రియోలో చైనా డ్రాగన్.. 70 పతకాలు కైవసం చేసుకుంది..! కానీ, ఈసారి ఎంతలేదన్నా పదికి తక్కువ కాకుండా పతకాలు తెస్తుందనుకున్న భారత రెండంటే రెండింటితోనే సంతృప్తి పడింది..!
ఒక దశలో స్టార్లంతా ఇంటిముఖం పడుతుంటే... ఆశలు అడుగంటుతుంటే.. ఇద్దరు అమ్మాయిలు.. భారత పరువును నిలబెట్టారు..! ‘రాజు వెడలె...’ అన్నచందంగా ప్రతిసారి విశ్వ క్రీడలకు ఆర్భాటంగా వెళ్లే భారత బృందం చచ్చీచెడి పతకాల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమవ్వడం.. ఒక్కోసారి అవి కూడా లేకుండా ఒట్టి చేతుల్తో తిరిగిరావడం మామూలైపోయింది! వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత సాధించింది 28 పతకాలే. మరి, జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారతకు ఒలింపిక్ పతకాలు ఎండమావిగా మారుతున్నాయెందుకు? భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శనకు కారణాలు ఏమై వుంటాయి? జనాభాలో చైనాతో పోటీపడుతున్న మనం పతకాల విషయంలో మాత్రం వారితో కనీసం పోటీపడలేకపోతున్నామెందుకు? ఆ విశేషాలను పరికిస్తే..
-- ధనిక, పేద వర్గాల మధ్య భారీ అంతరం
-- ప్రభుత్వ ప్రోత్సాహం కరవు.. మౌలిక వసతుల లేమి
-- గ్రామీణ ప్రాంతాల్లో ఒలింపిక్స్‌పై అవగాహన శూన్యం
ప్రపంచ జనాభాలో ఆరోవంతు జనాభావున్న భారతలో క్రీడా సంస్కృతి లేకపోవడమే ఒలింపిక్ పతకాల లేమికి ప్రధాన కారణం. అలాగే క్రీడల ఎదుగుదలకు పేదరికం, ఆరోగ్య సమస్యలు, మౌలిక సదుపాయాలు ప్రతికూలంగా పరిణమించాయి. ధనిక పేదవర్గాల మధ్య భారీ అంతరం ఏర్పడటంతో పేదలకు బతుకు బండి నెట్టుకురావడమే దుర్భరమవుతోంది. గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన ఈ రోజుల్లోనూ భారతలో చాలాచోట్ల అమ్మాయిలను క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతించే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లుగా చూడాలనుకుంటున్నారే తప్ప క్రీడలవైపు మార్గదర్శకత్వం చేయడం లేదు. ఒకవేళ పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్నా.. మొగ్గలోనే తుంచేసి తమ ఆకాంక్షలను వారిపై రుద్దుతారు. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో భారతకు స్వర్ణాల పంట పండించిన హాకీ ఆటపై గ్రామీణప్రాంతాల్లో అవగాహనే లేదు. ప్రభుత్వం కూడా క్రీడారంగంలో నామమాత్ర కేటాయింపులతో సరిపెడుతోంది.
|| గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తేనే..||
విశ్వక్రీడలంటే ఏదేశంలోనైనా యమా క్రేజ్! మరి.. అది గ్రామీణ ప్రాంతాలతో నిండి ఉన్న భారతలో మచ్చుకైనా కనిపించదు. విశ్వక్రీడల్లో భారత సక్సెస్ సాధించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒలింపిక్స్‌పై అవగాహన కల్పించాల్సిందేనని చైనా మీడియా నొక్కి చెబుతోంది. ఈమేరకు క్రీడలపై ప్రజల్లోగల అవగాహనను తెలుసుకునేందుకు కర్ణాటక, రాజస్థాన్ రాషా్ట్రల్లోని గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనం చేసింది. మీ దృష్టిలో అత్యున్నత ఉద్యోగం ఏదంటూ రాజస్థాన్‌లో ఓ గ్రామానికి చెందిన యువకులను ప్రశ్నిస్తే.. సాఫ్ట్వేర్, ఆర్కిటెక్ ఇంజనీర్, డాక్టర్, లాయర్ అనే చెప్పారు. టీచర్, సైనికుడు కావాలనుందని మరో గ్రామంలోని యువకులు చెప్పారు. వీరిలో ఏ ఒక్కరు కూడా క్రీడాకారునిగా ఎదగాలనే ఆకాంక్షను వ్యక్తం చేయకపోవడం గమనార్హం. రాజస్థాన్ కంటే మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్న కర్ణాటకలోనూ సేమ్ టు ‘షేమ్’!
