Saturday, 27 August 2016

|| వృథాకాని వీరుల త్యాగం || # నేడు బషీర్‌బాగ్‌ అమరుల సంస్మరణ దినం#




                 వారు చిందించిన నెత్తుటి తడి ఇంకా ఆరలేదు. తుది శ్వాస విడవడానికి కొన్ని నిమిషాల ముందువరకు వారు చేసిన నినాదాలు ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. తెలుగు ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. తుపాకీ గుండ్లు దూసుకు వస్తూంటే ఒక్క అడుగైన వెనక్కి వేయక, ముందుకే దూసుకెళ్లిన వారి ధైర్యం తెలుగు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోతుంది. వారు బషీర్‌బాగ్‌ అమరులు. ప్రజల ప్రాణాలను తోడేసే సరళీకరణ ఆర్థిక విధానాలు, వాటి ప్రతి రూపమైన విద్యుత్‌ సంస్కరణలపై తిరగబడ్డ తెలుగు బిడ్డలు! యవ్వన ప్రాయంలోనే ప్రజల కోసం ప్రాణాలర్పించిన యోధులు! తెలుగు ప్రజలు నిర్వహించిన చారిత్రాత్మక ఉద్యమాలకు మరో మెరుపును జోడించిన అమర వీరులు!
                తెలుగు నేలపై సాగిన మహత్తర పోరాటాల్లో విద్యుత్‌ పోరాటానిది ఒక ప్రత్యేక అధ్యాయం. 'పోరాటాలకు కాలం చెల్లింది. ఇజాలు లేవు, ఉన్నదల్లా టూరిజమే!' అంటూ ఊదరగొట్టిన ప్రపంచీకరణ ప్రచారాన్ని సవాల్‌ చేస్తూ పూరించిన సమరశంఖం అది. పాలకుల ఆంక్షలను, పైశాచిక దమనకాండను, పోలీసుల హింసా కాండను తట్టుకుని ప్రజల పోరాట పతాకాన్ని పైపైకి ఎగరేసిన ఘనత ఆ పోరాటానిదే. నూతన సహస్రాబ్ది ప్రారంభం, రెండు వేల సంవత్సరంలో జరిగిన ఆ పోరాటం, పోరాట వీరుల త్యాగం వృథా కాలేదు. విద్యుత్‌ ఛార్జీల జోలికి పోవడానికి దశాబ్దాల పాటు పాలకులు తటపటాయించే పరిస్థితిని ఆ పోరాటం సృష్టించింది. జాతీయ స్థాయిలోనూ ప్రపంచ బ్యాంకు అజెండాకు బ్రేక్‌లు వేసింది. హైదరాబాద్‌ను ప్రపంచ బ్యాంకు ఆదేశిత విధానాల ప్రతిఘటనకు వేదికగా మార్చింది. ' మరో ప్రపంచం సాధ్యమే' అని ఎలుగెత్తింది. అప్పటిదాకా అధికారాన్ని వెలగబెట్టిన తెలుగుదేశం పార్టీని, దాని నేత చంద్రబాబునాయుడును రెండు దశాబ్దాల పాటు ప్రతిపక్షానికే పరిమితం చేసింది.
చంద్రబాబునాయుడి నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం చేపట్టిన వినాశకర విద్యుత్‌ సంస్కరణలు, భారీ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తొమ్మిది వామ పక్షాలు ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర ప్రజలు సానుకూలంగా స్పందించారు. చిన్నగా ప్రారంభమైన ఉద్యమం క్రమేణా మహత్తర పోరాటంగా మారింది. ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళనలతో పాటు ఎక్కడికక్కడ కొత్త పోరాట రూపాలు పుట్టుకొచ్చాయి. ప్రజల అభిప్రాయం వెల్లడించడానికి నిర్వహించే ప్రజా బ్యాలెట్లు విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేక తీర్పునిచ్చాయి. హైదరాబాద్‌లో బిజిలీ బంద్‌కు పిలుపునిస్తే రాష్ట్రమంతా అంధకారం అలముకునేది. అధికార పార్టీ నేతలకు, చివరికి ముఖ్యమంత్రికి కూడా ప్రజల నుండి ప్రశ్నల వర్షం, నిరసనల నినాదాలు అనివార్యంగా మారాయి. పెనుభారం మోపిన పాలకులను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటుండటంతో ప్రభుత్వం కూడా అంతే తీవ్రంగా స్పందించింది. విపరీత స్థాయిలో నిర్బంధాన్ని అమలు చేసింది. వేలాది మందిని అరెస్ట్‌ చేసింది. కేసులు బనాయించింది. వివిధ జిల్లాల్లో ఆందోళనల సందర్భంగా జరిగిన లాఠీఛార్జీలలో గాయపడిన వారి సంఖ్యకు లెక్కే లేదు. నిర్బంధాన్ని, లాఠీఛార్జీలనూ ప్రజలు లెక్క చేయకపోవడంతో మూడు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం గుక్క తిప్పుకోలేక పోయింది. అణచి వేయడమే లక్ష్యంగా అమానుషంగా హింసాకాండకు దిగింది. దీనికి పరాకాష్టే 2008 ఆగస్టు 28 చలో అసెంబ్లీ సందర్భంగా జరిగిన ఘటనలు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజానీకం ఉవ్వెత్తున పొంగింది. ఇనుప తీగలను, బాష్పవాయువును, లాఠీఛార్జీలను, జలఫిరంగులను లెక్క చేయకుండా కదం తొక్కింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. అప్పటిదాకా ప్రపంచబ్యాంకు తప్ప మరోమాట మాట్లాడటానికి సిద్ధపడని చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ వామపక్షాల పోరుకు మద్దతు పలికింది. అప్పటిదాకా ఆరోపణలకు, ప్రత్యారోపణలకే పరిమితమైన రాజకీయాల్లోకి ప్రజా సమస్యలు అజెండాగా వచ్చాయి. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పతనానికి బషీర్‌బాగ్‌ పోరాటం నాంది పలికింది.

