భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 70వ స్వాతంత్య్ర దినోత్సవ దినాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన చెందారు. ప్రజాస్వామ్యమంటే కొన్నేళ్లకొకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకునే కసరత్తు కాదు. అంతకన్నా మించిన ప్రక్రియ. స్వేచ్ఛ అనే మహా వృక్షానికి ప్రజాస్వామ్య వ్యవస్థల ద్వారా నిరంతర పోషకాలు అవసరం. అంతరాయాలు, విభజనవాద రాజకీయ అజెండా వల్ల వ్యవస్థలకు విలువ లేకుండా పోతుందన్నారు. ప్రధాని మోదీ కూడా ఎర్రకోట ప్రసంగంలో దళితులపై దాడులను ఖండించారు. ఒకపక్క ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తూ ఆర్.ఎస్.ఎస్., విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలను బలోపేతం చేస్తూ, మరోపక్క దళితులపై దాడులు జరుగుతున్నాయనడం ప్రధానమంత్రి ద్వంద్వ నీతికి నిదర్శనం. నిజానికీ ఈ రెండు సంవత్సరాల్లో హిందూ రాజ్యాన్ని స్థాపించాలనే ఆర్.ఎస్.ఎస్., విశ్వహిందూ పరిషత్‌ల వ్యూహరచన హిందూ మతంలో ఉన్న ఫాసిస్ట్ కోణానికి మరింత పదునుపెడుతుందని మనకు అర్థమవుతుంది. అటు ప్రణబ్‌ముఖర్జీ కానీ, ఇటు మోదీ కానీ స్వాతంత్రోద్యమ ప్రస్తావనల సందర్భంగా అంబేడ్కర్ సిద్ధాంతాలను విస్మరించారు. బ్రిటీష్ వాళ్ళు పాలించేటప్పుడే భారతదేశంలో అనేక మత సంస్కరణోద్యమాలు జరిగాయి. హిందూ మతంలో మార్పులు తీసుకురావటం కోసమే బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం ఆవిర్భవించాయి. ఎంతో కొంత సంస్కరణలకు ప్రయత్నం చేశారు. మరోపక్క కొత్త విజ్ఞానం, యంత్రాలు, ఉత్పత్తి సాధనాలతో వచ్చిన మార్పులను కూడా హిందూ మతోన్మాదులు ఎదిరిస్తూ వచ్చారు. భారతదేశంలో మూలవాసులు కనిపెట్టిన తోలు పరిశ్రమను, జంతు ఆహార వినిమయాన్ని గోరక్షణ పేరుతో అడ్డుకొని దేశీయ ఉత్పత్తులను దెబ్బతీయాలనేది, భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టాలనేది ఆర్.ఎ్‌స.ఎస్. ఎజెండాగా మనకు అర్థమవుతున్నది. హిందూ మతోన్మాదం హేతురహితమైంది. తర్కానికి నిలవనిది, జ్ఞానానికి వ్యతిరిక్తమైంది, మానవత్వానికి భిన్నమైంది కూడా. మనిషి అభివృద్ధికి నిరోధకమైంది. మానవ సమాజ విస్తృతికి ఉక్కుగోడలా అడ్డు నిలిచింది. మానవుడి మెదడును కొన్ని పరిమితులకే లోబడేటట్లు నియంత్రించింది. అటువంటి హిందూవాదం నుంచి కొందరు బ్రాహ్మణులు కూడా విముక్తి చెందారు.
హిందూ మతాన్ని సంస్కరించాలని వివేకానందుడు, రామతీర్థ, బాలగంగాధర్‌తిలక్, మహాత్మాగాంధీ, డాక్టర్ రాధాకృష్ణన్ కొంతలో కొంత ప్రయత్నం చేశారు. అయితే ఆర్.ఎ్‌స.ఎస్., విశ్వహిందూ పరిషత్ హిందూ సంస్కరణవాదానికి మొదటినుంచి శత్రువులుగానే ఉన్నాయి. హిందూ మతోన్మాదం ఒక నియంతృత్వ వాదంగా, మూలవాసులను శత్రువులుగా భావించే వాదంగా మొదటి నుంచి ముందుకొచ్చింది.