|| చైనాలో అలా...||
చైనా తర్వాత అత్యధిక జనాభాగల దేశం మనదేనని సగర్వంగా చెప్పుకునే మనమే ఒలింపిక్స్‌లో పతకాల విషయానికొచ్చేప్పటికి సైలెంట్ అయిపోతుంటాం. మరి, క్రీడల్లో చైనా అంతలా ఎలా దూసుకుపోతోంది? వాళ్లు కూడా మనలాంటి మనుషులే. కానీ, వాళ్లకు ఇచ్చే శిక్షణ, ప్రభుత్వ ప్రోత్సాహమే చైనాను ఆటల్లో అగ్రపథాన నిలుపుతున్నాయి. చైనాలో స్పోర్ట్స్ సిస్టమ్ కొంచెం భిన్నంగా, కఠినంగా ఉంటుంది. క్రీడల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తుంటుంది. పతకాలు సాధించాలి సాధించాలి అంటే సరిపోదు. క్రీడాకారులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలి. సరైన శిక్షణ అందించాలి. ప్రతిక్షణం క్రీడాకారుల వెన్నంటే ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రోత్సహిస్తుండాలి. చైనా అదే చేసింది. శిక్షణ విషయంలో చైనా చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది.
|| పునాదులు పటిష్టంగా.. ||
భవిష్యత్తులో క్రీడల్లో పాల్గొనేందుకు అథ్లెట్లకు తగిన బాడీ షేప్, ఎత్తు తదితర విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని చిన్నారి క్రీడాకారులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను నియమిస్తుంది. ఆ అధికారులు ఎలిమెంటరీస్కూళ్లకు వెళ్లి తగిన ప్రమాణాలుగల క్రీడాకారులకోసం జల్లెడ పడుతుంటారు. ఇక తమకు తగిన అథ్లెట్లు దొరికారంటే ఆ క్రీడాకారులు తమ కుటుంబాలకు దూరమవ్వాల్సిందే. జిమ్నా్స్టల కోసమైతే చైనా మరింత తీవ్రంగా అన్వేషిస్తుంది. ఇందుకోసం కేవలం 4 నుంచి 9 ఏళ్ల వయసుగల చిన్నారులను ఎంపిక చేసుకుని చాలా కఠినంగా ఎడతెరిపిలేకుండా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు ఏకంగా 12 గంటల పాటు తీవ్రసాధన ఉంటుంది. ఎంపికైన చిన్నారికి ఒలింపిక్స్‌లో పోటీపడే సత్తా ఉందా లేదా అనేది ఈ శిక్షణ కాలంలోనే తెలిసిపోతుంది. చిన్నారులు సాధనపై ఏకాగ్రత చూపడం కోసం వారి కుటుంబాలు సైతం త్యాగాలకు ఒడిగడుతుంటాయి. వారి కుటుంబాల్లో ఎవరైనా మరణించినా కనీసం ఆ విషయాన్ని సైతం చిన్నారుల దరిచేరనీయరు. అదే భారతలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో 20 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతుంటారు. 43 శాతం మంది తక్కువ బరువుతో ఉంటారు. ఇక, వారికి ఆటలాడాలనే ఆసక్తి ఎక్కడినుంచి వస్తుంది.
|| ప్రపంచ స్థాయి సదుపాయాలు..||
ప్రపంచ స్థాయి అథ్లెట్లకు ఉత్తమ స్టేడియాలు, మౌలిక వసతులు, సామగ్రి, వ్యాయామ శాలలు అవసరం. అవి ఉంటేనే వారు తమ ప్రతిభను మరింత పెంచుకోగలరు. చైనాలో 8 లక్షల 50 వేల వ్యాయామశాలలు ఉన్నాయి. బీజింగ్ ఒలింపిక్స్‌కు ముందు చైనా నిర్మించిన స్టేడియాలను చూసి ప్రపంచం నివ్వెర పోయిన సంగతి తెలిసిందే. తాము ఏయే క్రీడల్లో బలహీనంగా ఉన్నామో గుర్తించి వాటిలో ముందంజ వేసే ప్రయత్నం చేస్తుంది. స్వదేశంలో నిష్ణాతులైన గురువులకు కొదవలేకున్నా అంతర్జాతీయ పోటీని దృష్టిలో ఉంచుకొని, ఫలితాలే లక్ష్యంగా విదేశీ కోచ్‌ల సహాయం తీసుకుంటుంది.
