని వీరికి తెలియదు అని ఫూలే రకరకాలుగా మనకు వివరించి చెప్పాడు. ఈనాడు జరుగుతున్న హిందూ కర్మకాండలన్నింటిలోనూ దళితులు అన్యాపదేశంగా అవమానించబడుతూనే ఉన్నారు. దీన్ని అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడం బ్రాహ్మణవాదాన్ని, పురోహిత ఆధిపత్యాన్ని విస్తరింపచేసి, ప్రజలు కరువు కాటకాల్లో, జీవన సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా వారికి చైతన్యం లేకుండా చేసి వారిలో అధీన భావాన్ని పెంచడానికే పుష్కరాల పేరుతో రాష్ట్రంలోనూ, గోవధ నిషేధం పేరుతో కేంద్రంలోనూ పెద్దఎత్తున హిందూత్వ భావజాల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అందువల్ల ఈనాడు దళితులు, బిసిలు ఈ హిందూత్వ భావజాలానికి వ్యతిరిక్తంగా ఫూలే, అంబేద్కర్‌ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. జ్యోతిరావ్‌ ఫూలే అనేక రంగాల్లో బ్రాహ్మణత్వాన్ని ఎదిరించాడు. శూద్రుల వ్యక్తిత్వాన్ని నిలిపి వీళ్ళూ మనుషులే అని తెలియజెప్పాడు. బ్రాహ్మణ ఉపాధ్యాయులు ఎందుకు కింది కులాల పిల్లలను పైకి రానివ్వరు అనే విషయంపై ఒక పరిశోధనాత్మక విశ్లేషణ చేశాడు. ఆ రోజుల్లోనే ఆయనొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా ముందుకొచ్చాడు. బ్రాహ్మణవాదాన్ని గురించి ఇంత నిక్కచ్చి అయిన అభిప్రాయాలను భారతదేశంలో చేసినవారు వీరికి ముందు దాదాపుగా ఎవరూ లేరు. బౌద్ధాన్ని ఆయన ఆధునీకరించాడు. ఆ రోజుల్లో ఉన్న గ్రామ పెద్దలైన కరణం, మునసబుల స్వభావాన్ని బయటపెట్టి ఎండగట్టాడు. గ్రామాల్లో భూమి ధనవంతులకు ఎందుకు ఉంది? పేదవారికి ఎందుకు లేదు? ఈ పట్టాలు ఎలా ఇచ్చారు? ఈ విషయాలన్నీ వివరించడానికి తన రచనల ద్వారా, వాదాల ద్వారా, చిన్న చిన్న సభల ద్వారా నిరంతరంగా పనిచేశాడు. అందుకే ఆయన అంబేద్కర్‌కు మార్గదర్శకుడయ్యాడు. మతం, బ్రాహ్మణ్యం ద్వారా దోపిడీకి గురవుతున్న వారిపై ఫూలే మొదట దృష్టి సారించాడు. ఆధునిక విద్య ద్వారా ఈ దోపిడీని అరికట్టి శాస్త్రీయ దృష్టిని పెంచవచ్చని బలంగా విశ్వసించి దాన్ని ఆచరించాడు. విద్యావ్యాప్తికి శక్తికి మించిన యత్నాలు చేశాడు. శాస్త్రీయ దృష్టిని పెంచడం ద్వారా మూఢాచారాలను రూపుమాపడానికి కృషిచేశాడు. శాస్త్రీయ విద్యతో సంప్రదాయక భావజాలాన్ని ఖండించడం సులువు అవుతుందనే విషయాన్ని ఫూలే గ్రహించి ఆ దిశలోనే తన పనులను చేపట్టాడు. సాంకేతిక, సాంస్కృతిక విప్లవాన్ని ఆధునిక విద్య ద్వారానే సాధించవచ్చని ఫూలే గ్రహించాడు. బ్రాహ్మణులు ఆధునిక విద్యను అభ్యసించినా సంప్రదాయబద్ధంగానే జీవిస్తారు. అందువల్ల వాళ్ళు వైజ్ఞానిక ప్రపంచంలోకి అడుగుపెట్టలేకపోతున్నారు. మహాత్మా ఫూలే ఒక కీలకమైన విషయాన్ని విప్పి చెప్పాడు. దళిత బహుజనులు అలా కాకుండా ఆధునిక విద్యతో పాటు సాంకేతిక, వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకున్నట్లైతే