Wednesday, 10 August 2016

|| గిరిజన సమగ్రాభివృద్ధికి ఉద్యమమే మార్గం ||

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులపై దాడిచేస్తున్న ఈ తరుణంలో జరుగుతున్న పరిణామాలను సాకల్యంగా అర్థం చేసుకొని ఐక్యంగా ఉద్యమించకపోతే గిరిజనుల ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. విద్య, వైద్యం, ఆహారం... రాష్ట్రంలో గిరిజనుల అక్షరాస్యత దేశంలోకెల్లా తక్కువ. కొన్ని మండలాల్లో 40 శాతం కూడా లేదు. మాతాశిశు మరణాలు అత్యధికం. పౌష్టికాహారలేమి, రక్తహీనతలతో బాధపడే గిరిజనులు చాలా ఎక్కువ. ఆరోగ్య సదుపాయాలు లేక మలేరియా వంటి చిన్న చిన్న జబ్బులతో ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలు అధ్వాన్నం. వెనుకబడిన ప్రజలు అభివృద్ధిలో ముందున్న ప్రజలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అభివృద్ధిలో ముందున్న ప్రజల కంటే అదనపు హక్కులు, రక్షణలు అవసరం. రాజ్యాంగ నిర్మాతలు ఆ దిశలో ఆలోచించి గిరిజనులకు రక్షణలు కల్పించారు. కానీ ఆచరణే అందుకు విరుద్ధంగా ఉంది. అందువల్లనే గిరిజనుల ఈ దీనస్థితి. దోపిడీవర్గాల పాలనలో చట్టాలు పాలకుల చుట్టాలుగా మారుతున్నాయి. గిరిజనులు, దళితులు, పేదలకు అనుకూలంగా ఉన్న రాజ్యాంగబద్ధ హక్కులు, చట్టబద్ధమైన రక్షణలు అమలు జరగవు. పోరాడి ప్రజలు అమలు జరిపించుకోవాలి. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అదే మార్గం. గిరిజనుల వనరులు దోపిడీదార్ల పరం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమే గిరిజన సమగ్రాభివృద్ధికి మార్గం. గిరిజనుల వనరులు వారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటే వారు తొందరగా అభివృద్ధి చెందగలరు. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. వారి వనరులు దోపిడీదారులకు వరాలుగా మారుతున్నాయి. గిరిజనులు కష్టపడి భూమిని అభివృద్ధి చేస్తే ఏదోవిధంగా వారిని మోసం చేసి, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి భూస్వాములు ఆ భూమిని కాజేస్తున్నారు. గిరిజనులను మరింత లోతైన అడవిలోకి తరిమేస్తున్నారు. పోడు వ్యవసాయమే అత్యధిక గిరిజనులకు నేడు దిక్కు. నేటి ఎల్‌టిఆర్‌ భూములన్నీ గిరిజనులవే. సాగునీరివ్వరు-ప్రాజెక్టుల్లో ముంచేస్తారు గిరిజనుల భూమికి సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వాలు ఇంతవరకు వారికి ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. అందుకు మంచి ఉదాహరణ పోలవరం ముంపు ప్రాంతమే. ఎటపాక, కూనవరం, విఆర్‌ పురం, చింతూరు, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గుంపహాడు, పోలవరం, దేవీపట్నం మండలాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల గిరిజనుల భూమి పోలవరం ప్రాజెక్టులో ముంచేస్తున్నారు. ఇది బంగారు భూమి. నల్లరేగడి నేల. మిర్చి, పత్తి, తదితర వ్యాపార పంటలు పండుతాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధిక దిగుబడి వస్తుంది. గోదావరి, శబరి, సీలేరు నదులు ఈ భూముల చుట్టూ ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద చిన్న అడ్డకట్ట వేస్తే ఈ భూములన్నీ సస్యశ్యామలమవుతాయి. 