Friday, 19 August 2016

# ప్రతిఘటనా సంస్కృతిని పెంచడం అవశ్యం #



                 గోరక్షకులు, ఘర్‌వాపసీ, లవ్‌ జిహాద్‌ ప్రేరకులు హైందవ మత రక్షకులుగా చెప్పుకుంటూ రాక్షసుల్లా రెచ్చిపోతున్నారు. ఒకపక్క నడిబజారులో వీరు వీరంగాలు వేస్తుంటే మరోపక్క హిందూత్వ మేధావులు ఫేస్‌బుక్‌లు, వాట్స్‌ఆప్‌లు ముఖ్యంగా మధ్యతరగతి, అందులోనూ అగ్రకుల యువతీయువకుల బుర్రల్ని తొలిచేస్తున్నారు. వీరిని పోలీసులు అదుపు చేయలేదు. న్యాయస్థానాలు సవాలక్ష కుంటి సాకులతో శిక్షించటానికి మీనమేషాలు లెక్కిస్తున్నాయి. వీరికి భారత రాజ్యాంగం అంటే భయం, భక్తి లేవు. హర్యానాలో గొడ్డుమాంసం తింటున్నారన్న నెపంతో ఒక ముస్లిం కుటుంబంపై దాడిచేసి కుటుంబ పెద్దను దారుణంగా నరికి చంపేశారు గోరక్షకులు. గుజరాత్‌లో గొడ్ల చర్మాన్ని వలుస్తున్నారనే నెపంతో దళిత యువకులను బట్టలూడదీసి కర్రలతో, రాడ్లతో చితకబాదుతూ నడిరోడ్డు మీద తిప్పారు. అంతేకాదు, ఈ భయానక ఘటనను ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టారు. అలా చేస్తేనే దళితుల్లో భయం కలుగుతుందని ఒక బిజెపి ఎమ్మెల్యే మీడియాలో నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇదే సమయంలో మహారాష్ట్రలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జ్ఞాపికగా ఉన్న ఆయన ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. ఇవి మూడూ బిజెపి పాలిత రాష్ట్రాలే. అందువల్ల వీటిని హిందూత్వ శక్తులకు నమూనాగా తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో అమలాపురంలో కూడా ఇదే తరహా దాడి జరిగింది. ఇక ఈ కాలంలోనే మహిళలపై వయస్సుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు, దాడులు, సామూహిక అత్యాచారాలు గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతున్నాయి. అందులో కూడా సామాజికంగా అణగారిన దళిత, గిరిజన, ముస్లిం, క్రైస్తవ మహిళలపై ఈ దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. ముస్లిం మైనారిటీల మీద, దళితుల మీద, మహిళల మీద పెచ్చరిల్లిన ఈ దాడులను నిశితంగా పరిశీలిస్తే వీటి వెనుక ఒక పథకం వివిధ వాదనల రూపంలో ఒక ఫాసిస్టు తరహా సిద్ధాంతం కనబడుతుంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని కవచంగా చేసుకుని ఈ సిద్ధాంతం వేళ్లూనుకుంటున్నది.

