మలబార్ తీరంలో ఎర్రజెండా మరోసారి రెపరెపలాడింది. నాలుగు నెలల సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగు తోంది. మూడు నెలల ప్రభుత్వాన్ని పురిటిలోనే హతమార్చేందుకు కసాయి (కాషాయి) మూకలు కుట్రలు పన్నుతున్నాయి. తమ వ్యూహాలతో భయోత్పాతం సృష్టిస్తున్నారు. బాంబులతో దాడులు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో అల్లర్లతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వీటిని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటున్నది. ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తూ ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించింది. గత యుడిఎఫ్ ప్రభుత్వ వైఫల్యాలకు భిన్నమైన విధానాలను రూపొంది స్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలు, మహిళలపై అత్యాచారాలు, లౌకికవాదం బలహీన పడటం, వ్యవసాయ వృద్ధి తిరోగమనం, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లోకి దిగజారటం, సంప్రదాయ పరిశ్రమలు దెబ్బతినడం, విద్య కార్పొరేటీకరణ, ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలహీన పడటం, విచ్చలవిడి అవినీతి, బంధుప్రీతి వంటి యుడిఎఫ్ విధానాలకు చమరగీతం పాడి ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనకై ప్రజలు ఆశతో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఎల్డిఎఫ్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే అవినీతి అంతం, సున్నా అసహనానికై దూరదృష్టి గల విధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఒక వైపు ప్రజా సంక్షేమం, మరోవైపు దూరదృష్టి గల విధానాల రూపకల్పన రెండూ సమాంతరంగా ముందుకు సాగుతున్నాయి. ఇలా ప్రజామోదమైన ప్రభుత్వం, ప్రజలతో మమేకమై విజయ పథంలో నడవటం కొన్ని మూకలకు మింగుడుపడటం లేదు. ఎలాగైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి ఒక సెక్షన్ (కార్పొరేట్) మీడియా కూడా వత్తాసు పలుకుతూ... ప్రచారంలో అండగా నిలస్తున్నది. చిన్న చిన్న అంశాలను పెద్ద పెద్ద పతాక శీర్షికలుగా రాస్తున్నది. ప్రజా విశ్వాసాన్ని నీళ్ల పాలు చేసి తన మీడియా నైతికతను గంగలో కలిపుతున్నది.
|| ఎల్డిఎఫ్ ప్రభుత్వ కీలక నిర్ణయాలు ||
తమ అవసరాలు తీర్చే ప్రభుత్వం తక్షణ అవసరమని కేరళ ప్రజానీకం ఎవరూ ఉహించలేని మెజార్టీతో ఎల్డిఎఫ్ కూటమిని గెలిపించారు. అధికారంలోకి వచ్చిన ఎల్డిఎఫ్ ప్రభుత్వ విధాన నిర్ణయాలు కూడా ప్రజల ఆశలకు, ఆశయాలకు లోబడే నిర్మించబడుతున్నాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి ప్రాథమికాంశాలకు పెద్దపీట వేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని ప్రజలు భావిస్తున్నారు. మంత్రివర్గ తొలి నిర్ణయం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. దళిత విద్యార్థిని జిషా హత్యాచారంపై ఐపిఎస్ అధికారిణితో విచారణ జరిపించింది. ఆమె కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తల్లికి నెలకు రూ.5 వేల పెన్షన్‌తో పాటు వారికి ప్రభుత్వమే పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలకే పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. దళితులపై సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా పినరయి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. నిర్ణయాలు కూడా దీర్ఘకాలం పాటు ఆచరణలో ఉండాలని ప్రణాళిక వేసింది. ప్రజానుకూల నిర్ణయాలకు, అవినీతి నిర్మూలనకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. సంక్షేమ పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచటం, యుడిఎఫ్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పంచవర్ష ప్రణాళిక విధానాన్ని తిరిగి కొనసాగించడం, గత యుడిఎఫ్ ప్రభుత్వం 2016 జనవరి నుంచి ఏప్రిల్ వరకు తీసుకున్న నిర్ణయాల్లో అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు సబ్ కమిటీ(మంత్రి వర్గ ఉప సంఘం) వేసింది. అతి తక్కువ కాలంలోనే ఎకె బాలన్ నేతృత్వంలోని ఆ కమిటీ 19 చట్ట విరుద్ధ నిర్ణయాలు తీసుకున్నట్టు తేల్చింది. ప్రజలు చేసే ప్రతి ఫిర్యాదునూ నెల రోజుల్లో పరిష్కరించేందుకు, ప్రభుత్వ వ్యవహారాలను చక్కదిద్దడానికి అధికార యంత్రాంగం వారంలో ఐదు రోజులు రాష్ట్ర రాజధానిలో ఉండాలి. జిల్లా స్థాయిలో పరిష్కారానికి వీలుండే ఫిర్యాదులను రాష్ట్ర స్థాయికి తేవాల్సిన అవసరం లేదు. మూడంచెల పంచాయతీలకు 12 దశల్లో ఆర్థిక సహకారం, కొచ్చి మెట్రో, వాటర్ మెట్రో, స్మార్ట్ సిటీల పూర్తికి కృషి, రవాణా వ్యవస్థను మెరుగుపర్చడం, రోడ్ల నిర్మాణంలో నాణ్యత, రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు 45 కిలోమీటర్ల పొడవునా రోడ్డు విస్తరణ, తదితర అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.
|| ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం ||
ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం దిశగా కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తోంది. ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తృత పరిచేందుకు రూ.150 కోట్లు కేటాయించింది. కేరళ ప్రజలు మినప్పప్పు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో మినప్పప్పు ధర ఆకాశాన్నంటింది. దాంతో ప్రభుత్వమే మినప్పప్పును కొనుగోలు చేసి రూ.181 ఉన్న దాన్ని రూ.66కే మలెలి స్టోర్(ప్రభుత్వ దుకాణం) ద్వారా ప్రజలకు అందిస్తున్నది. ఇదే దుకాణం ద్వారా కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, కారం, పంచదార, కొబ్బరి నూనె, బియ్యం లాంటి 13 నిత్యావసర వస్తువులు అందిస్తున్నది. మళయాళీలకు అత్యంత ముఖ్యమైన ఓనం పండుగకు బియ్యం కొరత సృష్టించడానికి కొంత మంది కుట్రపన్నుతున్నారు. దాన్ని అధిగమించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరిపి, తక్కువ ధరకే ప్రజలకు అందించేందుకు విధానాలు రూపొందిస్తోంది. వ్యాపారులు మంకుపట్టు పడితే ప్రభుత్వమే బియ్యం కొనుగోలు చేసి, ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించేందుకు నిర్ణయాలు చేస్తోంది.
|| ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి ||
కేరళలో మందుల కొరత విపరీతంగా ఉండేది. ఎల్డిఎఫ్ ప్రభుత్వం మందుల కొరత నివారణకు రూ.372 కోట్లు కేటాయించింది. ప్రభుత్వమే కొన్ని ప్రత్యేక దుకాణాల ద్వారా తక్కువ ధరలకే మందుల అమ్మకాన్ని నిర్వహిస్తున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి సకాలంలో వైద్యాన్ని అందించే ప్రక్రియను చేపట్టేందుకు, ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రమాణాలతో పాటు వైద్యం ఖరీదు కాకుండా చర్యలు తీసుకునేందుకు, వైద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీలను భర్తీ చేసి వైద్యాన్ని అందించే చర్యలు చేపట్టేందుకు, సుదూర ప్రాంతాలకు కూడా వైద్యం సకాలంలో అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
|| మెరుగైన విద్య...||
ప్రభుత్వ విద్యను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. మూసివేతకు సిద్ధంగా ఉన్న ఎయిడెడ్ స్కూళ్ళను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని విద్యాభివృద్ధికి బాటలు వేసింది. ఐదేళ్ళలో ఎయిడెడ్ పాఠశాలల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించింది. మొదటి ఏడాది రెండు కార్యక్రమాల ద్వారా రూ.450 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటి స్కూల్స్‌గా రూపకల్పన చేయాలని, 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎయిడెడ్ పాఠశాలల్లో 60 వేల హైటెక్ తరగతి గదులు, వెయ్యి స్కూళ్ళలో అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలని ఎల్డిఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య విద్యలో ప్రమాణాలు పాటించాలని కాలేజీలకు ఆదేశించింది. నాటి యుడిఎఫ్ ఇచ్చిన అక్రమ అనుమతులు రద్దు చేయడం, బోధనా ప్రమాణాలు లేని, మౌలిక సదుపాయాల కల్పనకు నోచుకోని కాలేజీలపై చర్యలు చేపట్టడం, ప్రయివేటు మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ జోక్యం తప్పనిసరి చేయటం, సెల్ఫ్పైనాన్స్ ఇంజనీరింగ్ కళాశాలల అడ్మిషన్లు, ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వాన్ని సంప్రందించడం వంటి నిర్ణయాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది.