ఒకసారి మనం ఆర్.ఎస్.ఎస్. పూర్వ చరిత్రకు వెళితే అసలు మతోన్మాదం పుట్టు పూర్వోత్రాలు, దళిత ముస్లిం ద్వేష పునాదులు, హిందూ సంస్కర్తలను వారు ఎందుకు తూలనాడుతున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. భారతదేశంలో హిందూ మతోన్మాదాన్ని పెంపొందించటంలో ఆర్.ఎ్‌స.ఎస్. పాత్ర గణనీయమైంది. దాని కుతంత్ర పూరితమైన వ్యూహమే ’రామజన్మభూమి - బాబ్రీ మసీద్’ వివాదం. ఆర్.ఎ్‌స.ఎస్. శక్తుల మతోన్మాద చరిత్రను మనం అర్థం చేసుకుంటే గాని ఈ దాడుల విషయం మనకు అవగతం కాదు. ఈ 70 ఏళ్ళ స్వాంతత్య్ర భారతంలో అది వర్ణ వ్యవస్థను పెంచి పోషించింది. కుల విద్వేషాలు రేపింది. అస్పృశ్యతా మారణ హోమాన్ని ఆచరించింది. ఈ హిందూ నియంతృత్వాన్ని అమానుషత్వాన్ని భరించలేక దళిత బలహీన వర్గాల ప్రజలు సిక్కు, ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరించారనే సత్యాన్ని వీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ దాడుల వల్ల మైనార్టీ మతాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. హిందూ, ముస్లిం వివాదాలను శాసీ్త్రయంగా పరిష్కరించకుండా, నిరంతరం తమ రాజకీయాల కోసం పెంచుతూనే వచ్చారని అంబేడ్కర్ విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం మతోన్మాదాన్ని పెంచి పోషించారని ఆయన స్పష్టంగా చెప్పారు.
హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఆనాటికీ, ఈనాటికీ పెద్ద ఉద్యమం జరుగుతూనే వస్తుంది. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు అవి నిరంతర ప్రవాహాలు, ప్రజ్వలితాలు కూడా. అయితే ప్రతి సమాజపు కదలికకు ఒక తాత్విక దృక్పథం కావాలి. సమాజం నిరంతర ఘర్షణతో చలనశీలంగా వుంటుంది. నిన్నటి సిద్ధాంతాలు నేడు అన్వయం కాకపోవచ్చు. సిద్ధాంతాల కంటే సమాజం ముందుకు పోవచ్చు, వెనక్కి పోవచ్చు. మొత్తం సమాజం వెలుగొందాలంటే, ఆశయపూర్ణం కావాలంటే స్తబ్దమైన సమాజాన్ని కొన్ని శక్తులు కదిలించి తీరాల్సి వుంది. నిజానికి హిందూమతం ఒక్కదానిలోనే కాదు. ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ మతాలన్నింటిలోకి కులతత్వం ఈనాడు చొరబడింది, ఛాందసత్వం చొరబడింది. దళితుల్లో కొన్ని ప్రాంతాల్లో హిందూ మతభావాలు పెరుగుతున్నాయి. అగ్రవర్ణాలకు పోటీపడి కొలుపులు, జాతరులు చేస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్., ఎస్సీ, ఎస్టీల్లోకి చొచ్చుకుపోవాలని చూస్తుంది. వాడ, వాడల్లో రామమందిరాలు నిర్మించాలని చూస్తుంది. దీనివలన దళితులు మళ్ళీ పూర్వ స్థితికి నెట్టబడే ప్రమాదం ఉంది.
అంతేగాక అంబేడ్కర్ పేరుతో ఆర్.ఎస్ .ఎస్. దళిత వాడల్లో చొరబడాలని చూస్తుంది. అంబేడ్కర్‌ని దేవుణ్ణి చేసి ఆయన సిద్ధాంతాలను, వక్రీకరించాలని చూస్తున్నారు. ఆర్.ఎస్ .ఎస్. వ్యూహం మార్చుతోంది. విశ్వవిద్యాలయాల్లో దళితులు ఉన్నత విద్యను అడ్డుకోవాలని చూస్తుంది. వారిలో ఆత్మన్యూనత కలిగించాలని చూస్తుంది.
ఏ ఉన్మాదం అడ్డొచ్చినా అది మతమైనా, అది కులమైనా, అది ప్రాంతమైనా దానిని తొలగించుకోవాల్సిన శాస్త్రీయ అవగాహన ఈనాటి భారతీయుల కర్తవ్యం. -డాక్టర్ కత్తి పద్మారావు


No comments:
Post a Comment