10-20 అడుగులు లిఫ్ట్‌ చేసినా ఈ భూమంతంటికీ నీరు ఇవ్వవచ్చు. వందలకు వందల అడుగులు లిఫ్ట్‌చేసి భూములకు నీరిస్తున్న పాలకులు గిరిజనులకు 69 ఏళ్ళ నుంచి చుక్క నీరివ్వలేదు. గిరిజనుల అభివృద్ధి పట్ల ఎంత వివక్షో దీన్ని బట్టి రుజువుకావడం లేదా? నీరిస్తే ఈ గిరిజనులు ఎందుకు అభివృద్ధికారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. వారికి 69 ఏళ్ళు సాగునీరివ్వని, అభివృద్ధి చేయని పాలక పార్టీలు భూమిని, భూమితో పాటు గిరిజనులను, వారి సర్వ సంపదలను, వారి సంస్కృతిసంప్రదాయాలను పోలవరం ప్రాజెక్టు రూపంలో జలసమాధి చేయడానికి పోటీలు పడుతున్నాయి. ముంపు లేకుండా గోదావరి నీరు మొత్తాన్నీ వినియోగించుకునే ప్రత్యామ్నాయాలు ఉన్నా గిరిజనులను ముంచడానికే నిర్ణయించడం దుర్మార్గం. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఉపాధి సాధ్యమే మన గిరిజన ప్రాంతం జీవ వైవిధ్యానికి నిలయం. మానవాళికి అవసరమైన ఎన్నో వనమూలికలు, ఔషధ మొక్కలు గిరిజన ప్రాంతం నిండా ఉన్నాయి. కలప మొదలు చింతపండు, తేనె, పిప్పళ్ళు, కరక్కాయలు, కాఫీ, ఒకటేమిటి అడవిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కటీ మానవావసరమే. గిరిజనులు రాత్రీపగలు అష్టకష్టాలు పడి సేకరించిన అటవీ ఉత్పత్తులు కారుచౌకగా వ్యాపారుల స్వంతమవుతున్నాయి. వీటిన్నింటినీ ప్రాసెస్‌ చేసి, ప్యాకింగ్‌ చేసి అమ్ముకునే అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తే గిరిజనుల ఆదాయం రెండు, మూడు రెట్లు పెరుగుతుంది. తద్వారా గిరిజనులు ఆర్థి కంగా అభివృద్ధి చెందుతారు. చింతపండు నిల్వ చేసుకునేందుకు కనీసం ఒక్క కోల్డ్‌ స్టోరేజీ కూడా నిర్మించని ప్రభుత్వాలు గిరిజనులను ఉద్ధరిస్తాయనుకోవడం భ్రమే. గిరిజనుల భూమంతా అన్యాక్రాంతమే రాజ్యాంగంలో ఐదవ షెడ్యూలు ప్రకారం గిరిజన ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న గ్రామాల్లో 50 శాతం గిరిజనులుంటే వాటిని షెడ్యూలు ప్రాంతంలో భాగంగా ప్రకటించాలి. మన రాష్ట్రంలో దాదాపు 1,800 గ్రామాల్లో షెడ్యూలు ప్రాంతాన్ని ఆనుకొని 50 శాతం పైన గిరిజనులున్నారు. అనేక గ్రామాల్లో నూటికి నూరు శాతం గిరిజన జనాభా కలిగి ఉన్న గ్రామాలను కూడా షెడ్యూలు ప్రాంతంగా ప్రకటించలేదు. 1989లో 889 గ్రామాల జాబితాను షెడ్యూలు ప్రాంతాల్లో కలిపేందుకు కేంద్రానికి పంపారు. 27 ఏళ్ళయినా ఇంతవరకూ ఎటువంటి నిర్ణయం చేయలేదు. ఈలోపు గిరిజనుల భూమంతా గిరిజనేతర భూస్వాములు కాజేశారు. గిరిజనులు తమ భూమిలోనే కూలీలుగా మారిపోయారు. ఈ గ్రామాల్లో గిరిజన యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నది. ఐటిడిఎలకు కూడా వీళ్లు పరాయివాళ్లే. జీవో 3 కూడా వీళ్లకు వర్తించదు. ఇంతకంటే గిరిజనులకు ఇంకేమి ద్రోహం చేయాలి? స్కూళ్ళ మూసివేత-భాషా వాలంటీర్ల తొలగింపు గిరిజనులకు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్నీ కరువే. 