Tuesday, 23 August 2016

|| భావి ఉద్యమాలకు దిక్సూచి ఉనా దళిత పోరాటం |


           ఒక చనిపోయిన ఆవు చర్మాన్ని ఒలిచినందుకు 2016 జులై 11న పట్ట పగలు నలుగురు దళితులను బహిరంగంగా కొట్టి ఊరేగించారు. ఈ సంఘటన గుజరాత్‌లోని ఉనాలో జరిగింది. గో సంరక్షణ పేరుతో దళితులను అత్యంత క్రూరంగా హింసించటమేగాక తమ హేయమైన చర్యలను ఏ మాత్రం జంకూగొంకూ లేకుండా సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ సంఘటన గుజరాత్‌ రాష్ట్రమంతటా నిరసన సెగలను రాజేసి అది దళిత హక్కుల కోసం చేస్తున్న ఉద్యమంగా మారింది. చనిపోయిన పశువులను తొలగించే పని నుంచి, పాకీ పని నుంచి విముక్తి, భూమిపై హక్కులు, ప్రత్యామ్నాయ కొలువులు, గౌరవప్రదమైన జీవితం కోసం చేసే ఉద్యమంగా ఉనా నిరసనలు రూపాంతరం చెందాయి. 2016 జులై 31న అహ్మదాబాద్‌లో ఒక దళిత మహా సమ్మేళనం జరిగింది. దానిలో వేలాది మంది దళితులు పాల్గొన్నారు. చనిపోయిన పశువుల కళేబరాలను తొలగించరాదనీ, పాకీ పని చేయరాదనీ ఆ సమ్మేళనంలో పాల్గొన్న దళితులు శపథం చేశారు. ఉనాలో పాశవిక దాడికి గురైనవారికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేయటానికి ఆ సమ్మేళనంలో ఉనా దళిత అత్యాచార లడత్‌ సమితి ఏర్పాటయింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆగస్టు 5న అహ్మదాబాద్‌ నుంచి దళిత అస్మితా యాత్ర ప్రారంభమై గుజరాత్‌లోని గ్రామాల గుండా 400 కిలోమీటర్లకు పైగా సాగింది. సంప్రదాయంగా కులం ఆధారంగా వస్తున్న పాకీ పని, మురుగు కాల్వలను శుభ్రపరచటం, పశువుల చర్మాలను తీసి వాటిని ఖననం చేయటం వంటి పనులను విడనాడాలని ఊరూరా శపథాలు చేశారు. ఆ పది రోజుల యాత్ర స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఉనాకు చేరుకుంది. దళితుల జీవితాల మీద, వారి ఆత్మగౌరవం మీద, వారి జీవనోపాధి మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉనా నిరసనలు, దళిత అస్మిత ప్రదర్శన ఒక చారిత్రక దళిత ప్రతిస్పందనగా మిగిలిపోతాయి. ఇలా ఎన్నడూ జరగని ఈ వినూత్న నిరసనకు మద్దతుగా ప్రగతిశీల గ్రూపులు, అనేక మంది వ్యక్తులు తమ సంఘీభావం తెలిపారు.