|| నిరుద్యోగంపై యుద్ధం...||
నిరుద్యోగాన్ని తరిమికొట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ప్రభుత్వ సంస్థల్లో, విభాగాల్లో ఏళ్ల తరబడి భర్తీకాని ఖాళీలను భర్తీ చేయాలని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటి సంబంధిత రంగాల్లో ఉద్యోగ కల్పన, ఒక్క కొచ్చిలోనే లక్ష ఉద్యోగాల కల్పన లాంటి అనేక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంలో 25 వేల ఉద్యోగాలు, పర్యాటక రంగంలో పది వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతులు కూడా ఇచ్చింది.
|| వ్యవసాయాభివృద్ధి ||
ప్రాథమిక రంగమైన వ్యవసాయానికి కేరళ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వరి అవసరం ఎక్కువ. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో వరి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరి సాగును 1.98 లక్షల హెక్టర్ల నుంచి మూడు లక్షల హెక్టర్ల వరకు పెంచాలని నిర్ణయించింది. వ్యవసాయ సబ్సిడీలను పెంచాలని, వ్యవసాయోత్పత్తుల ధరల్లో రైతులకు తగిన పాత్ర ఉండాలని ప్రభుత్వం చెబుతోంది.
|| పరిపాలన ప్రక్షాళన...||
గత యుడిఎఫ్ ప్రభుత్వం ఐదేళ్లలో పరిపాలనా దుర్వినియోగానికి పాల్పడింది. అవినీతి విచ్చలవిడి అయిపోయింది. అన్ని రంగాలూ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయాయి. అధికార యంత్రాంగం ప్రజలకు దూరంగా ఉంది. ఈ అభివృద్ధి ఆటంకాలను తొలగించేందుకు ప్రస్తుత పరిపాలనా విధానంలో మార్పులు అవసరమని భావించిన ఎల్డిఎఫ్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలకు రాజ్యాంగ బద్ధమైన కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్ నేత విఎస్ అచ్యుతానందన్‌ను ఛైర్మన్(మంత్రి వర్గ హోదా)గా నియమించింది. గతంలో పరిపాలనలో పంచాయతీలకు పెద్దపీట వేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డ కేరళ వామపక్ష ప్రభుత్వం ఈసారి నూతన పరిపాలనా సంస్కరణలతో ప్రజల ముందుకు రాబోతోంది. ఇంతటి ప్రజారంజక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వ విధానాలు కొంతమందికి మింగుడుపడటం లేదు. దేశానికే ఆదర్శవంతమైన, ప్రజామోదమైన సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై కేంద్రంలోని బిజెపి దాడులకు ఒడిగట్టడం రాజకీయ తిరోగమనానికి నిదర్శనం. వీరికి స్థానిక అస్తిరతను కోరుకునే మూకలు జతకలవడం మరో పెద్ద ప్రమాదం. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు పెద్ద సవాల్‌గా మారాయి. ఒక్క కేరళనే కాక చిన్న ఈశాన్య రాష్ట్రమైన త్రిపురను కూడా ఈ మూకలు వదలటం లేదు. అక్కడ విభజన అల్లర్లు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు. కేరళలో హిందూత్వ శక్తులు బాంబుల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి అనిశ్చిత పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఏళ్ల చరిత్ర గల కమ్యూనిస్టు ప్రభుత్వాలు వారి ఆటలకు ఆదిలోనే అడ్డుకుంటాయి. ప్రజాందోళనతో తిప్పికొడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
- జె జగదీశ్

No comments:
Post a Comment