వీళ్ళు కులతత్వానికి, మూఢాచారాలకు భిన్నంగా జీవించగలుగుతారు. జీవిక కోసం విద్య కాకుండా, జ్ఞానం కోసం విద్య అనే దాన్ని మహాత్మా ఫూలే ప్రతిపాదించాడు. బడుగు కులాలు విద్యావంతులై బ్రాహ్మణవాదంలో ఉన్నట్లైతే వారి బడుగు కులాలను అణగద్రొక్కాలని చూస్తారు. వారి బడుగు కులాలను అణగద్రొక్కడం ద్వానా వారు హిందూ మతాన్ని బ్రతికిస్తారు. బ్రాహ్మణులు ఎంత సైన్స్‌ చదువుకున్నా వాళ్ళు తద్దినాలు, ఆబ్ధికాలు అవన్నీ చేస్తూ వెళ్ళడం వల్ల పూర్వ సంప్రదాయాల నుంచి విముక్తి కాలేకపోతున్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం బోధిస్తున్న అంశాలు వారి నాలుకల మీదికే ఎక్కుతున్నాయి. వారి మెదడుల్లోకి ఎక్కడం లేదు. అందుకే బలహీన వర్గాలు ఐక్యంగా రాజ్యాధికారం సాధించుకొని చట్టాలు చేసే దశకు ఎదగండి అని అంబేద్కర్‌ ఇలా బోధిస్తున్నాడు. ఈ వ్యక్తి ఆరాధన, దైవీకరణ, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం అన్నది హిందూ సమాజాన్ని పతనం చేశాయి. దేశ పరిస్థితి దిగజారిపోవడానికి కారణం కూడా ఇవే. భౌతిక ఆనందాలన్నింటికీ చట్టమే నివాసం. చట్టాలు చేసే అధికారాన్ని గెలుచుకోండి. కనుక మీ దృష్టిని ఉపవాసాలు, ఆరాధనలు, దీక్షల నుంచి మళ్ళించి, శాసనాలు చేసే అధికారాన్ని దక్కించుకోవడంపై పెట్టండి. ఈ మార్గంలోనే మీ ముక్తి ఉంది. ఈ మార్గమే మీ ఆకలి సమస్యకు పరిష్కారమిస్తుంది. మీ జనాభా మెజారిటీలో ఉండడం సరిపోదని గ్రహించడం. వారు ఎప్పుడూ అప్రమత్తంగా, బలంగా, విద్యావంతులై, ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే విజయాన్ని సాధించి, దాన్ని నిలబెట్టుకోగలరని అన్న బోధనలు ఈనాడు చాలా ముఖ్యమైనవి. మానవుడు మానవ పరిణామ శాస్త్రం ఆధారంగా ప్రతి దశాబ్దానికీ ఒక పరిణామానికి గురికావాల్సి ఉండగా బ్రాహ్మణ, పౌరోహితవాదం రాజ్యం ముసుగులో విస్తరిస్తుంది. మోడీ, చంద్రబాబు ఈ విస్తరణకు బాధ్యులవుతున్నారు. నిజానికి చందబ్రాబు శూద్ర కులానికి, మోడీ బిసి వర్గానికి చెందినవాళ్ళు. అయితే వాళ్ళు బ్రాహ్మణీకరించబడ్డారు. మతం ముసుగులో రాజ్యం చేసినట్లయితే ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలు మరుగున పడిపోతాయని, దేశం సుభిక్షంగా ఉన్నట్లు ప్రకటిస్తూ కరువు, పేదరికం, నిరక్షరాస్యత, మద్యపానం, స్త్రీ అణచివేత, భూ ఆక్రమణ కొనసాగించవచ్చని వీరిద్దరి రాజకీయ వ్యూహం. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా లెనిన్‌, ఫూలే, అంబేద్కర్‌ భావజాలాలను దళిత బహుజన, మైనారిటీలు ముందుకు తీసుకెళ్ళి రాజ్య ముసుగులో కొనసాగుతున్న బ్రాహ్మణవాదాన్ని, హిందూ పౌరోహితవాదాన్ని ఎదిరించి నిలబడుతూ ప్రత్యామ్నాయ సమసమాజ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాల్సిన చారిత్రక సందర్భం ఇది..       ----- డాక్టర్‌ కత్తి పద్మారావు 

No comments:

Post a Comment