Monday, 22 August 2016

|| గో రక్షణ పేరిట మానవ హననం... ||



             'గోమాత'లను ముందుకు తెచ్చి మనుషుల సంరక్షణ కన్నా మాతల సంరక్షణే ప్రధానమంటూ కాషాయ పరివారం భౌతిక దాడుల మొదలు కోర్టుల వరకూ దేన్నీ వదలని నేపథ్యంలో ఆగస్టు చివరి వారంలో సుప్రీం కోర్టు స్పందన వెలువడింది. 'బీఫ్‌ కలిగి ఉండటంపై నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధమా?' ఈ అంశాన్ని విచారించడానికి అది అంగీకరించడంతో మీడియాలో చర్చ ఊపందుకొంది. అది కొన్ని చోట్ల 'మోడియాగా' సాగుతుంటే, మరి కొన్ని చోట్ల అందుకు వ్యతిరేకంగా సాగుతోంది. ఒక కీలక చర్చ జరగనున్న సమయంలో బాధ్యత గల పౌరులందరూ దీనిపై దృష్టి సారించాలి. చర్చ సాగించాలి. రాజకీయ సంకుచిత ప్రయోజనాలతో కాకుండా మానవాళికేది మంచో దాన్ని రాబట్టేలా వ్యవహరించాలి. 'బీఫ్‌' ఆహారంగా ఉంది. 'గోవు' పేరిట అది కొందరి నమ్మకంగా ఉంది. ఈ వాస్తవంలో నుంచి మనం ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. అడవుల్లో నుంచే మానవజాతి మనుగడ మొదలైంది. చిన్న జంతువులు ఆకులలములతో ప్రారంభమైన ఆహార సంపాదన వేట దశకు చేరింది. అరుగుదలకు లోబడిన ప్రతి జంతువునూ నాటి మనిషి ఆహారంగానే చూశాడు. ఆహార నిల్వ, పశువుల పాలు ఆహారావసరంగా గుర్తించాక పశుపోషణకూ, పశు సంరక్షణకూ దిగాడు. భూమిపై పండించడం నేర్చుకున్నాక పశు సంరక్షణాంశం మరింతగా ముందుకొచ్చింది. భౌతికంగా చూస్తే 'పవిత్రత, అపవిత్రత' కన్నా ఆహారం పెంపుకు మానవాళి అలోచనను మళ్ళించాల్సి వచ్చింది. దాన్ని ఒప్పించడానికి మొదలైన నీతినియమాలూ, ధర్మ బోధనలూ వైదికం, బౌద్ధం, జైనం రూపంలో సంఘర్షించాయి. ఈ సంఘర్షణ మతం రూపంలో వ్యక్తమైంది. ముందీ వాస్తవాన్ని గుర్తించాలి. దీనిలో నుంచే 'బీఫ్‌' ఆహారమా? పవిత్రమా? అనే అంశాన్ని అలోచించాలి. మనిషి అవసరాన్ని తీర్చిన ప్రతి దాన్నీ నాటి మనిషి అవసరంగానే భావించాడు. అది పది కాలాలపాటు తనను కాపాడాలనే భావాన్నుంచి పవిత్రంగానూ చూశాడు. నేటిలా నాడు సైన్సు అభివృద్ధి కాని దశలో దాన్ని పొందడానికి ఆరాధించి ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. అందుకే 'గంగమ్మ తల్లి' అంటూ నెత్తికెత్తుకున్నాడు. 'భూమాత' అంటూ సాగిల పడ్డాడు. ఆ క్రమంలో బహుశా పలికే సౌలభ్యంలో బర్రెమాతా, మేకమేతా అనలేక పాలిచ్చే జంతుజాలం మొత్తానికీ కలిపి 'గో మాత' రూపంలో ఆరాధించి ఉంటాడు. పునరుత్పత్తి ప్రక్రియతో పశు సంపద పెంచడం, వాటి పాలు మానవునికి పోషకాలనిచ్చేవిగా ఉండడంతో వాటిని కాపాడుకోవాలనే ఆవశ్యకత నుంచి నాటి మానవాళి ఆలోచనను మళ్ళించడానికి ఒకవైపు 'పవిత్రత' మరోవైపు 'ఘర్షణ' రూపాలే పైన చెప్పిన మతాలావిర్భావం. ఆనాడిలా 'పవిత్రత'ను ఎంత సమున్నతంగా చూపినా, గంగా మాతను పశువుల, మనుషుల ఒంటి శభ్రతకూ, మల, మూత్రాల శుభ్రతకూ వాడకుండా వదల్లేదు. పవిత్రత పేరిట పారిశుధ్య పరిరక్షణ నుంచి దూరంగా ఉంచాలనుకోలేదు. వందల, వేల స్తోత్రాలతో భూ మాతను కీర్తించినా, ఆమె గుండెలపై పుల్లలతో (ఆదిమ వ్యవసాయం) పొడవకుండా, గునపాలు (నాగళ్ళు) దించకుండా ఆహారోత్పత్తిని పొందలేదు. నాటి నుంచీ నేటి వరకూ గంగమ్మ తల్లినీ, భూ మాతనూ ఇలా వాడేడు కనుకే మానవాళి అవసరాలకు మించిన సంపద పోగు పడింది. దానిని పెంచడంలో మానవులందరి పాత్ర ఉన్నా, పొందడంలో వనరులు, పరికరాలు చేజిక్కించుకున్న వర్గాలే సంపన్న (భూ స్వామ్య, పెట్టుబడిదారీ) కుటుంబాలయ్యాయి. అవి ఇప్పటికీ సహజ సిద్ధమైన భూ మాత గుండెలపై నిలువు లోతులకు బోర్లు దించి, గంగమ్మ తల్లిని బాటిళ్ళలో నింపి అంగట్లో సరుకుగా నిలుపుతున్నారు. భూ మాతనూ ఆహారం పెంపుదల కోసం ఇదే రీతిన వాడుతున్నారు. పైగా పర్యావరణాన్ని పణంగా పెట్టి క్రేన్లతో భూ గర్భాలు చీల్చుతున్నారు. కోటాను కోట్లు గడిస్తున్నారు. అదీ మానవాళి ప్రయోజనం కోసం కాకుండా సంపన్నుల బొక్కసాల్లోకి మరింత సంపద మళ్ళించడానికి ఈ పనులు చేస్తున్నారు. మరి గంగమ్మ తల్లి, భూ మాతల 'పవిత్రత'లను కాపాడటానికి వీటినెందుకడ్డుకోవడం లేదు? అడ్డుకుంటే ఆహారం ఉండదు. సంపద పెరగదు. 'పవిత్రత' పేరిట ఏ మతోన్మాదులైనా, ఏ రాజకీయ పక్షమైనా ఈ పనికి దిగితే, వాళ్ళందరినీ పిచ్చోళ్ళ కింద జమేస్తారు. భౌతికంగా అడ్డుపడితే భూ స్థాపితం చేస్తారు.
మరి ' గోమాత' విషయంలో ఇప్పుడీ చర్చ ఎందుకు జరుగుతోంది? గోవును కొందరు ఆహారంగా వాడుతున్నారు. దాని చర్మాలు ఒలిచి మరి కొందరు జీవనోపాధిని పొందుతున్నారు. ఇంకొందరు దీన్ని తప్పంటున్నారు. 'పవిత్రత' పేరుతో కాషాయవాదులూ, సంతానోత్పత్తి, పాల ఉత్పత్తుల రీత్యా అనే ముసుగుతో మరి కొందరు కాషాయ సమర్థకులూ ముందుకొస్తున్నారు. మరిదే లక్షణం కలిగిన మేక, గొర్రె, కోడి కూడా పునరుత్పత్తి, పాలు, గుడ్ల వంటి ఆహారోత్పత్తులిస్తున్నప్పుడు, వీటిని వధించే వారిని కూడా సగటు 'పవిత్ర' వాదులు నిరోధించాలి. కానీ ఆ పని చేయడం లేదు. ఎందుకని? ఆ పని చేస్తే ప్రజలందరితో ఘర్షణ పడాలి. అలా చేస్తే గంగమ్మ తల్లి, భూమాతల విషయంలో స్పందించినట్టే స్పందిస్తారు. ఈ వాదకులకు కావలసింది ఆహారోత్పత్తి, సంపదలో పెంపులో సమిష్ట్టిగా పనిచేస్తున్న కష్టజీవులను చీల్చి ఉంచడం. వారికి వ్యతిరేకంగా ప్రజలను ఖండఖండాలుగా చీల్చి రాజ్యాధికారాన్ని, సంపదలు చేజిక్కించుకున్న వారి పక్షాన నిలపడం. అందుకు 'గో రక్షణ' ఉద్యమం పేరిట దళితులు, ముస్లిములకు వ్యతిరేకంగా మిగిలిన పక్షాలను కూడగట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే గతంలో క్రైస్తవులు, మహిళల విషయంలో కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టుడు చర్యలకు దిగారు. మన రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లోని 