Wednesday, 10 August 2016

|| కాశ్మీర్‌పై రేపు అఖిలపక్షం ||

  కాశ్మీర్‌పై ప్రతిపక్షాలు చేసిన ఆందోళనకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. కాశ్మీర్‌లో శుక్రవారం అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హాజరవుతారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. కాశ్మీర్‌ అంశంపై అఖిల పక్షం వేయాలని, రాజకీయ చర్చలు అవసరమని సిపిఎం, ఇతర విపక్షాలు తొలినుంచి డిమాండు చేస్తున్నాయి. కాశ్మీర్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న అశాంతిపై బుధవారం పార్లమెంట్‌ ఉభయసభల్లో వాడివేడి చర్చ జరిగింది. కాశ్మీర్‌లో పరిస్థితులు చేజారకముందే దీనిపై ప్రధాని సభలో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశాయి. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఏం చర్యలు చేపడుతున్నారో ప్రధాని సభకు వివరించాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. మరోవైపు రాజ్యసభలో దీనిపై సుదీర్ఘ జరిగింది. కాశ్మీర్‌ అల్లర్లపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సీపీఐ(ఎం) ఎంపీ సీతారాం ఏచూరి తప్పుపట్టారు. 1990లో వాజ్‌పేయి హయాంలో రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ పాటించిన విషయాన్ని గుర్తుచేశారు. హిజ్బుల్‌ నేతలతో మంతనాలు జరిపారన్నారు. ఇక 2004లో అప్పటి డిప్యూటీ పీఎం, హోంమంత్రి ఎల్‌కే అద్వానీ మిలిటెంట్‌ నేతలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నదని ఏచూరి ప్రశ్నించారు. కాశ్మీరీల్లో విశ్వాసం నెలకొనేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కాశ్మీర్‌లో పెల్లెట్‌ గన్స్‌ వాడటాన్ని నిలిపివేసి అఖిలపక్ష బృందాన్ని పంపాలని సూచించారు. కాశ్మీర్‌లో శాంతి నెలకొనేలా అన్ని వర్గాలతో బహిరంగంగా చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. రాజకీయ సంప్రదింపుల ద్వారా సామరస్య వాతావరణం నెలకొనేలా చొరవ చూపాలని కోరారు. కాశ్మీర్‌పై రాజ్యసభలో తొలుత ఒక సారి చర్చజరిగినా అది తూతూ మంత్రంగా సాగిపోయింది. దీనిపై అర్థవంతమైన చర్చ జరగాలని సిపిఎం, కాంగ్రెస్‌ ఇతర ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడంతో మొదట నిరాకరించిన ప్రభుత్వం చివరికి సమ్మతించింది. ఈ మేరకు బుధవరాం జరిగిన రెండో విడత చర్చల్లో ఏచూరి, గులాం నబీ ఆజాద్‌లు అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని గట్టిగా పట్టుపట్టారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిల్లో కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహించేందుకు సమ్మతించింది. అందంగా ఉంటుందని మాత్రమే కాశ్మీర్‌ను ప్రేమించకండి అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయిన వారికి కూడా ప్రేమను పంచండి అంటూ కాంగ్రెస్‌ పక్షనేత గులాం నబీ ఆజాద్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తొలుత చర్చ ప్రారంభించిన ఆజాద్‌, గడిచిన 33 రోజులుగా కాశ్మీర్‌లో అట్టుడుకుతున్న ఆందోళనల నేపథ్యంలో మిగతా భారతీయులలాగే కాశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. '33 రోజుల తర్వాతైన కాశ్మీర్‌ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చకు అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగ మనేది నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలసిపోయామా? లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కాశ్మీర్‌ కుటుంబం ఉగ్రవాద పీడనను అనుభవించింది. వారికి రక్షణగా నిలవాలి. అంతే తప్ప సైన్యాన్ని ఉపయోగించి భయోత్పాతం సృష్టించొద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. అఖిల పక్షంతో కాశ్మీర్‌కు వెళ్లి, పరిస్థితులు చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోండి. పార్ల మెంట్‌ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే కాశ్మీరీలకు భరోసా ఇచ్చిన వాళ్ళమవుతామని గులాం నబీ ఆజాద్‌ అన్నారు.కాశ్మీర్‌ అంశంపై ప్రధాని మధ్య ప్రదేశ్‌లో మాట్లాడారు కాని లోక్‌సభలో కాదని పేర్కొన్నారు. ''ఎక్కడో ఆఫ్రికాలో ఏదైనా ఘటన జరిగితే ప్రధాని ట్వీట్‌ చేస్తారు. మన శత్రుదేశం పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ఏదైనా దాడికి పాల్పడితే మానవతా దృక్పథంతో స్పందిస్తారు. ఎక్కడ ప్రాణ నష్టం జరిగినా సానుభూతి తెలపడంలో తప్పులేదు. మన దేశంలోని కీలక ప్రాంతం తగలబడిపోతుంటే ఆ వేడి మదికి చేరాలి కదా! కాశ్మీర్‌ అందాలను పొగడాల్సిన పనిలేదు...అక్కడ ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రేమ చూపండి' అని పేర్కొన్నారు. కాశ్మీర్‌ అంశంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందిస్తూ జమ్మూ కాశ్మీర్‌లో సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం పెచ్చుమీరిపోయిందని దాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. కాశ్మీర్‌ వ్యవహారంపై అందరూ ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ మాట్లాడుతూ కాశ్మీర్‌ అంశంపై శుక్రవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రెండు నెలల్లో ప్రత్యామ్నాయాలను కనుగొటామన్నారు. 4,500 మంది రక్షణ సిబ్బంది గాయాల పాలయ్యారని చెప్పారు. నిర్వహణకు కష్టమైనా కాశ్మీర్‌ లోయలో సమస్యలకు ఒక రాజకీయ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. కాశ్మీర్‌లో హింస, ప్రస్తుత రక్తపాతానికి ముగింపు పలకాలని హితవు పలికారు. సైన్యాన్ని వినియోగించకుండా, కాశ్మీర్‌ ప్రజల హృదయాలు గెలుచుకోవాలని జెడియు సభ్యుడు శరద్‌ యాదవ్‌ సూచించారు. పెల్లెట్‌ తుపాకులు ప్రయోగి ంచడం తక్షణమే మానుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిష్కారం కొనుగొనేందుకు ప్రయత్నించాలన్నారు. కాశ్మీర్‌ యువత లబ్ధి పొందితేనే విజయవంతమైన భారతదేశం రూపుదిద్దుకుంటుందని కేంద్ర మంత్రి జితింద్ర చౌదరి అన్నారు. జమ్మూకాశ్మీర్‌ తన సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉందన్నారు. కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని రాజ్యాంగంలోనే చెప్పారన్నారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన హిజబుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వని చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి డెరెక్‌ ఓబ్రీన్‌ అన్నారు. బుర్హాన్‌ వని వీధుల్లో కంటే ఇంటర్నెట్‌లో చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అతడు బతికి ఉండగా కంటే చనిపోయిన తరువాతే ఇంకా ఎక్కువ ముప్పుగా మారాడన్నారు.

No comments:

Post a Comment