|| మోడీ  నమూనా-వాస్తవికత ||

అందరికీ అన్నీ అందుబాటులో ఉన్న ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా గుజరాత్‌ మారిందనీ, అందుకు కారణం తాము అనుసరించిన 'గుజరాత్‌ నమూనా' అనే మిధ్యా భావనను నిర్మించటానికి నరేంద్ర మోడీ, ఆయన బృందం చాలా శ్రమించారు. అయితే వాస్తవంలో గుజరాత్‌లో ఉన్నది 'మొదానీ నమూనా' అని గుజరాత్‌ ప్రజలు అంటుంటారు. ఈ నమూనా పాలనలో ప్రజలను కొట్టి కార్పొరేట్లు దోజుకోవటానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రజలను చీల్చే హిందూత్వ ఎజెండాను అమలు చేయటానికి మతతత్వ, కులతత్వ శక్తులకు ఈ నమూనా పూర్తి స్వేచ్ఛనిస్తుంది. మొత్తం గుజరాత్‌ జనాభాలో దళితులు 7.1 శాతం ఉంటారు. భూమిలేక పోవడం, నిరుద్యోగం, దారిద్య్రం వీరి కుటుంబాలలో తాండవిస్తూ ఉంటుంది. ఒకవైపు వ్యవసాయంపై ఆధారపడి బతికేవారు భూమిలేని స్థితిలో ఉండగా అదానీ, అంబానీ, టాటాల వంటి కార్పొరేట్లకు లక్షలాది ఎకరాలను ధారాదత్తం చేస్తున్నారు. గుజరాత్‌లో 55,000 మందికి పైగా పాకీ పని చేస్తున్నారని నవసర్జన్‌ ట్రస్టు అధ్యయనంలో తేలింది. దారుణమైన దారిద్య్రం జాడలను మేము అహ్మదాబాద్‌ నుంచి ఉనా వెళ్ళేదారిలో చూశాము. పాఠశాలల్లో కూడా తాము ఘోరమైన వివక్షను ఎదుర్కొంటున్నట్టు మేము మాట్లాడిన దళిత బాలబాలికలు చెప్పారు. ఒక్కోసారి వారిని టాయిలెట్లను శుభ్రపరిచే పనిచెయ్యమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చాలా తక్కువమంది దళితులకు మాత్రమే దొరికాయి. 'మురికి పనులు' చెయ్యటం నుంచి కొద్దిమంది మాత్రమే బయటపడ్డారు. పరిస్థితులు మెరుగ్గా ఉండటం వల్ల రంగులు వేయటం, వడ్రంగిపని, నిర్మాణ రంగంలో దొరికే పనులకోసం తాము ముంబాయి, కేరళ, లక్షద్వీప్‌లకు కూడా వెళ్తున్నట్లు కొంతమంది చెప్పారు. గుజరాత్‌లోని 'ప్రపంచ స్థాయి' రోడ్ల గురించి చాలానే ప్రచారం జరిగింది. మొదానీ నమూనా అభివృద్ధిలో చాలా గోతులు ఉన్నట్లు మాకు కనబడింది. అహ్మదాబాద్‌ నుంచి ఉనా మధ్య గల 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించటానికి మాకు 10 గంటల సమయం పట్టింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 'గో సంరక్షణ' పేరిట ముస్లింలపైనా, దళితులపైనా జరుగుతున్న దాడులు బాగా పెరిగాయి. బహిరంగంగా కొట్టటం, ఆవు పేడను బలవంతంగా తినిపించటం, హింసకు గురైనవారిని బట్టలూడదీసి ఊరేగించటం వంటి వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో గల బిజెపి ప్రభుత్వాలు హింసకు పాల్పడిన దోషులపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా లేక అలాంటి హింసను కీర్తించటం ద్వారా తమ పరోక్ష మద్దతు తెలుపుతున్నాయి. వివిధ హిందూత్వ గ్రూపులు, 'గో సంరక్షణ' పేరుతో పనిచేస్తున్న మూకలు కొన్ని వర్గాల ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ (అందరితో కలిసి అందరి అభివృద్ధికి) నినాదంలోని డొల్లతనం దళితుల స్థితిగతులను చూచినప్పుడు తెలుస్తుంది. దళితుల జీవితాలు ఆర్థికంగా ఏవిధంగానూ మెరుగు పడకపోగా వారు అత్యంత క్రూరమైన హింసకు గురవుతున్నారు. తమపై జరుగుతున్న అణచివేతకు నిరసనగా వారు కోపోద్రిక్తులు కావటాన్ని ఈ ఉద్యమంలో మనం గమనిస్తాం.