3, 4, 5 తరగతుల పిల్లలను జిపిఎస్‌ స్కూల్‌ నుంచి ఆశ్రమ పాఠశాలలకు తరలించి పిల్లలు తగినంత మంది లేరనే నెపంతో ఉన్న స్కూళ్ళను మూసేస్తున్నారు. కొండ కోనల్లో ఒకటో తరగతి పిల్లలు రెండు, మూడు కిలోమీటర్లు వెళ్ళి చదువుకోగలిగే పరిస్థితి లేదు. మరలా గిరిజనులను నిరక్షరాస్యులుగా మారుస్తున్నారు. గిరిజన తెగలు వారి స్వంతభాషలోనే మాట్లాడతారు. తెలుగు ఆ పిల్లలకు అర్థం కాదు. అర్థం కాని భాషలో చదువు కష్టమై స్కూళ్ళు మానేస్తున్నారు. వారి భాషలో అర్థమయ్యేలా చేసేందుకు గిరిజన భాషా వాలంటీర్లను నియమించారు. వాలంటీర్లు వారి స్వంత భాషలో చెప్పడంతో పిల్లలు రెగ్యులర్‌గా స్కూళ్ళకు వచ్చారు. హాజరు పెరిగింది. ప్రభుత్వ సమీక్షలో ఇదే తేలింది. భాషా వాలంటీర్లను మాత్రం తొలగించారు. గిరిజన అక్షరాస్యతపై నిర్లక్ష్యానికి ఇదో మచ్చుతునక. గిరిజన వర్సిటీ అనుమానమే అనేక యూనివర్సిటీలతో పాటు గిరిజన యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపిస్తామని విభజన చట్టంలో అంగీకరించారు. చంద్రబాబు విజయనగరం జిల్లాలో పెడతామని అసెంబ్లీలో ప్రకటించారు. ఐఐటి, ఐఎఎం అడ్మిషన్లు ప్రారంభించారు. ఎయిమ్స్‌, పెట్రో యూనివర్శిటీలకు త్వరలో అడ్మిషన్లు చేస్తామని ప్రకటించారు. గిరిజన యూనివర్శిటీకి మాత్రం అతీగతీ లేదు. పైగా కేంద్రమంత్రి గిరిజన యూనివర్శిటీ లేనట్లేనని ప్రకటించారు. చంద్రబాబు దాన్ని ఖండించలేదు. వారంవారం బాబు ఢిల్లీ ట్రిప్పుల్లో గిరిజన యూనివర్శిటీ ప్రస్తావనే లేదు. కాలేజీలు, ఆశ్రమ పాఠశాలల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులను నియమించడం లేదు. అనేక సబ్జెక్టులకు గురువులు లేరు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన చదువే లేదు. నేటి ప్రయివేటు పోటీ రాజ్యంలో నాణ్యత లేని చదువుతో పోటీపడి నెగ్గలేక గిరిజన యువత ఉపాధి పొందలేకపోతున్నది. మెడికల్‌, ఇంజనీరింగ్‌ విద్య బహుదూరం రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో గిరిజనులకు అందుబాటులో ఎక్కడా మెడికల్‌, ఇంజనీరింగ్‌, పిజి కాలేజీలు లేవు. పాడేరు ఏజెన్సీలో ఆరు లక్షల గిరిజన ప్రజలున్నారు. జ్వరాలతో కోకొల్లలుగా ప్రజలు చనిపోతున్నారు. అక్కడ మెడికల్‌ కాలేజీ పెడితే అనుబంధంగా పెద్దాసుపత్రి వందల మంది డాక్లర్లతో గిరిజనులను చావు నుంచి రక్షించవచ్చు. గోదావరి పుష్కరాలకు రూ.1,200 కోట్లు, కృష్ణా పుష్కరాలకు మరో రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు మెడికల్‌ కాలేజీ పెట్టడానికి రూ.400 కోట్లు మాత్రం లేవంటున్నారు. గిరిజనుల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యం? రిజర్వేషన్లు అంతరించిపోతున్నాయి విద్య, వైద్యం, రైలు, బస్సు, విమానం, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, పరిశ్రమలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, రక్షణ రంగంతో సహా సర్వం ప్రయివేటు పరం చేస్తున్నారు. రాజ్యాంగపరంగా గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ప్రభుత్వ సర్వీసులు, రంగాలు ప్రయివేటుపరం కావడంతో మన రిజర్వేషన్లు అంతరించి పోతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 