|| పల్చబడుతున్న బూర్జువా లౌకికతత్వం ||

పై అంశాలకు తోడవుతున్న మరో ప్రమాద పార్శ్వం బూర్జువా పార్టీలు హిందూత్వ ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యత. బిజెపి వ్యతిరేక, అనుకూల పార్టీలన్నీ (వామపక్షాలు మినహా) హిందూత్వ ప్రచారానికి ఇస్తున్న ప్రాధాన్యతతో అసలు లౌకికవాదానికే తూట్లు పడుతున్నాయి. తాజాగా మన రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం, గోదావరి నీళ్లు కృష్ణలో కలిసినప్పుడు, తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలు ప్రారంభించేటప్పుడు, ఇంక కృష్ణా పుష్కరాలైతే చెప్పనే అక్కర్లేదు. ఇలా హిందూ మతాచారాలను పాటించడం, పాటించేలా ప్రజలను ప్రోత్సహించడం భవిష్యత్‌లో ప్రమాదంగా పరిణ మించనున్నది. లౌకిక వ్యవస్థ ఈ విధంగా బలహీనపడే కొద్దీ ఆ ఖాళీలో ఫాసిస్టు శక్తులు ఎగబాకుతున్నాయి. దురదృష్టవ శాత్తూ బూర్జువా, లౌకిక పార్టీలకు ఈ స్పృహ లేదు. ఎన్నికలలో బావుకోవాలన్న ఆశతో బిజెపిని తిట్టడం తప్ప, ముంచుకొస్తున్న మతోన్మాద ప్రమాదం గురించి వారికి ఎరుకేలేదు. హిందూత్వ ప్రచారంలోనూ, ఆ మత సంప్రదాయాలను గట్టిగా అవలంబించడం ద్వారానూ, అలాగే హిందూత్వ భావజాలంలోని మధ్యయుగాల నాటి పొరపాటు లేక అశాస్త్రీయ వైఖరులను వ్యతిరేకించేవారిని బిజెపికన్నా ఎక్కువగా తిట్టడం ద్వారా బిజెపిని బలహీన పర్చవచ్చన్న అపసవ్యమైన అలోచనలను కొన్ని లౌకిక బూర్జువా పార్టీలు ప్రదర్శిస్తున్నాయి. పుష్కరాలకు డ్రెస్‌కోడ్‌లు, పాల్గొనే ఉద్యోగులందరూ గోవిందనామ జపం చేయాలన్న ఆదేశాలు మనం చూశాం. టిడిపి ప్రభుత్వం (దేవాదాయ శాఖ) తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి ఏటా రాష్ట్రంలో 500 గుడులు కట్టాలని నిర్ణయించింది. అందుకు తొలి విడతగా ప్రభుత్వం రూ.25 కోట్లు కేటాయించింది. దాదాపు ఇవే పద్ధతులు తెలంగాణ రాష్ట్రంలోనూ కనబడుతున్నాయి. ఆ విధంగా బిజెపి పాలిత రాష్ట్రాల మాదిరిగానే అనేక లౌకిక బూర్జువా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా తయారవుతున్నాయి.

|| పెరుగుతున్న ప్రతిఘటన సంస్కృతి ||

అనాదిగా మన దేశంలో ప్రతీఘాత సాంస్కృతికో ద్యమానిదే పైచేయిగా ఉంటున్నది. అమానుషమైన కులవ్యవస్థ రూపుదిద్దుకుంటున్న తొలి శతాబ్దాలలో దానికి వ్యతిరేకంగా ముందుకొచ్చిన బౌద్ధ, జైన మతాలను అణచివేయటంతో ఈ ప్రతీఘాత సంస్కృతి మొదలైంది. పాలకుల ప్రోత్సాహంతో క్రమంగా బలపడుతూ వచ్చింది. బౌద్ధం, జైనం, తరువాత క్రీస్తుశకం 15వ శతాబ్దంలో కబీర్‌దాస్‌, గురునానక్‌, రవిదాసు, తుకారాం వంటి వారు నడిపిన భక్తి ఉద్యమం హిందూ మతం ముసుగులో నడిచే ప్రతీఘాత సాంస్కృతికోద్యమాన్ని నిలువరించటానికి గొప్ప ప్రయత్నమే చేశాయి. ఆ తర్వాత జ్యోతిబా ఫూలే, నారాయణ గురు వంటివారు, ఆ తర్వాత 19వ శతాబ్దంలో సాగిన సంఘ సంస్కరణోద్యమాలు, వాటి కొనసాగింపుగా అంటరానితనం సమస్యపై డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ నడిపిన పోరాటం, ఇవన్నీ ప్రతీఘాత సాంస్కృతిక ధోరణులలోని దుష్టత్వాన్ని ఏదో ఒక మేరకు బట్టబయలు చేశాయి. ఏమైనా స్వాతంత్య్రానంతరం కాలం గడిచే కొద్దీ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి సన్నగిల్లింది. అలాగే ప్రగతిశీల సంస్కరణోద్యమ ధోరణులు బలహీన పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రతీఘాత సాంస్కృతిక ధోరణులకు కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ప్రారంభమయింది. ప్రత్యామ్నాయ ప్రగతిశీల సాంస్కృతికోద్యమాన్ని నిర్మించు కోవాల్సిన అవసరం, అవకాశం రెండూ ఏర్పడుతున్నాయి.