|| ఆటలే లోకం.. అద్భుత పోత్సాహం..||
చైనా అథ్లెట్లకు ఆటలే లోకం. అదే వారికి జీవనోపాధి కూడా. ప్రాథమిక విద్యతో పాటే చిన్నప్పటి నుంచి కఠోర శ్రమతో చాలా మంది నిరుపేదలే క్రీడల్లో స్టార్లుగా ఎదుగుతారు. చైనా ప్రభుత్వం పతకాలు నెగ్గిన అథ్లెట్లకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తుంది. దీంతో, క్రీడలను చైనీయులు అద్భుతమైన కెరీర్‌గా భావిస్తారు. చైనాలో అథ్లెట్లకు, క్రీడా సంఘాలకు మధ్య మంచి సమన్వయం ఉంటుంది. అందుకే, క్రీడాకారులంతా తమ లక్ష్యంపైనే గురిపెడతారు. అధికారులు వారికి కావాల్సినవి అందేలా చూస్తారు. మనదేశంలో ఇవన్నీ లోపించడం వల్లే ఏ దశలోనూ మనం వారిని అందుకోలేకపోతున్నాం. మన ఆలోచన, ఆచరణ మారినప్పుడే ఆటల్లో భారత అభివృద్ధిని చూస్తాం.
|| ఆటగాళ్లదీ తప్పే ||
దేశానికి పతకాలు రావడం లేదంటే అందులో అథ్లెట్ల పాత్రా ఉంది. ఇష్టమైన క్రీడాంశాన్ని ఎంచుకొని, నామమాత్రపు సదుపాయాలున్నా కఠోర సాధనతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అథ్లెట్లు ఒలింపిక్ పతకం మాట అటుంచి ఆ పోటీలకు అర్హత సాధించడాన్ని మాత్రమే అంతిమ లక్ష్యంగా భావిస్తున్నారు. విశ్వక్రీడలకు అర్హతనే ‘ఎవరె్స్ట’గా భావిస్తూ అనంతరం రిలాక్స్ అవుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ ఈవెంట్లకు, వీలైతే ఒలింపిక్స్‌కు అర్హత సాధించి...అదృష్టం కలిసొచ్చి ఓ పతకం నెగ్గారంటే చాలు.. ఓ సర్కారు కొలువు, ఇంటి స్థలం వాలిపోతాయి. జీవితంలో హాయిగా సెటిలవ్వొచ్చు అనే ‘కంఫర్ట్‌జోన్’లో బందీ అవుతున్నారు. ప్రపంచంలోనే మేటి క్రీడాకారునిగా ఎదగాలనే అంతిమ లక్ష్యాన్ని వదిలి తమకు తెలియకుండానే ఇక చాలనుకుంటున్నారు.
|| చాంపియన్ల కార్ఖానాలు..||
చైనాలో 4000 స్పోర్ట్స్ స్కూళ్ల నుంచి ఇప్పటికే 4 లక్షల మంది చిన్నారులను భావి చాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులంతా తమదేశ ఖ్యాతిని పెంచేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. బీజింగ్‌లోని షిచాహై స్పోర్ట్స్ స్కూల్ నుంచి ఇప్పటికే 25 మంది ప్రపంచ చాంపియన్లు వెలుగులోకొచ్చారు. చైనా దక్షిణ భాగంలోని వీలన్ స్పోర్ట్స్ స్కూల్ వెయ్యి మంది పూర్తి స్థాయి విద్యార్థులతో ఒలింపియన్ల కర్మాగారంగా పేరొందుతోంది. చైనీయులకు క్రీడల పట్ల ఎంతటి ఆసక్తి ఉందో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.(ఆంధ్ర జ్యోతి)






No comments:
Post a Comment