|| నేటి కర్తవ్యం ||
విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో బిజెపితో చెలిమి కట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ముందు వరకు మారిన మనిషినని చెప్పుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సంస్కరణల జపం ప్రారంభించారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. సామాన్యుల సమస్యలను గాలి కొదిలేసిన ప్రభుత్వం, ప్రజల నుండి భూమిని గుంజుకోవడం, కార్మిక చట్టాలను నీరుగార్చడం, నిర్బంధాన్ని అమలు చేయడాన్ని తన విధానంగా మార్చుకుంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ కన్నా దూకుడుగా ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. కీలకమైన రక్షణ రంగంతో పాటు అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెడ్‌కార్పెట్‌ పరిచింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ఉరకలేస్తోంది. దశాబ్ద కాలం క్రితమే రాష్ట్ర ప్రజానీకం చీదరించి, తిరస్కరించిన ప్రపంచ బ్యాంకు అజెండాను ప్రజలపై పచ్చిగా రుద్దడానికి సిద్ధపడుతోంది. దీనికి మతోన్మాదం అదనం. ప్రజలను కులాలు, మతాల ప్రాతిపదికగా చీల్పి అధికారాన్ని పదిలం చేసుకోవడానికి కుట్రలు చేస్తోంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, పోరాటాలు ప్రారం భమైనాయి. సెప్టెంబర్‌ రెండున చారిత్రాత్మక సార్వత్రిక సమ్మెకు దేశవ్యాప్తంగా కార్మికలోకం నడుంకట్టింది. రాష్ట్రంలోనూ పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బాధిత ప్రజలు, కార్మికులు ఎక్కడికక్కడ ఈ పోరాటాల్లో భాగస్వా ములవుతున్నారు. ఈ పోరాటాలకు సంఘీభావం తెలపడం, మరింత సంఘటితం చేయడమే బషీర్‌బాగ్‌ అమరవీరులకు అర్పించే నివాళి.
                  

No comments:

Post a Comment