|| వెల్లివిరుస్తున్న అవకాశాలు ||

సామాజికంగా అణగారిన తరగతుల్లో ఒక నూతన చైతన్యం గత కొంత కాలంగా ముందుకొస్తున్నది. దళిత, శూద్ర కవులు, రచయితలు, విద్యావేత్తలు పెద్దసంఖ్యలో ముందుకొస్తున్నారు. మరుగున పడేసిన అనేక చారిత్రక అంశాలు వెలికి తీయబడుతున్నాయి. చరిత్ర రచన, పరిశోధనల మీద బ్రాహ్మణవాద పట్టును వీరు నిర్దాక్షిణ్యంగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ ఊపందుకోవడం మూలంగా అంబేద్కర్‌ వాదనలను, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని పోల్చి చూడడం, లాల్‌ సలామ్‌ నీల్‌ సలామ్‌ ఒకటవ్వాలని, కమ్యూనిస్టులు, దళిత బిసి తరగతులు కలవాలని ఇలా అనేక వాదనలు బలంగా ముందు కొస్తున్నాయి. ఆ వాదనలను, మంచిచెడ్డలు ప్రక్కనబెడితే మొత్తం మీద దేశవ్యాప్తంగా ప్రతీఘాత హిందూత్వ సంస్క్కృతిని, సంప్రదాయాలను బలంగా ప్రతిఘటిస్తున్న ఉద్యమాలు ముందుకు వస్తున్నాయన్నది మనం గమనించాలి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థి రోహిత్‌ మరణం, ఢిల్లీ జెఎన్‌యులో కన్నయ్య, ఇతర విద్యార్థి నాయకుల అరెస్టు, తదితర పరిణామాల సందర్భంగా ఒకపక్క కాషాయదళం అండతో మనువాదులు, మరోపక్క అనేక ప్రగతిశీల వేదికలు, మేధావులుగా దేశం నిట్టనిలువునా చీలిపోయింది. వ్యూహాత్మకంగా అయినా మనువాదులే ఒక అడుగు వెనక్కి వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కాలంలోనే మహిళలు ఆలయ ప్రవేశ నిషేధంపై దేశాన్నే ఒక కుదుపు కుదిపేశారు. ముస్లిం మహిళలు మసీదులలో ప్రవేశంపై గొంతెత్తడం గొప్ప విశేషం. మహారాష్ట్రలో శని దేవాలయం, త్రయంబకేశ్వరం, శబరిమలలోని అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశం అంగీకరించాలని విద్యాధికులైన యువతులు ఈ పోరాటాన్ని నడిపారు. మహిళలను కించపరచడానికి, అణచివుండ టానికి ముందుకువేయబడిన ''బహిష్టు'' గురించి ధైర్యంగా మహిళలే దేశవ్యాప్త బహిరంగ చర్చకు పూనుకోవడం ''సంతోషంగా రక్తస్రావం'' (హ్యపీ టు బ్లీడ్‌) అనే ఉద్యమాలను ప్రారంభించడం గొప్ప సాంఘిక పరిణామాలకు సంకేతం. వీటన్నింటినీ తీవ్రంగా వ్యతిరేకించే ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా దేవాలయాల్లో మహిళల ప్రవేశం తప్పుకాదని సణగడం ఈ సంస్కరణ ఉద్యమాలలోని బలాన్ని తెలియజేస్తుంది. ఇద్దరు ముస్లిం మహిళలు మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని ఏకంగా సుప్రీంకోర్టుకెక్కారు. ఖురాన్‌, తదితర గ్రంథాలలోని అంశాలను వారు ఉటంకిస్తున్నారు. మతం పరిధిలోనైనా ఈ సంస్కరణోద్యమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా గుజరాత్‌ ఉనాలో దళితులు చనిపోయిన ''గొడ్ల చర్మాలను మేం వలవం, వాటిని తీసుకెళ్లం'' నినాదం లేవనెత్తారు. ఈ నినాదం బలంగా కార్యరూపం దాలిస్తే అగ్రకుల పెత్తందారీతనం దిగిరాక తప్పదు. ఈ ఉద్యమాలన్నీ మారుతున్న పరిస్థితులకు, పెరుగుతున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. అంతేకాదు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.