48వ అధికరణం 'జంతు వధను అడ్డుకుని వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఆవులు, దూడలతో సహా పాలిచ్చే, పనిచేసే పశువుల వధను నిషేధించాలి' అని చెప్పిందే తప్ప, ఆవులను మాత్రమే కాపాడాలని ఎక్కడా చెప్పలేదు. బహుశా ఈ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకునే కావచ్చు కేవలం బీఫ్‌ కలిగి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని శిక్షించడం పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి సేచ్ఛ, జీవించే హక్కులో రాష్ట్రం చొరబడటమే' అని ముంబయి హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాదు, బీఫ్‌ను తెచ్చుకోవడంపై నిషేధం విధిస్తూ 1976 నాటి మహారాష్ట్ర జంతు సంరక్షణ (సవరణ) చట్టంలోని సవరణలను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అయినా ఇవేవీ 'గో పవిత్రవాదులు' పేరిట సాగే మత విద్వేషులు తలకెక్కించుకోదలచుకోలేదు. ముందు చెప్పిన రాజకీయ అజెండా వారి ముందు ఉంది కనుకే అడ్డగోలు వాదనలతో సాగుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పశువులను కాపాడుకోలేని రైతులు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా రైతులే బతకలేని స్థితిలో ఇలా జరుగుతోంది. అందులో ఆవులు, ఎద్దులు, బర్రెలు వగైరా పాల ఉత్పత్తులనిచ్చే అమూల్య సంపద అంతమౌతోంది. మరి దీనికి బాధ్యులెవరు? పాలకుల విధానాలు కావా? వీటిని అంతం చేస్తున్న ఆ పాలకులపై వీరు దాడికి దిగుతారా? దాడి సంగతి అలా ఉంచి రైతుల, పశువుల సంరక్షణ కోసం జరిగే పోరాటాలతో కూడా వీరు కలవడం లేదు. ఎందుకని? భూస్వాములు, పెట్టుబడిదార్లతో కలగలిసిన పాలక పక్షంగా ఉంటున్నారు కనుక. వారి ప్రయోజనాల రక్షణలో కష్టజీవులను విభజించి పాలించే పనిలో ఉంటున్నారు కనుక. దాని కోసమే మత విశ్వాసాలను రాజకీయాలతో రంగరించాలని చూస్తున్నారు కనుక. ఆ వెంపర్లాటలోనే మనిషి పైకి మనిషిని, బలహీన కులాలపైకి సంపన్న కులాలను, మైనార్టీలపైకి మెజార్టీ మతస్తులను ఉసిగొల్పుతున్నారు. ఆ రక్తపు మడుగులపై అధికార పీఠాలను పదిలం చేసుకుని పదవుల్లో ఊరేగాలనుకుంటున్నారు. సభ్య సమాజం, నాగరిక మానవులు దీనినే ఆలోచించాలి. మతాల పేరిట సాగించే మానవ సంహరణను అనుమతించాలో, ప్రతిఘటించాలో ఆలోచించాలి. ఇదే సమయంలో కోర్టులు కూడా ఒక అంశాన్ని తీవ్రంగా పరిశీలించాలి. చట్టం పిచ్చోడి చేతిలో రాయి కాకుండా చూడాలి. పాల ఉత్పత్తులు, పునరుత్పత్తి ఆగిన దశలోనూ, కరువు కాటకాలతో పశువులు కబేళాలకు తరలుతున్న స్థితిలోనూ, మత విశ్వాసాన్ని రాజకీయంగా మలిచి మనుషులపై దాడులకు దిగే సంస్థల, రాజకీయ పక్షాల విషయంలోనూ ఎలా వ్వవహరించాలో కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించాలి. - ఉన్నం వెంకటేశ్వర్లు

No comments:

Post a Comment