Saturday, 27 August 2016

# సుప్రీం హితవు!#

ప్ర‌జాజీవితంలో ఉన్నవారు విమర్శలకు తలొగ్గాల్సిందేనంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు చెప్పిన హితవు అనేకమంది పాలకులకు వర్తిస్తుంది. ఆమెకూ, ఆ రాష్ట్రానికీ సంబంధించి ప్రత్యేకించి చేసిన వ్యాఖ్యలతో పాటు న్యాయస్థానం మరికొన్ని మంచిమాటలూ చెప్పింది. ‘పరువునష్టం’తో ఎదుటివారిని భయపెట్టడం ద్వారా విమర్శనూ, అసమ్మతినీ తొక్కిపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దన్నది. ‘దేశద్రోహం’ మాదిరిగానే, ‘పరువునష్టం’ కూడా దుర్వినియోగమవుతున్న తరుణంలో అనేకమంది ఉద్యమకారులు, సంస్థలు డిమాండ్‌ చేస్తున్నట్టుగా దీనిని సివిల్‌ నేరంగా మార్చడంలో నష్టమేమున్నదో న్యాయవేత్తలు ఆలోచించాలి.
                  ప్రభుత్వాన్నీ, అధికార యంత్రాంగం పనితీరునూ తప్పుపట్టినవారిపై పరువునష్టందావా వేస్తూపోతుండటం ద్వారా ప్రతిపక్షాలపై కక్షసాధింపునకు పాల్పడటం వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తుందనీ, విపక్షాల విమర్శలను సహించడం పాలకులు అలవర్చుకోవాలని సుప్రీంకోర్టు హితవు చెబుతున్నది. ఎండీఎంకే నాయకుడు విజయకాంత, ఆయన భార్య ప్రేమలతపై తమిళనాడు ప్రభుత్వం దాఖలు వేసిన పరువునష్టం దావా విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలే చేసింది. జూలైలో ఈ కేసులో వీరిపై జారీ అయిన నాన్‌బెయిలబుల్‌ అరెస్టువారెంట్లను నిలిపివేస్తున్న సందర్భంలోనే సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని కొంత తెలియచెప్పింది. పాలకులు తమ ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై పరువునష్టం కేసులను ఆయుధాలుగా ప్రయోగించడం సరికాదనీ, ఇందుకు అధికారయంత్రాంగాన్ని వినియోగించుకోవడం సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఐదేళ్ళకాలంలో జయలలిత ప్రభుత్వం రెండువందలకుపైగా పరువునష్టం దావాలు వేయడం, అందులో 80 పైచిలుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేపైనా, యాభైవరకూ విజయకాంతపార్టీపైనా, మరో ముప్పై ఆయనపై వ్యక్తిగతంగానూ, మరో యాభై వివిధ మీడియా సంస్థలపైనా ఉండటం సుప్రీంకోర్టుకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం కలిగించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్‌ చేసినందుకు సుబ్రహ్మణ్యస్వామి ఐదు కేసులు ఎదుర్కొంటున్నారు. జయలలిత ఆరోగ్యంపై రాసినందుకూ, మాట్లాడినందుకూ పత్రికలూ, వ్యక్తులు కేసులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అవసరమైతే వ్యక్తిగతంగా తేల్చుకోండి అని సుప్రీంకోర్టు హితవుచెప్పింది. ప్రభుత్వం అవినీతిమయమైపోయిందనీ, సక్రమంగా పరిపాలించడం లేదనీ అన్నంత మాత్రాన కేసులు పెట్టి నోరుమూయించే ప్రయత్నాలు చేయవద్దని వ్యాఖ్యానించింది.
                  ఒక వ్యక్తి పరువుప్రతిష్టలను దిగజార్చేలక్ష్యంతో చేసిన ఒక తప్పుడు వ్యాఖ్య లేదా ప్రకటన అంటూ ఈ చట్టం విస్తృతమైన నిర్వచనాన్ని ఇస్తున్నది కనుక అధికారంలో ఉన్నవారు అవలీలగా దానిని వాడుకోవడానికి వీలుకలుగుతున్నది. ఆరుసార్లు ముఖ్యమంత్రి అయి పలు కేసులు ఎదుర్కొన్న జయలలిత, తన ఆరోగ్యం గురించి వచ్చిన వ్యాఖ్యలు, పర్యటనలపై వచ్చిన విమర్శలతోపాటు, పరిపాలనకు సంబంధించిన విమర్శలను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె పదవిలో ఉన్న మొత్తం కాలంలో దాదాపు వెయ్యికేసులు వేసినట్టు ఒక అంచనా. గత ఏడాది రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినప్పుడు వాట్సాప్‌ ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించిన కొందరిపై ఆదిలోనే పరువునష్టం కేసులు వేసి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఆమె నిలువరించగలిగారు. జయలలిత తీరును ఏకేస్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు పరువునష్టం దావా ప్రాధాన్యతను తగ్గించినట్టుగా భావించనక్కరలేదు. రాజకీయప్రత్యర్థుల నోరుమూయించడానికి అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వం తరఫున దీనిని ఆయుధంగా ప్రయోగించడాన్ని మాత్రమే అది తప్పుపడుతున్నది. ఈ చట్టం దుర్వినియోగమవుతున్నదన్న విమర్శలు అనేకం వచ్చినప్పటికీ, తాను దానిని కాపాడుకొచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు గుర్తుచేసింది. దానిని ఇలా దుర్వినియోగం చేసి అసలు స్ఫూర్తిని దెబ్బతీయవద్దని కోరుతున్నది. గతంలో సుబ్రహ్మణ్యస్వామి కేసులో ఐపీసీ 499, 500 సెక్షన్ల చెల్లుబాటును సుప్రీంకోర్టు నిర్థారించి, ‘డీక్రిమినలైజ్‌’ చేయడానికి నిరాకరించింది. వాక్‌స్వాతంత్ర్యాన్ని అడ్డుపెట్టుకొని ఒక వ్యక్తి ఇతరుల పరువు ప్రతిష్ఠలను ఏమాత్రం నష్టపరచకూడదన్న ఉద్దేశంతో ఈ పనిచేస్తూనే, వాక్‌స్వేచ్ఛ, భావస్వేచ్ఛ నిరంకుశమైనవి కావు, వాటికీ పరిమితులున్నాయ్‌ అని హెచ్చరిక కూడా చేసింది. అప్పటి సంగతి అలా ఉంచితే, జయలలిత వ్యవహారంలో సుప్రీంకోర్టు స్వయంగా అధికారంలో ఉన్నవారు పరువునష్టం దావాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూసింది. అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు, ప్రజాసంక్షేమం కోసం కృషిచేసేవారు, పాలనలో పారదర్శకతను వాంఛిస్తున్నవారు కూడా మెడమీద ఇలా కత్తివేలాడుతున్నప్పుడు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించలేరు. పరువునష్టాన్ని సివిల్‌ నేరంగా మార్చిన పక్షంలో మిగతా స్వేచ్ఛలను రక్షిస్తూనే, నోరువిప్పడానికి కూడా భయపడే పరిస్థితులను కాస్తంత మార్చవచ్చు. ( ఆంధ్ర జ్యోతి ) 

No comments:

Post a Comment