|| ప్రత్యామ్నాయానికి ప్రాతిపదిక కావాలి ||

బలంగా ముందుకొస్తున్న ఈ ఉద్యమాలు తరతరాల సంప్రదాయాలను, ఆ పేరిట జరుగుతున్న క్రూరమైన అణచివేతను ప్రశ్నిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘ సంస్కరణోద్యమాలు ఒక తీవ్రమైన మూఢవిశ్వాసాలు, ఫ్యూడల్‌ సమాజంలో అంతర్భాగంగా జరిగాయి. ఈనాడు ఆధునిక ఆలోచనలు, పద్ధతులు బ్రహ్మాండంగా విస్తరించిన సైన్స్‌, కృశించిపోతున్న ఫ్యూడల్‌ సమాజం తరుణంలో ప్రగతిశీల సాంస్కృతికోద్యమాన్ని నిర్మించడానికి పై ఉద్యమాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. మతం వ్యక్తిగతమైనది. ప్రభుత్వానికి, మతానికి సంబంధం ఉండరాదు. మతపరమైన విద్యను ఆపివేయాలి అనే నిజమైన లౌకికతత్వాన్ని ప్రగతిశీల విప్లవ కార్మికోద్యమం ముందుకు తేవాలి. ఉదారవాద ఆర్థిక విధానాలను అండగా చేసుకుని పెరుగుతున్న ఫాసిస్టు తరహా మతోన్మాదాన్ని కార్మికవర్గం, కార్మికవర్గ పార్టీలు ఓడించాలి. అందుకు కొందరు మేధావులు సూచిస్తున్నట్లు పై గొప్ప చారిత్రక కర్తవ్యాన్ని రాజకీయ పార్టీల మధ్య పొత్తుల స్థాయికి అంటే బిజెపిని ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నది సరికాదు. సిపిఎం 21వ మహాసభలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. రాజకీయ తీర్మానంలో హిందూ మతోన్మాదాన్ని పూర్తిగా అంతం చేయాలంటే రెండు ప్రధాన కర్తవ్యాలను వెనువెంటనే నిర్వర్తించాలని మహాసభ చెప్పింది. ఒకటి, ఇతర మైనార్టీ మతాలలో పెరుగుతున్న ఛాందసవాద, వేర్పాటువాద, ఉగ్రవాదాలపై నిర్ద్వంద్వంగా పోరాడాలి. అలా చేసినప్పుడే ఇతర మైనారిటీ మతాలను కమ్యూనిస్టులు, ఇతర ప్రగతిశీల శక్తులు బుజ్జగిస్తాయని, హిందూ మతాన్ని తెగనాడతాయన్న హిందూ మతోన్మాద దుష్ట ప్రచారాన్ని తిప్పి కొట్టగలుగుతాం. అలాగే మైనారిటీ మతాలలో ఆధునికత వైపు, సంస్కరించబడాలన్న వైపు కృషిచేస్తున్న శక్తులను బలపర్చగలుగుతాం. ఇలా చేయడం వల్ల మైనారిటీ మతాలలో పెరుగుతున్న ఉన్మాదపూరితమైన ఛాందసవాద ఉద్యమాలను, వాటిని చూపించి తాను బలం పుంజుకుంటున్న మెజారిటీ హిందూ మతోన్మాదాన్ని, మైనారిటీ మతాల్లో పెరుగుతున్న ప్రమాదకర ధోరణులను శాశ్వతంగా అంతం చేయగలుగుతాము. ఇది జరగాలంటే ఒక గొప్ప ప్రగతిశీల సాంస్కృతికోద్యమం అవసరం. అందుకు ప్రతిఘటన సంస్కృతిని అన్ని కోణాల నుంచి పెంపొందింపజేయడం నేటి ఆవశ్యకత.   ---- ఆర్‌ రఘు

No comments:

Post a Comment