-- యుద్ధ సామగ్రి మరమ్మతు, సరఫరాలకు లాజిస్టిక్ ఒప్పందం
-- అమెరికాకు భారత్ సైనిక స్థావరాల వినియోగానికి ఎర్ర తివాచి
-- అమెరికా యుద్ధ వ్యూహాలకు మోదీ ప్రభుత్వం దాసోహం
-- భారత వ్యూహాత్మక స్వాతంత్య్రానికి ప్రమాదం
భారత్, అమెరికాలు తమ సైనిక స్థావరాలను పరస్పరం ఉపయోగించుకునేందుకు ఉద్దేశించిన వ్యూహాత్మక ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. 'లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (లెమోవా)'గా పిలుస్తున్న ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల సైనిక స్థావరాలలో పరస్పరం యుద్ధ సామగ్రి మరమ్మత్తు, సరఫరా, ఇంధనం నింపుకోవడం వంటివి ఇకపై అధికారికంగా సాగిపోతాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అమెరికా రక్షణ మంత్రి ఎష్టన్ కార్టర్‌ల భేటీ తర్వాత ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. నిజానికి, గత ఏప్రిల్‌లో కార్టర్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడే ఈ ఒప్పందంపై సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ఫలితంగా ఇరు దేశాల సైన్యాలు కలిసిమెలిసి పని చేయడం సులువవుతుందనీ, అయితే ఇది ఇరు దేశాల ఆమోదంతోనే జరుగుతుందనీ అమెరికా రక్షణ మంత్రి కార్టర్ అన్నారు. అట్లాగే, ఈ ఒప్పందం ద్వారా ఇరు పక్షాల్లో ఎవరికీ మరో దేశపు స్థావరాల్లో సైనికులను మోహరించడానికి అనుమతి లభించదని కార్టర్, పారికర్‌లిద్దరూ స్పష్టం చేశారు. భారతదేశంలో ఈ ప్రతిపాదనలను వామపక్ష పార్టీలు తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గత దశాబ్ద కాలంగా అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. వామపక్ష పార్టీల ఒత్తిడితోనే మునుపటి యూపీఏ ప్రభుత్వం దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు మోడీ ప్రభుత్వం దేశ ప్రయోజనాలను లెక్క చేయకుండా ఈ ఒప్పందానికి సై అంది. దీని ద్వారా భారత్ తాను చిరకాలంగా కట్టుబడి వున్న అలీన విధానం నుంచి వైదొలిగినట్టు అవుతుందన్నది కూడా పలువురి విమర్శ.
|| పెద్దన్నతో పీటముడులు ||
గత దశాబ్ద కాలంలో భారత్, అమెరికాల మధ్య సైన్య సంబంధాలు బాగానే గట్టిపడ్డాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా భారత్‌కు అత్యధికంగా ఆయుధ సామగ్రిని ఎగుమతి చేస్తున్న దేశంగా ఉంది. 2007 నుంచి ఇప్పటి వరకు దానికి భారత్ నుంచి దాదాపు 1400 కోట్ల డాలర్ల (రూ. 93,897 కోట్లు) కాంట్రాక్టులు లభించాయి. గత కొన్నేండ్లుగా భారత్ అన్నింటికన్నా ఎక్కువగా అమెరికాతోనే సైనిక విన్యాసాలు సాగిస్తోంది. కొద్ది నెలల క్రితమే అమెరికా భారత్‌కు కీలక సైనిక భాగస్వామి హౌదానిచ్చింది. సాధారణంగా అది ఇలాంటి హౌదాను తన సన్నిహిత మిత్రులకే ఇస్తుంది. ఈ హౌదాతో భారత్ ఇప్పటి వరకు తనకు అందుబాటులో లేని కీలక సైనిక సాంకేతికతను అమెరికా నుంచి పొందగలుగుతుంది. వాస్తవానికి ఇరు దేశాలు అవసరమైనప్పుడు సైనిక స్థావరాల నుంచి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూనే వున్నాయి. అయితే, ఈ ఒప్పందం ద్వారా దీనికి లాంఛనమైన ఆమోదముద్ర పడుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీక అని వాషింగ్టన్‌లోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో భారత్-అమెరికా సంబంధాలపై అధ్యయనం చేస్తున్న అపర్ణా పాండే అన్నారు. 'రెండు దేశాల సైన్యాధికారుల మధ్య ఇప్పటికే విశ్వాసం పాదుకొంది. ఈ ఒప్పందం దాన్ని మరింత బలోపేతం చేస్తుంది' అని ఆమె చెప్పారు. 'అమెరికాతో రక్షణ ఒప్పందాలతో కలుగబోయే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం తక్షణం ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది' అని పెంటగాన్ అధికారి బెంజమిన్ ష్వార్జ్ అన్నారు. అయితే, అమెరికా, భారత్‌ల మధ్య బలపడుతున్న సైనిక సమన్వయం పెరుగుతున్న చైనా ప్రభావాన్ని నియంత్రించే దిశలో వేస్తున్న అడుగులేనని వాషింగ్టన్‌లోని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
|| దేశ సార్వభౌమత్వానికే తలవంపులు : సిపిఎం ||
భారత్, అమెరికాల మధ్య కుదిరిన లాజిస్టిక్స్ సపోర్ట్ ఒప్పందాన్ని సిపిఎం పొలిట్‌బ్యూరో ఖండించింది. ఇది అమెరికన్ సాయుధ బలగాలకు భారత సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు వీలు కలిగిస్తుందని అది ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా భారత్ అమెరికాకు సైనిక భాగస్వామిగా మారినట్టేనని పార్టీ పేర్కొంది. 'ఈ ఒప్పందం మాటున అమెరికా సైన్యాలు యుద్ధసామగ్రి అవసరాలు, ఇంధనాన్ని నింపుకోవడం, ఇతర సేవల కోసం భారత నేవీ, ఎయిర్‌ఫోర్స్ స్థావరాలను నిరంతరం ఉపయోగించుకోగలుగుతాయి. బడుగుదేశాలపై యుద్ధాలు చేసేటప్పుడు అమెరికా సైన్యాలు భారత సైనిక స్థావరాలను ఇంధనం, మరమ్మత్తు వంటి అవసరాలకు వాడుకోగలుగుతాయి' అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యవాద దేశంతో ఇలాంటి ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం భారత సార్వభౌమత్వాన్ని అపహాస్యం చేసిందని, దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని సైతం తాకట్టు పెట్టిందని పొలిట్‌బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ముందు ఇలా మోకరిల్లడాన్ని దేశభక్తి గల భారతీయులంతా వ్యతిరేకించాలని అది విజ్ఞప్తి చేసింది.
|| అమెరికా తోకపట్టుకొని పోకండి : చైనా హితవు ||
చైనా దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' సంపాదకీయంలో మాత్రం అమెరికా తోకపట్టుకొని పోవడం భారత్‌కు శ్రేయస్కరం కాదంటూ కుండబద్దలు కొట్టింది. ఇలా అమెరికాకు అనుయాయిగా మారడం ద్వారా భారత్ తన వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అందులో రాసింది.

No comments:
Post a Comment