7,77,000, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2,40,000 ఖాళీగా ఉన్నాయి. ఇవి నింపితే రిజర్వేషన్‌ ప్రకారం గిరిజనులకు 71 వేలు వస్తాయి. కానీ వాటిని భర్తీ చేయకుండా కాంట్రాక్టు వర్కర్లతో పని చేయించుకుంటున్నారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలుకు పాలకులు అంగీకరించడం లేదు. ప్రయివేటీకరణ రోజురోజుకూ పెరగడంతో గిరిజనులకు రిజర్వేషన్ల హక్కు ఉండీ లేనట్టే. గిరిజన చట్టాలన్నీ ఉల్లంఘనే గిరిజనులకు రక్షణ ఇచ్చే చట్టాలన్నీ పాలకులు ఉల్లంఘిస్తున్నారు. 1/70 చట్టం, పీసా చట్టం, ఐదవ షెడ్యూలు నిబంధనలు..., ఏ ఒక్కటీ అమలు జరిపిన ముచ్చటే లేదు. దోపిడీవర్గాల పరిపాలనలో అధికార గణం (ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌)లో ఎస్‌ఆర్‌ శంకరన్‌, బిడి శర్మ వంటి కొద్దిమంది మినహా అత్యధికులు నిరంకుశ అధికారులే. వీళ్ళ పాలనలో గిరిజనులకు ద్రోహం తప్ప ఏమి న్యాయం జరుగుతుంది? ఈ ప్రమాదాన్ని గమనించే రాజ్యాంగ నిర్మాతలు గిరిజనులను గిరిజనులే పాలించుకునేందుకు అవకాశం కల్పిస్తూ రాజ్యాంగంలో 6వ షెడ్యూలు ఏర్పరిచారు. దానికి అనుగుణంగా త్రిపుర రాష్ట్రంలో గిరిజన స్వయం పాలిత అభివృద్ధి మండలిని ఏర్పరిచారు. అధికారుల పెత్తనం స్థానే గిరిజనులకు తమకేమి కావాలో నిర్ణయించుకొనే అవకాశం దొరికింది. వనరులను ఎందుకు, ఎక్కడ, ఎలా ఖర్చు చేసుకోవాలో నిర్ణయించుకొనే హక్కు వచ్చింది. అందువల్లనే నూటికి 96 మంది అక్షరాస్యులుగా మారారు. అడుక్కుతినేవాళ్ళు, ఆకలితో మరణించేవాళ్ళు, ఆత్మహత్యలు లేని విధంగా అభివృద్ధి చేసుకోగలిగారు. అల్లూరి, కొమరం భీం... స్ఫూర్తితో పోరాడాలి ఆది నుంచీ పోరాడకుండా గిరిజనుల ఉనికే లేదు. క్రూరమృగాలతోనే గాక మానవ మృగాలతోనూ భయంకరమైన యుద్ధాలు చేసి గిరిజనులు తమ ఉనికిని కాపాడుకుంటున్నారు. మొదట రాజులు, జమిందార్లతో పోరాడారు. అనంతరం బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులతో యుద్ధం చేశారు. స్వాతంత్య్రానంతరం భారత పాలక వర్గాలతో నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. నేడు భారత పాలకవర్గాలకు విదేశీ బహుళజాతి సంస్థలు (కార్పొరేట్‌ శక్తులు) తోడై గిరిజనులను అడవి నుంచి తరిమేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, తదితర యోధుల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి. సమగ్రాభివృద్ధికై ఉద్యమించాలి ఆరవ షెడ్యూలు ప్రకారం గిరిజన స్వయంపాలన, 50 శాతం గిరిజనులున్న గ్రామాలను ఐదవ షెడ్యూలులో చేర్చడం, గిరిజన యూనివర్శిటీ, అనుబంధంగా మెడికల్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రాథమిక విద్యకు ప్రతీ గిరిజన గూడెంలో పాఠశాల, ఉపాధికై గిరిజనోత్పత్తులతో ప్రాసెసింగ్‌ యూనిట్లు, సాగునీరు ప్రాజెక్టులు సాధించుకున్నప్పుడే సమగ్ర గిరిజనాభివృద్ధి సాధ్యం. అందుకు పార్టీల అనుబంధాలను పక్కనపెట్టి గిరిజనులంతా సమైక్యంగా ఉద్యమించాలి. - ఎం క్రిష్ణమూర్తి (వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)

No comments:

Post a Comment