Saturday, 13 August 2016

## భాషా రాజకీయాలకు గొడ్డలి పెట్టు ## || మద్రాసు హైకోర్టు తీర్పు ||

ఈ ఆగస్టు 8 సోమవారం నాడు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో అర్థవంతంగా, శాస్త్రీయ దృక్పథంతో ఉంది. ఆ ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజరుకిషన్‌ కౌల్‌, న్యాయమూర్తి ఆర్‌.మహదేవన్‌లతో కూడిన మొదటిబెంచి ఇచ్చిన ఈ తీర్పు అనేక విధాలుగా చరిత్రలో నిలిచిపోయేదిగా ఉంది. వాయిదాల దోబూచులాటల్లో ఏడేళ్లు గడిచిపోగా గత ఏడాదిగా ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ వహించిన ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వెళ్లేముందు దీనిపై న్యాయాన్ని ప్రకటించడం పట్ల శ్రద్ధ వహించడం మనం గమనించాల్సిన సంగతి.
ఆయన వెలువరించిన తీర్పులో ప్రసిద్ధ అమెరికన్‌ గ్రంథకర్త ఆలివర్‌ వెండెత హాల్మ్స్‌ను ఊటంకిస్తూ 'ప్రతి భాషా ఒక దేవాలయమేనని, అందులో ఆ భాషను మాట్లాడేవారి ఆత్మ విలసిల్లుతుంటుందని' స్పష్టం చేశారు. ప్రజాభాషలన్నిటినీ గౌరవిస్తూ ఆయన ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు, పార్టీలు, ప్రజలు కూడా సహృదయంతో స్వీకరిస్తే అందరికీ మేలు జరుగుతుంది. 
'భాషా రాజకీయాలు' అనగానే మనకు వెంటనే హిందీ వ్యతిరేక ఉద్యమం, ఇంగ్లీషు వ్యతిరేక ఉద్యమం, భాషా రాష్ట్రాల ఉద్యమాలు గుర్తుకు వస్తాయి. ఒక ప్రత్యేక భాషకు సంబంధించిన వారు తమ భాషను కాపాడుకోవడానికి, పెంపు చేసుకోవడానికి కృషి చేయడం, అందుకోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమించడం వారి హక్కు. దాన్నెవరూ కాదనరు. తమ భాషపై పరభాషలు పెత్తనం చేయడాన్ని వ్యతిరేకించడం ప్రజాస్వామ్య పోరాట పరిధుల్లోకే వస్తుంది. తమ భాషే ఉన్నతమైనదని, ఇతర భాషలను గౌరవించడం వల్ల, లేదా ప్రోత్సహించడం వల్ల తమ భాష దెబ్బతింటుందని, అందువల్ల తమ ప్రత్యేకతను, ఔన్నత్యాన్ని ఎవరూ ప్రశ్నించరాదు అనే ఆధిపత్య ప్రదర్శన తక్కిన భాషాజాతుల వారి వ్యతిరేకతను ఎదుర్కొనక తప్పదు. అటువంటి ఆధిపత్య భావజాలాన్ని న్యాయస్థానాలు సమర్థించనేరవు. ఇప్పుడు సరిగ్గా జరిగింది అదే! 2004 అక్టోబరు 12న కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన చేసింది. 'క్లాసికల్‌ లాంగ్వేజెస్‌' అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ, దాని ప్రకారం ఆ భాష సాహిత్యం లేదా చరిత్ర ప్రాచీనత వెయ్యేళ్లకు పైబడి ఉండాలని, ఆ భాషను మాట్లాడేవారు తరాలుగా విలువైన వారసత్వంగా భావించుకునే సాహిత్య సంపద ఉండాలనీ, దాని సాహిత్య సంప్రదాయం ఇతర భాషా సమూహాల నుంచి అరువు తెచ్చుకొన్నదిగా కాక స్వతంత్రమైనదిగా ఉండాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ అర్హతలను తమిళభాష కలిగి ఉన్నందువల్ల దానిని క్లాసికల్‌ భాషగా గుర్తిస్తున్నట్లు తెలుపుతూ, ఇకపై ఈ విషయంలో తీసుకోవలసిన చర్యలను సాంస్క ృతిక శాఖ చేపడుతుందని ఆ ప్రకటన వివరించింది.