|| ఉనాలో పెల్లుబికిన దళిత శక్తి ||

ఉనా దళిత అత్యాచార్‌ లడత్‌ సమితి ఆధ్వర్యంలో జరగనున్న దళిత అస్మిత ప్రదర్శనలోనూ, ఆజాదీ కూచ్‌లోనూ పాల్గొనాలని మేము నిర్ణయించుకున్నప్పుడు సమాజంలోని అత్యంత అణగారిన ప్రజలకు సంఘీభావం తెలుపటానికని మాకు తెలుసు. వివిధ రాష్ట్రాలలో ఉనా కార్యక్రమంతో సంఘీభావం వ్యక్తమైంది. ఆగస్టు13న ఆజాదీ కూచ్‌ కోసం జరుగుతున్న మోటారు సైకిల్‌ ప్రదర్శనపై గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలోని సమ్‌తర్‌ గ్రామంలో అగ్రకుల శక్తులు దాడి చేశాయి. ఆగస్టు14న ఉనా వైపు దళిత అస్మిత ర్యాలీ బయలుదేరింది. మేము ఉనా నుంచి ర్యాలీలో కలవటానికి వెళ్తున్నాము. అయితే సమ్‌తర్‌కు కొద్ది దూరంలో సాయుధులైన మూకలు రోడ్డుకు అడ్డంగా వాహనాలను, బండరాళ్ళను పెట్టారు. వాళ్ళు దళిత కెమేరా, మరో రెండు సంస్థలకు చెందిన జర్నలిస్టులను, ఇతర జర్నలిస్టులను కొట్టారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ ర్యాలీని భగం చేయటానికి ఈ మూకలను సమీకరించటం జరిగింది. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రను పోషించారు. మోటారు సైకిళ్ళపై తిరుగుతూ సాయుధ మూకలు భయోత్పాతాన్ని సృష్టించటానికి ప్రయత్నించాయి. ఆగస్టు14 రాత్రి ఆజాదీ కూచ్‌ ర్యాలీకి వచ్చేవారిపై దాడులు జరిగాయి. అలా దాడులకు గురైనవారు కొందరు ఆస్పత్రుల్లో చేరవలసి వచ్చింది. 'గో సంరక్షుల' బెదిరింపులు, దాడులు ప్రజలను మరింతగా సమీకరించాలనే కసిని పెంచాయి. ప్రత్యామ్నాయ మార్గంలో సాయంత్రనికి ర్యాలీ ఉనాకు చేరింది. మేము ర్యాలీలో కలిసిపోయి ఉనా అంతా భుజంభుజం కలిపి ప్రదర్శనలో పాల్గొన్నాం. గుజరాత్‌, మహారాష్ట్రలకు చెందిన దళిత్‌ శోషన్‌ ముక్తి మంచ్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తమిళనాడు అస్పృశ్యతా నివారణా సంఘటన, అభ్యుదయ రచయితల అసోషియేషన్‌కు చెందిన కొందరు కామ్రేడ్స్‌ ఈ ర్యాలీలో పాల్డొనటాన్ని మేము చూశాం. వీరంతా తమంత తాముగా పాల్గొన్నారు. గుజరాత్‌ నుంచీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ నుంచీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కిసాన్‌ సభ, ట్రేడ్‌ యూనియన్‌, ఐద్వా ప్రతినిధులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉనా గుండా సాగిన ర్యాలీ అందరిలో స్ఫూర్తిని నింపింది. జై భీం, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కలలను సాకారం చేయాలనే నినాదాలు మిన్నంటాయి. అలాగే నరేంద్ర మోడీకి, బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు ఉనా అంతటా మార్మోగాయి. అయితే 'ఆవు తోకను ఉంచుకుని మా భూమిని మాకివ్వండి' అనే నినాదం మిగిలిన అన్ని నినాదాల కంటే ప్రాచుర్యాన్ని పొందింది. ఆగస్టు 15న జరిగిన ఆజాదీ కూచ్‌ వాతావరణాన్ని ఉత్తేజపరిచింది. బెదిరింపులను, దాడులను బహిరంగంగా ధిక్కరించి ప్రజలు వేలాదిగా సమావేశమయ్యారు. దళిత యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మృత పశువులను తరలించే పనిని, పాకీ పనిని చేయబోమనే శపథాన్ని ఉద్యమ యువ నాయకుడైన జిగేష్‌ మేవానీ అందరిచేతా చేయించారు. ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలను, ఒక్కో దళిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమినీ ఇవ్వాలనే డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ప్రభుత్వం భూమి కోసం చేసిన డిమాండ్‌ను అంగీకరించకపోతే రైల్‌ రోకో చేయాలనే పిలుపునిచ్చారు. రోహిత్‌ వేముల తల్లి రాధికా వేముల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్ని రకాల అణచివేతల నుంచి ఆజాదీ కోసం పోరాటం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ సభలో ప్రసంగించారు. బహిరంగ దాడులకు గురైన వారినీ, వారి కుటుంబాలనూ మేము కలిసి మాట్లాడాము. వారు భయభ్రాంతులై ఉండటాన్ని మేము గమనించాము. ఒకవైపు పేద దళిత కుటుంబాలు బెదిరింపుల మధ్య భయోత్పాతంతో నిండిన వాతావరణంలో కాందిశీకుల వలే జీవిస్తుంటే మరోవైపు నేరస్తులు దర్జాగా ఎటువంటి జంకూగొంకూ లేకుండా ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నారు. తన వాహనంపై కాల్పులు జరిగాయని ఒక దళిత నాయకుడు ఆరోపించారు. వారికి పోలీసు రక్షణ కల్పించేంత వరకూ నాతోపాటు ప్రగతిశీల సినిమాల దర్శకుడైన ఆనంద్‌ పట్వర్థన్‌, కొందరు జర్నలిస్టులు, ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్వి విక్రమ్‌, సామాజిక కార్యకర్త ముజాహిద్‌ నఫీస్‌-మేమందరమూ అక్కడ ఉన్నాం. ఉనా ప్రదర్శనకు వ్యతిరేకులైనవారు కేంద్రీకరించిన సమ్‌టర్‌ను మేము దాటుతున్నప్పుడు బాష్ప వాయువు వాసనను మేము గమనించాము. ఆ ప్రాంతంలో అంబులెన్సులు, పోలీసు వాహనాల హడావిడి కనిపించింది. హిందూత్వ మూకల దాడిలో అనేక మంది పోలీసులు గాయపడినట్టు తెలిసింది. ర్యాలీలో పాల్గొన్న వారిని వెతకటానికి ఆ సాయుధ గూండాలు మా బస్సును కూడా ఆపారు. కానీ వారు మా బస్సును వెళ్ళనిచ్చారు. ఆ తరువాత కొంచెం సేపటికి మేము 'సేఫ్‌ జోన్‌'లోకి ప్రవేశించామని మా బస్సు డ్రైవర్‌ చెప్పారు. ఇదంతా స్వాతంత్య్ర దినోత్సవం రోజున జరిగింది!
ఉనా ఉద్యమం లేవనెత్తిన విషయాలు అత్యంత ప్రాధాన్యం గలవి. ఒక అణచివేత ఎలా ధిక్కారాన్ని జనింపజేస్తుందో, ఒక దేశవ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ చేస్తుందో ఉనా ఉద్యమం మనకు తెలియజేస్తుంది. అలాంటి సాధ్యత వాస్తవ రూపం దాల్చాలంటే అవకాశాన్ని వినియోగించుకుని, అన్ని ప్రగతిశీల శక్తులూ పోరాటంతో సంఘటితం కావలసి ఉంటుంది. కుల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటాలలో ఉనా ఒకటవుతుంది. అది ప్రజల గాథగా మారుతుంది. అత్యంత విశాల ఐక్యతను నిర్మించవలసిన అవసరాన్ని చరిత్ర మన ముందుకు తెచ్చింది. ఉనా సందేశాన్ని దేశం నలుమూలలకూ తీసుకుపోవాలి. ఆ స్ఫూర్తితో కుల అణచివేతను శాశ్వతంగా తుడిచివేయటానికి ఒక ఉద్యమాన్ని నిర్మించాలి.     - విజూ కృష్ణన్‌

No comments:

Post a Comment