ఈ ప్రకటనతో సాటి భాషలైన తెలుగు, కన్నడ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు మేధావులు, రచయితలు భావించారు. ఇంతలో ఏమైందో ఏమో కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా నియమితులైన నిపుణుల కమిటీ (ఈ కమిటీయే తొలుత తమిళానికి 'క్లాసికల్‌' ప్రతిపత్తిని ఇస్తూ నిర్ణయించింది) అత్యంత గోప్యంగా అక్టోబరు 29న సమావేశమై క్లాసికల్‌ భాషగా గుర్తించబడడానికి తొలుత తాము నిర్ణయించిన అర్హతల్లో మొదటి దాన్ని మార్పు చేసింది. మొదటి నిర్ణయం ప్రకారం ప్రాచీనత వెయ్యేళ్ల ప్రాచీనత ఉండాలనే నిబంధనను మార్చి అది 1500-2000 సంవత్సరాల ప్రాచీనత ఉండాలని మార్చారు. పైగా ఆ భాషకు చెందిన ప్రాచీన సాహిత్యానికి, దాని ఆధునిక భాషా రూపానికీ మధ్య కొన్నేళ్ల పాటు సంబంధం లేకుండా ఉండవచ్చునన్న నాల్గవ నిబంధనను చేర్చారు. ఈ రెండు మార్పులు చేయడంలో కచ్చితంగా కుట్ర ఉందని, తెలుగు, కన్నడ భాషలకు ఆ ప్రతిపత్తి రాకుండా ఉండటానికి ఈ మార్పులను చేశారని వెల్లడైంది. తమిళానికిచ్చినట్లే తమకూ ఈ హౌదాను ఇవ్వాలనీ, పరిశోధనకు, భాషాభివృద్ధికి వారికివ్వ నిర్ణయించినట్లే అన్ని సౌకర్యాలను, సహాయాలను తమకూ ఇవ్వాలని, తెలుగు, కన్నడ భాషా ప్రజల నుంచి ఉద్యమం బయలు దేరింది.
2005 నవంబరు 25న కేంద్ర ప్రభుత్వం 'సంస్కృతాన్ని' కూడా క్లాసికల్‌ భాషగా గుర్తిస్తూ మరొక హడావిడి ప్రకటన జారీ చేసింది. నిజానికి భారతదేశ రాజ్యాంగం ప్రకారం 8వ షెడ్యూలులో 22 భాషల్ని సమానంగా గుర్తించారు. వీటిలో హిందీని అధికార భాషగా అంగీకరించాలని రాజ్యాంగం నిర్ణయించింది. అన్నిటినీ జాతీయ భాషలుగా గుర్తించాలనే డిమాండు నాటికీ నేటికీ అలాగే కొనసాగుతూనే ఉంది. 2004 అక్టోబరు 12న తమిళానికి 'క్లాసికల్‌' ప్రతిపత్తినివ్వడానికి నిర్ణయించేందుకే భారతీయ భాషల్లో కొత్తగా 'క్లాసికల్‌ భాషలు' అనే వర్గీకరణను కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత గాని వారికి గుర్తురాని అంశం ఏమిటంటే గత 60 ఏళ్లుగా సంస్కృతం, అరబిక్‌, పరియన్‌, పాళీ, ప్రాకృత భాషలు క్లాసికల్‌ భాషలుగా గౌరవిస్తున్న సంప్రదాయం ఉందని, ఆ భాషల్లో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సన్మానాలు జరుగుతున్నాయని. తమిళానికి ప్రాచీన భాష హోదా ఇచ్చి, సంస్కృతానికి ఇవ్వకపోవడం పట్ల కినిసిన పండితులు ఒత్తిడి తేగానే ఉలిక్కిపడిన కేంద్ర ప్రభుత్వం సంస్కృతాన్ని కూడా 'క్లాసికల్‌'గా గుర్తిస్తూ 2005 నవంబరు 25న ప్రకటించింది. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డ కేంద్రంపై తెలుగు, కన్నడ భాషోద్యమకారుల ఒత్తిడి పెరిగింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ చట్ట సభల తీర్మానాలతో కేంద్రంపై ఒత్తిడిని పెంచాయి. దాంతో కేంద్రం గౌరవంగా బయటపడే ప్రయత్నాలు చేసి, ద్రావిడ విశ్వవిద్యాలయంలోనూ, సిఐఐఎల్‌ (మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ)తోనూ సదస్సుల నిర్వహణ చేయించి, సమ్మిళిత అభిప్రాయాల సేకరణ చేసి చివరకు 2008 అక్టోబరు 31న మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల ఆవిష్కరణ దినోత్సవం రోజున రెండు భాషలకూ క్లాసికల్‌ ప్రతిపత్తిని ప్రకటించింది.
ఆశించని ఈ పరిణామం ద్రావిడ భాషాధిపత్య వర్గాల అవకాశాన్ని దెబ్బతీసింది. నిజానికి డిఎంకె పార్టీ 2004లో తమ ఎన్నికల వాగ్దానాల పత్రంలోనే తాము అధికారంలోకొస్తే కేంద్రాన్ని ఒప్పించి తమిళానికి క్లాసికల్‌ భాషా ప్రతిపత్తిని సాధిస్తామనీ, తర్వాత తమిళాన్ని రెండవ జాతీయ భాషగా ప్రకటనను తెప్పిస్తామని వాగ్దానాలను గుప్పించింది. అన్నాడిఎంకెపై పైచేయి సాధించడంలో ఇదొక అంశం వారికి. ఎన్నికల తర్వాత కేంద్రంలో యుపిఎ ప్రభుత్వంలో డిఎంకె చేరడానికి ఒక షరతుగా కనీస ఉమ్మడి కార్యక్రమంలో తమిళానికి 'క్లాసికల్‌' హోదానిస్తామనే అంశాన్ని పెట్టించుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే కమిటీని వేయించి, దాని ద్వారా 'క్లాసికల్‌ భాష' ప్రకటనను అదే ఏడాది నవంబరు 12నే ప్రకటింపజేసుకున్నారు. దాని ప్రకారం గుర్తింపే కాకుండా, తమిళ భాషా కేంద్ర సంస్థనూ, పరిశోధన కేంద్రాన్ని స్థాపించుకోవడానికి, అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో గుర్తింపు, గౌరవాన్ని పొందే పధకాలను; రూ.100 కోట్ల కేంద్ర సహాయాన్ని పొందుతారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో తమిళ పీఠాలు ఇంకా ఎన్నో ఆ రకంగా ప్రత్యక్ష, పరోక్ష నిరంతర ఆర్థిక వనరుల తోడ్పాటు, రాజకీయ ప్రాబల్యం వీళ్లాశించారు. తెలుగు, కన్నడాలు పోటీకి వస్తాయని, కేంద్రాన్ని ఒప్పిస్తాయని వారు ఊహించలేదు. దీంతో డిఎంకె అభిమాని అయిన న్యాయవాది ఆర్‌.గాంధీ చేత మద్రాసు హైకోర్టులో వ్యాజ్యం వేయించారు. 'క్లాసికల్‌ భాష' హోదాకు కావలసిన అర్హతలు ఆ రెండు భాషలకూ లేవనేది ఆ వ్యాజ్యంలో ఒక అంశం కాగా, వారికి గుర్తింపు ఇస్తే 'తమిళభాష'కున్న ప్రత్యేకత పోతుందనేది మరొక అంశం. ఈ రెండు అంశాల మీద మద్రాసు ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 'క్లాసికల్‌ భాషలను' గుర్తించడానికి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ నిర్ణయాలే తుది నిర్ణయాలనీ, వాటిపై ఏదైనా చెప్పవలసివస్తే వారికే చెప్పుకోవాలని స్పష్టం చేసింది. ఇతర భాషలకు ఇచ్చే గుర్తింపు వల్ల తమిళానికి ఖ్యాతి తగ్గుతోందనే మాట తప్పు అనీ, ఏ భాషా ఖ్యాతి అయినా, ఆ భాషా ప్రజల కృషి, తీరుతెన్నులు, అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది తప్ప ఒక దానివల్ల మరొక భాష ఖ్యాతి ఎప్పుడూ దెబ్బతినదని స్పష్టం చేసిన న్యాయమూర్తులు 'అన్ని భాషలూ దేవాలయాల వంటివే'ననే సూక్తితో తమ తీర్పుకు ఒక ఔన్నత్యాన్ని, శాశ్వతత్వాన్ని కలిగించారు. 
ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే! ప్రజాస్వామ్యంలో భాషల గుత్తాధిపత్యం చెల్లదు. ఇప్పుడు ప్రపంచీకరణ విధానాల దాడిలో నలిగిపోతున్న భారత్‌ వంటి దేశాల్లో ఇంగ్లీష్‌ భాషా సామ్రాజ్యవాదం పాలన, విద్యావ్యవస్థల్ని దురాక్రమణ చేస్తోంది. మన ప్రభుత్వాలు కూడా ప్రపంచీకరణ మాయలో కొట్టుకుపోతున్నాయి. ఇటువంటి సమయంలో దేశీయ భాషలన్నిటినీ ప్రజా భాషలుగా గుర్తించి, అభివృద్ధి పరచుకోవడం మన కర్తవ్యం. అదే భాషా జాతుల వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని జాతీయతను కాపాడుకోవడానికి దారి తీస్తుంది.ఇప్పుడు మద్రాసు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వల్ల గెలిచింది ప్రజల భాషలు. ఓడింది భాషోన్మాదం. దీన్ని తెలుగు వాళ్లం ముఖ్యంగా గమనించాలి. ఈ వ్యాజ్యంలో తెలంగాణ రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎవరెంత వాదించారు. ఎవరు ఏ దశలో ప్రవేశించారు అన్న చర్చకు మనం తావివ్వకూడదు. విశిష్ట భాష (క్లాసికల్‌ లాంగ్వేజి) కేంద్ర సంస్థను మా రాష్ట్రానికే తెచ్చుకుంటామనీ రెండు రాష్ట్రాల బాధ్యులు పరస్పరం ప్రకటనివ్వడం మనకే మేలు చేకూర్చదు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని తమ మాతృభాష 'తెలుగు'ను విశిష్ట భాషగా పెంపుదల చేసుకునేందుకు సమిష్టిగా ఆలోచించి చర్యల్ని చేపట్టాలి. రెండు రాష్ట్రాలైనా రెండూ తెలుగు రాష్ట్రాలే. ఏ ఇతర భాషకూ లేని ప్రత్యేకమైన బాధ్యత మనకు మరొకటి ఉంది. అసమగ్రంగా, అసమంజసంగా జరిగిన భాషా రాష్ట్రాల ఏర్పాటు వల్లగాని, అనేక చారిత్రక, సామాజిక కారణాల వల్ల గాని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9 కోట్ల మంది తెలుగువారుంటే, బయట మరో 9 కోట్ల మంది తెలుగువారు ఉన్నారు. వీరందరూ తెలుగు అభివృద్ధినే కోరుకుంటున్నారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కలిసి సమిష్టి వ్యూహంతో తెలుగు భాషాభివృద్ధికై కృషి చేయడానికి ఇదొక మంచి అవకాశం.

- డా|| సామల రమేష్‌బాబు

3 comments:

  1. ఇది అసలైన భారతదేశం.నిఝంగా గర్వించదగ్గ రోజు.

    ReplyDelete
  2. ఇది అసలైన భారతదేశం.నిఝంగా గర్వించదగ్గ రోజు.

    ReplyDelete
  3. భాషాసామ్రాజ్యవాదం నశించాలి. సమాజం ప్రజాస్వామ్యీకరణ చెందడంలో భాగంగా ప్రజలు మాట్లాడే అన్ని భాషలను ఉన్నతీకరించాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని నలు దిశలా చాటాలి!!!

    ReplyDelete